*అహో గుణవతీ మమ భార్యా*
*ఒక గురుకులం లో ఒకతను చదువుకుంటూ వుండే వాడు.*
*ఆ గురువు భార్య పెద్ద గయ్యాళి. గురువును ఎప్పుడూ సతాయిస్త్తూ వుండేది.*
*ఆమె నోటికి హద్దూ పద్దూ వుండేది కాదు. శిష్యుడి కేమో ‘ఎందుకు ఆమెను గురువు గారు అదుపు చెయ్యడం లేదు?’ అనిపించింది.*
*నేరుగా వెళ్లి గురువు గారినే అడిగేశాడు. ఆయన నవ్వుతూ… “అదంతే లే నీకూ పెళ్లి అయితే తెలుస్తుంది.” అన్నాడు.*
*అందుకు శిష్యుడు… “నేనయితే నా భార్యను చాలా అదుపులో పెట్టుకుంటాను.” అన్నాడు.*
*”సరేలే నీవు పెళ్లి చేసుకున్నాక నేను వచ్చి చూస్తాను. నీవెంత నీ భార్యను అదుపులో పెట్టుకున్నావో” అన్నాడు.*
*శిష్యుని చదువు పూర్తయింది, తన వూరికి వెళ్లి పెళ్లి చేసుకున్నాడు. వాడి భార్య గురువుగారి భార్య కంటే గయ్యాళి. ఏమయినా అంటే బయటికి వెళ్లి గోల చేసి పరువు తీసేది.*
*అందుకని శిష్యుడు ఆమెను భరిస్తూ వచ్చాడు. అప్పటికి తెలిసివచ్చింది భార్యను అదుపు చెయ్యడం యెంత కష్టమో.*
*కొన్ని సంవత్సరాలు గడిచాక గురువు శిష్యుడి యింటికి వస్తున్నట్టు కబురు పెట్టాడు.*
*శిష్యుడికి భయం పట్టుకుంది. తనేమో పెద్దగా బీరాలు పలికాడు… ‘నాభార్యను అదుపులో పెట్టుకుంటా’నని.*
*ఇప్పుడెలా?*
*భార్యను బ్రతిమ లాడాడు… ‘మా గురువుగారు వస్తున్నారు ఆయన ఒకే పూట వుంటారు. కాస్త నేనెన్ని తిట్టినా నోరుతెరువకుండా వుండు’ అని.*
*ఏ కళనుందో ఆమె ఒప్పుకుంది. ‘అయితే వంద తిట్లవరకూ ఊరుకుంటాను, తర్వాత నా వల్లకాదు’ అని షరతు పెట్టింది.*
*భార్య ఒప్పుకున్నందుకే సంబర పడిపోయి ‘సరేలే.’ అన్నాడు.*
*గురువుగారు వచ్చారు. యింక మనవాడు రెచ్చిపోయాడు. సమయం దొరికింది కదా అనిప్రతిదానికీ ఆవిడని తిడుతూ కసురుతూ వున్నాడు.*
*ఆవిడ చాలా గట్టిది. వంద చింతగింజలు ఒక పళ్ళెం లో పెట్టుకొని ఒక్కో తిట్టుకూ ఒక్కో గింజ బయట పడేస్తూ వుంది.*
*గురువు గారూ, శిష్యుడు భోజనానికి కూర్చున్నారు. ఆమె వడ్డించినంత సేపూ ఏదో ఒకటి తిడుతూనే వున్నాడు. గురువు గారి కేమో చాలా ఆశ్చర్య మేసింది. ‘వీడు నిజంగానే భార్యను చాలా అదుపులో పెట్టుకున్నాడు. ఆమె నోరే తెరవడం లేదు పాపం అనుకున్నాడు.*
*కాసేపటికి వంద తిట్లూ పూర్తయిపోయాయి.*
*శిష్యుడు… “ఏమే తెలివిలేనిదానా! గురువు గారికి కాస్త పులుసు మారు వడ్డించాలని తెలియదా? వడ్డించు!” అని గద్దించాడు.*
*ఆవిడ పులుసు కుండ తీసుకొని వచ్చి గురువు నెత్తిన పగులగొట్టింది.*
*గురువుగారు ఆ వేడివేడి పులుసు పడేసరికి మంటతో అల్లాడి పోయి పెరట్లోకి వెళ్లి నీళ్ళు నెత్తిన పోసుకుంటున్నాడు.*
*అప్పుడు ఆవిడ వచ్చి… “నా కుండ నీ మూలంగా పగిలిపోయింది! కుండకు డబ్బులిచ్చి కదులు!!” అని బెదిరించింది.*
*అప్పుడు గురువు గారు ఒక శ్లోకం చెప్పారు…*
*”అనేక శత భాండాని భిన్నాని మమ మస్తకే ।*
*అహో గుణవతీ మమ భార్యా భాండ మూల్యం న యాచతే॥*
*అర్థము:--*
*ఎన్నో వందల కుండలు నా నెత్తిన పగిలాయి. కానీ ఆహా! నా భార్య ఎంత గుణవతి! ఎప్పుడూ కుండ డబ్బులు అడగలేదు!!*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
No comments:
Post a Comment