Friday, August 30, 2024

 *💐💐శ్రీమాత్రే నమః💐💐* 
*252. పరమానన్దా*
*💐💐💐💐💐💐💐💐*

*ప్రతిపదార్థము / పదవిభజన : పరమ + ఆనన్దా = పరమానన్దా = సర్వోత్కృష్టమైన ఆనందము స్వరూపముగా గలది.*

*1. " యో వై భూమో తత్సుఖమితి" -*
*" ఏది అనంతమో అది సుఖము".*
*" పరమః ఉత్కృష్టః ఆనందోయస్యాః స్వరూపం - సా" -*

*"ఉత్కృష్టమైన ఆనందము స్వరూపముగా గలది. నిరతిశయ సుఖస్వరూపం గలది. అంతులేని ఆనందమే స్వరూపంగా గలది ."*

 *'ఆనందమీమాంస' లో చెప్పబడిన మానుష్యానందము మొదలైనవన్నీ క్షణికమైనవి. పరమానందము తురీయము. పరమపురుష స్థితి. తైత్తిరీయాదులందు 'సర్వానందాపేక్షయా' అని చెప్పబడింది. బ్రహ్మానందం ఆధిక్యమని చెప్పబడుట వలన అది పరమానందము. ఆనందమే బ్రహ్మరూపము. పరమేశ్వరి నిరతిశయ బ్రహ్మానందరూపిణి.*

*2. ఆనందం రెండు రకాలు : 1. ఇహము 2. పరము. ఇహంలో ఉండే ఆనందం అశాశ్వతం, అనిత్యం. అది అనుభవించినంతవరకే ఉంటుంది.ఆ తరువాత దుఃఖానికి దారితీస్తుంది. పరమానందం ఒక్కటే శాశ్వతమైన ఆనందం. అదే బ్రహ్మానందం.*

*3. ఈ ఆనందం శ్రోత్రియుడు, సదాచార సంపన్నుడు, నిష్కాముడు అయిన బ్రహ్మవేత్తయే అనుభవించ తగినది. ఈ మూడు గుణాలు లేని వాడికి ఆనందం లభించదు. ఈ లోకంలోని సంపద అంతా యువకుడు, సదాచార సంపన్నుడు, వేదాధ్యాయి, బలమైనవాడు అనుభవించడానికే ఉన్నది. దీనిని అనుభవించడం వల్ల కలిగే ఆనందం 'మానుషానందం'.*

*మానుషానందానికి నూరు రెట్లు 'మనుష్య గంధర్వానందం'. మానవులై ఉండి పుణ్యకర్మల చేత గంధర్వత్త్వం పొందిన వారిని మనుష్య గంధర్వులు అంటారు.*

*పైదానికి నూరు రెట్లు 'దేవగంధర్వానందం'.* *సృష్టికాలంలో దేవలోకంలో గంధర్వులుగా పుట్టినవారు దేవగంధర్వులు.* 

*పైదానికి నూరురెట్లు 'చిరలోకపితరానందము చిరకాలం ఉండే లోకంలో ఉన్న పితృదేవతలను చిరలోకపితురులు అంటారు.* 

*పైదానికి నూరు రెట్లు 'అజానజదేవానందం' దేవలోకానికి పైన ఈ లోకం ఉన్నది.* 

*పైదానికి నూరు రెట్లు 'కర్మదేవానందం'. వైదిక కర్మలు చేసినవారు కర్మదేవతలు.*

*పైదానికి నూరురెట్లు 'దేవానందం'. యజ్ఞంలో హవిర్భాగం తీసుకునే 33 మంది దేవతలు వీళ్ళు.* 

*దేవానందానికి నూరురెట్లు 'ఇంద్రానందం'.*

*దీనికి నూరురెట్లు 'బృహస్పతి ఆనందం'.*

*దీనికి నూరురెట్లు 'ప్రజాపతి ఆనందం'.*

*ప్రజాపతి ఆనందానికి నూరురెట్లు 'బ్రహ్మానందం'.*

*అదే పరమానందం. అతడే పరబ్రహ్మ. జీవులందరిలోనూ ఉన్నాడు. పరమేశ్వరి పరబ్రహ్మస్వరూపిణి కాబట్టి పరమానందం పొందుతుంది. ఆమె 'పరమానందస్వరూపిణి'.*

*4. 'నిర్వాణషట్కం'లో ఆదిశంకరులు చిదానంద రూపమే శివమని ఉపదేశించారు. 'శివం' అంటే మంగళకరం. మంగళకరమైన చిదానంద స్వరూపం, ఆరవ శ్లోకంలో :*

*" అహం నిర్వికల్పో నిరాకార రూపః*
*విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేన్ద్రియాణాం*
*సదా మే సమత్వం న ముక్తిః న బన్ధః*
*చిదానన్ద రూపః శివోహం శివోహం" అన్నారు.*

*" సంకల్పవికల్పాలు లేనివాడను. నిరాకారుడను.సర్వత్రా వ్యాపించిఉన్నవాడను. సర్వేంద్రియాలలో వ్యాపించి ఉన్నవాడను. సదా సమత్వం కలిగినవాడను, శుద్ధ జ్ఞానస్వరూపుడను, ఆనందస్వరూపుడను, మంగళకరుడను అయిన శివుడను నేనే. నాకు ముక్తి లేదు. బంధనం లేదు. నేనే శివుడను. శివ - శివా ఇద్దరూ ఒక్కరే."*

*5. 'ఆనందో బ్రహ్మ' అనే శ్రుతివాక్యము స్మరించదగినది.* 
*" యతో వాచో నివర్తన్తే అప్రాప్యమనసా సహ*
*ఆనందం బ్రహ్మణో విద్వాన్ నబిభేతి కదాచ నేతి" - తైత్తిరియోపనిషత్తు*

*" ఏ పరమాత్మను చేరలేక మనస్సుతో సహా వాక్కులు వెనక్కి తిరిగి వస్తున్నాయో, అట్టి పరమాత్మ ఆనందాన్ని సాక్షాత్కరించుకున్న విద్వాంసుడు భయాతీతుడు. అతడే పరమానందాన్ని ( శాశ్వతానందాన్ని ) పొందుతున్నాడు."*

*6. చిత్, ప్రకాశ, విమర్శ బిందువుల సమన్వయ త్రిభుజాన్ని 'త్రిపుటి' అంటారని కిందటి నామంలో చెప్పుకున్నాం గదా! జ్ఞానం అనేది ఇదే వరుస బిందుక్రమంలో ( చిత్, ప్రకాశ, విమర్శ క్రమం) వ్యక్తమౌతుంది. దీనికి వ్యతిరేక క్రమంలో అంటే - విమర్శ, ప్రకాశ, చిత్ క్రమంలో ఒక దానిలో ఒకటి లీనమైతే వచ్చే స్థితిని 'పరమానంద' స్థితి అంటారు. ఆ స్థితిలోని అమ్మవారు 'పరమానందా' అవుతుంది. 'చిన్మయీ', 'పరమానంద' స్థితులను ఈ నామం క్రింద సూచించిన చిత్రంలో విధంగా అర్థం చేసుకోవచ్చు.* 

*మొదటి బొమ్మ - కేంద్రం వద్ద ఉన్న 'నేను' నుండి అంటే 'ఆత్మ' నుండి చిత్- ప్రకాశ - విమర్శ మార్గంలో జ్ఞానం వ్యక్తమయి అంతా చిన్మయమవుతుందని సూచిస్తుంది.* 

*రెండవ బొమ్మ - 'చిన్మయీ స్థితి' నుండి విమర్శ - ప్రకాశ - చిత్ మార్గంలో జ్ఞానం, కేంద్రం వద్దనున్న 'నేను' అంటే 'ఆత్మ' లోనికి లీనమవుతుందని సూచిస్తుంది. ఇక్కడ చిన్మయీ'ని 'అమ్మవారు' గాను, కేంద్రం వద్ద ఉన్న 'నేను' లేదా 'ఆత్మ'ను 'అయ్యవారు' గాను సమన్వయం చేసుకోవాలి.*
*'నేను' అనే అయ్యవారిలో లీనమై ఉండే 'జ్ఞానం' అనే 'అమ్మవారి'ని 'పరమానందా' అంటారు. ఈ స్థితిని 'ముక్తి' లేక 'మోక్షము' లేక తైత్తిరీయోపనిషత్ లోని ఆనందవల్లిలో చెప్పిన పరాకాష్టానంద స్థితి అయిన 'బ్రహ్మానంద స్థితి' అంటారు. ఇటువంటి బ్రహ్మానంద స్థితులు మనకు అప్పుడప్పుడు లభ్యమవుతూనే ఉంటాయి. కాని అవి అలాంటివి మనం గమనించం.*

*" నిరపేక్షక నిరతిశయానంద రూపము" అని ఈ నామానికి అర్థం.* 

*ఓం పరమానన్దాయై నమః (పంచాక్షరి )*

💐💐💐💐💐💐💐💐
*Jagadguru Gnanapeetam*
*Jagadguru Charitable Trust*
*Mobile : 8309979334 / 9494970459 / 9063939567*
*💐💐శ్రీమాత్రే నమః💐💐*

No comments:

Post a Comment