Saturday, July 5, 2025

 .   *☘️వేదమూర్తుల స్తుతులు☘️*
*꧁❀❀━❀🙏🕉️🙏❀━❀❀꧂*
               *(24 వ భాగము)*

*శ్రీనారదముని నైష్టిక బ్రహ్మచారి. బ్రహ్మచారులలో నాలుగురకాల వారు ఉన్నారు. మొదటిరకము వాడు "సావిత్రుడు". మంత్రదీక్ష, ఉపనయనము తరువాత కనీసము మూడురోజులు బ్రహ్మచర్యాన్ని పాటించినవానికి ఇది అన్వయిస్తుంది. రెండవరకమువాడు “ప్రాజాపత్యుడు". దీక్షా నంతరము కనీసము ఒక సంవత్సర కాలము బ్రహ్మచర్యాన్ని కచ్చితముగా పాటించినవానికి ఇది అన్వయిస్తుంది. తరువాతి రకమువాడు "బ్రహ్మ బ్రహ్మచారి". దీక్షాసమయము నుండి వేదా ధ్యయనము పూర్తి యగునంతవరకు బ్రహ్మచర్యాన్ని పాటించే వానికి ఇది అన్వయిస్తుంది. తరువాతి స్థితి "నైష్ఠికుడు". జీవితాంతము బ్రహ్మచర్యాన్ని పాటించేవాడు నైష్ఠికుడు. వీరందరిలో మొదటి మువ్వురు ఉపకుర్వాణులని పిలువ బడతారు. అంటే వారు బ్రహ్మచారి జీవితము ముగిసిన తరువాత వివాహము చేసికొనవచ్చును. కాని నైష్టిక* *బ్రహ్మచారి మైథునానికి పూర్తిగా విముఖుడై ఉంటాడు. అందుకే సనకాదులు, నారదుడు నైష్ఠిక బ్రహ్మచారులని తెలియ బడతారు. అటువంటి బ్రహ్మచారులు వీరవ్రతులని పిలువబడతారు. ఎందుకంటే వారి బ్రహ్మచర్యవ్రతము క్షత్రియుల వ్రతము వలె వీరోచితమైనట్టిది. బ్రహ్మచారి జీవనము విశేష లాభదాయకమై యుండి జ్ఞాపకశక్తిని, సంకల్పశక్తిని వృద్ధి చేస్తుంది.*

*నారదుడు నైష్ఠిక బ్రహ్మచారి కనుకనే గురువు నుండి ఏది వినినప్పటికిని దానిని మరువకుండెనని ఈ సందర్భములో విశేషముగా చెప్పబడింది. ప్రతీ విషయాన్ని శాశ్వతముగా గుర్తుపెట్టుకునేవాడిని "శ్రుతధరుడు" అని పిలుస్తారు. శ్రుతధరుడైన బ్రహ్మచారి ఏదీ రాసుకోకుండానే. పుస్తకాలు తిరిగేయకుండానే తాను విన్నది విన్నట్లుగా అక్షరము పొల్లుపోకుండ గుర్తు పెట్టుకోగలడు. నారదమునికి ఈ యోగ్యత ఉన్నది. అందుకే నారాయణ ఋషి నుండి ఉపదేశాన్ని పొందినవాడై అతడు భక్తియోగతత్త్వాన్ని ప్రపంచమంతట ప్రచారము చేసే కార్యంలో నెలకొన్నాడు. అటువంటి ఋషులు ప్రతీ విషయాన్ని గుర్తు పెట్టుకోగలరు కనుక ఆలోచనాపరులు, ఆత్మదర్శులు, భగవత్సేవలో పూర్తిగా స్థిరులునై ఉంటారు...*

*ఈ విధముగా నారదముని తన గురువైన నారాయణ ఋషి నుండి శ్రవణము చేసిన తరువాత పూర్ణానుభూతిని పొందాడు. సత్యమునందు నెలకొనినవాడై అతడు అతిప్రసన్నతతో నారాయణఋషిని స్తుతించాడు. నారదుడు నారాయణఋషిని దేవదేవుడగు శ్రీకృష్ణభగవానుని అవతారముగా సంబోధించి. బద్ధజీవుల పరమశ్రేయోభిలాషులని విశేషముగా వర్ణించాడు. భక్తులను రక్షించి, అభక్తులను నశింప జేయడానికే ప్రతియుగంలో శ్రీకృష్ణుడు అవతరిస్తాడని. భగవద్గీతలో చెప్పబడింది. కృష్ణావతారమైన నారాయణఋషి కూడ ఇక్కడ బద్ధ జీవుల శ్రేయోభిలాషిగా సంబోధింపబడినాడు. భగవద్గీతలో చెప్పబడినట్లు శ్రీకృష్ణుని వంటి శ్రేయోభిలాషి లేనేలేడని ప్రతియొక్కడు తెలిసికోవాలి. శ్రీకృష్ణుడే ఎల్లరకు పరమశ్రేయోభిలాషియని ఎరిగి ప్రతియొక్కడు అతనినే ఆశ్రయించాలి. ఈ రకంగా మనిషి తనకు సంపూర్ణ రక్షణను ఇచ్చేవాడు ఒకడున్నాడని ఎరిగి ధైర్యవంతుడు, సంతుష్టుడు అవుతాడు. స్వయంగా శ్రీకృష్ణుడు, ఆతని అవతారములు, అతని ప్రధానాంశలు బద్ధజీవులందరికీ పరమశ్రేయోభిలాషులు.*

*శ్రీకృష్ణుడు దానవులకు కూడ శ్రేయోభిలాషియే. బృందావనములో తనను చంపడానికి వచ్చిన రాక్షసు లందరికీ ఆతడు మోక్షాన్ని ఇచ్చాడు. కనుక శ్రీకృష్ణుని సంక్షేమకర కార్యాలన్నీ పూర్ణమై ఉంటాయి. ఆతడు రాక్షసుని వధించినా లేదా భక్తునికి రక్షణము నొసగినా ఆ కార్యఫలము ఒక్కటే సమానమే అవుతుంది. పూతన రాక్షసికి కృష్ణజనని స్థానము ఇవ్వబడినదని చెప్పబడింది. భగవంతునిచే సదా రక్షింపబడి విశుద్ధభక్తుడు ఎంతగా లాభము పొందుతాడో అంతగా దానవుడు కృష్ణునిచే వధింపబడి పరమలాభాన్ని పొందుతాడు.*

*నారాయణఋషికి నమస్కరించిన తరువాత నారదముని తన శిష్యుడైన వ్యాసదేవుని ఆశ్రమానికి వెళ్ళాడు. వ్యాసునిచే చక్కగా ఆదరింపబడి సుఖాసీనుడైన తరువాత నారదుడు తాను నారాయణఋషి నుండి వినిన దంతయు వివరించాడు. ఈ ప్రకారముగా శుకదేవగోస్వామి వేదజ్ఞానసారము గురించి, వేదములందలి చరమలక్ష్యము గురించి పరీక్షిత్తు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. దేవాదిదేవుని దివ్యమైన ఆశీస్సులను బడసి ఆ విధంగా భగవత్సేవలో నెలకొనడమే జీవిత పరమలక్ష్యము. కనుక శుకదేవగోస్వామిని, పరంపరలో ఉన్నట్టే వైష్ణవులను అనుసరిస్తూ దేవదేవుడైన శ్రీకృష్ణునికి మనిషి నమస్కరించాలి. వేదనిర్ణయము ననుసరించి మధ్వసంప్రదాయము, రామానుజు సంప్రదాయము, విష్ణుస్వామి సంప్రదాయము, నింబార్క సంప్రదాయము అనే నాలుగు వైష్ణవ సంప్రదాయాలు మనిషి దేవదేవునికి శరణుజొచ్చాలనే విషయాన్ని అంగీకరిస్తాయి.*

*వేదవాఙ్మయము శ్రుతులు, స్మృతులు అనే రెండు భాగాలుగా విభజింప బడినది. ఋగ్వేదము, సామవేదము, అథర్వవేదము, యజుర్వేదము అనే నాలుగు వేదములు, ఉపనిషత్తులు శ్రుతులు. కాగా పురాణాలు, మహాభారతము వంటి ఇతిహాసాలు స్మృతులు, భగవద్గీత మహాభారతములో ఉన్నది. వీటన్నింటి సారమేమంటే శ్రీకృష్ణుడే దేవాది దేవుడని మనిషి తెలిసికోవాలి. పరమపురుషుడైన అతని అధ్యక్షతలోనే ప్రకృతి పనిచేస్తుంది. సృష్టిస్థితిలయకార్యాల కొరకు భగవంతుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా అవతరిస్తాడు. వీరందరు త్రిగుణాలను స్వీకరించినా చరమ నిర్దేశము విష్ణువు చేతిలోనే ఉంటుంది. త్రిగుణాంతర్గతమైన ప్రకృతి కలాపాలన్నీ దేవదేవుడైన శ్రీకృష్ణుని నిర్దేశములోనే నడుపబడతాయి. ఇది భగవద్గీతలోను (మయాధ్యక్షేణ), వేదాలలోను (ప అక్షత) ధ్రువపరుపబడింది.*

*భౌతికజగత్తు ప్రకృతి పురుషుల వలన (ఉపాదాన నిమిత్త కారణముల) ఏర్పడినదని నాస్తిక సాంఖ్యతత్త్వవేత్తలు వాదిస్తారు. కాని శ్రీకృష్ణుడే సర్వకారణ కారణుడు. ఉపాదాన నిమిత్త కారణాలు రెండింటికి ఆతడు కారణుడు. ప్రకృతి పురుషులు చరమకారణము కానేకారు. శిశుజననము తల్లిదండ్రుల కలయికచే కలిగినట్లు బాహ్యానికి గోచరించినా ఆ తల్లిదండ్రులకు చరమకారణము శ్రీకృష్ణుడే. కనుక బ్రహ్మసంహిత యందు ధ్రువపరుప బడినట్లు అతడు ఆది కారణము లేదా సర్వకారణకారణము అయియున్నాడు.*

*భగవంతుడు, జీవులు ఇద్దరు ప్రకృతిలోనికి ప్రవేశిస్తారు. దేవాదిదేవుడు శ్రీకృష్ణుడే తన ఒకానొక ప్రధానాంశచే కారణోదకశాయి విష్ణువుగా (మహావిష్ణువు) ప్రకటమౌతాడు. తరువాత ఆ బ్రహ్మాండమైన మహావిష్ణువు రూపము నుండి గర్భోదకళాయి విష్ణువు ఆవిర్భవించి ప్రతి విశ్వంలో ప్రవేశిస్తాడు. అతని నుండియే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉద్భవిస్తారు. వారిలో విష్ణువే క్షీరోదకశాయి. విష్ణువుగా సకల జీవుల హృదయాలలోను, పరమాణువుతో పాటు సకలభౌతిక తత్త్వాలలోను ప్రవేశిస్తాడు. దీనిని బ్రహ్మసంహిత "అండాన్తరస్థ పరమాణు చ యాస్తరస్థం - భగవంతుడు ఈ విశ్వములోనూ, ప్రతి పరమాణువులోను ఉన్నాడు" అని పలికింది.*

*జీవుడు నానారకాల జీవజాతులలో, రూపాలలో చిన్న దేహాన్ని కలిగి ఉంటాడు. అదేవిధంగా సమస్త విశ్వము భగవంతుని దేహమే అయి ఉంటుంది. ఈ దేహము శాస్త్రాలలో విరాడ్రూపమని వర్ణించబడింది. వ్యక్తిగతజీవుడు ఒకానొక దేహాన్ని పోషించినట్లు, భగవానుడు సమస్త సృష్టిలో ప్రవేశించి దానిని పోషిస్తాడు. జీవుడు వెడలిపోగానే భౌతికదేహము నశించిపోతుంది. అలాగే విష్ణువు వెడలిపోగానే జగత్తు లయించిపోతుంది. కనుక జీవుడు భగవంతునికి శరణుజొచ్చినపుడే సంసారవిముక్తి సాధ్యపడుతుంది. "మామేవ యే ప్రపద్యన్తో మాయామేతాం తరన్తితే" అని ఈ విషయము భగవద్గీతలో ధ్రువపరుపబడింది. కేవలము భగవచ్చరణాగతియే ముక్తికి కారణము. భగవంతునికి శరణాగతుడైన తరువాత జీవుడు ఏ విధంగా ప్రకృతి గుణాల నుండి ముక్తుడౌతాడనే విషయము గదిలో నిదురిస్తున్న వ్యక్తి ఉపమానము ద్వారా వివరించబడుతుంది. మనిషి నిదురిస్తున్నప్పుడు అతడు గదిలో ఉండడము అందరూ చూస్తారు, కాని నిజానికి స్వయంగా జీవుడు ఆ దేహంలో ఉండడు. ఎందుకంటే అతడు తన దేహాన్ని మరచిపోయి* *ఉంటాడు, కేవలము ఇతరులు అతని దేహమున్నట్లుగా గమనిస్తారు. అదేవిధంగా భగవద్భక్తిలో నెలకొనిన ముక్తాత్ముడు భౌతికజగత్తుకు సంబంధించిన గృహకలాపాలలో ఉన్నట్లు ఇతరులు గాంచినా కృష్ణగతచిత్తుడైనందున అతడు ఈ జగత్తులో నివసించడు. నిదురించు వ్యక్తి కలాపాలు అతని దేహకార్యాలకు భిన్నమై యున్నట్లు అతని కలాపాలు భిన్న మై ఉంటాయి. భగవద్గీతలో ధ్రువపరుపబడినట్లు నిరంతరము భగవద్భక్తిలో నెలకొనెడి భక్తుడు అదివరకే త్రిగుణ ప్రభావాన్ని అధిగమించినవాడే అయియుంటాడు. అతడు అదివరకే బ్రహ్మభూతస్థితిలో నెలకొనినవాడై ఉంటాడు. దేహములో లేదా భౌతికజగత్తులో నివసించినట్లు గోచరించినా అతడు దివ్యస్థితిలో నెలకొని ఉంటాడు.*

💦🌸🌸 🌸🏵️🌸 🌸🌸💦
*"వేదమూర్తుల స్తుతులు" అను దశమస్కంధములోని భక్తివేదాంతభాష్యము ఇంకా వుంది*
💦🌸🌸 🌸🏵️🌸 🌸🌸💦 
*☘️\!/సర్వం శ్రీకృష్ణార్పణమస్తు\!/☘️*

*┈┉┅━❀꧁ హరే కృష్ణ ꧂❀━┅┉┈*
         *SPIRITUAL SEEKERS*
🍁☘️🍁 🙏🕉️🙏 🍁☘️🍁

No comments:

Post a Comment