Friday, August 30, 2024

 చలాచల బోధ:--
ఇప్పుడు బంధ మోక్షాలు ఎవరికి? ఆత్మకా?అనాత్మకా? ఆత్మ నిత్య ముక్తము, ఆనంద లక్షణయుతము.ఆత్మకు చావు పుట్టుకలు లేవు.సదా ఉంటూనే ఉంటుంది.ఆత్మకు బంధము లేదు.కావున ముక్తి కొరకు ఆరాట పడదు, ప్రయత్నం చేయవలసిన పని లేదు.ఇక అనాత్మ జడము, ఆత్మ చైతన్యం వలన చైతన్యవంతమై పని చేస్తుంది.అనాత్మ అనగా శరీర ప్రాణ మనసులు యాంత్రికంగా పని చేస్తాయి.
శరీర ధర్మం జనన మరణాలు.ప్రాణ ధర్మం ఆకలి దప్పులు.మనసు ధర్మం శోక మోహాలు.ఈ ఆరు ధర్మాలను కలిపి షడూర్ములు (షట్+ఉర్ములు) అని అంటారు.షడూర్మి సహితః జీవః.
షడూర్మి రహితః శివః 
అని శాస్త్రం చెబుతోంది.అనగా ఎవరికైతే ఈ షడూర్ములను కలిగి ఉంటారో వారు జీవ భావంతో ఉంటారు.ఎవరైతే షడూర్ములను రహితపరచు కుంటారో వారు జీవ భావమును విడచి పెట్టి, శివుడు లేక బ్రహ్మానంద స్వరూపుడు అయి ఉంటారు.అయితే ఈ షడూర్ములను ఎవరు పోగొట్టుకుంటారు?అమనస్కమైన తరువాత ఎవరు మిగిలి ఉంటారు?సాధన చతుష్టయ సంపత్తి కలవాడైయున్న "నేను నేనైన నేను"ఉంటాడు.ఈ "నేను నేనైన నేను"అంటే ఎవరు? శరీర త్రయం విలక్షణమైన నేను మరియు పంచకోశ ధర్మ వ్యతిరిక్తమైన ధర్మం ఉన్న నేను.ఇంకా మెలుకువ కల నిద్ర లేని నేను.అనగా షడూర్ములు లేని నేను.కావున బంధ మోక్షాల విషయము 'నేను'కు ఉన్నది.షడూర్ములు నాకు ఉన్నాయి అని అనుకునే 'నేను'కు బంధం ఉంది.కావున ఆ'నేను'కు మోక్షేచ్ఛ ఉంటుంది.షడూర్ములు నాధర్మాలు కాదు, నేను వాటి కంటే వేరుగా విలక్షణంగా ఉన్నాను అనే నిశ్చయ జ్ఞానం కలిగి యున్న 'నేనే'అనగా "నేను నేనైన నేనే"ఆత్మను "అహం బ్రహ్మ"అని యే, నేను 'కు స్వానుభవం ఉంటుందో ఆ 'నేనే'ముక్తుడు. కనుక ఆత్మకు బంధ మోక్షాలు లేవు,అనాత్మకు బంధ మోక్షాలు లేవు.మధ్యలో ఉన్న, నేను 'కు తన అజ్ఞానంలో బంధ మోక్షాలు ఉన్నాయి.శరీర త్రయం నేను కాదు అని విలక్షణమైన నేను కు బంధ మోక్షాలు లేవు.అలాగే పంచ కోశ ధర్మాలు నాకు లేవు అని వ్యతిరిక్తమైన ధర్మం అనగా సచ్చిదానంద లక్షణం గల నేను కు బంధ మోక్షాలు లేవు.మూడు అవస్థలు నాకు లేవు అని అవస్థా త్రయమునకు నేను సాక్షిగా ఉన్న నేనుకు బంధ మోక్షాలు లేవు.
అందుకే రమణ మహర్షి వారు 'నేను ఎవరు 'అనే ప్రశ్నను పెట్టి ఆ నేనును విచారణ చేసుకొనమని ప్రవచనమును అందించారు.

ఇప్పుడు పంచకోశాలంటే ఏమిటి?అనే వివరాలను మరియు వాటి ధర్మాలను చెప్పుకుందాము.
సశేషం!

No comments:

Post a Comment