*☘️వేదమూర్తుల స్తుతులు☘️*
*(22 వ భాగము)*
*భక్తియుత సేవ ఏనాడును కర్మనియమాల పరిధిలోనికి రాదు. ఈ విషయమే. భగవద్గీతలో "స గుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే" అని చెప్ప. బడింది. భగవద్భక్తులు త్రిగుణ ప్రభావాలను అధిగమించి దివ్యమైన బ్రహ్మానుభూతి. పదములో నెలకొంటారని దాని భావము. భక్తులు ఇహపరాలలో ముక్తులై ఉంటారు. ఈ భౌతికజగత్తులో యజ్ఞుని (విష్ణువు లేదా శ్రీకృష్ణుడు) కొరకు చేయబడిన ఏ. కర్మయైనా ముక్తకర్మయే అవుతుంది. కాని అచ్యుతునితో సంబంధము లేకపోతే. కర్మఫలాన్ని ఆపే అవకాశమే లేదు. కృష్ణభక్తిభావనాయుత జీవనము ముక్తి మయ జీవనము. సారాంశమేమంటే భగవత్కరుణచే భక్తుడు ఇహపరాలలో ముక్తుడై ఉంటాడు. కాగా కర్మిష్టులు, జ్ఞానులు, యోగులు ఇహపరాలలో ఎన్నడును ముక్తిని పొందరు వేదమూర్తులు ఇంకను స్తుతించసాగారు : "ప్రభూ! నీ అనుగ్రహముచే నీ పొద పద్మమహిమను ఎరిగినవాడు భౌతిక సుఖదుఃఖాల పట్ల విరక్తుడౌతాడు.* *" భౌతికజగత్తులో ఉన్నంతవరకు భవక్లేశాలు అనివార్యముగా కలుగుతుంటాయి. కాని భక్తుడు పాపపుణ్య ఫలాలైనట్టి ఆ చర్య ప్రతిచర్యలపై దృష్టిని మళ్ళించడు. జనసామాన్యము కావించే నిందాస్తుతులకు కూడ అతడు కలతచెందడు. ఉబ్బిపోడు. దివ్యమైన కార్యాలు చేసి నందున భక్తుని ఒకప్పుడు ఘనంగా పొగడడము జరుగుతుంది. విమర్శకు కారణం లేకపోయినా మరొక్కప్పుడు అతడు విమర్శలకు గురియవుతుంటాడు. అయినా విశుద్ధభక్తుడు సాధారణజనుల ఈ నిందాస్తుతులను లెక్కజేయడు. నిజానికి భక్తుని సమస్త కలాపాలు దివ్యస్థితిలోనే ఉంటాయి. లౌకికకలాపాలలో నెలకొనినట్టి జనుల నిందా స్తుతులలో అతనికి అభిరుచి ఉండదు. ఆ విధంగా భక్తుడు తన దివ్యస్థితిని నిలుపుకొంటే ఇహపరాలలో అతనికి భగవంతునిచే ముక్తి నిత్యమై ఉంటుంది.*
*నానాయుగాలలో, నానావతారాలలో భగవంతుడు చేసిన మహిమాన్విత కర్మలను విశుద్ధభక్తుల సాంగత్యములో శ్రవణము చేయడము ద్వారా భక్తుని దివ్యస్థితి కొనసాగుతుంది. కృష్ణచైతన్యోద్యమము ఈ సిద్ధాంతము పైననే ఆధారపడి ఉంది. "దేవా! పూర్వ ఆచార్యులు సూచించినట్లు నీ దివ్యమైన సేవలో నన్ను నెలకొననిమ్ము. నీ భక్తుల సాంగత్యములో నన్ను నివసింపనిమ్ము. జన్మజన్మలకు ఇదే నా కోరిక" అని ఈ సంబంధములోనే శ్రీల నరోత్తమదాస ఠాకూరులు గానము చేసారు. ఇంకొక రకంగా చెప్పాలంటే తాను ముక్తుడయ్యాడో, లేదో భక్తుడు పట్టించు కొనక కేవలము భక్తియోగము పట్ల ఆత్రుత చెందుతాడు. ఆచార్యుల ఆదేశానికి స్వతంత్రముగా ఏదీ చేయకపోవడమే భక్తియోగానికి అర్థము. కృష్ణచైతన్యోద్యమ కలాపాలన్నీ శ్రీరూపాది ఆచార్యుల చేతనే నిర్దేశించబడినాయి. భక్తుల సాంగత్యములో ఈ నియమాలను పాటించే భక్తుడు తన దివ్యస్థితిని చక్కగా నిలుపుకోగలుగుతాడు.*
*తనను చక్కగా ఎరిగిన భక్తుడు తనకు అత్యంత ప్రియుడని భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు చెప్పాడు. నాలుగు రకాలైన పుణ్యాత్ములు భక్తియోగాన్ని చేపడతారు. పుణ్యాత్ముడు ఆర్తిని పొందితే అది తొలగడానికి భగవంతుని ఆశ్రయిస్తాడు. పుణ్యాత్మునికి ఆర్థిక సహాయ్యము అవసరమైతే దానికొరకు అతడు భగవంతుని ప్రార్థిస్తాడు. పుణ్యాత్ముడు నిజంగా జిజ్ఞాసువైతే దేవాదిదేవుడుగు శ్రీకృష్ణుని దరిచేరుతాడు. అదేవిధంగా పుణ్యాత్ముడు కృష్ణసంబంధవిజ్ఞానాన్ని తెలిసికోవడానికి ఉత్సాహపడితే ఆ దేవదేవుని ఆశ్రయిస్తాడు. ఈ నలుగురు వ్యక్తులలో చివరివాడు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడని భగవద్గీతలో సన్నుతించబడినాడు. భగవంతుని గురించిన శాస్త్రీయ జ్ఞానములో నిష్ణాతులైనట్టి పూర్వాచార్యులను అనుసరిస్తూ భక్తిజ్ఞానాలతో శ్రీకృష్ణుని తెలిసికోవడానికి యత్నించే వ్యక్తి నిశ్చయముగా శ్లాఘనీయుడు. అటువంటివాడు అనుకూలములు, ప్రతికూలములు అయిన సమస్త జీవనస్థితులు భగవత్సంకల్పముచేతనే సృష్టించబడినాయని ఎరుగగలుగుతాడు. భగవచ్చరణారవిందాలకు సంపూర్ణ శరణాగతుడైనంతట అతడు జీవనస్థితి అనుకూలముగా ఉన్నదో, ప్రతికూలముగా ఉన్నదో పట్టించుకోడు. ప్రతికూల పరిస్థితినైనా భక్తుడు భగవంతుని ప్రత్యేకానుగ్రహముగా భావిస్తాడు. నిజానికి భక్తునికి ప్రతికూల పరిస్థితులే లేవు. సమస్తము భగవంతుని సంకల్పము నుండియే వస్తున్నదని ఎరిగినవాడై అతడు ప్రతిస్థితిని అనుకూలమైనదిగనే చూస్తాడు.*
*జీవితమునందలి ఏ పరిస్థితిలోనైనా అతడు భక్తియుత సేవను చేయడానికి పరమోత్సాహముతో ఉంటాడు. ఈ భక్తియుతనైజము భగవద్గీతలో వివరించ బడింది. జీవితమునందు విపరీతపరిస్థితులలో భక్తుడెన్నడును శోకముకు గురి కాడు, అట్లే అనుకూల పరిస్థితులలో ఉప్పొంగిపోడు. మహోన్నతమైన భక్తియోగ స్థితిలో అతడు చేయకూడని కార్యములు, చేయవలసిన కార్యముల పట్టికయైనా పట్టించుకోడు. కేవలము ఆచార్యులను అనుసరించడము ద్వారానే ఈ స్థితి ఒనగూడుతుంది. విశుద్ధభక్తుడు ఆచార్యులను అనుసరించే కారణంగా అతడు చేసే ఎటువంటి భక్తియుత సేవయైనా దివ్యస్థితిలో ఉన్నదిగానే భావించబడుతుంది. అందుకే ఆచార్యుడు విమర్శకు అతీతుడు. సాధకుడు ఎన్నడును తాను ఆచార్యునితో సమానస్థితిలో ఉన్నానని తలచకూడదు. ఆచార్యులు భగవంతునితో సమానస్థాయిలో ఉన్నట్టివారు. కనుక సాధకులు శ్రీకృష్ణుని గాని, అతని ప్రతినిధియైన ఆచార్యుని గాని ఏ విధంగాను విమర్శించకూడదు.*
*ఈ విధముగా వేదమూర్తులు దేవదేవుని ఆరాధించారు. స్తుతుల ద్వారా భగవదారాధనమంటే ఆ దేవదేవుని దివ్యగుణాలను, లీలలను, కర్మలను స్మరించడమని అర్ధము. కాని భగవల్లీలలు, గుణములు అనంతములు. కనుక భగవంతుని అన్ని గుణాలను స్మరించడము అసాధ్యము. అందుకే వేదమూర్తులు తమ శక్త్యనుసారము దేవదేవుని ఆరాధించి చివరకు ఈ విధంగా పలికారు : "దేవా! మహోన్నత లోకమైన బ్రహ్మలోకానికి అధిష్ఠానదేవతయైన బ్రహ్మ దేవుడు, స్వర్గాధిపతియైన ఇంద్రుడు, సూర్యచంద్రాది లోకపాలురు ఈ భౌతిక జగత్తునకు అంతరంగిక నిర్దేకులే అయినప్పటికిని నిన్ను గురించి కొద్దిపాటి జ్ఞానమునే కలిగి ఉన్నారు. అయినచో ఇక సాధారణ మానవులకు, జ్ఞానులకు నీ గురించి ఏమి తెలుస్తుంది? నీ అనంతమైన దివ్యగుణాలను ఎన్నడము ఎవ్వరికీ సాధ్యము కాదు. జ్ఞానులైనా, ఉన్నతలోకాలకు చెందిన దేవతలైనా నీ రూపగుణములను కొలువజాలరు. నీకైనను నీ దివ్యగుణముల పూర్తి జ్ఞానము లేదని మేము తలుస్తున్నాము. నీవు అనంతుడవు కావడమే దానికి కారణము. నీ గురించి నీకే తెలియదని పలకడము సబబుగా లేకపోయినప్పటికిని నీ అనంతగుణశక్తుల కారణంగాను, నీ జ్ఞానము కూడ అనంతమైనదే అయినందునను నీ జ్ఞానము, శక్తివిస్తారములకు అనంతమైన పోటీ ఏర్పడియున్నదని తెలిసికోవడము మంచిది."*
*దీని భావమేమిటంటే భగవంతుడు, అతని జ్ఞానము రెండును అనంతములే కనుక తన శక్తుల గురించి భగవంతుడు కొంత తెలిసికోగానే తనకు మరికొన్ని శక్తులు ఉన్నవని అతడు తెలిసికొంటాడు. ఈ రకంగా భగవచ్ఛక్తులు, భగవంతుని జ్ఞానము రెండును నిరంతరము వృద్ధి చెందుతాయి. రెండు కూడ అనంతములే కనుక శక్తులకు అంతము ఉండదు. శక్తులను తెలిసికొనే జ్ఞానానికి అంతము ఉండదు. భగవంతుడు నిస్సందేహముగా సర్వజ్ఞుడు, అయినా స్వయంగా అతడే తన శక్తుల పూర్ణవిస్తారాన్ని తెలిసికోలేడని వేదమూర్తులు పలికారు. దీని భావము భగవంతుడు సర్వజ్ఞుడు కాడని కాదు. మనిషి అసలైన విషయము ఎరుకకు రానపుడు అది అజ్ఞానము, లేదా జ్ఞాన రాహిత్యము అనబడుతుంది. అయినా ఇది భగవంతునికి అన్వయించదు. ఎందుకంటే అతనికి తన గురించి బాగా తెలుసు. అయినా తన శక్తులు, కార్యకలాపాలు వృద్ధిచెందినకొలది అతడు వాటిని తెలిసికోవడానికి తన జ్ఞానాన్ని వృద్ధిచేస్తాడు. రెండును అనంతముగా పెరిగి పోతుంటాయి, వాటికి అంతమే ఉండదు. ఈ భావనలో.. తన శక్తులు, గుణాల హద్దు తెలియదని చెప్పబడుతుంది. స్వయంగా భగవంతుని కే భగవంతుని శక్తులు, కలాపాల విస్తారమెంత అపరిమితమైనదో బుద్ధి మంతుడు, గంభీరుడువైన ఏ జీవుడైనా రమారమి అంచనా వేయగలుగుతాడు. మహావిష్ణువు యోగనిద్రలో ఉన్నప్పుడు విశ్శ్వాస ద్వారా అసంఖ్యకముగా విశ్వములు వెలువడతాయని, ఉచ్చ్వాస ద్వారా ఆ అసంఖ్యాకలోకాలు తిరిగి అతని దేహములో ప్రవేశిస్తాయని వేదాలలో చెప్పబడింది. మన పరిమిత జ్ఞానము ననుసరించియు ఈ విశ్వాలు అనంతముగా ఉన్నాయి. ఇవి ఎంత పెద్దవంటే పృథ్వి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, వాటితోపాటు మహత్తత్త్వము అహంకారము అనెడి స్థూల సూక్ష్మతత్త్వములు విశ్వములో ఉండడమే కాకుండ ఏడుపొరలుగా విశ్వాన్ని ఆచ్ఛాదించి ఉన్నాయి. ఒక్కొక్క పొర దాని పూర్వపార కన్నను పదిరెట్లు అధిక పరిమాణములో ఉంటుంది. ఈ రకంగా ప్రతీవిశ్వము ఎంతో జాగ్రత్తగా భద్రపరుపబడింది. అటువంటి విశ్వాలు అసంఖ్యాకముగా ఉన్నాయి. ఈ విశ్వాలన్నీ మహావిష్ణువు దివ్యదేహములోని అసంఖ్యాక రోమకూపాలలో నెలకొని ఉంటాయి. గాలిలో అసంఖ్యాక ధూళికణాలు ఎగురుతున్నట్లుగా భగవానుని దివ్య దేహపు రోమకూపాలలో అసంఖ్యాక విశ్వాలు తేలియాడుతుంటాయి. ఈ కారణము చేతనే భగవంతుడు మన జ్ఞానానికి అందనివాడని వేదాలు పలుకుతున్నాయి. "అవాజ్మానస గోచరః" - భగవంతుని పరిమాణాన్ని అర్థము చేసికోవడము మన మానసికకల్పనకు అందనట్టిది. కనుక నిజంగా పండితుడు, బుద్ధిమంతుడునైన వ్యక్తి తాను భగవంతుడనని చెప్పుకొనక ఆత్మ అనాత్మలకు భేదము చూపుతూ భగవంతుని తెలిసికోవడానికి ప్రయత్నిస్తాడు. పరమాత్ముడు ఉన్నత న్యూన శక్తులతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగియున్నప్పటికిని ఆ రెండింటికి అతీతుడని అటువంటి సావధాన పూర్వకమైన వివేచన ద్వారా స్పష్టముగా అవగతమౌతుంది. సమస్తము తన శక్తి పైననే ఆధారపడియున్నను తాను ఆ శక్తికి భిన్నముగాను లేదా వేరుగాను ఉన్నానని భగవద్గీతలో శ్రీకృష్ణుడు వివరించాడు.*
💦🌸🌸 🌸🏵️🌸 🌸🌸💦
*"వేదమూర్తుల స్తుతులు" అను దశమస్కంధములోని భక్తివేదాంతభాష్యము ఇంకా వుంది*
💦🌸🌸 🌸🏵️🌸 🌸🌸💦
*☘️\!/సర్వం శ్రీకృష్ణార్పణమస్తు\!/☘️*
*┈┉┅━❀꧁ హరే కృష్ణ ꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🦚🔔🦚 🙏🕉️🙏 🦚🔔🦚
No comments:
Post a Comment