Tuesday, August 27, 2024

 *కన్నయ్య లీలలు* 
                   ➖➖➖✍️

```
ఒకనాడు పొద్దున్నే యశోద బాలకృష్ణుని లీలావిలాసాల గీతాలు ఆలపిస్తూ పెరుగు చిలుకుతోంది.
హృదయంలో కృష్ణస్మరణం, వాక్కుతో గుణ సంకీర్తనం.. ఇలా యశోద మనో, వాక్‌, కాయాలు భగవత్సేవలో సంలగ్నమయ్యాయి. 

యశోద శుద్ధ భక్తి స్వరూపం. భగవంతుని బంధించగల భక్తి ఇదే! 

రోజూ ఆలస్యంగా లేచే కన్నయ్య ముందుగానే మేల్కొని తల్లి వద్దకు వచ్చి కవ్వం కదలకుండా పట్టుకొని ‘అమ్మా! ఆకలేస్తోంది పాలివ్వవే’ అంటూ పైటలాగుతూ తల్లిపై వాలిపోయాడు. 

యశోద కన్నయ్యను ఒడిలోకి తీసుకొని ప్రేమగా జుట్టు దువ్వుతూ పాలిస్తోంది.

ఈలోగా పొయ్యి మీద పాలు పొంగుతూ ఉంటే వెంటనే పిల్లవాణ్ని కింద దింపి పాల కుండ దించడానికి గబగబా వెళ్లింది. 

కడుపు నిండకుండా మధ్యలో దించి వెళ్లిందని కోపంతో కృష్ణుడు ఒక వాడిగల రాతితో పెరుగు కుండను పగుల గొట్టాడు

నిన్న తీసి దాచి ఉంచిన వెన్న వెతికి తింటూ పైపెచ్చు దొంగ కన్నీరు కారుస్తూ ఏడుపు మొదలెట్టాడు. 

పొయ్యి మీదపాలు దించి వచ్చిన యశోద పగిలిన పెరుగు కుండను చూసి లోపల నవ్వుకుంటూ.. కొడుకు కనిపించక పోయేటప్పటికి కంగారుపడి వెతుకుతూ బయల్దేరింది. తిరగబడ్డ రోటిపై ఎక్కి నిలబడి.. ఉట్టి మీద ఉన్న వెన్న తీసి కోతులకు పెడుతూ కోపంతో కనిపించాడు కన్నయ్య.
 
చేత బెత్తం పట్టుకొని వస్తున్న మాతను చూచి.. కాలిగజ్జెలు ఘల్లుఘల్లుమని మోగుతుండగా భయపడుతున్నట్లుగా రోలు దిగి పారిపోసాగాడు. ఇరుగుపొరుగు గోపికలు నవ్వుతూ చూస్తూండగా యశోద కూడా బాలుని వెంటపడ్డది.``` 

*‘యద్‌చిభేతి స్వయం భయం’*-``` భయానికే భయంకరుడైన భగవంతుడు భయపడి పరిగెత్తడమా? ఏమి అపూర్వ లీలా ప్రదర్శనం! 

మహా యోగుల మనస్సులు కూడా వెంటపడి పట్టుకోలేని తన ముద్దుల పట్టిని పట్టాలనే పట్టుదలతో పరమాత్ముని వెంట పరుగిడుతున్న యశోద ఎంత పుణ్యాత్మురాలు! ఆమె పరుగెత్తి పరుగెత్తి అలసిపోయింది కానీ కన్నయ్యను పట్టలేకపోయింది.

ఎందుకని?    యశోద చేతిలో అహంకారమనే బెత్తం ఉన్నది. అహంకారంతో కూడిన భక్తి ఫలించదు. అచ్యుతుడు అహంకారికి ఆమడ దూరంలో ఉంటాడు. దేవకీ తనయునికి దైన్యం(దీనభావం) అంటేనే ఇష్టం. మీదుమిక్కిలి జీవుడు జడాన్ని(బెత్తం) పట్టుకున్నంత వరకూ చైతన్యమూర్తి చేతికి చిక్కడు! ఇది వేదాంత భక్తి సిద్ధాంతం

తల్లి కర్రపారవేయగానే తనయుడు వెనుకకు తిరిగి చూచాడు. ముఖదర్శనం కాగానే యశోదకు బాలకృష్ణుడు పట్టుబడ్డాడు. పట్టుకుందేగానీ తల్లికి కొట్టడానికి చేతులు రాలేదు.

కానీ రోటికి కట్టివెయ్యాలని మాత్రం పట్టుబట్టింది. ఆ లీలాగోపాల బాలుని ఐశ్వర్యశక్తి తెలియక పోవడం చేత రోటికి కట్టడానికి కన్నయ్య నడుము (మొల)కు ఒక తాడు కట్టబోగా అది రెండు అంగుళాలు తగ్గింది.
 
దానికి మరో తాడు కలిపి చుట్టినా రెండు అంగుళాలు తగ్గింది.

ఇంటిలోని తాళ్లన్నీ కలిపి ముడివేసినా కూడా మాల రెండు అంగుళాలు తగ్గడం వలన.. 

ముజ్జగాలు దాగి ఉన్న ఆ బుజ్జికృష్ణుని చిరు బొజ్జను కట్టలేకపోయింది.

త్రిగుణాతీతుడు గుణాల(తాళ్ల)చే బద్ధుడవుతాడా? ఇంద్రియాలకే బంధనం కానీ.. ఇంద్రియాలకు అధిపతి అయిన ఆ హృషీకేశునికి బంధముంటుందా? పశువులను బంధించే తాళ్లు పశుపతిని బంధించగలవా?

బాలకృష్ణుని మొల పెరిగిందా
అంటే లేదు. పోనీ, తాళ్లు పొట్టివి అయ్యాయా అంటే అదీ లేదు. ఆశ్చర్యం!

నిత్యముక్తుడైన శ్రీకృష్ణపరబ్రహ్మ యొక్క దివ్య దృష్టి సోకగానే తాడుకు కూడా ముక్తి కలుగగా, దానికి బంధించే శక్తి నశించిపోయిందట``` *‘పట్టుగొనన్‌ నాకు గాక పరులకు పశమే’*(నేను తప్ప వీడిని ఇతరులెవరూ కట్టలేరు) ```అని అహంకరించిన యశోద తనయుని కట్టలేక పోయింది.

 
పరమాత్మను బంధింపగలిగేది ప్రేమ రజ్జువు మాత్రమే. అది కూడా ఆయనకు ఇష్టమైతేనే!

జీవునికి దేవునికి రెండుగుళాల దూరం. అహంకార మమకారాలు, రాగద్వేషాలు పాపపుణ్యాలనే ద్వంద్వాలే రెండంగుళాలు.

ఇంతకన్నా ముఖ్యంగా భక్తుని పరిశ్రమ పరాకాష్ఠకు చేరి పరిపక్వం కావాలి. రెండవది, భగవంతుని కృప కూడా వెల్లివిరియాలి. అప్పుడే రెండంగుళాల దూరం తొలగి భగవంతుడు బంధనం స్వీకరిస్తాడు.

యశోద అలసి సొలసి పోయింది. తనను కట్టివేయాలనే పట్టుదలతో తంటాలు పడుతున్న తల్లి మీద తనయునికి కృప(జాలి) కలిగింది. తల్లి కష్టం చూడలేక ``` *‘కృపయాసీత్‌ స్వబంధనే’*``` బాలకృష్ణుడు తనకుతానే బంధనం స్వీకరించి(యశోదయా దామ్నా ఉదరే బద్ధః) ‘దామోదరుడు’ అన్న గౌణ నామంతో ప్రసిద్ధుడయ్యాడు. 

యశోద కృష్ణుని రోటికి కట్టివేసి ఇంటి పనులలో మునిగిపోయింది.
 
భక్తులకు పట్టుబడినట్లుగ భగవంతుడు జ్ఞానులకు గానీ, మౌనులకుగానీ, దానపరులకు గానీ, యోగీశ్వరులకు గానీ పట్టుబడడు గదా! 

నిష్కపటమైన భక్తికే కట్టుబడతాను... అని చెప్పడానికే కన్నయ్య దామోదరుడు అయ్యాడు.✍️```
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   

No comments:

Post a Comment