🌳మా స్టారు..🌳
పడక కుర్చీలో పడుకుని కళ్ళు మూసుకుని ఉన్నారు విద్యాసాగర్ గారు..
ఆయన రిటైరయ్యి నాలుగేళ్లు అయ్యింది...
స్వస్థలం కర్నూల్ పట్టణం..అక్కడే ఎక్కువకాలం లెక్చరర్ గా పని చేసారు.. ఎన్నో అనుభూతులు... గతం ప్రసాదించిన వరం.. ఆ అనుభూతుల్లోనికి తొంగి చూడటం అలవాటయ్యింది విద్యాసాగర్ గారికి..
ఆయనో పిజిక్స్ లెక్చరర్ ఆ రోజుల్లో.. అప్పుడు ఆయన వయస్సు పట్టుమని ముప్పై ఏళ్ళు లేవు...అప్పటికే సీనియర్ కాలేజీ లెక్చరర్... స్టూడెంట్స్ కి ఇష్టమైన లెక్చరర్ కూడా..
ఆయన పనిచేస్తున్న కాలేజీ ఒక రెసిడెన్షియల్ కాలేజీ..మొత్తం నాలుగు వందల మంది విద్యార్థులు ఉండేవారు..దాదాపుగా తొంభై శాతం విద్యార్థులు నిరుపేదలే...కష్టపడి చదివి, ఎంట్రెన్స్ పరీక్ష వ్రాసి ఉత్తీర్ణులై వచ్చిన వారే అందరూ.. నెలకు వంద రూపాయలు స్టైఫండు ఇచ్చేవారు ప్రతి విద్యార్థికి .. అవి వారి తిండికే సరిపోయేవి...
ఇంకో రెండు రోజుల్లో దసరా పండుగ సెలవులు.. ఆ రోజు రాత్రి పది గంటల తరువాత విద్యార్థులు ఉన్న హాస్టల్ నిరీక్షణకు వెళ్ళారు ఆయన ...ఆ కళాశాల లో పని చేస్తున్న ప్రతి లెక్చరర్ కి అదో ప్రత్యేకమైన డ్యూటీ...
హాస్టల్ లో నలభై గదులున్నాయి. రెండు వందల మంది మాత్రమే హాస్టల్ లో ఉన్నారు..మిగతా రెండు వందల మంది కాలేజీకి దగ్గర్లో ఉన్న కాలనీల లో అద్దెకు ఉండేవారు .హాస్టల్ లో ఖాళీ అయినప్పుడు వచ్చి చేరేవారు..
హాస్టల్ నిరీక్షణకు దాదాపు రెండు గంటల సమయం పట్టేది.. నలభై గదుల్లో ఉన్న విద్యార్థులు ఎలా చదువుతున్నారో చూడాలి ..నిరీక్షణ చేస్తున్న లెక్చరర్..
నిరీక్షణ మొదలయ్యింది ఆ రోజు రాత్రి..
మధ్య మధ్యలో గదుల్లోనికి వెళ్లి విద్యార్థులను పరామర్శించి ముందుకు కదులుతున్నారు..
8 వ నంబర్ రూము.... తలుపులు దగ్గరకు వేసి ఉన్నాయి.. ఏవో మాటలు వినిపిస్తున్నాయి..చదువు కోకుండా ఈ మాటలేమీటీ.. అనుకుంటూనే దగ్గరగా వెళ్లి మాటలు విన్నారు... ఆ తరువాత ముందుకు కదిలారు.. ఒక గంట తరువాత స్కూటర్ స్టార్ట్ చేసి ఇంటికి బయలు దేరారు విద్యాసాగర్ మాష్టారు...
ఆ రోజు రాత్రి చాలా సేపటి వరకూ ఆయనకు నిద్ర పట్టలేదు..
ఎప్పుడో తెల్లవారు ఝామున నిద్ర పట్టింది ఆయనకు...
టైం కి కాలేజీకి వెళ్ళడం ఆయనకు అలవాటు..
మొదటి పీరియడ్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ క్లాసుకి వెళ్ళారు...
పాఠం మొదలు పెట్టే ముందు మాములుగా అందరినీ అడిగారు .
"దసరా సెలవులు వస్తున్నాయి కదా .. ఈ పది రోజులు ఇంటికి వెళ్ళే వారు ఎందరు ? "
మొత్తం క్లాసులో ముప్పై రెండు మంది విద్యార్థులు ఉన్నారు.. ముగ్గురు తప్పించి అందరూ ఇంటికి వెళ్తున్నామని చేతులు యెత్తారు..చేతులు ఎత్తని ముగ్గురి పేర్లు ఆయనకు తెలుసు..
"హాయిగా సెలవులు గడిపి రండి..కొన్ని రోజులు కాలేజీని మరచి పొండి..."నవ్వుతూ అన్నారు ఆయన..
క్లాసు చెప్పడం మొదలు పెట్టారు..గంటన్నర తరువాత క్లాసు ముగించి స్టాఫ్ రూమ్ కి వెళ్ళారు ఆయన....
ఒక అరగంట తరువాత ప్రిన్సిపాల్ రూం లో ఉన్నారు ఆయన..
"సర్..నిన్న రాత్రి హాస్టల్ విజిట్ కి వెళ్ళాను..ఒక రూం లోనుండి విద్యార్థులు మాట్లాడుకున్న మాటలు విన్నాను.."
"సర్ ! దసరా సెలవులు కొంతమంది పిల్లలకు కష్టం కలిగిస్తున్నాయి.. కొంత మందికి తల్లి దండ్రులు లేరు..ఎవరి పంచనో ఉండి చదువుతున్నారు ఇన్నాళ్లూ..ఇప్పుడు ఇక్కడికి వచ్చారు.. ఈ సెలవుల్లో ఎక్కడికి వెళ్ళాలో వాళ్లకు అర్థం కావటం లేదు ..హాస్టల్ కూడా మూసేస్తున్నాం .. తిండి కూడా ఉండదు పిల్లలకు.. సెలవుల్లో.."
"నాదో రిక్వెస్ట్ సర్ .. హాస్టల్ తెరిచి ఉంచుదాం ..రెండువందల మందిలో కనీసం ఒక ఇరవై మంది హాస్టల్ లోనే ఉండే అవకాశం ఉంది.. వీలయితే మెస్ కూడా ఏర్పాటు చేయాలి మనం...చెప్పడం ఆగారు.. విద్యాసాగర్ గారు..
ప్రిన్సిపాల్ అంతా విని ఆశ్చర్య పోయారు.. "అయ్యో.. ఇన్నాళ్లూ ఈ విషయం నా దృష్టికి ఎవరూ తీసుకు రాలేదు..."బాధ పడ్డారు ఆయన..
ఆలోచనలో పడ్డారు ప్రిన్సిపాల్..కాసేపటి తరువాత తేరుకుని అన్నారు..
"హాస్టల్ తెరిచి ఉంచడం కష్టం కాదు ..మెస్ ఏర్పాటు చేయడం కష్టం.. మెస్ లో పని చేస్తున్న వాళ్లకు సెలవులు ఇచ్చి తీరాలి.. ఏం చేయాలి ? .." ఆలోచనలో పడ్డారు ఆయన..
"అది పెద్ద కష్టం కాదు సర్.. దాదాపు పాతిక మంది లెక్చరర్లము ఉన్నాము..పిల్లలు మా ఇళ్ళల్లో భోజనం చేస్తారు..ఆ సంగతి నేను చూసుకుంటాను..మీరు హాస్టల్ తెరిచే ఉంచి పుణ్యం కట్టుకోండి.." బ్రతిమ లాడారు విద్యాసాగర్ గారు..
"అలాగే ..తప్పకుండా హాస్టల్ తెరిచే ఉంచుదాం...ఇక్కడే ఉండాలనుకునే విద్యార్థులు నిరభ్యంతరంగా ఉండవచ్చు సెలవు రోజుల్లో...వాచ్ మన్లు గా ఒకరిద్దర్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేద్దాం...ఇక భోజనాల సంగతి...మా ఇంట్లో కూడా నలుగురికి నేను ఏర్పాటు చేస్తాను .."అన్నారు ప్రిన్సిపాల్..
ఆయనకు నమస్కారం చేసి స్టాఫ్ రూం కి నడిచారు విద్యాసాగర్ గారు..
లంచ్ సమయం లో స్టాఫ్ రూం లో ఉన్న ఆయన దగ్గరకు వచ్చారు ఉదయం ఫస్ట్ ఇయర్ పీరియడ్ లో సెలవులకు ఇంటికి వెళ్ళని ముగ్గురు విద్యార్థులు..
"ఏమిటి ? చెప్పండి .."అడిగారు ఆయన. ..
ఒక నిముషం మాటలు లేవు..నెమ్మదిగా ఒక విద్యార్థి చెప్పాడు..
"మాకు కూడా ఇంటికి వెళ్ళాలని ఉన్నది ..అమ్మని, నాన్నని చూడాలని ఉంది..అలాగే తమ్ముళ్ళను చెల్లాయిలను కూడా..కానీ వెళ్ళడానికి మా దగ్గర డబ్బులు లేవు .అందుకే మేం ఉదయం చేతులు ఎత్తలేదు సర్..."చెప్పాడు ఒక విద్యార్థి..మిగతా ఇద్దరూ ..అవును సర్...అన్నారు... ఈ విషయం అందరి ముందు చెప్పలేక పోయాం సర్... క్షమించండి...అన్నారు ఆ ముగ్గురూ..
"సరే..మీరు క్లాసుకి వెళ్ళండి....మీతో తరువాత మాట్లాడుతాను.. " అంటూ వాళ్ళను పంపేశారు విద్యాసాగర్ గారు...
పిల్లలు ఇంత కష్ట పడుతూ ఉన్నారా ? సెలవులకు ఇంటికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవా ?? ఆయన మనసు ఎంతో బాధ పడింది.. ఏం చేయాలి.. ఏం చేయాలి...
ఆ పిల్లలు ముగ్గురికి ..సెలవులకు ఇంటికి వెళ్ళడానికి ట్రెయిన్ టిక్కెట్లు కొన్నారు...మళ్ళీ రావడానికి, ఖర్చులకు ..ఒక్కొక్కరికి వంద రూపాయలు అదనంగా ఇచ్చారు...విద్యా సాగర్ గారు...
అయినా ఆయన మనసులో ఏదో బాధ...ఇలా విషయం చెప్పకుండా తమలో తాము బాధ పడుతున్న విద్యార్థులు ఎందరో..?
ఆయన మదిలో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది....
దసరా , సంక్రాంతి సెలవులకు ..వారం రోజుల ముందు ..విద్యార్థులకు ఫిజిక్స్ సబ్జెక్టు లో పరీక్ష పెట్టేవారు ..వంద మార్కులకు..కనీసం ఎనభై మార్కులు వచ్చిన విద్యార్థులకు ..వంద రూపాయలు నగదు పారితోషికం...అందజేసేవారు....ఇంకేముంది.... ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మరియు థర్డ్ ఇయర్ విద్యార్థులకు..ఇలా ఇవ్వసాగారు.. దసరా , సంక్రాంతి పండుగలకు..విద్యాసాగర్ గారు ఇరవై వేలు పైనే ఖర్చు పెట్టేవారు.. ఆ రోజుల్లో.. ఆ కాలేజీలో ఆయన ఉన్న ఐదేళ్ల లో ఇలాగే గడిచింది .ఆయనకు తృప్తిగా ఉంది...ప్రిన్సిపాల్ కూడా మెచ్చుకున్నారు..ఆయన కూడా కొంత సాయం చేసే వారు మిగతా గ్రూప్ విద్యార్థులకు..
ఆ రోజులు గుర్తుకు వచ్చి ..నవ్వుకున్నారు ఆయన..ఆ పిల్లలు ఎలా ఉన్నారో...ఎక్కడ ఉన్నారో... వాళ్ళు కనిపించినా గుర్తు పట్టడం కష్టం..
"కాఫీ తీసుకోండి.. "అంటూ వచ్చింది ఆయన శ్రీమతి..
"దసరా పండుగ వస్తోంది కదా.. మన పని మనిషి పిల్లలకు బట్టలు కొందామా ?" అడిగింది ఆవిడ...
ఆవిడ వంక తదేకంగా చూశారు విద్యాసాగర్ గారు..
"అలాగే..."అంటూ ఆలోచనలో పడ్డారు..
ఒక గంట తరువాత శ్రీమతి కి చెప్పారు... "అలా ..మా కాలేజీ వరకూ వెళ్లి వస్తాను.."
"మీ కాలేజీ ఏమిటి ? మీరేమైనా కట్టించారా ? "నవ్వింది ఆయన శ్రీమతి..
ఆయన కూడా నవ్వారు..
హైదరాబాదు లో డిప్యూటీ డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు ఆయన..విద్యా విభాగంలో.. ప్రస్తుతం కర్నూల్ లో సెటిల్ అయ్యారు...
*** *** ***
కాలేజీ కి చేరుకుని ..తిన్నగా ఫిజిక్స్ డిపార్ట్మెంట్ కి వెళ్ళారు..అక్కడ ఉన్నవారికి ఆయన తెలుసు..నమస్కారం చేసారు అందరూ... కాసేపు వారితో గడిపి...ప్రిన్సిపాల్ రూం లోనికి అడుగు పెట్టారు ఆయన...
"నమస్కారం ప్రిన్సిపాల్ గారు..నా పేరు విద్యా సాగర్.. ఈ కాలేజీలో ముప్పై ఏళ్ల క్రితం లెక్చరర్ గా పనిచేశాను..ఒకసారి చూసి పోదామని వచ్చాను...." చెప్పారు ఆయన..
ప్రిన్సిపాల్ .. అక్కడున్న మిగతా వాళ్ళు చూస్తూ ఉండగానే .. విద్యాసాగర్ గారి కాళ్ళకు నమస్కారం పెట్టారు...
"సర్...మీరు నాకు తెలుసు....నేను కూడా ఇదే కాలేజీ లో కామర్స్ చదివాను... మీరిచ్చిన వంద రూపాయల్లో సగం నాకిచ్చేవాడు నా రూం మేట్...మీ పేరు చెప్పుకుని మేము సెలవుల్లో ఇంటికి వెళ్ళేవాళ్ళం .."వినయంగా చెప్పారు...ప్రిన్సిపాల్..
విద్యాసాగర్ గారికి ఆశ్చర్యం.. ఎన్ని ఏళ్ల క్రితం మాట... కొన్ని వందల రూపాయల సాయం... అదీ పిల్లలకు.... ఇంకా ఇలా కొంతమంది గుర్తు పెట్టుకోవడం ఆనందంగా ఉంది...
జేబులో నుండి చెక్కు తీశారు...ఇరవై వేల రూపాయలు...వ్రాసి సంతకం చేసి..ప్రిన్సిపాల్ చేతికి అంద జేశారు..
"పిల్లల కోసం ఖర్చు పెడితే సంతోషిస్తాను..."చెప్పారు విద్యా సాగర్ గారు..
"అలాగే సర్...తప్పకుండా.."
"మీరు నేర్పిన బాట లోనే నేను నడుస్తున్నాను.. పండుగల ముందు పరీక్షలు పెట్టి..కొంతమందికి నగదు బహుమతి ఇవ్వడం మొదలు పెట్టాను.. మీరు వెలిగించిన కాగడా ..ఇంకా వెలుగుతూనే ఉంది మాష్టారూ... నా ముందు వాళ్లు కూడా ఇలాగే చేసారు..అవసరం ఉన్న వాళ్లకు ..వాళ్ల ఆత్మాభిమానానికి అడ్డు రాకుండా ..మీరు చేసిన పనిని మేం కొనసాగించాం..
మీకు అభ్యంతరం లేక పోతే అప్పుడప్పుడూ వస్తూ ఉండండి .."వేడుకున్నాడు ..ప్రిన్సిపాల్...
ప్రిన్సిపాల్ తో బాటుగా టీ త్రాగి..తృప్తిగా బయటకు నడిచారు...కాదు..కాదు..కారు వరకూ..దాదాపు అందరు లెక్చరర్లు వచ్చి దిగ బెట్టారు.. ప్రిన్సిపాల్ కారు డోర్ తీసి పట్టుకుని.. అన్నాడు.. "మమ్మల్ని ఆశీర్వదించండి మాష్టారూ.."
విద్యాసాగర్ గారికి..కళ్ళల్లో నీళ్ళు ఉబికాయి...ప్రతి జన్మ లో ఉపాధ్యాయుడుగా పుట్టాలని కోరుకు న్నారు .. దేవుణ్ణి..
*** ***
"మీకోసం ఆయన ఎవరో వచ్చారు.... ఇంకో గంట లో వస్తానని వెళ్ళారు...ఏదో పేరు చెప్పారు...ఆc.. సుబ్బారావు గారట....పెద్ద రైల్వే ఆఫీసర్ లా ఉన్నారు ఆయన. .." చెప్పింది ఆయన శ్రీమతి..
ఎవరో సుబ్బారావు...గుర్తుకు రాలేదు విద్యాసాగర్ గారికి..
ఇంకో అరగంట లో వచ్చారు ఆ సుబ్బారావు గారు
షరా మామూలే ...వచ్చిన సుబ్బారావు గారు ఆయన కాళ్ళకు నమస్కరించడం ...
వచ్చిన సుబ్బారావు గారు చెప్పారు ..
"ముప్పై ఏళ్ళ క్రితం.. ఒక మధ్యాహ్నం..మీ రూం కి వచ్చిన ముగ్గురిలో నేను ఒకడిని మాష్టారూ.. అప్పుడు మీరు ట్రెయిన్ టికెట్ కొనిపెట్టి..వంద రూపాయలు డబ్బులు ఇచ్చారు ఇంటికి వెళ్ళడానికి..
ఈ రోజున ..అదే రైల్వేలో ..రైల్వే బోర్డు మెంబరుగా పని చేస్తున్నాను... అంతా మీ చలవే..వినయంగా చెప్పాడు.. సుబ్బారావు..
ఎంతో సంతోష పడ్డారు విద్యాసాగర్ గారు... సుబ్బారావు ని దీవించి పంపారు ..విద్యాసాగర్ గారు.. అతను తెచ్చిన స్వీట్ ని తిన్నారు ఆప్యాయంగా...
ఆ రుచి గొప్పగా ఉంది ఆయనకు.... అలా ఎప్పుడూ అనిపించలేదు ..
ఆయనకు బాగా నిద్ర పట్టింది ఆ రాత్రి.. నిద్రలో వెలుగుతున్న కాగడా ...కనిపిస్తూనే ఉంది.. సంతోషంగా ట్రెయిన్ లో వెళుతున్న విద్యార్థులు కూడా కనిపించారు..కలలో..
మాష్టారు గా విద్యను అందరూ బోధిస్తారు... విద్యార్థుల అవసరాలను గుర్తించి ఆదుకునే .. విద్యాసాగర్ లాంటి కూడా మాస్టార్లు అరుదుగా ఉంటారు... చేసిన సాయం బయటకు చెప్పడం వారికి ఇష్టం ఉండదు.... వారే నిజమైన మాష్టార్లు.... విద్యా సాగరులు..
💐💐🌹
No comments:
Post a Comment