Friday, August 9, 2024

****నవ్వు నాలుగువిధాలా చేటు!*

 *నవ్వు నాలుగువిధాలా చేటు!*
నవ్వు అన్ని సమయాలలో ముఖానికి అందమూ మనసుకు ఆహ్లాదము కలిగించవు. నవ్వుల వల్ల కలిగిన ఎన్నో అనర్ధాల గురించి మన పురాణాలలో ఇతిహాసాలలో చెప్పబడ్డాయి. అలాటి కొన్ని సంఘటనలు చూద్దాము…

సీతాకళ్యాణ సమయంలో సీతారాములను ఆశీర్వదించడానికి శివపార్వతులు కూడా విచ్చేసారు.  సీతాదేవిని తనకు పెళ్ళికానుకగా ఏమి కావాలో కోరుకోమన్నాడు పరమేశ్వరుడు.

సీత దీర్ఘదృష్టితో తనకు భవిష్యత్తులో ఏది ప్రయోజనకరమో త్రికాలజ్ఞుడైన త్రినేత్రునికే బాగా తెలుసని అటువంటిదానినే తనకు కానుకగా ఇవ్వమని కోరింది.

పరమశివుడు ఆలోచించాడు. గతంలో త్రిపురాసురులను తన క్రోధపూరితమైన నవ్వుతోనే భస్మంచేశాడు. అటువంటి నవ్వును సమయానుకూలంగా ఉపయోగించుకోమని సీతాదేవికి కానుకగా ఇచ్చాడు.

ఆ నవ్వును సీతాదేవి తన మనసులో భద్రంగా పదిలపరుచుకున్నది.

రావణాసురునిచే లంకలోని అశోకవనంలో చెఱపట్టబడి వున్నప్పుడు సీతాదేవిని చూడడానికి హనుమంతుడు వచ్ఛాడు. మాటల సందర్భంలో రావణునిపట్ల గల కసిని క్రోధపూరితమైన నవ్వుగా వ్రెళ్ళగక్కింది. అది చూసిన హనుమంతుడు ఆవేశం చెందాడు. లంకా దహనం చేశాడు. నిజానికి ఆనాటి లంకా దహనం జరిగింది హనుమంతుని వలన కాదు. పరమేశ్వరుడు కానుకగా ఇచ్చిన నవ్వును సీతాదేవి ఈసందర్భంలో ఉపయోగించు కున్నది. మహాసాధ్వియైన సీతాదేవి రౌద్రం వలన కలిగిన నవ్వువలనే లంక దహించబడిందని ఒక  రామాయణ గ్రంధ వివరణ.

అలాగే రామాయణంలో జరిగిన మరో సంఘటన…

రావణ సంహారం అనంతరం అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకం మహావైభవంగా సాగింది. శ్రీరాముడు తనకు సహాయం చేసిన వానర ప్రముఖులతో సహా అందరినీ సత్కరించి సంతోషపరుస్తున్నాడు.
ఆ సమయంలో పక్కనే వున్న లక్ష్మణుడు ఉన్నట్టుండి ఫకాలున నవ్వాడు. లక్ష్మణస్వామి ఎందుకు నవ్వాడో ఎవరికీ అర్ధంకాలేదు. శ్రీరాముడు , సీత , భరతుడు , సుగ్రీవుడు , హనుమంతుడు అందరూ ఎవరికివారే తమలోని ఏదో లోపాన్ని చూసే లక్ష్మణుడు నవ్వాడాని అతనిపై ఆగ్రహించారు.

వారిని శాంతింపజేయడానికి వారికి క్షమాపణలు చెపుతూ తన నవ్వుకు గల కారణం గురించి లక్ష్మణుడు ఇలా చెప్పాడు…
సీతారాములతో పధ్నాలుగేళ్ళపాటు వనవాసంలో గడిపిన తను ఏ ఒక్కరాత్రి పగలు కూడా  ఒక్క క్షణమైనా నిద్రపోకుండా సీతారాముల కాపలాలో గడిపానని ఆ సమయంలో ఒక్క రెప్పపాటు సమయంలో కూడా నిద్రాదేవి ఆవహించలేదు. కానీ ఈ సంతోష సమయంలో యింతమంది ప్రముఖుల సమక్షంలో వున్న నన్ను నిద్రాదేవి ఆవహించిందని  తన ఈ దురవస్థకు ఆపుకోలేని నవ్వు వచ్చిందని లక్ష్మణుడు సంజాయిషి చెప్పుకున్నాక కానీ ఆ సభలోని వారి అనుమానం , కోపం తగ్గలేదు.

అందరికీ తెలిసిన మరో నవ్వు …పాంచాలి నవ్వు..!

మహాభారతంలో మయసభ ఘట్టంలో దుర్యోధనుని చూసి ద్రౌపది  నవ్విన నవ్వువలన ఎన్ని అనర్ధాలు , ఎన్ని దుష్పరిణామాలు, ఎన్ని ఘాతుకాలు , ఎంతటి మహా సంగ్రామం జరిగి కుఱువంశం నాశనమైపోయిందో అందరికీ తెలిసిందే!

అందువలన పదిమందిలో వున్నప్పుడు అకారణంగా నవ్వి నవ్వులపాలు కాకూడదు.
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

 లోకా సమస్తా సుఖినోభవన్తు!

No comments:

Post a Comment