Friday, August 15, 2025

 #గుడ్మార్నింగ్
(1695)

కథ

'హత్య'

తెల్లవారు ఝామున ,ఇంట్లో ఉరి పెట్టుకు చనిపోయిండు రాజిరెడ్డి,అతనికి ఎనబై సంవత్సరాల వయసు ఉండొచ్చు.
భార్య నాలుగేళ్ల క్రితమే క్యాన్సర్ తో చనిపోయింది.
అప్పట్నుంచి ,ఒక్కడే వండుకుని తింటున్నాడు!

'ఎవరి దగ్గర ఉండడు' అని కొడుకులు కోడళ్లు అనేవాళ్లు!

ఎందుకు ఉరి పెట్టుకున్నడో ,ఎవరూ మాట కూడా మాట్లాడటం లేదు.చాలా మందికి పట్టింపే లేదు.పట్టింపు ఉన్నవాళ్లు ప్రశ్నించుకోలేదు!

అప్పుడప్పుడు ఒకరూ ఇద్దరూ వచ్చి ,నడుం వెనుక చేతులు పెటుకుని శవం వైపు తొంగి చూసి,చుట్టూ ఉన్నవారిని కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఏదో నిర్ధారించుకున్నట్టుగా మౌనంగా వెనుతిరుగుతున్నారు!

రాజిరెడ్డి ముగ్గురు కొడుకులవి మూడు డాబా ఇండ్లు వరుసగా ,ఉత్తర దక్షిణాలుగా ఉన్నాయి!
వేర్లు పడ్డాకా ,అవి వాళ్లు ఎవరంతట వాళ్లు కట్టుకున్న ఇండ్లు!
ఎవరి వ్యవసాయాలు వాళ్లకున్నాయి,అందులో ఒకాయన బొగ్గుగనుల్లో ఉద్యోగం చేసి రిటైర్ అయిన తరువాత వచ్చి ఇల్లు కట్టుకుని స్థిరపడ్డాడు.ఇద్దరు కొడుకులు మాత్రం మొదటి నుండి వ్యవసాయలే చేస్తున్నారు.

ఆఇండ్లు కళ తప్పి ఉన్నాయి,మనుషులు అట్లాగే ఉన్నారు!

ఆ ఇండ్లకు ఎదురుగా ,పాత పెంకుటిల్లు రామిరెడ్డిది.అదాయన వేరు పడిన తరువాత కట్టుకున్న ఇల్లు.
పెంకులు ఉరుస్తున్నాయని పైన టార్పాలిన్ కప్పారు!
అదీ చివికింది,చీలికలు పీలికలు అయింది,అక్కడక్కడా దానిపై రాళ్లు పెట్టి ఉన్నాయి,గాలికి లేవకుండా!

రాజిరెడ్డి ముగ్గురు కొడుకులను,ముగ్గురు ఆడబిడ్డలను కని, పెంచి,పెద్దజేసి,పెండ్లిళ్లు చేసిన ఇల్లు!

ఆ ఇంటిముందు ,సిమెంటు రేకుల పందిరి కింద,నేల మీద వరిగడ్డి వేసి ,రాజిరెడ్డి శవాన్ని పడుకోబెట్టారు!
ఎర్రగా బక్కగా అలిసిపోయి...

ఇంటి ఆడవారు చుట్టూ కూర్చున్నారు!
కొంగులతో విసరుకొంటున్నారు!

ఏడ్పుల ఆర్పులు ఏమీ లేవు!

ఏప్రిల్ మాసపు ఎండలు!
ఉదయం పది దాటిందో లేదో ,ఎండ ఈడ్చి కొడుతోంది!
తారు రోడ్డు మీద నుండి అప్పుడప్పుడు టూవీలర్స్,ఫోర్ వీలర్స్,ట్రాక్టర్సు ,ఆర్టీసీ బస్సు సర్వీసులు వెళ్తూ వస్తున్నాయి.

కొందరు గ్రామస్తులు జమయ్యారు అక్కడ!
అందులో రైతులే-రెడ్డి కులస్తులే ఎక్కువ మంది ఉన్నారు!
రోడ్డుమీద ఎవరిదారిన వారు ,వచ్చే వారు పొయ్యేవారు,
తల తిప్పి ఓసారి చూస్తున్నారు.
ఊరు కూడా పట్నం లాగే ఒకరికొకరు అపరిచతం అవుతోంది!

ఇంతకుముందు చావులను దహనాలను ఎవరూ పట్టించుకోక పోవడం వల్ల, గ్రామ పెద్ద ధర్మారెడ్డి వేదన చెందిండు!
'పురాగ ఇట్లైతే ఎట్లరా' అని రెడ్లను అందరినీ కుప్పేసి - గ్రామంలో ఒక రెడ్ల సంఘాన్ని ఫామ్ చేసిండు!
ముఖ్యంగా చావులప్పుడైనా ,అందరం కలిసి ముందుబడాలని చెప్పిండు!

అప్పట్నుంచి కొందరు రెడ్లు  వస్తున్నారు!
వచ్చి గోడల మీద,కొమ్మల మీద కూర్చుంటున్నరు!
ఏమీ పెద్దగా పట్టించుకోరు!

మళ్లీ ధర్మారెడ్డే ముందుబడి ,దహనానికి ఏర్పాట్లు చేయిస్తుంటాడు.ఇప్పుడూ అలాగే చేయిస్తున్నాడు.
మధ్య మధ్య ఎవరినో ఒకరిని ,ఏదో ఒక పనికి పురమాయిస్తున్నడు,గదమాయిస్తున్నాడు!
'నీ యమ్మ ఈనేతోని బతుకలేం' అనుకుంటూ పురమాయించిన పనికి పోతున్నారు!

ధర్మారెడ్డి వయసు దాదాపు అరవై ఏడు సంవత్సరాలు!
మొదట్లో ఒక టర్మ్ ,గ్రామ సర్పంచిగా పని చేసాడు!
అప్పుడు ఎన్నికల్లో ఇంత పోటీ ఉండేది కాదు.
తరువాత వద్దనుకున్నాడు!

ఎవరు సర్పంచిగా ఉన్నా-అధికార కార్యక్రమాలు మినహా -తక్కిన గ్రామ వ్యవహారాల్లో -ధర్మారెడ్డి అనధికార సర్పంచిగా పనిచేసేవాడు,సర్పంచులు అలాగే భావించే వారు!
'లాభం లేని పనులు'ఎవరు చేస్తేనేమి అనుకునే వారు!

మాట కఠినం కాని ,తరువాత మరిచేవాడు!ఎవరు ఏ మాట సాయం అడిగినా,వెళ్లి నిలుచునే వాడు!
ఎవరిమీదా పెత్తనం చెలాయించే వాడు కాదు!
పదవులు కాదు గాని,పలుకుబడి సంపాదించిన మనిషి!

ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులు, ఏ పార్టీ వారైనా గ్రామంలోకి వస్తే  , ధర్మారెడ్డి ఇంటికి వస్తారు!కచ్చితమైన మనిషి.తన పదెకరాల వ్యవసాయం తనది.సంపన్నుడేమీ కాదు,మామూలు రైతు!

గత నలబై ఏడు సంవత్సరాలలో ఆ గ్రామంలో ఎన్నో చావులు జరిగాయి.ఆ కాలం ఆయన కాలం.ఏ చావు ఎట్లా జరిగిందో ధర్మారెడ్డికి తెలుసు,సహజసిద్ధమైన చావులు తక్కువ!
ఆయన అన్ని కులాల చావుల దగ్గరకు వెళ్తాడు!
తన అవసరం ఉందనుకుంటే,దహనం అయ్యే దాకా ముందుబడతాడు,ఖర్చులు పెడతాడు,తరువాత తీసుకుంటాడు,కొన్ని సార్లు కొందరు కొంత ఇవ్వరు కూడా!

గ్రామంలో సగం చావులు ,ఆత్మహత్యలే!
అయితే ఇప్పుడు చావులు అలాగే ఉంటాయని అనుకునే స్ధితిలో గ్రామం ఉంది!
సాధారణంగా ఆత్మహత్యలు గ్రామం దాటవు!
ఎక్కువ ఆత్మహత్యలు'కడుపునొప్పితో ' అని చెప్పుకుంటారు!

ప్రతి ఆత్మహత్య చేసుకున్న మనిషి వేదన ధర్మారెడ్డికి తెలుసు!
అందుకే ధర్మారెడ్డిలో ఎంతో వేదన ఉంటుంది,మనుషుల మీద ఆగ్రహం ఉంటుంది.ఆ ఆగ్రహం తాను తీర్పులు చెప్పేటప్పుడు బయట పడుతుంది.

'పటేల్ మంచోడు కని ,కోపం ఎక్కువ' అని పేరు సంపాదించాడు!

ఆయన పంచాయతీలో మందిని కోప్పడుతున్నప్పుడు చూసిన సన్నిహితులు 'అంత కోపం నీ ఆరోగ్యానికి మంచిది కాదు' అని సలహా ఇస్తుంటారు!

ఇట్లా తల్లిదండ్రులను పట్టించుకోని వారిని ,ఏమీ చెయ్యలేక పోతున్నాననే ఆవేదన ఆయనను తొలుస్తూ ఉంటుంది!

'కాడు' పేర్చే పని ఎందాకా వచ్చిందో, మాదిగల నాయకునికి పోన్ చేసిండు ధర్మారెడ్డి!

'అవుతోందని ' అటునుండి జవాబు!
'అయితాందో తాగుకుంట కూసున్నరో? 'ఎవరో మందిలోంచి అన్నారు!

'ఈడ వట్టిగ కూసునే కంటే, అక్కడికి పొయ్యి ఆ పని చేయించచ్చు కదనోయి?' అని మరెవరో అన్నారు!

ఈ సందడికి కొద్ది దూరంలో -రోడ్డు ప్రక్క - తన సైకిల్ మోటారుకు స్టాండ్ వేసి కూర్చున్నాడు గ్రామ సర్పంచి వెంకట్.
అధికార పార్టి ఎమ్మెల్యేకు ముఖ్యకార్యకర్త!
ఆయన చుట్టూ మరో నలుగురు గ్రామ పంచాయతీ మెంబర్లు నిలబడి ఉన్నారు!

సర్పంచి ఎడతెగని పోన్లు చేస్తున్నడు!
ఎమ్మెల్యే కారు ఎక్కడి దాకా వచ్చిందో తెలుసుకుంటున్నాడు!

నెల క్రితం ఒక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నడు!
ఓడిపోయిన ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యే వచ్చిండు.
చనిపోయిన రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం చేసాడు!
ప్రభుత్వ వ్యవసాయ విధానాన్ని ఎండగట్టాడు,తమ పార్టీ పరువు తీసాడు!గ్రామంలో తమ పార్టీ పరపతి తగ్గుతోందని ఎమ్మెల్యే వెంట పడుతున్నడు సర్పంచి!
'ఇట్లైతే వచ్చే ఎలక్షన్లో కష్టం సార్ ' అని చెపుతున్నడు!
'మేం పిలిచిన చావులకైనా రండి సార్ ' అని ఒత్తిడి చేసి ఇప్పుడు రప్పిస్తున్నాడు!

ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వొద్దని సర్పంచి ప్లాన్!

చనిపోయిన రాజిరెడ్డి పెద్దకొడుకు దగ్గరికి వెళ్లిండు ధర్మారెడ్డి!
'మీ అక్కా,చెల్లెండ్లు ఎక్కడి దాకా వచ్చినట్టు?' అని అడిగిండు!
'అర గంటల అందరూ రావచ్చు' అన్నడు సదరు మనిషి!
ఆయన ముఖంలో ఏ భావాలు లేవు!

ధర్మారెడ్డి వెనక్కి తిరిగి ,సర్పంచి దగ్గరకు వచ్చిండు!
సర్పంచి లేచి తన బండి మీద ,ధర్మారెడ్డిని కూర్చోమన్నాడు!
ధర్మారెడ్డి వద్దని అలాగే నిలబడ్డాడు!
'ఎక్కడి దాక వచ్చిండు మీ ఎమ్మెల్యే సారు? 'అని అడిగిండు!
'అరగంటల రావచ్చు' అన్నడు సర్పంచి!

ఎక్కడి నుండో నలుగురు గంగెడ్ల వాళ్లు వచ్చారు!
'పీక' పాట వినగానే ,రైతు యువకుడొకడు 'ఛట్,ఆపు' అని కోపగించుకున్నడు!

'దండాలు పటేండ్లకు దండాలు'అని గంగెడ్ల పెద్ద ,వంగి వంగి దండాలు పెట్టిండు.ఎండకు ఒగరుస్తోంది గంగెద్దు!

'ఎన్ని కులాలోళ్లు మారినా,వీళ్లు మారరు' అని ఎవరో కోపంగా అన్నరు!

ధర్మారెడ్డి అటూఇటూ చూసాడు,కూర్చోవడానికి!
ట్రాక్టరు పాత టైరు కనపడితే దాని మీద కూర్చున్నాడు!
బుజం మీద తువ్వాలతో చెమట తుడుచుకున్నాడు!

'పోలీసులకు కంప్లయింట్ చెయ్యకపోతే ఎట్ల'
అని ధర్మారెడ్డి వైపు తిరిగి అన్నడు సర్పంచి!
'అంత మీరేనాయే,సర్పంచి,ఎమ్మెల్యే,మంత్రి.
పోలీసులు ఏమంటరు?' అన్నాడు ధర్మారెడ్డి!

'ఇండ్ల కంప్లయింట్ చేసేటోళ్లు ఎవరున్నరు? ' అని సదరు ఆత్మహత్య చేసుకున్న కుటుంబ సభ్యులను ఉద్దేశించి అన్నడు!

'పుల్లలు పెట్టెటోళ్లు మనదాంట్లెనే ఉన్నరు' అంటూ దూరంలో కూర్చున్న ఉపసర్పంచి వైపు చూపిస్తూ..సర్పంచి అన్నడు!

'ఏంగాదులే,ఎమ్మెల్యే వచ్చినంక పోలీసోడు ఏం పట్టిచ్చుకుంటడు' అని ధర్మారెడ్డి అన్నడు!

ఇంటిముందు కారు ఆగింది,రాజిరెడ్డి బిడ్డలు దిగారు!
తొవ్వల తొవ్వల అందరు కలుసుకున్నట్టుంది,ముగ్గురు కలిసే వచ్చారు!ఇద్దరు అల్లుండ్లు ఎప్పుడో చచ్చిపొయ్యారు!
ఉన్నొక్క అల్లుడు ,తన కొడుకుతో పాటు సైకిల్ మోటర్ పై వచ్చిండు.మనుమలు మనుమరాండ్లు అట్లనే సిటీలల్ల నుండి కార్లేసుకోని రానే వచ్చిండ్రు!

ఇంటి ఆడ బిడ్డలు ,శవం మీద పడి కాసేపు ఏడ్చారు!
'నీకు ఏం కష్టం అచ్చిందే బాపూ'
నీకు మేం లెవ్వనుకున్నవా బాపు'
ఇలాంటి రాగాలేవో తీస్తున్నారు!
వాళ్ల ఏడ్పు చూసి, అక్కడ చేరిన ఆడవారిలోనూ , ఏదో తడి ప్రారంభం అయింది!

నలుగురు మాదిగ యువకులు డప్పులతో వచ్చి -ఢమ ఢమ లాడించి,తాము వచ్చామన్నట్టుగా - ఊరుకున్నరు!

అంతలోనే,
ప్రక్క గ్రామానికి వెళ్లి ,ఆటో ట్రాలీలో పాడె కర్రలు,కొత్తకుండ,తెల్లబట్ట,ఊదుబత్తీలు,పూలదండ,కిరోసిన్ తదితర దహనక్రియకు కావాల్సిన వస్తుసామాగ్రితో వచ్చారు ఇద్దరు మనుషులు!వాళ్లను ఉదయమే పంపాడు ధర్మారెడ్డి!

ట్రాలీ లోంచి సామాగ్రి దించారు!

మాదిగ రెండో పెద్దమనిషి ధర్మారెడ్డి వైపు చూసాడు!
'రావాల్సిన వాళ్లందరు వచ్చినట్టే, పొద్దు పోతోంది ' అనుకుంటూ ' నీ పని కానియ్ ' అన్నట్టుగా ధర్మారెడ్డి మాదిగ రెండో పెద్ద వైపు తల  ఊపాడు!

'పాడె 'కట్టడం ప్రారంభం అయింది!
డప్పులు మళ్లీ ఢమ ఢమ మ్రోగుతున్నవి!
ఏడ్పులు ఎక్కువయ్యాయి.
జనం ఎక్కువయ్యారు!

ధర్మారెడ్డిలో ఆలోచనలు ముసురుకుంటున్నాయి!

నిన్న సాయంత్రం..చీకటిలో..
ముసలాయన రాజిరెడ్డి ,తన ఇంటికి రావడం..
'ధర్మన్నా! నా గతి ఎట్లా?'అని దండం పెట్టడం..
కొడుకులు ఎవరూ ఏమీ ఇవ్వడం లేదని,వండుకోవడం చాత కావడం లేదని, నెలకు ఒకరింట్ల తిండి పెట్టమని మీరైనా పిలిపించి చెప్పండని' కాళ్లమీద పడబోవడం...తన నిస్సహాత..

'నేను చెప్తే , నీ కొడుకులు వినరు చిన్నాయనా,వినరు!
వాళ్లను వినిపిచ్చుటానికి నాకు ఏ అధికారం లేదు.
వాళ్లు అన్నం పెట్టకపోతే,ఇక్కడికి వచ్చి ఉండు.నాకు అన్నానికి లోటు లేదు.లేదంటే వరంగల్లున ఏదన్న అనాధాశ్రమంల పడగొట్టుమంటే పడగొడుత.ఇంతకంటే నేను ఏంజెయ్యలేను' అన్నడు.

రాజిరెడ్డి కండ్లనీరు తీసుకుని, తిరిగి వెళ్లిండు!
తన దారి తను 'ఇలా' చూసుకున్నడు!

ధర్మారెడ్డికి అన్నీ గుర్తుకు వస్తున్నాయి!
రామిరెడ్డికి వృద్దాప్య పెన్షన్ కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. అప్పటికి ఆయన ఒక కొడుకు ఉద్యోగం చేస్తున్నడని,అటువంటి వారికి ఇవ్వకూడదని రూల్స్ ఉన్నాయని చెప్పారు.
తాను ఎంతకని చెప్పగలడు?ఎందరికని చెప్పగలడు?

కన్నకొడుకులు బిడ్డలు తండ్రిని చూసుకోకపోతే,ఇక ఎవరు చెప్తరు?ఎవరు వింటరు?ఎందరికి చెప్పలేదు?ఏమవుతోంది!
అప్పటి మందం సరే అంటరు,తరువాత ఎవడు పట్టించుకోడు!

ఎందరు చనిపోవడం లేదు!
ఎన్ని ఆత్మహత్యలను,మామూలు చావులని పైకి చెప్పడం లేదు?

వీటికి పరిష్కారం లేదా?

కొన్ని సంవత్సరాలుగా  గ్రామంలో చూస్తున్నాడు!
ముగ్గురు రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్లు ,మరికొందరు బొగ్గుగని కార్మికులను .ముసలి వారైనా,వాళ్లంతట వాళ్లు బాగానే బ్రతుకుతున్నరు.వాళ్లకు ఉద్యోగాల తాలూకా పెన్షన్లు నెలనెలా వస్తున్నాయి. అందులో కొందరు పనిమనిషులను పెట్టుకుని కూడా వెళ్లదీస్తున్నరు.

వ్యవసాయం చేసి బ్రతికెటోళ్ల పరిస్ధితే అధ్వాన్నంగా ఉంటోంది!
ఎందుకని?

సూర్యుడు నెత్తికెక్కుతున్నడు,ఎండ వేడిమి పెరుగుతోంది!
రోడ్డుమీద సందడి పెరిగింది!

వరుసగా నాలుగు కార్లు వచ్చినయి!
ఎమ్మెల్యే వచ్చిండు!మందీ మార్బలం దిగింది!
ఇద్దరు గన్ మన్లు వెంట,వెనక కొందరు పోలీసులు!

ఎమ్మెల్యేకు సర్పంచి ఎదురెల్లిండు,
అందరూ కలిసి ,శవం దగ్గరికి వచ్చారు!
ఎవరో పూలు తెచ్చి ,ఎమ్మెల్యే చేతిలో ఉంచారు!
ఆ పూలను శవంపై ఉంచాడు ఎమ్మెల్యే.
తల వంచి కొద్దిసేపు మౌనం పాటించాడు!
ఆయన్ను చూసి అందరూ పాటించారు!

తరువాత ఎమ్మెల్యే ఉపన్యాసం లాంటిది ఇచ్చాడు!
'రాజిరెడ్డి పార్టీ సానుభూతి పరుడని..గ్రామ స్ధాయిలో పార్టీకి ఎంతో సేవ చేసాడని...ఆయన మరణం విచారకరం' అని.

సర్పంచి ఎమ్మెల్యే చెవుల ఏదో చెప్పిండు.ఎమ్మెల్యే అటు తిరిగిండు!రాజిరెడ్డి పెద్దకొడుకు వైపు తిరిగి ఆయన్ను ఓదారుస్తున్నట్టుగా బుజం తట్టాడు!
తన జేబులోంచి కొన్ని నోట్లు రాజిరెడ్డి కొడుకు జేబులో కుక్కాడు,ఖర్చులకు ఉండనియ్యి అని!

ధర్మారెడ్డి మనసులో ఏదో సుడులు తిరుగుతోంది!

ఎమ్మెల్యే వెను తిరిగి, 'ధర్మారెడ్డి సాబ్! నాకు వేరే అర్జంట్ పనులున్నయి,హైదరాబాదుకు పోవాలె ,మినిష్టర్ సార్ను కలువాలె, మీరు కానివ్వండి' అన్నడు!

ధర్మారెడ్డి చేతులు జోడించి,
'సార్! మీరు పెద్దవారు,నేను చాలా చిన్నోన్ని,ఒక్కమాట చెప్త,
మనసున పెట్టుండ్రి!' అన్నడు!

ఎమ్మెల్యే ముఖంలో రంగులు మారాయి!

" సార్!
అరవై ఏండ్లు దాటిన ప్రతి రైతుకు పెన్షన్ ఇవ్వాలె సార్!
లేదా ప్రతీ గ్రామంలో ఒక సీనియర్ సిటిజన్ హోమ్ పెట్టాలె.
ముసలోళ్లు ఎక్కడికి వెళ్లి చెప్పుకోవాలె సార్? అంతంత దూరాలు పోగలరా? గ్రామ పంచాయతీకి అధికారాలు ఇవ్వాలి. తల్లిదండ్రులకు అన్నం పెట్టని కొడుకుల కోడండ్ల నుండి డబ్బు వసూలు చేసి,గ్రామంలో సీనియర్ సిటిజన్ హోమ్స్ నడుపాలె.
ఎక్కన్నో జిల్లా కేంద్రంలో ఒక హోమ్ పెడితే ఎట్లా సార్? ప్రతీ గ్రామంలో పెట్టాలె.పరిస్థితి అట్లున్నది సార్,వృద్దులది కూడా పెద్ద ఓటు బ్యాంకు కద సార్,అట్లనన్న అలోచన చెయ్యండి సార్,

కొడుకులు కోడండ్లు,బిడ్డలు అల్లుండ్లు పట్టించుకోరు,ప్రభుత్వం పట్టించుకోదు.ఎట్ల సార్?రాజిరెడ్డి కొడుకు ఉద్యోగం చేస్తే,రాజిరెడ్డికి వృద్దాప్య పెన్షన్ ఇవ్వదా ప్రభుత్వం? కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నరని,తల్లిదండ్రులకు ప్రభుత్వం వృద్దాప్య పెన్షన్ ఇవ్వదా సార్? రూల్స్ ఇట్లుంటయా?అట్ల ఎందరికో ఇవ్వడం లేదు. 'అవ్వ పెట్టది,అడుక్క తిననియ్యది' అని సామెత.ఎమ్మెల్యేలు కొందరు ఎంపీలు అయితే,ఒక్కొక్కరికి రెండు పెన్షన్లు ఉన్నాయి కద సార్, ఒక్కటి సరిపోదా సార్? మందికి ఒక రూల్ , మనకు ఒక రూలా సార్?మీరు పట్టించుకోకపోతే,ఇట్లనే చచ్చిపోతుంటరు సార్' 
మీరు అందరూ కలిసి అలోచన చెయ్యండి సార్,పరిష్కారం చూపండి సార్,
దేశానికి అన్నం పెట్టిన రైతుకు,చివరికి మనం ఏంపెడుతున్నం సార్?మెడకు ఉరి పెడుతున్నం సార్! ఉరి! 
సార్,నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి సార్'

పోలీసులు అలర్టు అయ్యారు!
ధర్మారెడ్డిని ప్రక్కకు తీసుకపోవడానికి ప్రయత్నం చెయ్యబొయ్యారు.ఎమ్మెల్యే వద్దని వారించాడు పోలీసులని!

పార్టీ కార్యకర్తలు ఆందోళనగా చుట్టూ మూగారు! వింటున్నారు!

"ధాంక్స్ సార్ , విన్నందుకు! మనసుకు ఎంతో బాధ అనిపిస్తోంది సార్!ఈ గ్రామంలో ,ఎన్నో ఇలాంటి చావులను చూస్తున్నాను సార్!ఇప్పుడు ఇస్తే ఏం లాభం సార్?
చనిపోయిన వాళ్లకు ఏం ఉపయోగ పడుతయి సార్?
ఇట్ల ముందే ఇచ్చే ఏర్పాటు ఉంటే, ఎందరో బ్రతికెటోళ్లు సార్!

అరువై సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీసు పూర్తి చేసిన వాళ్లకు ,నెల నెల పెన్షన్ ఇస్తున్నరు కద సార్?
మరి రైతులు అందరికీ ఎందుకు ఇవ్వరు సార్?
జీవితం అంతా ఎగుసం చేసి, ఎన్నో పంటలు పండించి అందరికి అన్నం పెట్టిన రైతుకు ,నెల నెల కొంత పెన్షన్ ఇవ్వలేమా సార్?
ఈ ఊరి నుండి ప్రతీ సంవత్సరం పది కోట్ల రూపాయల వరి పంట బయటకు పోతున్నాది.అదంతా దేశం తింటున్నది కద,
లక్షల కోట్ల బడ్జెట్లు కదా సార్ మనవి?" అని ధర్మారెడ్డి ధర్మాగ్రహాన్ని వెళ్లగక్కిండి.

ఎమ్మెల్యే తల గంభీరంగా ఊపిండు!

ఎవరో వచ్చి ,ధర్మారెడ్డిని ప్రక్కకు తీసారు!

ఎమ్మెల్యే ,
ఆయన అనుచరులు కార్ల వైపు కదిలారు!

డప్పుల మోత!
పాడెను పైకి లేపారు!
'గోవిందా..గోవిందా..'అంటున్నరు!
ఆడవాళ్ల ఏడ్పులు!
శవం మీద బోలు పేలాలు,చిల్లర నాణాలు చల్లుతున్నరు!
ఎండ తీవ్రమైంది.

ఓ అన్నదాత- రాజిరెడ్డి అంతిమ యాత్ర-శవయాత్ర మొదలైంది!

తుమ్మేటి రఘోత్తమరెడ్డి
(15 సెప్టెంబరు 2018)

No comments:

Post a Comment