🙏🙏🙏🌼🌼🌼🌼🙏🙏🙏
*🌼 ఒక యోగి ఆత్మకథ-7 🧘♀️*
*(🖌️రచన :- శ్రీ పరమహంస యోగానంద)*
*🌼2-అధ్యాయం*
“మీ నాన్నగారిని లేపు!” ఆవిడ స్వరం గుసగుసమన్నట్టు ఉంది. “మీరు నన్ను చూడాలంటే, తెల్లారగట్ల నాలుగు గంటలకి మొట్టమొదటి బండి ఎక్కి కలకత్తా వచ్చెయ్యండి!” ఛాయామాత్రంగా ఉన్న ఆ రూపం మాయమైంది.
“నాన్నా! నాన్నా! అమ్మ చచ్చిపోతోంది!” నా గొంతులోంచి వెలువడ్డ భయార్తస్వరం. నాన్నగారిని వెంటనే లేపేసింది. వెక్కివెక్కి ఏడుస్తూ ఆ దుర్వార్త ఆయనకి చెప్పాను.
“అదంతా నీ భ్రమ; దాన్నేం పట్టించుకోకు,” అన్నారు నాన్నగారు. కొత్త పరిస్థితి ఏది ఎదురైనా తిరస్కరించే సహజ ధోరణిలో అన్నారాయన.
“మీ అమ్మ ఆరోగ్యం దివ్యంగా ఉంది. చెడ్డకబురు ఏమైనా వస్తే రేపు బయల్దేరి వెళ్దాం లే!” “ఇప్పుడు బయల్దేరకపోతే, తరవాత మిమ్మల్ని మీరు క్షమించుకో లేరు.” నాలో ఉన్న బాధ ఇంకా కటువుగా పలికించింది, “నేనూ మిమ్మల్ని ఎన్నడూ క్షమించను!”
విషాదపూర్ణమైన ఆ ఉదయం, స్పష్టమైన కబురు తెచ్చింది: “అమ్మకి జబ్బుచేసి ప్రమాదస్థితిలో ఉంది; పెళ్ళి వాయిదా పడింది; వెంటనే వచ్చెయ్యండి.”
మాకు మతి చెడిపోయింది. ఇద్దరం బయలుదేరాం. దారిలో బండి మారేచోట ఒక ఊళ్ళో మా మామయ్యల్లో ఒకాయన మమ్మల్ని కలుసుకున్నాడు. భయంకరంగా ఉరుముతూ ఒక రైలు మావేపు వస్తుంది.
మొదట చిన్నగా కనిపించినదే రానురాను పెద్దదవుతూ వచ్చింది. మనస్సులో ఏర్పడ్డ సంక్షోభం మూలంగా, చటుక్కున రైలుపట్టాల కడ్డంగా పడిపోవాలనిపించింది. అప్పుడే అమ్మకి దూరమైపోయినందువల్ల, ఆవిడలేని శుష్క ప్రపంచాన్ని భరించలేననిపించింది.
ఈ లోకంలో అందరిలోకి నాకు అత్యంత ఆప్తురాలైన స్నేహితురాలు, అమ్మ ఒక్కర్తే అన్నంతగా ప్రేమించాను నేను. చిన్నతనంలో నా కెదురైన చిన్నచిన్న బాధలన్నిటికీ నాకు ఉపశమనం కలిగించినవి జాలి నింపుకొన్న ఆవిడ నల్లటి కళ్ళే.
“అమ్మ ఇంకా బతికుందా!” మామయ్యని, ఈ ఒక్క చివరి ప్రశ్న అడగడంకోసం ఆగాను.
నా ముఖంలో ఉన్న నిరాశని అర్థంచేసుకోడానికి అట్టేసేపు పట్ట లేదాయనకి. “లేకేం? బతికే ఉంది!” అన్నారు. కాని ఆయన మాట, ఒక్క పిసరు కూడా నమ్మలేదు నేను.
మేము కలకత్తాలో మా ఇంటికి చేరడం, దిగ్ర్భాంతి కలిగించే మృత్యు వైచిత్ర్యాన్ని దర్శించడానికే అయింది. నేను కుప్పలా కూలి పోయాను; ప్రాణం దాదాపు పోయిందనిపించే స్థితి ఏర్పడింది.
నా మనస్సు సమాధానపడ్డానికి కొన్నేళ్ళు పట్టింది. నా ఆర్తనాదాలు స్వర్గ ద్వారాల్ని భేదించి చివరికి ఆ జగజ్జననినే పిలుచుకువచ్చాయి. నా పచ్చిపుండ్లను చివరికి మాన్పగలిగినవి చల్లని ఆ తల్లి పలుకులే:
“జన్మజన్మలుగా, అనేకమంది తల్లుల వాత్సల్యరూపంలో నిన్ను కనిపెట్టుకొని ఉన్నదాన్ని నేను! నువ్వు వెతుకుతున్న ఆ నల్లని కళ్ళను, మాయమైపోయిన ఆ అందమైన కళ్ళను, రెండింటినీ నా చూపులో చూడు!”
ఎంతో ప్రేమాస్పదురాలైన అమ్మకు దహనకాండ ముగిసింది. ఆ వెంటనే నేనూ నాన్నగారూ బెరైలీకి తిరిగి వచ్చేశాం. అక్కడ మా ఇంటికి ఎదురుగా ఆకుపచ్చ - బంగారు వన్నెలో మిసిమిచెందే మెత్తని పచ్చిక నేల ఉంది. దానికి నీడనిచ్చేది పెద్ద ‘సేవాలి’ వృక్షం.
నేను ప్రతిరోజూ పొద్దున విచారగ్రస్తుడినయి ఆ చెట్టు దగ్గిరికి సంస్మరణాత్మక తీర్థయాత్ర సాగిస్తూ ఉండేవాణ్ణి. కవితావేశం కలిగిన క్షణాల్లో నాకు అనిపిస్తూ ఉండేది.
తెల్లటి ఆ ‘సేవాలి’ పుష్పాలు, పచ్చని గడ్డితో నిండిన గద్దెమీద, మనఃపూర్వకమైన భక్తిభావంతో ఆత్మార్పణ చేసుకుంటున్నట్టుగా పరుచుకుంటున్నాయని.
నా కన్నీటి బిందువులు మంచు కణాలతో కలిసిపోతూ ఉండగా, ఉషస్సులోంచి బయల్వెడలుతున్న మరో లోకపు చిత్రమైన కాంతిని, తరచు గమనిస్తూ ఉండేవాణ్ణి. భగవంతుడికోసం తీవ్రమైన ఆకాంక్ష కలిగినందువల్ల ఏర్పడిన గాఢమైన వేదన నన్ను బాధిస్తూ ఉండేది. హిమాలయాలు నన్ను బలంగా దగ్గరికి లాక్కొంటున్నట్టు అనిపించేది.
ఒకసారి, మా చుట్టం ఒకాయన పవిత్రమైన ఆ కొండ ప్రాంతాల్లో యాత్ర ముగించుకొని బెరైలీలో మమ్మల్ని చూడ్డానికి వచ్చాడు. ఉన్నత పర్వత శ్రేణుల్లో నివసించే యోగుల్ని గురించి, స్వాముల్ని గురించి ఆయన చెప్పిన కథలు ఎంతో ఆసక్తిగా విన్నాను.
“హిమాలయాలకి పారిపోదాం.” ఒక రోజున, బెరైలీలో మా ఇంటి యజమాని చిన్న కొడుకు- ద్వారకా ప్రసాద్‌తో అన్నాను నేను. కాని నా మాటలకు “అతనికి నా మీద సానుభూతి లేకపోయింది.
నాన్న గారిని చూడ్డానికి అప్పుడే అక్కడికి వచ్చిన అన్నయ్యకి నా సంగతి చెప్పేశాడు. అయితే అనంతు అన్నయ్య, ఏదో కుర్రనాగన్న వేసుకున్న అసాధ్యమైన పథకమని తేలికగా తీసుకోకుండా, నన్ను అదే పనిగా వెక్కిరించడం మొదలుపెట్టాడు.
“నీ కాషాయ వస్త్ర మేదిరా? అది లేకపోతే నువ్వు స్వామివి కాలేవు మరి! కాని ఆ మాటలతో నాకు చెప్పలేనంత ఉత్సాహం కలిగింది. ఆ మాటలే నా ఊహకొక స్పష్టమైన రూపం ఇచ్చాయి.
నే నొక యతినై భారతదేశమంతా సంచరిస్తున్నట్టు, బహుశా అవి, నా పూర్వ జన్మ స్మృతులను మేల్కొలిపి ఉండవచ్చు: ఏమైనప్పటికీ, ప్రాచీన కాలంలో ఏర్పడిన సన్యాసాశ్రమానికి చిహ్నమైన వస్త్రాన్ని ఎంత సహజ సులభంగా ధరించగలనో గ్రహించగలిగాను.
సశేషం:-
🙏🙏🙏🌼🌼🌼🌼🙏🙏🙏
No comments:
Post a Comment