Monday, August 12, 2024

విచార సంగ్రహం ( భగవాన్ రమణ మహర్షులు 🙏🏻)

 విచార సంగ్రహం 
( భగవాన్ రమణ మహర్షులు 🙏🏻)
ఈ చిన్నగ్రంధము ఎంతో విలువైనది. ఎందువలన అంటే, 1901 -02 లో భగవాన్ రమణమహర్షి మౌనవ్రతంలో వుంటున్నప్పుడు, వారి పాదాలను ఆశ్రయించుకుని వున్న బ్రాహ్మణ పరమ భక్తాగ్రేసరుడు అయిన గంభీరం శేషయ్య గారికి ఆకాలంలో, వారు అడిగిన సందేహాలకు రమణులు వ్రాతపూర్వకంగా అనుగ్రహించిన వేదాంతసారం, యిందులో పొందుపరచ పడినది. ఇందులో ముముక్షువులైన సర్వాధికారులకు అధికఫలం ఇచ్చే ఉపదేశములు వుండడడం వలన ఇది ' విచార సంగ్రహము ' అనే పేరుతో పిలువబడినది.
దైవపూజ.
' అహం బ్రహ్మాస్మి ' అనే భావనను విడువక వుండడమే నిర్గుణపూజ యొక్క తాత్పర్యము. అదే యజ్ఞము, దానము, తపస్సు, జపము, యోగ సాధనాల ఫలం అవడం వలన, తన నిష్ఠకు ప్రతిబంధకంగా ఏ రూపములు స్ఫురణకు వచ్చినా, మనస్సును ఆ దారిలో పోనీయకూడదు.
మనస్సును ఆత్మ స్వరూపమైన తనయందే నిలిపి, తన ఎదుట ఏమిజరుగుతున్నా, ' జరిగేది జరగనీ, నేను సాక్షీ మాత్రుడను. ' అనే భావానికి అలవాటు పడితే, యే ప్రతిబంధకమూ దరిజేరదు. అంతకంటే వేరు ఉపాయము లేదు. ఎన్నిఅలజడులు వచ్చినా, ' నేను బ్రహ్మమును. ' అను భావమును వీడకూడదు.
ఈ విధంగా అహం అనే స్వరూపమునందు మనస్సును నిలపడం యోగము, ధ్యానము, జపము, జ్ఞానము, భక్తి, మంత్రము. అహం స్వరూపం అయిన ఆత్మాకారమునే దైవంగా తెలిస్తే, మనస్సును నిరంతరం అక్కడే లగ్నం చేస్తే, అదే భగవంతునికి సమర్పించే సర్వోపచారఫలము అని చెప్పబడింది. మనస్సును ఒక్కదానిని నియంత్రిస్తే, సర్వమూ మన వశం అయినట్లే. మనస్సే కుండలిని. షడ్చక్ర దర్శనము మొదలైనవన్నీ మనో కల్పనలే. యోగశాస్త్రం ఆరంభించిన సాధకులకు మాత్రమే ఈ కుండలిని మొదలైన పరిభాష వర్తిస్తుంది.
అంత : పూజ తెలియక పోవడం వలననే, మన శక్తినే విగ్రహాలలో ఆవాహన చేసుకుని, పూజచేయడానికి అలవాటు పడినాము. కాబట్టి, అన్నివిషయాలు తెలుసుకున్న మనము, ఆత్మజ్ఞానమును తెలుసుకు౦టే అన్నింటినీ తెలుసుకున్నట్లే. అనేక విపరీత భావనలతో కూడుకుని వుండే మనము, దైవము అనే ఆత్మను తెలుసుకోవడం అనే ఏక భావనతో, విపరీత భవనాలు తొలగిపోతాయి. అసలు దైవ స్వరూపము అంటే ఏమిటో తెలుస్తుంది.
ఎల్లప్పుడూ, సర్వ పరిపూర్ణమైన స్వ స్వరూప ఆత్మ భావనను మరువకుండా వుండడమే పూర్ణమైన యోగము, జ్ఞానము మొదలైనవి. ఒకవేళ ఎప్పుడైనా, తన అసలు స్థితిని వదిలి, బహిర్ముఖ వ్యవహారములు మనస్సులో ప్రవేశిస్తే, ' ఓహో ! ఈ దేహాదులు మనము కామే ! మనము ఎవరమూ ? ' అనే విచారణతో, దానిని తిరిగి మన అసలుస్థితిలో నిలుపవలెను.
మనం అనేకసార్లు చెప్పుకున్నట్లు, ' నేనెవరను ? ' అనే విచారణ సర్వ అనర్ధ నివృత్తికి, ఆనందప్రాప్తికి ముఖ్య హేతువు. ఎన్ని మాటలు తిప్పి తిప్పి చెప్పినా, విషయము మాత్రము ఇంతే.
ముక్తి గురించి రేపు తెలుసుకుందాం. -

No comments:

Post a Comment