Tuesday, August 27, 2024

 *సముద్రంలో నీళ్ళు ఉప్పగా ఎందుకుంటాయంటే? (అమ్మమ్మ చెప్పిన సరదా జానపద కథ)* - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
    ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు వుండేటోళ్ళు. వాళ్ళవి పక్కపక్క ఇళ్ళు. అయినా వాళ్ళ నడుమ పలకరింపులు ఉండేటివి కాదు. తమ్ముడేమో చానా పేదోడు. తినడానికి తిండి గూడా వుండేది కాదు. కానీ అన్న చానా ధనవంతుడు. పెద్ద బంగళా కట్టుకోని హాయిగా కాలుమీద కాలేసుకోని బతుకుతా వుండేటోడు. తమ్ముడు తినడానికి తిండి లేక బాధపడతా వున్నా ఒక్కపైసా గూడా విదిలిచ్చేటోడు కాదు.
ఆ ఊరి పక్కన ఒక పెద్ద సముద్రం వుండేది. ఆ సముద్రంలోని నీళ్ళు బాగా చప్పగా వుండేవి. చుట్టుపక్కల ఊళ్ళలోని జనాలంతా ఆ నీళ్ళను తాగుతా, స్నానం చేస్తా, ఆ నీళ్ళలోని చేపలు పట్టుకుంటా, పంటలు పండించుకుంటా హాయిగా వుండేటోళ్ళు.
ఒకసారి తమ్ముడు తినడానికి తిండి లేక చేపలన్నా పట్టుకోనొద్దామని పడవ తీసుకోని సముద్రంలోనికి పోయినాడు. పొద్దున్నుంచీ సాయంత్రం వరకూ వేటాడినాడు గానీ వలలో ఒక్క చేప గూడా పల్లేదు. ఇంటికి పోతే పెండ్లాం పిల్లలకు ఏమని చెప్పాల్నో అర్థం కాలేదు. దాంతో ఏమైనా సరే చేపలు పట్టే ఇంటికి పోవాలని రాత్రవుతున్నా సరే అలాగే చీకటిలో వల వేయసాగినాడు.
అలా వేటాడుతావుంటే అర్దరాత్రప్పుడు వలలో ఒక బంగారు రంగు చేప పడింది. “అబ్బ... ఎంత ముచ్చటగా వుంది ఈ చేప. దీన్ని ఎవరైనా సరే మంచి ధర ఇచ్చి కొంటారు. హాయిగా వారం రోజులు గడిచిపోతాయి" అనుకున్నాడు సంబరంగా. అంతలో ఆ చేప “బాబూ... నన్ను వదులు. నేను నీవనుకుంటున్నట్లు చేపను కాదు. గంధర్వున్ని. హాయిగా సముద్రంలో ఈదుదామని చేపలాగా తయారయి వచ్చినాను" అనింది. పడక పడక ఒక్క చేప పడితే అది ఇలాగయిందే అని వాని కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. అయినా బాధను మనసులోనే దాచుకోని 'అరెరే... పాపం' అంటూ ఆ చేపను వలలోంచి తీసి నీళ్లలోకి వదిలేసినాడు.
వెంటనే ఆ చేప గంధర్వునిలా మారిపోయి “బాబూ! నువ్వేం బాధ పడకు. ఇకపైన నువ్వెప్పుడూ సంతోషంగా వుండేలా నీకో మంచి బహుమతి ఇస్తా" అంటూ మాయమై మరుక్షణంలో చేతిలో ఒక తిరగలితో ప్రత్యక్షమైనాడు. “చూడు బాబూ... ఇది విసుర్రాయి. దీన్నే కొందరు తిరగలి అని కూడా అంటారు. నువ్వు దీన్ని ముందు పెట్టుకోని

"తిరగవే తిరగవే ఓ తిరగలీ
నా కోరిక తీరేదాకా తిరగవే"

అంటూ నీకేం కావాలో కోరుకో, మరుక్షణమే ఈ తిరగలి తిరగడం మొదలు పెడుతుంది. నీకు కావాల్సినవన్నీ అందులోనుంచి రావడం మొదలు పెడతాయి. మరలా నీవు 

"ఆగవే ఆగవే ఓ తిరగలీ
ఇచ్చింది చాలింక ఆగవే తిరగలీ"

అనేంత వరకూ తిరగలి తిరుగుతానే వుంటుంది. కానీ జాగ్రత్త. దీని గురించి ఎవరికీ చెప్పొద్దు. నీకు అవసరమయినప్పుడు వాడుకో" అని చెప్పినాడు. తమ్ముడు సంబరంగా దానిని తీసుకోని ఒడ్డుకు చేరినాడు. ఎవరికీ కనబడకుండా పడవ చాటున కూర్చొని

“తిరగవే తిరగవే ఓ తిరగలీ
నా కోరిక తీరేదాకా తిరగవే"

అంటూ బచ్చాలు, కర్జికాయలు, లడ్లు... అన్నీ కోరుకున్నాడు. అవన్నీ రాగానే సంబరంగా మూటగట్టుకోని ఇంటికి తీసుకొని పోయినాడు. అందరికీ కడుపు నిండా కావలసినంత పెట్టినాడు.
తరువాత రోజు తమ్ముడు తిరగలి నుంచి కావలసినంత బంగారం, వజ్రాలు తీసుకోని పెద్ద మేడ కట్టించుకొన్నాడు. హాయిగా కాలు మీద కాలేసుకోని బ్రతుకుతా ఊరిలోని పేదజనాలను ఆపదలో ఆదుకుంటా ఆనందంగా గడపసాగినాడు.
పక్కనే వున్న అన్న ఇదంతా చూసినాడు. “అరే... వీడు నిన్న మొన్నటి వరకూ తినడానికి తిండిగూడా లేకుండా కడుపు చేతబట్టుకోని తిరుగుతా వుండె. అటువంటిది పదిమందికి నవ్వుతా పెడతా వున్నాడు. ఇందులో ఏదో రహస్యం వుంది. ఎట్లాగయినా సరే కనుక్కోవాలి" అనుకున్నాడు.
తరువాత రోజు పొద్దున్నే కళ్ళనీళ్ళతో తమ్ముని ఇంటికి చేరి "తమ్ముడూ... తమ్ముడూ... మీ వదినకు ఆరోగ్యం బాగాలేదు. ప్రాణం మీదకు వచ్చింది. పదివేల వరహాలు కావాలి. నువ్వు ఇంతకు ముందున్నవేమీ మనసులో పెట్టుకోవద్దు. ఎట్లాగయినా డబ్బు సర్దు. పంటలు చేతికి రాగానే అవి అమ్మి మళ్ళా నీవి నీకు పువ్వుల్లో పెట్టి అప్పగిస్తా" అన్నాడు.
“అయ్యయ్యో... అన్నవై వుండి మరీ ఇంతలా అడగాల్నా ... ఇప్పటికిప్పుడు అంటే లేవు. కాసేపున్నాక నేనే మీ ఇంటికొచ్చి ఇస్తాలే” అన్నాడు.
అన్న సరేనని అక్కన్నించి పోయినట్టే పోయి ఎవరికీ కనబడకుండా వెనుక నుంచి మరలా లోపలకు వచ్చి దాక్కున్నాడు. ఇదేమీ తెలీని తమ్ముడు గదిలోనికి పోయి తలుపు వేసుకున్నాడు. వెంటనే అన్న కిటికీ కొంచం తెరచి లోపలికి తొంగి చూడసాగినాడు.
తమ్ముడు పెట్టెలో భద్రంగా దాచి పెట్టిన తిరగలి తీసి

“తిరగవే తిరగవే ఓ తిరగలీ
నా కోరిక తీరేదాకా తిరగవే"

అంటూ పదివేల వరహాలు కోరుకున్నాడు. అంతే ఇది తిరుగుతా వుంటే జలజలజల వరహాలు రాలసాగినాయి. అన్న అది చూసి ఆశ్చర్యపోయినాడు. “ఓహో ఇదా సంగతి" అనుకున్నాడు. అక్కడే దాక్కోని తమ్ముడు వరహాలు తీసుకోని బైటకు పోగానే మట్టసంగా లోపలికి దూరి గుట్టుచప్పుడు కాకుండా తిరగలి ఎత్తుకోని పోయినాడు.
ఎవరూ చూడకుండా సముద్రం దగ్గరకి చేరుకున్నాడు. తినడానికి అన్నం పప్పు పెరుగు మూటగట్టుకోని తిరగలి పడవలో పెట్టుకోని నీళ్ళలోకి పోయినాడు. సముద్రం మధ్యకు చేరుకున్నాక “హమ్మయ్య... ఇక్కడయితే ఎవరూ చూడరు. కావలసినవన్నీ కోరుకోని దీన్ని ఇక్కన్నే పారేసి వెళ్ళిపోదాం. ఎవరికీ తెలీకుండా" అనుకున్నాడు.
అంతలో బాగా ఆకలి వేయసాగింది. "సరే" తిన్నాక కోరుకుందాంలే అనుకోని అన్నంలోకి పప్పేసుకోని బాగా తిన్నాడు. తర్వాత పెరుగేసుకున్నాడు. కానీ అందులో ఉప్పు లేక చప్పగా అనిపించింది. ఎలాగూ తిరగలి పక్కనే వుంది గదా... ఉప్పుకెంతసేపు అనుకోని

“తిరగవే తిరగవే ఓ తిరగలీ
నా కోరిక తీరేదాకా తిరగవే"

అంటూ ఉప్పు కావాలని అనుకున్నాడు. అంతే వెంటనే తిరగలి తిరుగసాగింది. ఉప్పు రాసాగింది. కొంచం రాగానే “చాలు చాలు ఇంక చాలు” అన్నాడు. తిరగలి తిరుగుతానే వుంది. ఉప్పు వస్తానే వుంది. “అరెరే... ఇదేంది. ఇలా వస్తా వుంది" అనుకుంటా దాన్ని గట్టిగా పట్టుకొన్నాడు. ఎంత గట్టిగా పట్టుకున్నా అది ఆగకుండా తిరుగుతానే వుంది. ఉప్పు వస్తానే వుంది.
వానికి ఏం చేయాల్నో అర్ధం కాలేదు. ఎలా ఆపాల్నో అర్థం కాలేదు. “ఓరినాయనోయ్... దీన్ని ఎలా ఆపాలిరా దేముడా" అని నెత్తీ నోరూ కొట్టుకోసాగినాడు. ఉప్పు గుట్టలు గుట్టలుగా వస్తానే వుంది. నెమ్మదిగా బరువు పెరుగుతున్న కొద్దీ పడవ, పడవతోబాటు వాడూ సముద్రంలో మునిగిపోయినారు. తిరగలి కూడా సముద్రంలో మునిగిపోయింది. ఐనా అది తిరుగుతానే వుంది. ఉప్పు వస్తానే వుంది.
నెమ్మదిగా సముద్రంలోని నీళ్ళన్నీ కొంచం కొంచెంగా ఉప్పగా మారడం మొదలు పెట్టినాయి. కొన్ని రోజులకు ఉప్పెక్కువయి ఉప్పుకశంగా మారిపోయినాయి. దానిలో ఎన్ని నదుల నీళ్ళు కలిసినా ఆ ఉప్పుకశం కొంచంగూడా తగ్గడం లేదు. ఇప్పటికీ తిరగలి లోపల తిరుగుతానే వుంది. ఉప్పు పెరుగుతానే వుంది. 
*****************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
కథ నచ్చితే *SHARE* చేయండి.

No comments:

Post a Comment