Tuesday, August 27, 2024

 🙏🙏🙏ఓం🙏🙏🙏
     శుభోదయం
*దొంగ బంగారు పాత్ర*
*మన మంచితనంతో…*
       *ఇతరులను మార్చలేమా?*
            ➖➖➖✍️
సంత్‌ రవిదాసు నిరంతరం భగవన్నామ స్మరణలో నిమగ్నమై ఉండేవాడు. చెప్పులు కుడుతూ జీవనం సాగించేవాడు. ఒక చిన్న కుటీరంలో నివసించేవాడు. తనకు ఉన్నంతలోనే అతిథులకూ, అభ్యాగతులకూ సేవలు అందించేవాడు.

ఒకసారి రవిదాసు కుటీరానికి ఒక సాధువు వచ్చాడు. రవిదాసు సేవానిరతికి మెచ్చుకొని, తన జోలె నుంచి ఒక పరసువేదిని తీశాడు. ఆ పరసువేదితో ఒక ఇనుప పనిముట్టును తాకి... దాన్ని బంగారంగా మార్చాడు. “ఈ పరసువేది నీ దగ్గరే ఉంచుకో, అవసరమైనప్పుడల్లా ఉపయోగించి బంగారాన్ని పొందు. నీ దారిద్య్రం తీరుతుంది” అని రవిదాసుకు చెప్పాడు.

కానీ రవిదాసు అందుకు అంగీకరించలేదు.

అప్పుడు సాధువు ఆ పరసువేదిని కుటీరం పైకప్పులో పెట్టి, “నీకు ఇష్టమైనప్పుడే దాన్ని తీసుకో!” అని చెప్పి వెళ్ళిపోయాడు.

అయితే రవిదాసు దాన్ని ఎప్పుడూ ఉపయోగించలేదు.

పదమూడు నెలల తరువాత ఆ సాధువు మళ్ళీ వచ్చి, పరసువేది గురించి రవిదాసును అడిగాడు.

”స్వామీ! మీరు దాన్ని ఎక్కడ పెట్టారో అక్కడే ఉంటుంది చూడండి” అన్నాడు రవిదాసు.

జైన్‌ సాహిత్యంలోనూ అలాంటి నిస్వార్థపరుడైన ఒక గురువు కనిపిస్తాడు. ఆ గురువుకు సొంత ఇల్లు లేదు. ఎక్కడో పాడుపడిన ఆలయంలోనో, కొండ గుహలోనో, చెట్టు కిందో... ఎక్కడ ఏకాంతం లభిస్తే అక్కడ ఉండేవాడు.

క్రమంగా ఆయన గొప్పతనం ప్రజలకు తెలిసింది. ఆయన దర్శనం కోసం చెట్లూ, పుట్టలూ, గుట్టలూ వెతుకుక్కుంటూ వెళ్ళేవారు. 

ఆ గురువు గొప్పతనం ఆ నోటా, ఈ నోటా రాజుకు చేరింది. రాణితో సహా వచ్చి ఆ గురువును రాజు దర్శించుకున్నాడు.

గురువు బోధించిన మంచి విషయాలు విన్నాక... గురువు పాదాల మీద ఆ రాజ దంపతులు మోకరిల్లారు.

వజ్రాలు పొదిగిన ఒక బంగారు పాత్రను ఆ గురువుకు రాణి ఇచ్చి, దయతో స్వీకరించాలని ప్రాధేయపడింది. 

”నేను భిక్షాటనతో జీవించేవాణ్ణి. ఈ బంగారు పాత్రతో భిక్ష చెయ్యలేను. దీన్ని జాగ్రత్తగా దాచుకోలేను. వద్దు!” అన్నాడు ఆ గురువు.

”పరవాలేదు స్వామీ! ఇది పోతే మరొకటి, అది పోతే ఇంకొకటి ఇస్తాను” అంది రాణి. ఆ పాత్రను అక్కడే ఉంచి, రాజ దంపతులు వెళ్ళిపోయారు.

కొంతసేపటి తరువాత ఒక దొంగ వచ్చాడు. గురువు ఆ గిన్నెను చూపి, “నాయనా దాన్ని తీసుకుపో! దాంతో నాకేమీ పని లేదు” అన్నాడు.

గురువు ఆ గిన్నె విలువ తెలియని అమాయకుడేమో అనుకొని, “అది చాలా విలువైనది స్వామీ!” అన్నాడు దొంగ.

అంతేకాదు, “నేనొక దొంగను” అని కూడా చెప్పాడు.

అప్పుడు గురువు “ఇది నాకు అవసరం లేదు. తీసుకువెళ్ళు. కానీ ‘నేను దొంగను’ అని ఎప్పుడూ అనుకోకు. ప్రతివారిలోనూ బుద్ధత్వం ఉంటుంది. కాబట్టి నువ్వూ బుద్ధుడివే” అంటూ ఆ పాత్రను అతని చేతికి ఇచ్చి పంపాడు.

మూడు రోజుల తరువాత ఆ దొంగ తిరిగి వచ్చి, గురువుకు ఆ బంగారు పాత్రను తిరిగి ఇచ్చాడు.  “అయ్యా! దీన్ని ఎవరూ కొనలేదు. ఇక దీంతో నాకేం పని, నువ్వే ఉంచుకో!” అన్నాడు.

”సరే! ఆ పాత్రను అక్కడ ఉంచు. ఎవరికీ పనికిరాని ఆ పాత్రను రాణిగారికే ఇచ్చేస్తాను. మరి ఇప్పుడు మరో దొంగతనం చేయడానికి వెళ్తావా?” అని అడిగాడు గురువు.

“భలేవాడివయ్యా నువ్వు! 
ఎక్కడో, ఏదో దొంగతనం చేసి బతికేవాణ్ణి. నువ్వేమో ‘నీవు బుద్ధుడివి’ అని నాతో చెప్పావు. అప్పటి నుంచి ‘బుద్ధుడు దొంగతనాలు చేస్తాడా?’ అనే ప్రశ్నే నన్ను వెంటాడుతోంది. దొంగతనం చేయబుద్ధి కావడం లేదు. మనస్సు ఒప్పుకోవడం లేదు. నేనూ భిక్షాటనతోనే జీవిస్తాను!” అంటూ ఆ గురువు పాదాల మీద తన శిరస్సు ఉంచి నమస్కరించాడు.

నిర్మలమైన మనస్సు ఉన్న వారి మాటలు, చేతలు,నిస్వార్థత ఎలాంటి కఠినాత్ములలోనైనా ఊహించని పరివర్తన తేగలవనడానికి ఈ కథ ఒక ఉదాహరణ.✍️```
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
           🌷🙏🌷
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
         ➖▪️➖
సర్వేజనా సుఖినోభవంతు...
లోకా సమస్త సుఖినోభవంతు...
ఓం శాంతి శాంతి శాంతిః...
స్వస్తి...🙏

No comments:

Post a Comment