హృదయ కురుక్షేత్రం
యుద్ధానికి సర్వం సిద్ధం అయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంగ్రామం ముందుకు వచ్చింది. పలు సంఘర్షణలు, ఆరోపణలు, రాజనీతి, రాయబారాలు, వాదాలు, వివాదాలు... చివరకు యుద్ధానికి దారితీశాయి. కురు, పాండవ సైన్యాలు పరస్పరం ఎదురెదురుగా పోరాటానికి నిలిచాయి. ధర్మం వైపు ఏడు, అధర్మం వైపు పదకొండు అక్షౌహిణుల సైన్యం మోహరించింది. ఇదీ మంచి చెడుల మధ్య జరిగిన కురుక్షేత్ర సంగ్రామ దృశ్యం. ఆనాటి కురుక్షేత్రం ఈనాటికీ ఏదో పేరు మీద జరుగుతున్న పోరాటమే. పేర్లు ప్రదేశాలు వేరు కావచ్చు కానీ పోరాటం మాత్రం యథాతథం. అడుగడుగునా విశ్వవ్యాప్తంగా జరిగే సంఘర్షణకు అది ప్రతీకగా నిలుస్తుంది. కురుక్షేత్రం ఒక ప్రదేశం. అన్ని విధాలా యుద్ధానికి తగిన ప్రదేశమని ఇరుపక్షాలు నిర్ణయించాయి. అటువంటి యుద్దభూమి ఎక్కడో లేదు. అది మనలోనే ఉంది. మనిషి శరీరంలోని హృదయక్షేత్రం అటువంటిదే. అక్కడే మంచి, చెడులు మోహరించి ఉంటాయి. ప్రతిక్షణం అంతర్మధనం ఒక సంగ్రామం. పాండవుల పక్షాన నిలిచిన వారికన్నా కౌరవ సైన్యం ఎక్కువ. అంతరంగంలో మంచికన్నా చెడుగుణాలు ఎక్కువగా ఉంటాయని, వాటి ప్రభావంతోనే మనిషి పతనం అవుతున్నాడని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. సత్వగుణం ఒకవైపు అణిగి ఉంటే, రజో తమో గుణాలు కలిసి విజృంభిస్తాయని భగవద్గీత పదిహేడో అధ్యాయం చెబుతోంది.
సామాజిక రంగంలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. మంచి తక్కువగా, చెడు గుణాలు ఎక్కువగా కనిపించడం ప్రస్తుతం సాధారణమైంది. మంచికన్నా చెడు త్వరగా వ్యాప్తి చెందుతుంది. ఆకర్షణలు, ప్రయోజనాలు మనిషిని ఆకర్షిస్తాయి. ఏదో ఒక బలహీనతకు మనిషి లొంగిపోయి తప్పు అని తెలిసినా ఆవైపు చేరతాడు. ధర్మం ఉన్నవైపు విజయం తప్పదని భగవద్గీత చెబుతుంది. మంచి బోధించే కృష్ణుడు, ఆచరించే అర్జునుడు ఉంటే- గెలుపు తథ్యం. అంతరంగాన్ని పవిత్రం చేసుకుని సత్వ గుణాన్ని పెంచుకుంటే మనిషి ధర్మం వైపు ప్రయాణం చేసి గమ్యం చేరతాడు. సమాజంలో జరుగుతున్న పోరాటం మంచి చెడుల మధ్య జరిగిన కురుక్షేత్ర సంగ్రామం వంటిది. అధర్మ పక్షాన నిలిచి అసుర గుణాలు కలిగిన అఖండ సైన్యాన్ని చూసి అర్జునుడు నిరాశ చెందాడు. బంధువులు, స్నేహితులు, సోదరులు అధర్మానికి కొమ్ము కాస్తున్నారు. తన తోటివారిని సంహరించడానికి వెనకడుగు వేశాడు. ధర్మం పక్షాన నిలిచిన శ్రీకృష్ణుడు ధైర్యం చెప్పాడు- నీవు చేసే యుద్ధం రాక్షసత్వం మీదే తప్ప మనుషుల మీద కాదు. సంస్కరించే విధానం కొంత కఠినంగానే ఉంటుంది. నేను చేస్తున్నాను అనే అహంకారం విడిచి కర్తవ్యాన్ని నిర్వహించమని బోధించాడు. మనిషి జీవితంలో అడుగడుగునా పోరాటం చేయడం తప్పదు. చదువు, వృత్తిలో నిలకడ, పనిలో నైపుణ్యత, అనారోగ్యం... ఎన్నో పోరాటాలు, ఆరాటాలు. జీవితమే ఒక కదనరంగం. పోరాడితేనే గెలుపు మంచితనం కొంత మేరకు బలహీనంగా అసమర్థతతో కనిపిస్తుంది. అది సమయం కోసం వేచి ఉండే ధోరణి మాత్రమే. పదమూడు సంవత్సరాలు వేచి ఉన్న పాండవులు కురుక్షేత్రంలో తమ శక్తి చూపించి అద్భుతమైన విజయాన్ని సాధించారు.
మనకెందుకు అనే నిరాశ, ఉదాసీనత, ఉపేక్ష, దుర్మార్గానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు ఆయుధం పట్టి యుద్ధం చేయలేదు. ధర్మ పక్షాన నిలిచినవారికి కొండంత నైతిక, మానసిక బలాన్ని అందించాడు. సమాజంలో మన వంతు కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించాలి. అదే స్వధర్మం. అయిదు వేళ్లు బిగిస్తే పిడికిలి. అది మన బలాన్ని చూపించే ఆయుధం, విజయానికి చిహ్నం. హృదయ క్షేత్రాన్ని అశాంతి నుంచి ప్రశాంత క్షేత్రంగా మార్చడమే పవిత్ర కర్తవ్యం..🙏🚩
No comments:
Post a Comment