Friday, August 15, 2025

 మాయా తిరగలి (జపాన్ జానపద కథ)
డా.ఎం.హరికిషన్
***************************
ఒక ఊరిలో ఒక వ్యాపారి వుండేవాడు. అతను చాలా మంచివాడు. గాలిలో పోయే పక్షులను పిలిచి గింజలు, దారిలో పోయే చీమలను ఆపి చక్కెర పెట్టేవాడు. అతని దగ్గర ఒక గుర్రం, కుక్క పిల్లి, కోడి పెట్టె వుండేవి. ఆ నాలుగింటిని చిన్న పిల్లలుగా వున్నప్పుడే తెచ్చి ఒకే కంచంలో తినిపించి, ఒకే మంచమ్మీద పడుకోబెట్టాడు. దాంతో అవన్నీ ఒక దానితో ఒకటి గొడవ పడకుండా అన్నదమ్ముల్లెక్క కలసి మెలసి పెరిగి పెద్దగయ్యాయి. వ్యాపారి వాటిని సొంత పిల్లల్లా చూసుకునేవాడు. కమ్మని రుచులతో కడుపునిండా కొసరి కొసరి తినిపించేవాడు. దగ్గరకు తీసుకొని నిమురుతా ప్రేమగా కబుర్లు చెప్పేవాడు. అంతా ఒక కుటుంబంగా కలసిమెలసి వుండేవాళ్ళు.
ఒకసారి ఆ వ్యాపారికి పెద్ద నష్టం వచ్చింది. అతని అంగళ్ళన్నీ నిప్పు అంటుకొని కాలి బూడిదయిపోయాయి. దాంతో అతను సంసాదించిన సొమ్మంతా హారతి కర్పూరంలా కరిగిపోయింది. ఆఖరికి కట్టుబట్టలతో నడి వీధిలో నిలబడవలసి వచ్చింది. తినడానికి తనకే కష్టమయిపోయింది. దాంతో ఒక రోజు తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న ఆ నాలుగు జంతువులను పిలిచి “మిత్రులారా... చూస్తున్నారుగా నా పరిస్థితి. పంచభక్ష పరమాన్నాలు కాదుగదా కనీసం కడుపునిండా కాసిన్ని గంజినీళ్ళు పోసే స్థితిలో గూడా లేను. ఇక మీరు నాతోపాటే వుంటే ఆకలితో మలమలా మాడి చావడం ఖాయం. ఈ ప్రపంచం చాలా పెద్దది. పోయి ఇంకో యజమానిని వెదుక్కోండి. నమ్మకంగా సేవ చేస్తూ, అన్నం పెట్టిన యజమానిని మోసం చేయకుండా, ఎదిరించకుండా హాయిగా బ్రతకండి" అంటూ కళ్ళనీళ్ళతో వాటికి వీడుకోలు పలికాడు.
పాపం... ఆ జంతువులు యజమానిని వదలలేక కళ్ళనీళ్ళు పెట్టుకున్నాయి. కానీ అక్కడ వుండి యజమానిని మరింత బాధపెట్టడం ఇష్టం లేక వదలలేక వదలిపోయాయి. ఆ నాలుగు కలసి చాలామంది దగ్గరికి పోయాయి. “నన్ను పెంచుకో రోజూ ఉదయాన్నే ఒక మంచి కోడిగుడ్డు అందిస్తా" అంది కోడిపెట్టె. “మీ ఇంట్లో వుండే ఎలుకలన్నీ పట్టేసి మీ ధాన్యాన్ని కాపాడతా" అంది పిల్లి. “మీ ఇంట్లోకి దొంగలెవరూ దూరకుండా రాత్రింబవళ్ళూ కాపాడతా" అంది కుక్క “ఎక్కడికి పోవాలంటే అక్కడికి నా మీద కూర్చోబెట్టుకొని ఎంతదూరమైనా సరే సర్రున తీసుకొని పోతా" అంది గుర్రం... కానీ అవి ఎన్ని మాటలు చెప్పినా ఒక్కరంటే ఒక్కరు గూడా ఇంటి తలుపు తెరిచి లోపలికి రమ్మనలేదు. కడుపునిండుగా కనీసం గంజికూడా పోయలేదు.
ఊరిలోని ప్రతి ఇంటి మెట్టూ ఎక్కీ దిగీ అవన్నీ బాగా అలసిపోయాయి. “మనం ఇక్కడే ఈ ఊరిలోనే వుంటే ఆకలితో చావడం ఖాయం. వేరే ఊరికి పోదాం. అక్కడ ఎవరో ఒకరు చల్లని మనసున్న మహారాజు దొరకక పోడు" అనుకున్నాయి. పక్కనే అడవి వుంది. ఆ అడవి దాటితే ఒక పెద్ద నగరం వస్తాది. అక్కడికి పోయి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అవి అడవి బాట పట్టాయి. సగం దూరం నడిచేసరికి వాటికి నడిచీ నడిచీ కాళ్ళు నొప్పి పెట్టసాగాయి.
“అర చేతి నిండా గింజలు తీసుకొని ఒళ్ళో కూచోబెట్టుకొని రోజూ ఎన్ని రకాల గింజలు తినిపించేవాడో మన యజమాని. పొద్దున్నుంచీ ఏమీ తినక నీరసమోస్తావుంది" అంది కోడిపెట్ట.
“అవును... నాకు చేపలంటే ఇష్టమని వారం వారం సంతకుపోయి గంపనిండా తెచ్చి కడుపు నిండా పెట్టేవాడు. పొద్దున్నుంచీ ఒక్క చేపా తినక నోరు చచ్చిపోతావుంది. అడుగు తీసి అడుగు వేయడమే కష్టంగా వుంది” అంది పిల్లి.
“రోజూ పొద్దునా సాయంత్రం నన్ను తీసుకొని వీధులన్నీ తిప్పేవాడు. దారిలో గురువయ్య అంగడిలో బన్నులు, మస్తానయ్య అంగడిలో తునకలు కొనేవాడు. తలచుకుంటే నోట్లో సర్రున నీళ్ళు కారిపోతా వున్నాయి. పొద్దున్నుంచీ మాంసం ముక్క కాదు గదా... కనీసం చీకి పాడేసిన ఎముక ముక్క గూడా దొరకలేదు. నీరసంతో కళ్లు తిరుగుతా వున్నాయి. ఒళ్ళు తూలుతా వుంది" అంది కుక్క.
ఆ మాటలన్నీ విన్న గుర్రం “మీరందరూ చెప్పింది నిజమే. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గానీ అలాంటి మనసున్న యజమాని మనకు దొరకడు. కానీ అదే తల్చుకుంటూ నీరసించి పోతే ఎలా, అందరూ నా మీదకి ఎక్కి కూర్చోండి. నా కాళ్లలో ఇంకా సత్తువ మిగిలే వుంది. వీలయినంత త్వరగా పక్క ఊరికి చేరుకుందాం” అంది.
అన్నీ 'అలాగే' అంటూ ఎగిరి గుర్రం మీదకు ఎక్కాయి. గుర్రం దారిలో కనబడిన గడ్డి తింటూ వేగంగా దూసుకు పోసాగింది. నెమ్మది నెమ్మదిగా చీకటి ముసురుకోసాగింది. దారి మసకమసకగా కనబడసాగింది. "అడవిలో అలాగే పోతే ఏదయినా ప్రమాదం జరగొచ్చు" దాంతో ఎక్కడైనా ఆగుదాం అనుకున్నాయి. ఆ రాత్రి వుండడానికి చోటు వెదుక్కుంటా పోతా వుంటే ఒకచోట ఒక పాడుబడిన బంగళా కనబడింది.
“ఈ బంగళా ఎవరిదో గానీ చూడముచ్చటగా వుంది. మన అదృష్టం బాగుంటే కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర దొరకవచ్చు పదండి పోదాం" అనుకొని అ బంగళా దగ్గరి పోయి గట్టిగా పిలిచాయి. కానీ ఎంత పిలిచినా లోపలనుంచి జవాబు రాలేదు. దాంతో నెమ్మదిగా తలుపు తెరుచుకొని లోపలికి పోయాయి. ఇంటిలో ఎవరూ లేరు. తినడానికి ఏమైనా దొరుకుతాయేమో అని ఇళ్ళంతా వెదికాయి కానీ చిన్న గడిపరక కూడా కనబడలేదు. "సరే... ఏం చేద్దాం. పడుకోవడానికైనా ఇంత చోటు దొరికింది. అదే పది వేలు" అనుకుంటూ ఒక గదిలో ఒక మూల పడుకొని ఖాళీ కడుపులతో అలాగే నిద్రపోయాయి. 
అర్ధరాత్రి ఏవో అరుపులు, కేకలు, పెద్ద పెద్ద నవ్వులు వినబడి అదిరిపడి లేచాయి. నెమ్మదిగా ఆ గదిలోంచి బైటకు వచ్చి మధ్య గదిలోకి తొంగి చూశాయి. అక్కడ కొంతమంది దొంగలు కూర్చున్నారు. వాళ్ళ మధ్యలో ఎక్కడెక్కడి నుంచో దొంగతనం చేసుకొని వచ్చిన నగలూ, హారాలు, బంగారు వరహాలు దీపం కాంతిలో తళతళ మెరుస్తా కనబడ్డాయి. అందరూ సంబరంగా నవ్వుకుంటా మాట్లాడుకుంటా వున్నారు.
అంతలో దొంగల నాయకుడు “రేయ్... ఆకలయితా వుంది. పోయి తిరుగలి పట్టుకొని రాపోండి. నచ్చినవన్నీ కోరుకొని కమ్మగా కడుపు నిండా తిందాం" అన్నాడు.
వెంటనే ఒక దొంగ పోయి తిరగలి తెచ్చాడు. అది అలాంటిలాంటి మామూలు తిరగలి కాదు. మాయా తిరగలి. దాన్ని తిప్పుతూ ఏమి కోరుకుంటే అవి బైటకు వస్తాయి. వెంటనే దొంగల నాయకుడు
"గిరగిర తిరిగే తిరగలి  కోరిక తీర్చే తిరగలీ నచ్చినవన్నీ ఇచ్చేసెయ్  మెచ్చినవ్నీ తెచ్చేసెయ్
విందు భోజనం సిద్ధం చేయ్  
కమ్మగ కడుపులు నింపేసేయ్" అన్నాడు గట్టిగా. వెంటనే తిరగలి తిరగడం మొదలు పెట్టింది. అందులోంచి రకరకాల తియ్య తియ్యని తినుబండారాలు, కరకరలాడే కారాబూందీలు, నోరూరించే రోటి పచ్చళ్ళు, ఘుమఘుమలాడే రసమూ సాంబారు, పొగలు కక్కే బిర్యానీలు వరుసగా ఒకదాని తరువాత ఒకటి రాసాగాయి. అందరూ వాటి చుట్టూ కూర్చొని లొట్టలేసుకుంటా తినసాగారు. ఆ కమ్మని వాసన పీలుస్తావుంటే గుర్రానికి, మిగతా వాటికి నోట్లో సర్రున నీళ్ళూరసాగాయి.
“ఎలాగైనా సరే ఆ దొంగలను అక్కడినుంచి తరిమికొట్టి ఆ విలువైన ఆభరణాలు, మాయా తిరగలి సంపాదించాలి" అనుకున్నాడు. గుర్రం బాగా ఆలోచించి, 'ఓ కుక్కా నీవు నా మీదకు ఎక్కు, పిల్లీ నువ్వు కుక్క మీదకు ఎక్కు కోడిపెట్టె నువ్వు పిల్లి మీదకు ఎక్కు, ఒకరి మీదికి ఒకరం ఎక్కి చీకటిలో చూడ్డానికి చాలా వింతగా వుంటాం. ఒకేసారి మనమంతా గట్టిగా భయంకరంగా అరుచుకుంటూ లోపలికి పోదాం. వాళ్ళు అదిరిపడి మనవంక చూస్తారు. ఒకరిమీద ఒకరం వుంటాం కాబట్టి అర్థం గాక ఇదేదో వింత జంతువు అని హడలిపోతారు. వాళ్ళు మనల్ని గుర్తు పట్టకముందే నేను దీపాలను కాలితో తంతాను" అంటూ ఆ తరువాత ఏం చేయాలో చెప్పింది. అన్నీ సరేనంటూ గుర్రం చెప్పినట్టే ఒకదాని మీదకు ఒకటి ఎక్కాయి.
ఒక్కసారిగా అన్నీ కలసి అతి భయంకరంగా అరుస్తూ ఆ గదిలోకి దభీమని దుంకాయి. ఆ అరుపులకు దొంగలు అదిరిపడ్డారు. దీపం మసకమసక వెలుగులో అవి ఒకదాని మీదకు ఒకటి ఎక్కి వుండడంతో భయంకరంగా వింతగా కనబడింది. ఇదేందిరా భగవంతుడా ఇలాంటి వింత జంతువును జన్మలో చూడలేదు అనుకున్నారు. అంతలో గుర్రం కాలితో దీపాన్ని తన్నేసింది. అంతే... ఆ ప్రదేశమంతా చీకటితో నిండిపోయింది. వెంటనే గుర్రం రెండు కాళ్ళతో బలమంతా వుపయోగించి దొంగల నాయకుని మోహమ్మీద ఒక్కటి తన్నింది. దెబ్బకు వాని మూతి పగిలి చేతికి నాలుగు పళ్ళు ఊడి వచ్చాయి. కుక్క ఒక దొంగ పిక్క పట్టుకొని కండ ఊడి వచ్చేటట్టుగా ఒక్క పెరుకు పెరికింది. పిల్లి ఒకని మూతిమీద పడి మొహమంతా పిచ్చిపిచ్చిగా రక్కేసింది. కోడి ఎగిరి ఒకని కళ్ళలో ఫటఫటామని పొడిచేసింది.
దొంగలందరూ భయంతో వణికిపోతా "రేయ్... ఈ ఇంటిలో ఏదో భయంకరమైన వింత జంతువు తిరుగుతా వుంది. దానికి దొరికినామా మనపని అయిపోయినట్లే. బతికుంటే పోగొట్టుకున్నదంతా మరలా సంపాదించుకోవచ్చు. అందరూ పారిపోండి" అంటూ తలా ఒక దిక్కు కిందామీదాపడుతూ పారిపోయారు.
వాళ్ళట్లా పారిపోగానే జంతువులన్నీ సంబరంగా అక్కడ వున్న తినుబండారాలన్నీ కమ్మగా కడుపునిండా తిన్నాయి. బంగారు నగలన్నీ మూట గట్టుకొని, మాయా తిరగలి తీసుకొని, తరువాత రోజు పొద్దున్నే తమ యజమాని దగ్గరికి తిరిగి పోయాయి. వాటిని చూడగానే అతను కళ్ళనీళ్ళతో వురుక్కుంటా వచ్చి సంబరంగా అన్నిటినీ కౌగిలించుకున్నాడు. “మీకు ఎవరైనా యజమాని దొరికాడా... బాగా చూసుకుంటున్నాడా" అని అడిగాడు.
దానికి ఆ నాలుగూ నవ్వి “మాకు ఇంక ఏ కొత్త యజమానితోనూ అవసరం లేదు. ఎప్పటికీ నువ్వే మా యజమానివి. మనం ఇంకెప్పుడు విడిపోవలసిన అవసం రాదు” అంటూ జరిగిందంతా చెప్పి నగలమూట ఇచ్చి మాయా తిరగలి చేతిలో పెట్టాయి. వాటి సహాయంతో తిరిగి అతడు వ్యాపారం చేసి కొద్ది కాలంలోనే మరలా ధనవంతుడు అయ్యాడు. జంతువులన్నిటితో కలసి హాయిగా బ్రతకసాగాడు.
*****************

No comments:

Post a Comment