*యండమూరి వీరేంద్రనాధ్*
మన పట్ల మనకు నమ్మకం ఎక్కువైతే దాన్ని ‘ఓవర్-కాన్ఫిడెన్స్’ అంటారు. నా మనసులో ఎక్కడో నాకు, మంచి మార్కులతో పాసయ్యాననే అహం ఉంది. అదీగాక కాలేజీ రోజుల్లో నేనొక గ్యాంగ్ లీడర్‌ని. ఆ అహంభావం నా బాడీ లాంగ్వేజ్ లో, మాటతీరులో ఎదుటి వాళ్లకి కనపడిపోతోందని అర్థమైంది.
ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడిగిన వాళ్లకి సిద్ధాంతపరంగా సమాధానం చెప్పేవాణ్ని తప్ప నా జవాబులో ప్రాక్టికల్ అప్రోచ్ ఉండేది కాదు. అంతే కాకుండా ఫ్యాక్టరీలో నాపై ఉద్యోగి కన్నా, నాకు ఎక్కువ నైపుణ్యం ఉందని నిరూపించుకోవడానికి ప్రయత్నించేవాడిని. ఇది తప్పే కదా. ఒక చిన్న ఉదాహరణ చెపుతాను.
“మేము భవిష్యత్తులో ఏమి చదివితే మంచిది మాస్టారూ? కాస్త కెరియర్ కౌన్సెలింగ్ చెయ్యండి” అని ఒక లెక్కల టీచర్ని కొందరు విద్యార్థులు అడిగారు. వృద్ధుడైన ఆ టీచర్ నవ్వి, “ఒక్క ప్రశ్నతో మీరు కెరియర్ ఎలా నిర్ణయిస్తారు?’ అని అనుమానించకుండా ఆన్సర్ వేగ౦గా చెప్పండి. హైదరాబాదు నుంచి గంటకి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూన్న రైలు, 335 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ చేరటానికి ఎంతసేపు పడుతుంది?” అని అడిగారు.
“335 నిముషాలు” అన్నాడు మొదటివాడు.
“శహబాష్. ప్రశ్న పూర్తవ్వకుండానే అద్భుతంగా చెప్పావురా” అంటూ మెచ్చుకుని ‘ఇంత చిన్న లెక్క తెలీదా?’ అన్నట్టూ మిగతావారి వైపు చిరాగ్గా చూశారు.
రెండోవాడు సంశయిస్తూ, “స్టేషన్ చేరే ముందు వేగం తగ్గుతుంది కదా. అదే ఆలోచిస్తున్నాను మాస్టారూ” అన్నాడు.
కాస్త జనరల్ నాలెడ్జ్ ఉన్న మూడో అమ్మాయి “అది వందేభారత్ ఎక్స్-ప్రెస్సయినా కాజీపేటలోనో, వరంగల్లోనో ఆగాల్సిందేగా సారూ” అన్నది.
నాలుగో అమ్మాయి టీచర్నే క్రాస్-ఎగ్జామ్ చేస్తూ, “వెళ్ళటం అంటే ‘ఆగటమా’? చేరటమా? చేరటమంటే ఇంజనా? రైలు చివరి పెట్టెనా?” అని ప్రశ్నించింది. అయిదోవాడి వైపు తిరిగి “నువ్వేం చెపుతావురా?” అని అడిగారు మాస్టారు. వాడు నవ్వి ఊరుకున్నాడు.
“నువ్వు లెక్కల్లో చేరరా” మొదటివాడితో అని, రెండోవాడితో “నువ్వు హేతువు ఆలోచించావు. ఫిలాసఫీ చదువు. ఫిలాసఫీలో తర్క౦ ఒక భాగం” అని, మూడో విద్యార్థిని వైపు తిరిగి, “నువ్వు గ్రూప్స్ కి ప్రిపేర్ అవటం బెటరు” అని నాలుగో అమ్మాయి వైపు చూస్తూ, “నువ్వు న్యాయశాస్త్రం చదువమ్మా” అన్నారు.
“మరి నేను?” అన్నాడు ఆఖరి వాడు.
“ప్రశ్నకి సమాధాన౦ చెప్పలేనప్పుడు మౌన మందహాసాన్ని ఆశ్రయి౦చావు కాబట్టి, పొలిటికల్ సైన్స్ చదువు” అన్నారు. విద్యార్థులు ఆయనకి వినయంగా నమస్కరించారు. కథ ఇక్కడితో ఆగలేదు. ఇక్కడే ఒక గొప్ప మలుపు ఉంది.
“మీరు వెంటనే సమాధానం చెప్పకపోయేసరికి మీ తెలివి గురించి తక్కువ అంచనా వేశాను. నేనే లెక్కల్లో మాస్టర్ అనీ, నాకున్నదే జ్ఞానమనీ అనుకున్నాను. జ్ఞానమనే ఇంద్రధనస్సుకి ఇన్ని రంగులు ఉ౦టాయనీ, మీరు నా కన్నా గొప్పగా ఆలోచిస్తారనీ అనుకోలేదు. ‘తెలివి ఒకంత లేని’ అంటాడు లక్ష్మణకవి. మంచి పాఠ౦ నేర్పారు. మీకు కాదు. మీ సమాధానాలు నా అహానికే కెరియర్ కౌన్సెలింగ్ ఇచ్చాయి” అన్నారు.
** ** **
మాస్టారు కేవలం లెక్కల దృష్టిలోనే ఆలోచించారు. నేను కూడా అలాగే, నాది ‘తెలివి’ అనుకున్నాను. అది అవతలివారికి ‘పొగరు’గా కనబడుతుంది అనుకోలేదు. నా పై అధికారులకి నా ‘నైపుణ్యం’ సుపీరియాటీ కాంప్లెక్స్ గా కనబడుతోంది అని భావించ లేదు.
ఇలా అనలైజ్ చేసుకోవటం వలన నా లోటుపాట్లు నాకు తెలిశాయి. ‘చదువు’ వేరు, ‘ఉద్యోగం’ వేరు. మనకి ఎన్ని తెలివితేటలు ఉన్నా, మనం చదివింది ఎంత గొప్ప చదువు అయినా, ఉద్యోగంలో మాత్రం ఒద్దికగా ఉండాలి. అంతే కాదు. “మనం ఆ సంస్థ పనికి ఎంత ఉపయోగపడతాం” అన్న దాని బట్టే మనకు ఆ సంస్థలో సముచిత స్థానం లభిస్తుంది తప్ప మన డిగ్రీ, తెలివీ బట్టి కాదు.
ఈ ఆలోచన తరువాత నాలో ఒక అనూహ్యమైన మార్పు వచ్చింది. నా బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నాను. నాకొచ్చినది చెప్పడం కాకుండా, వాళ్లకేం కావాలో తెలుసుకుని మాట్లాడటం నేర్చుకున్నాను. ఈ రెండు అంశాలు నా వ్యక్తిత్వాన్నీ, కెరీర్‌నీ పెద్ద మలుపు తిప్పాయి. ఒక్కముక్కలో చెప్పాలంటే, భవిష్యత్తులో ఆ తర్వాత ఏ ఉద్యోగానికి వెళ్లినా, వాళ్లు నన్ను ఇష్టపడేలా మలుచుకున్నాను.
నాలో ఈ మార్పు తరువాత, నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో యజమాన్యం, నేను ఉద్యోగం ఇస్తున్న రోజుల్లో నా వర్కర్లూ నన్ను ఇష్టపడటం మొదలుపెట్టారు.
No comments:
Post a Comment