Tuesday, August 27, 2024

****దేవుడి చిరునామా

 *🌹🌹🌹    దేవుడి చిరునామా    🌹🌹🌹*

              *కాశీ వెళ్లే ఓ రైల్లో తమ ఎదురు ప్రయాణీకుడైన ఓ సన్యాసి భగవద్గీత ని చదువు కోవడం చూశాడో నాస్తికుడు.*

             *"స్వామీ! నిజంగా దేవుడున్నాడంటారా?" కాలక్షేపానికి ప్రశ్నించాడు అతను. సాధువు తల ఎత్తి అతని వంక చూసి,. ఉన్నాడన్నట్లుగా మౌనంగా తల ఊపి మళ్లీ గీతని చదువుకోసాగాడు.*

            *"దేవుడ్ని చూడాలని నాకు బాగా కుతూహలంగా ఉంది. దయచేసి ఆయన చిరునామా చెప్తారా?" పరిహాసంగా అడిగాడు అతను.*

            *అది గుర్తించి, పుస్తకం మూసి ఆ సన్యాసి చెప్పాడు. "నీకో కధ చెప్తా విను. అది నీ సందేహం తీర్చచ్ఛు.*

           *పూర్వం ఓ ఊళ్ళో ఓ అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు తమ పక్కింటి యువకుడితో వివాహం చేయాలనుకున్నారు. ఆమె అందుకు ఒప్పుకోలేదు. నేను పెళ్ళంటూ చేసుకుంటే అందరిలోకి గొప్పవాడినే చేసుకుంటాను తప్ప మన పక్కింటిలాంటి వాడిని చేసుకోను". చెప్పిందా పిల్ల."ఎవర్ని చేసుకుంటావయితే?" ప్రశ్నించింది తల్లి.*

          *"మన ఊళ్ళో అందరికంటే గొప్పవాళ్లెవరు?" ఆడిగిందా అమ్మాయి."మన ఊళ్ళో ఏం ఖర్మ? మన దేశం.లోని అందరికంటే గొప్పవాడు రాజు గారు" చెప్పాడు తండ్రి.*

           *"అయితే ఇంకేం? ఆయన్నే చేసుకుంటాను." చెప్పిందా పిల్ల. అది కుదరదని ఎంత చెప్పినా వినలేదా అమ్మాయి. తండ్రికి ఏమి చెయ్యాలో తెలీక ''సరే'' అన్నాడు.*

             *ఆ పిల్ల రాజధానికి చేరుకుంది. ఓ పల్లకీలో ఊరేగుతూ ఆ రాజు గారు ఆమెకు ఎదురు పడ్డాడు. ''నన్ను పెళ్లి చేసుకో '' అని అడగబోతుండగా, ఆ రాజు పల్లకి దిగి కాలినడకన వెళ్లే ఓ సన్యాసి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేయటం చూసింది. '' ఈ సన్యాసి రాజుకంటే గొప్పవాడు కాకపోతే ఎందుకతనికి నమస్కరిస్తాడు?''*

            *అని ఆలోచించి ఆమె సన్యాసినే వివాహం చేసుకోవాలనుకుంది.. అతని దగ్గరకు వెళ్లి ఆ విషయం అడగబోతుండగా అతను రోడ్డుప్రక్కన ఉన్న ఓ వినాయకుడి గుడి ముందు నిలబడి మూడు గుంజీలు తీయటం చూసింది. '' ఈ సన్యాసి కన్నా ఆ వినాయకుడే గొప్ప. చేసుకుంటే వాణ్ణే చేసుకోవాలి'' అనుకుని ఆ అమ్మాయి లోపలికి వెళ్ళింది.*

           *ఇంతలో ఓ కుక్క వచ్చి ఆ విగ్రహం ముందు కాలెత్తి దాన్ని అపవిత్రం చేసింది. అప్పుడామె ఆ వినాయకుని కన్నా ఆ కుక్కే శ్రేష్ఠం అయి ఉంటుందని భావించి దాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుండగా, ఓ పిల్లవాడు రాయితో ఆ కుక్కని కొట్టాడు. అది కుయ్యోమంటూ పరిగెత్తింది. ఇది చూసిన ఆ అమ్మాయి ఆ పిల్లవాడు గొప్పవాడనుకొని వాణ్ణే పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ ఇంతలో ఓ యువకుడు వచ్చి ఆ పిల్లవాడి చెవిని నులిమి వాణ్ణి మందలించాడు. దాంతో తాను చూసిన అందరికన్నా ఆ యువకుడే గొప్పవాడనుకొని వాడి దగ్గరకు వెళ్లి తనని వివాహం చేసుకోమని అడిగింది. ఆ యువకుడు ఎవరో కాదు. ఆమె తల్లిదండ్రులు కుదిర్చిన పక్కింటి యువకుడే".*

           *కధ పూర్తయ్యాక ఆ సన్యాసి చిన్నగా నవ్వుతూ తన ఎదుటి ప్రయాణీకుడితో చెప్పాడు. "మన హృదయం ఆ అమ్మాయి ఉన్న గ్రామం లాంటిది.*

            *దేవుడికోసం ఎక్కడెక్కడో వెతికినా చివరికి మన హృదయాంతరాల్లోనే దేవుడు ఉన్నాడు అని తెలుస్తుంది. అక్కడ తప్ప ఇంకెక్కడ వెతికినా దేవుడు దొరకడు. అదే దేవుని చిరునామా".*

        *కనిపించే అమ్మనాన్న నిజమైన దేవుళ్లు*

*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹*

No comments:

Post a Comment