[7/2, 17:02] +91 79819 72004: *ఆ గుప్పెడున్న పిట్టల ఆత్మాభిమానం ముందు నా నిలువెత్తు అహంకారం పటాపంచెలయ్యిందేమో...*
నా బాధ మీతో పంచుకోవడం మినహా నాకువేరే దారి తోచలేదు.
మండి పోతున్న వేసవి ఎండలు నన్ను హైరానాపెడుతుండేవి.సెలవుల వెసులుబాటు కారణంగా నేను ఎండలకి భయపడి దాదాపు బయటికి వెళ్ళకుండానే కాలక్షేపం చేస్తుండేవాడిని.ఎండల కారణంగా వారం రోజులు ట్రైనింగ్ క్లాసులకు హాజరు కావాలనితెలియగానే....
బడికెళ్లనని మారాంచేసే చిన్నపిల్లాడిలా నా పరిస్థితుండేది.
ఈ కాంక్రీట్ అరణ్యంలో, విశాలమైన రోడ్లు ఎండలకు పెళపెళలాడుతూ కాలుతున్న పెనంలా ఉన్నాయి.
మేం ఈ ఇంట్లోకొచ్చి దాదాపు సంవత్సరమైంది. మొదట్లో నేనంతగా గమనించలేదు గానీ...
తర్వాత వాటిని గుర్తించాక మాత్రం ప్రాణం విలవిలలాడిపోతోంది.
మా గేటు ముందు రోడ్డవతలి
కరెంటు స్తంభం పైన తీగల మధ్య కాసారం పైన ఎండిపోయిన గరిక గడ్డితో చిక్కని గూడు. ఆ రోజు కాసేపు ఆసక్తితో చూస్తే.. సమీప తీగలమీద ఓ రెండు చిట్టి గోరొంకలు..
ఎందుకో ఆదుర్దా పడుతున్నాయి.పరిశీలనగా చూస్తే రోడ్డు పక్క కానుగ చెట్టు మీదున్న నాలుగైదు కాకులు వీటిని కంగారుపెడుతున్నాయి.
తడవకోసారొచ్చి గోరింకల గూట్లోని గుడ్లు పొడుచుకుతినాలని వాటి దుర్బుద్ధి.
మనుగడకోసం పోరాటం!
చిట్టి గోరింకలు వంతులు వారీగా గూటి కాపలాలో నిమగ్నం. ఆకారంలోనూ..బలంలోనూ బలగంలోనూ.. పెద్దవైన కాకులపై చిట్టి ముక్కులతో పొడుస్తూ..అరుస్తూ పోరాటం.
ఈ హైడ్ అండ్ సీక్ గేమ్ ప్రతిరోజూ !
ఎండలు ముదిరాయి. ఇప్పుడవి ప్రకృతితో..సూర్యునితో పోరాటం!
నాకు పదే పదే ఖాండవ దహనంలోని కథ...
జరితఅనే లావుక పక్షి పిల్లల్ని కాపాడుకునే తపన గుర్తొచ్చేది.
చిన్నతనంలో మనసు మరీ స్వచ్ఛంగా ఉండేది.
ఈ కథ చదివినప్పుడల్లా ఏడుపు వచ్చేది.అర్జునుడి మీద కోపం వచ్చేది.
పాపం పసివాడు సినిమా చూసొచ్చి వెక్కి వెక్కి ఏడ్చిన రాత్రులెన్నో! నాన్న నా ఉద్వేగాల్నీ.. అనుభూతుల్ని గౌరవిస్తూ.. అక్కున చేర్చుకుని లాలిస్తూ..అది సినిమా అని అర్థమయ్యేలా సర్దిచెప్పేవారు.చందమామ,బాలమిత్ర కథలు చదివిస్తూ ఊహాశక్తి,ఆలోచనాశక్తికి పదును పెట్టేవారు.
ప్రస్తుత విషయానికొస్తే...
గోరింకల జంటకి తీవ్రమైన ఎండనుండి తట్టుకోలేని నిస్సహాయత..కాకుల నుండి గూటి రక్షణ...ఆహార సేకరణ కై ఒకరు వెళ్తే మరొకరు గూటి రక్షణ.
ఈ కనీసావసర సాధనలోనే కాలమంతా..పోరాటమంతా!
మేం నలుగురం ఆలోచించి ..గోడమీద ఎప్పుడూ నీళ్ల డబ్బా ఉండేలా జాగ్రత్త పడేవాళ్ళం.
ఉహూ! ముట్టుకునేవేకావు. వేరే పిట్టలు..కాకులూ మాత్రం తాగి పోతుండేవి.
అప్పుడప్పుడు ఓ గుప్పెడు మెతుకులుంచిన
కాగితం సమీపంలో కింద ఉంచేవాళ్ళం.తింటాయని ఆశ పడేవాళ్ళం.
లేదు ముట్టుకునేవే కావు.
కానీ ఎప్పుడైనా గోడమీంచి పారబోసిన గిన్నెలు కడిగిన నీళ్ళల్లో మెతుకులు మాత్రం తినేవి.
మా ఆత్మాభిమాన స్వతంత్ర జీవనంలో ఎవరికీ చోటులేదు!
కష్ట పడే బతుకుతాం!
ఎవరిమీదా ఆధార పడబోము!అవసరమైతే ఇలాగే జీవితాన్ని ముగిస్తాం! అన్నట్టుండేవి.
వాటి గుప్పెడు ఆత్మ విశ్వాసం ముందు నా నిలువెత్తు నమ్మకం కూలిపోయింది.
మీకు చెప్పటానికి కథకి మాత్రం పనికొచ్చింది.
✍️ శ్రీనివాస కుమార్.
[7/2, 17:02] +91 79819 72004: అవి ప్రకృతికి ఎదురొడ్డి చేసిన పోరాటంతో ఫలించాయని నేను పడ్డఆరాటం మూణ్నాళ్ల ముచ్చటే అయ్యిందేమో!
మీకు విషయం వివరంగా చెప్పాల్సివుంది.
ఎండల ధాటికి విలవిల లాడుతూ ఎలాగోలా ఆ గోరొంక జంట బైట పడిందని
తృప్తి పడ్డానా..!!
వారం నుండి చిరు జల్లులు పడుతున్నాయి.మొన్నరాత్రి గట్టి వర్షం పడింది కూడా!
మన కథలోని గోరింకల గూడు కరెంటు స్తంభం కాసారం పై ఉన్న సంగతి మీకు తెల్సిందే. అది కాస్తా ఈ వర్షాలకు చెదిరిపోయింది.
గూట్లోని గుడ్లు ఎక్కడ పడిపోతాయోనని నాకు బాధ ఉండేది.ఎప్పుడు వచ్చాయోగానీ..ఆ అరిష్టాన్ని కూడా దాటేసి ముచ్చటగా మూడు పిల్లలు వచ్చాయి.
జంట గోరింకలు,పొలాల్లోనూ
గడ్డిమీదా దొరికిన పురుగులను..మేతను చిట్టి గోరింకల నోళ్లల్లో పెడుతుంటే ముచ్చటగా ఉంది.
ఆ క్షణానవి ప్రపంచ విజేతలుగా నాకు తోచాయి!
రాత్రినుండీ ముసురు వాన.
తెలవారుతుంటే చూద్దునుగదా.. పూర్తిగాతడిసిన శరీరాన్ని రెక్కలను ముక్కుతో సవరిస్తూ.. సమీపంలో కరెంటు తీగె కూర్చుని గాలికి ఆర్పుకుంటూ కనిపించాయి.
కొద్దిసేపటికి అనుకోని ప్రమాదం రానే వచ్చింది.
పెద్ద జంట ఆందోళనగా అరుస్తోంటే..
రెండు చిట్టి పిట్టలు అంతెత్తుమించి కింద పడి నిస్సహాయ స్థితిలో దీనంగా అరుస్తున్నాయి.
"అర్రెరె ! దగ్గరికి పోయి తీయబోతే వాటి చెరోకాలూ
ఎరువుల బస్తా ప్లాస్టిక్ దారంతో విడదీయలేనంతగా చిక్కుకుపోయి ఉన్నాయి.బహుశా
గూటి నిర్మాణంలో మెత్తటి పదార్థాలు సేకరించే అవస్థలో
ఈ దారం చిక్కులతో గూట్లోటి చేరి ఉంటుంది.
గాయం కాకుండా కత్తెరతో కత్తిరించే ప్రయత్నం చేస్తోంటే..
తల్లిపిట్ట నా తలపై దాడి చేస్తూ.. ముక్కుతో ఓ పోటు పొడుస్తూ ఆందోళనలో అటూ ఇటూ ఎగురుతుంది.
మీమనుషులవల్లే ఇదంతా!
స్వార్థం కోసం ఇష్టం వచ్చినట్టు ప్లాస్టిక్ వాడేస్తారు..ఇప్పుడు చూడు నా బిడ్డలకు హానీ జరిగిందని ప్రశ్నించినట్టనిపించింది.
తీరా ఎలాగో ప్లాస్టిక్ దారం కత్తిరించి తీస్తే ... ఎన్ని రోజులయ్యిందో కానీ దారుణం జరిగి!
రెండు పిట్టల చెరో కాలూ
అప్పటికే కృశించి ఎదుగుదల లేకుండా వేళ్లాడుతున్నాయి.
ఇప్పుడేంటి కర్తవ్యం!
ఇవి ఎగరలేవు.. రెక్కలూ రాలేదు.కాలూ లేదు.
అంతెత్తు కరెంటు స్తంభం మీద తీగల మధ్య గూట్లో వాటినెలాగూ పెట్టలేం!
కిందనే పెద్ద పిట్టలు చూసేలా ఓ చోట ఉంచాను.
అదృష్టవంతురాలైన మూడో చిట్టిపిట్ట మాత్రం అమ్మ తెచ్చే మెత్తటి ఆహారం కోసం నోరు తెరుచుకుని ఎదురు చూస్తోంది.
నా నిస్సహాయతని
అక్షర రూపంలో మళ్ళీ మీ ముందుంచి భారంగా ముగిస్తున్నాను.
✍️ శ్రీనివాస కుమార్
No comments:
Post a Comment