శ్రీ భగవాన్ ఉవాచ - కర్మ, సన్న్యాస యోగము
లేనివాడై ఉపరతిని పొంది, పరమాత్మ ధ్యానము నందు ఆనందించువాడు. పరమాత్మయే పరమానంద స్వరూపుడు, నిరంతరము, అట్టి అక్షయసుఖ సాగరుని అభేదభావముతో ధ్యానించుచు, తాదాత్మ్యమును చెందుటయే అక్షయానందము ననుభవించుట. ఇదియే సర్వోత్కృష్టమైన ఆనందము.
22. యేహి సంస్పర్శజాభోగా, దుఃఖయోనయ ఏవతే |
ఆద్యంత వంతః కౌంతేయ, న తేషు రమతే బుధః ॥
విషయేంద్రియ సంయోగము వలన ఉత్పన్నమగు భోగము లన్నియును, (భోగలాలసులకు సుఖములుగా కన్పించినను) నిస్సందేహముగా నవి దుఃఖ హేతువులే, మరియు, ఆది అంతములు గల అనిత్యములు. కావున ఓ అర్జునా! బుద్ధిమంతుడు వాటియందు ఆసక్తుడు కాడు.
వ్యాఖ్య :- బాహ్యాకర్షణలు క్షణికములు. తృష్ణను పెంచునట్టివి. వివేక వంతుడు ఇటువంటి క్షుద్రమైన సుఖముల నాశింపక, శాశ్వతమైన ఆత్మయందే రమించును. ఆనంద నిలయమైన ఆత్మను, తనయందే ఉంచుకొని, బాహ్యమైన వస్తువులయందు క్షణిక సుఖాలవెంట పరువులెత్తడం శుద్ధ అవివేకమని భావము.
23. శక్నోతీహైవ యః సోఢడుం, ప్రాక్ శరీర విమోక్షణాత్ । కామక్రోధోద్భవం వేగం, సయుక్తః ససుఖీ నరః ॥
ఎవడు ఈ జన్మము నందే, దేహమును చాలించుటకు పూర్వమే, కామ క్రోధముల వలన కలిగిన ఉద్వేగమును సహించుటకు సమర్థుడగుచున్నాడో, (అదుపులో నుంచుకోగలడో) ఆ సాధకుడే యోగి మరియు సుఖి కూడాను.
వ్యాఖ్య:- కామక్రోధములు మానవునకు మిక్కిలి ప్రమాదకరమైన అంతః శత్రువులు, (3/37) అని భగవానుడే చెప్పి యుండెను. కావున వీటిని ఈ జన్మ యందే, ఈ శరీరమును విడువక పూర్వమే అణగద్రొక్కి వాటి ఉధృతమును శమింప జేయవలెనని భగవానుని హెచ్చరిక. ఏలనన దుర్లభమైన ఈ మానవ జన్మ మరల మరల రాకపోవచ్చును. ఈ జన్మ యందు వీటిని ఉపేక్షించినచో నివి మరుజన్మ యందును విజృంభించి, దుర్జయమయి పోవును. నీచజన్మలకు దిగజార్చును. వీటిని ఈ జన్మలోనే నియంత్రించిన సాధకుడు యోగియు, సుఖియు అగును.
No comments:
Post a Comment