Friday, August 15, 2025

 *అవతార్ మెహర్ బాబా - 51*
🪷

రచన: బి. రామకృష్ణయ్య


*నవజీవనం*

బాబా డెహరాడూన్ కి రాక పూర్వమే అక్కడ కొన్ని మాసాలు ఉండటానికి ప్రత్యేకమైన ఒక స్థలాన్ని సేకరించి బాబా నివాసానికి యోగ్యమైన ఇళ్ళు కొన్ని నిర్మించాలని సూచించారు. ఈ కార్యం నిమిత్తం మండలి వారు డెహరాడూన్ -హరిద్వార్ రోడ్డు పైన పట్టణానికి రెండు కి.మీ. దూరంలో ఉన్న 'మంజిరీ మాఫీ' అనే స్థలాన్ని ఎంచుకొని ఆ దగ్గరలో నివాసముంటున్న ఒక వ్యక్తి వద్దకు వెళ్ళి ఆ సమీపంలో తమకు స్థలం కావాలని అడిగారు. అతను ఆ దగ్గరలోనే స్థలం ఇప్పించాడు. ఆ స్థలంలో ఇళ్ళ నిర్మాణం కూడా ఆయన పర్యవేక్షణలో చేయించాడు ఆ స్థలానికి తరువాత మెహెర్ మాఫీ అనే పేరు కూడా వచ్చింది.

ఆ వ్యక్తి పేరు శతృఘ్న కుమార్. ఆయన కమ్యూనిస్ట్ భావాలు కలవాడు. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమంలో పాల్గొని చాలాసార్లు జైలుకు వెళ్ళాడు. ఆయన యవ్వనం చాలా భాగం జైలులోనే గడిచింది. అలా జైలులో మ్రగ్గుతున్న అతనికి ఒకనాడు ఒక ఆలోచన వచ్చింది. 'అందరూ భగవంతుడు ఉన్నాడని, ఆయన్ని తలుచుకొని ఏది కోరితే అది నెరవేరుతుందని అంటారు. నేనెందుకు పరీక్షించుకోకూడదు?' వెంటనే ఆయన ఇలా అనుకున్నాడు - 'ఓ భగవంతుడా (మిస్టర్ గాడ్): నిజంగా నీవంటూ ఉంటే రేపు ఉదయం ఏడు గంటలకు నన్ని జైలు నుండి విడుదల చేయించు. అప్పుడు నీవంటూ ఉన్నావని నమ్ముతాను. ఆ తర్వాత నీవు కనబడితే నీకు జీవితాంతం సేవ చేసుకుంటాను'. 

అది రాత్రి సమయం. ఆ సాయంత్రం వరకూ ఎలాంటి ఉత్తర్వులూ రాలేదు. ఉదయం 7 గంటల వరకు జైలు అధికారి కార్యాలయానికి ఎవ్వరూ రారు. తాను కోరుకున్న విడుదల అసాధ్యమైనదే. మానవాతీతమైన దైవశక్తి నిజంగా ఉండి పని చేస్తే తప్ప తన విడుదల సాధ్యం కాదు. అనే భావాలు మనస్సులో మెదులు తుండగా హృదయాంతరాళాలలో మాత్రం "నీ మొర ఆలకించి దైవం నిన్ను విడుదల చేస్తాడు' అనే ఆశ ప్రోత్సహించసాగింది. ఈ భావాలతో రాత్రంతా నిద్రపోకుండానే గడిపాడు. పదేపదే తనకున్న కొద్దిపాటి వస్తువులను సర్దుకుంటూ విడుదలైతే వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి అని చాలా తాపత్రయపడ్డాడు. ఉదయం ఐదు గంటలైంది. మనస్సు సందేహంగా ఇంకా ఎలా సాధ్యమవుతుంది నీ విడుదల అంటుంటే అంతరంగం నుండి ఆశ మాత్రం ఆగిపోకుండా ధైర్యాన్ని చెబుతూంది.

ఇంతలో ఒక జవాను తనవైపుకే రావడం చూశాడు. తన వద్దకే వచ్చి 'నీవు చాలా అదృష్టవంతుడివి. నీ విడుదల కోసం పై నుండి టెలిగ్రామ్ ద్వారా ఆదేశాలు వచ్చాయి. జైలర్ గారు ఉదయం 6.30గం. లకే ఆఫీసుకు వస్తారు. వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు' అని చెప్పి వెళ్ళాడు. శతృఘ్న కుమార్ నమ్మలేకపోయాడు. ఇది కలా? నిజమా? అయితే దేవుడనే వాడు ఉన్నాడన్న మాట. అంతే కాదు. నా మొర అలకించి అసాధ్యమైన నా కోరిక నెరవేర్చి నన్ను విడుదల చేశాడు. జైలర్ వద్దకు వెళ్ళి చెయవలసినవన్సీ నెరవేర్చి గేటు బయటకు అడుగుపెట్టాడు. 
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
సమయం సరిగ్గా ఏడు గంటలైంది. ఆహా! నేను పెట్టిన పరీక్షలో నెగ్గి భగవంతుడు తానున్నానని నిరూపించుకున్నాడు. అయితే భగవంతుడెక్కడ ఉన్నాడు? నా వాగ్దానం ప్రకారం నేను అయనకు సేవ చేయడమెలా అని యోచిస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు. కాలక్రమేణా అతడు తన వాగ్దానాన్ని మరిచిపోయాడు.

బాబా అనుచరుల కోరిక మేరకు బాబాకు మంజరీ మాఫీలో స్థలం ఇప్పించి ఇళ్ళు నిర్మించి ఇవ్వడంలో శతృఘ్న కుమార్ తోడ్పడాడు. బాబాకు బాబా మండలి వారికి భోజనాలు వసతి ఏర్పాటు చేశాడు. బాబాను చూడగానే ఆయన తనకు ఆత్మీయుడైనట్లు, ఎప్పటి నుండో తనకు తెలిసి ఉన్నటు అనుభూతి పొందాడు. ఇలా కొంతకాలం బాబాకు సేవ చేసుకు న్నాడు శతృఘ్న కుమార్. ఒకసారి అతడు సతారాలో బాబా వద్ద బాబా మండలి వారితో కలిసి ఉన్నాడు. 

ఒకరోజు బాబా వాహ్యాళికి వెళ్తుంటే గొడుగు పట్టుకొని బాబా వెంట నడుస్తున్నాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు - "నీవు చేసిన వాగ్దానం నీకు గుర్తుందా?" 

శతృఘ్న కుమార్ కి ఏమీ అర్థం కాలేదు. తానెప్పుడూ బాబాకు ఏ వాగ్దానం చేయలేదే అనుకున్నాడు.

"జైలులో చేసిన వాగ్దానం పూర్తిగా మరిచిపోయావా?" అన్నారు బాబా. వెంటనే అతనికి జైలు విడుదల కోసం తాను పెట్టిన పరీక్ష, వాగ్దానం గుర్తుకు వచ్చాయి. 
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
బాబా మళ్ళీ వెంటనే ఇలా అన్నారు - "నేనే ఆ భగవంతుడను. నన్ను ఎప్పుడూ మరిచిపోకు". 

శతృఘ్న కుమార్ కి ఎంతో ఆశ్చర్యం, సంతోషం కలిగాయి. తను ఏదో పెద్ద బరువు దించి వేసుకున్నట్లుగా అనుభూతి పొంది తనకు తెలియకుండానే తన వాగ్దానం ప్రకారంగా తనను జైలు నుండి విడిపించిన దైవానికి సేవ చేసుకునే భాగ్యాన్ని బాబా కలుగజేసినందులకు ఆనందభరితుడైనాడు. జీవితాంతం బాబా సేవ చేసుకుని ధన్యుడైనాడు.
📖

ఇలా బాబా దివ్యత్వాన్ని ధృవపరిచే అనుభవాలెన్నో శతృఘ్న కుమార్ కి కలిగాయి. బాబా నవజీవనంలో డెహరా డూన్ కి రైలులో వచ్చి స్టేషన్ ఉన్న లో ప్రయాణికుల విశ్రాంతి గదిలో ఉన్నారు. బాబాకు స్థలం ఇప్పించినందున బాబా మండలి వారు శతృఘ్న కుమార్ ని రైలు స్టేషన్ కి తీసుకొని వచ్చారు. 

కుమార్ ని చూచి బాబా "మాకు వెంటనే భోజనాలు ఏర్పాటు చేయగలవా?" అని అడిగారు. ఒక గంట సమయం ఇస్తే చేయగలనని చెప్పాడు కుమార్. సరే అలాగే. తొందరగా ఏర్పాటు చేయి" అన్నారు బాబా. బాబా టేబిల్ వద్ద కూర్చుని ఉన్నారు. ఈరుచ్ బెడింగ్ సర్దు తున్నాడు. ఒక మండలి సభ్యుడు బాత్రూమ్ నుండి వస్తున్నాడు. బాబా వద్ద నుండి సెలవు తీసుకొని మోటార్ సైకిల్ పై తన ఇంటికి వెళ్ళి త్వరత్వరగా అన్నం వండించి తీసుకొనివచ్చాడు శతృఘ్న. విశ్రాంతి గదిలోకి ప్రవేశించగానే తను ఇందాక వెళ్ళే సమయంలో ఎలా ఉందో అదే దృశ్యం అతని కంటబడింది. తన ఇంటికి వెళ్ళడం, ఆహారం తయారు చేసి తీసుకొని రావడం అంతా ఒక క్షణంలో జరిగిపోయిన అనుభూతి కలిగింది. బాబా సమయాన్ని అలా స్థంభింపజేసి ఉంచారేమో అనిపించింది. కృష్ణావతారం లో నారదునికి యమునా నదిలో మునిగి లేచే క్షణ కాలంలోనే కలిగిన సుదీర్ఘ అనుభవం (వివాహం జరగడం, 60 మంది పిల్లలు పుట్టడం, సంసారంతో విసిగి తనను కాపాడమని కృష్ణుని వేడుకోవడం) లాంటి సంఘటన, అనుభవం శతృఘ్న కుమార్ కి కలిగింది. 
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఆ అన్నం తెచ్చిన గిన్నెను తెచ్చి బాబా ముందు టేబిల్ పైన ఉంచాడు శతృఘ్న కుమార్. బాబా స్వయంగా దాని మూత తీసి సహచర మండలి వారందరినీ పిలిచి 'ఆకలితో ఉన్నారు బాగా తినండి' అంటూ అందరికీ వడ్డించాడు. ఒక్కొక్కరుగా వచ్చిన వారందరినీ చూసి శతృఘ్న కుమార్ కి మనస్సులో ఆందోళన ప్రారంభమైంది. అసలు బాబా బృందంలో ఎంతమంది ఉన్నారనే విషయం తెలుసు కోకుండా తను వెళ్ళి ఆహారం తయారు చేయించి తెచ్చాడు. ఇప్పుడు చూస్తే తాననుకున్న దానికన్నా చాలా ఎక్కువ మంది ఉన్నారు. తాను తెచ్చిన ఆహారం సరిపోదు, ఏంచేయాలి? అని మనస్సులో మధన పడుతుండగా బాబా ఆయన్ని కూడా పిలిచి "నీవు కూడా మాతో బాటే తిను" అని అతనికి ఒక పళ్ళెంలో తన స్వహస్తాలతో అన్నం వడ్డించి ఇచ్చాడు. కుమార్ తత్తరపాటుతో వెళ్ళి పళ్ళెము అందుకున్నాడు. అన్నం సరిపోలేదనే అపవాదు భరించవలసివస్తుందని కుమార్ ఆందోళన పడుతున్నాడు. అందరికీ వడ్డించి బాబా అన్నం గిన్నెపై మూత పెట్టేసి, పక్క గదిలో ఉన్న స్త్రీ మండలి వారికి దానిని తీసుకొని వెళ్ళి ఇవ్వమని అన్నారు. 

ఇంకా స్త్రీమండలి వారు కూడా ఉన్నారని తెలుసుకొని శతృఘ్న కుమార్ తనకు అపవాదు తప్పదని ఆ గిన్నెలో ఏమీ మిగిలి లేదని, స్త్రీమండలి వారు ఏమి తింటారని గాభరాపడ్డాడు. స్త్రీమండలి వారి గదిలోకి తీసుకొని వెళ్ళి గిన్నెపై నుండి మూతతీసి చూస్తే ఆ గిన్నెలో అన్నం నిండుగా ఉంది. కేవలం పక్కన ఒక చెంచాతో కొంచెం మాత్రం తీసినట్లుగా ఉంది. శతృఘ్న కుమార్ కి ఆశ్చర్యంతో బాటు కలిగిన ఆనందానికి అవధులు లేవు.

ఇలాగే మంజరీ మాఫీలో జరిగిన కార్యక్రమాల్లో ఎన్నోసార్లు ప్రసాదం అక్షయ మైపోయి ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా వచ్చిన ప్రేమికులందరికీ బాబా చేతితో పంచగా సరిపోవడమే కాకుండా మిగిలిపోయేది. అలా బాబా చేతితో పంచగా ఒకసారి 'బజ్జీలు' అక్షయ మైనందున ప్రతి సంవత్సరం మార్చి మాసంలో జరిగే మేళా కార్యక్రమంలో ఆ రోజుకి గుర్తుగా 'బజ్జీల'నే నేటికి ప్రసాదంగా చేసి పంచుతున్నారు డెహ్రాడూన్ లో ఉన్న బాబా ప్రేమికులు.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment