*ఇత్తలిబింది*
(ఎండపల్లి భారతి)
"బుజ్జమ్మా, కుదుట్లో బింది ఏదే" నీళ్ల అరుగు కాడనింటి అరిసింది మాయమ్మ.
మా దిగవ బురుజులో మేమంతా ఒక కులపువాళ్లమే ఉంటాము. మా ఊరు మొత్తానికి ఒకరిద్దరికి మటుకే ఉండాయి ఇత్తలిబిందెలు. వాటిని చూసినప్పుడల్లా మా అమ్మకు నిదరపట్టేది లేదు. "బుజ్జీ, ఎట్లయినా ఒక ఇత్తలిబింది తేవల్ల పాపా" అనేది నాతో.
"అయితే అమ్మా, నువ్వు కూలికిపొయి తెచ్చిన దుడ్లన్నీ కూడబెట్టు. నేను గూడా ఈ పొద్దుటినింటీ చింతకాయిలూ కానక్కాయిలూ ఏరి, సెట్టి అంగట్లో అమ్మి ఆ దుడ్లు గూడా ఇస్తాను" అంటిని.
అదే సెరత్తుగా రెయ్యనకా పగలనకా ఒళ్లు యించుకుని రూపాయి రూపాయి కూడేసి, మంగళారం సంతకు పొయి ఇత్తలిబింది తీసుకుని వచ్చింది అమ్మ.
బింది మా ఇంటికి వచ్చిన పొద్దు, మా ఊర్లోవాళ్లంతా మా ఇంటికొచ్చి బిందిని చూసేసి పోయిరి. ఊరంతా మా బింది మాటలే, 'మల్లమ్మ ఇత్తలిబింది తెచ్చిందంటనే అని ఒకరు, 'అవునమ్మో, నేను ఇబ్బుడే చూసేసి వస్తి, బలే బాగుంది' అని ఇంకొకరు.
'బలే పట్టుమింద ఉండి తెచ్చేసిందమ్మా, మనవల్ల అవతాదా' అని ఒకరు. 'మా తాగుబోతు నా బట్టకు ఎంత నోరు కొట్టుకుని చెప్పినా, పైసా మిగిలిస్తే కదా. కూలిదుడ్లంతా నా సాడు తాగేదానికే సరిపోతుండాదే' మూతి తిప్పతా ఇంకొకరు. మా ఇత్తలిబిందిని చూసి, తాకి, తడిమి, ఇచ్చుకుని, మెచ్చుకుని, కుళ్లుకుని, మురిసిపొయ్యింది మావూరు అడగుంపు.
మాయమ్మ మూతి పచ్చిపసుపు పూసుకున్నెట్లు వెలిగిపోతా ఉండాది. మాకు రాజ్యాలు గెలిసినట్లుగా ఉండాది. నేను నా జతగత్తెల్ని అందర్నీ పిలిసి పిలిసీ బిందిని చూపిస్తా ఉండాను.
మాయమ్మ కొత్తబిందిని సంకన వేసుకుని నీళ్లబోరు కాడకి బయలుదేరింది. నేను నా జతగత్తెలతో కలిసి మా అమ్మ వెనకాల్నే పోతా ఉండాను.
నిన్నటివరకూ మాయమ్మ, మట్టి కడవను సంకనేసుకుని నడిసిన నడకకీ, ఈపొద్దు ఇత్తలిబిందిని నడుముకు ఆనించుకుని నడస్తుండే నడకకీ ఎంతో వారా ఉండాది.
అబ్బుటి మాయమ్మ పోరులో ఓడిపొయిన పెట్ట మాదిరిగా ఒదిగి ఒదిగి నడిసేది.
ఇబ్బుటి మాయమ్మ, రాజ్యాన్ని గెలిసిన రాణి మాదిరిగా జంబంగా పోతుండాది, రాణికి పొగిడింపులు చేసే బంటుజనం మాదిరిగా వెనకాల మా పిల్లగుంపు.
మా అమ్మ బోరుకాడకి పోయి, బోరు కుదుట్లో ఉండే నీళ్లను కాలితో పక్కకు తోసి, కుదుట్లో బింది పెట్టింది. నేను దడాబడామంటా బోరును కొడితిని, కోక కొంగును చుట్టచుట్టి తలమింద పెట్టుకుని, నిండిన బిందిని ఆ చుట్టమింద పెట్టుకుని ఇంటితట్టుకు అడుగులు వేసింది అమ్మ.
మావూరి కాపోళ్ల మడుల్లో నెమ్మరొడ్ల కోతకు పోయినప్పుడు, ఆ వరికసువు పొడువుగా ఉండాదని సందిడు ఎత్తుకోని వచ్చింది అబ్బుడొకసారి. ఆ కసువుతో చుట్టకుదుర్లు అల్లి, వాటిని అటవ పైనుండే ఒక కట్టికి తగలేసి ఉండింది. నన్ను అటవ ఎక్కించి, ఒక చుట్టకుదురును దింపించింది. కొత్త చుట్టుకుదురును నీళ్లరుగు మింద పెట్టి, దానిమింద ఇత్తలిబిందిని పెట్టింది.
మా ఇంట్లో ఉండే కుండాసట్టీ అన్ని మట్టివే, ఒకటో అరో అలవర బోకులు ఉండాయి. వాటి నడాన బంగారం మెరిసినట్లు మెరస్తా కుచ్చోనుండాది
ఇతలిబింది.
మాయమ్మ ఇంట్లో ఉన్నెబ్బుడు ఎబ్బుడూ ఆ బిందికల్లానే చూసుకుంటా ఉండేది. ఎంత బతిమాలుకున్నా ఒక్కపొద్దన్నా నీళ్లు తెస్తానంటే, ఆ బిందిని మటుకు నా చేతికి ఇచ్చేది లేదు. "నువ్వు కింద వేసేస్తావు బుజ్జమ్మా. సొట్టలు పడిపోతాది" అంటా నన్ను తాకనిచ్చేదే లేదు.
శివరేతిరి పండగబ్బుడు మావూర్లోని మొగోళ్లు చానామంది నక్కముట్టి ఆట ఆడతారు. అదొక జూదం. మా నాయినకు నక్కాముట్టి ఆటంటే బలే బెమ, పండక్కు మూడునాళ్ల ముందుగానే నక్కాముట్టి ఆటలో దుడ్లునంతా నీగేసుకున్నాడు. ఎల్లుండి పండగనంగా ఆపొద్దు రెయ్యి మా ఇంట్లో రచ్చ లేసింది.
మా నాయిన మాయమ్మను డబ్బులు అడిగినాడు. మాయమ్మ లేవని చెప్పేసింది. అంతే మాయమ్మని దబీదబీమని రెండు గుద్దేసి, బయిటికి యెలబారిపొయినాడు మా నాయిన.
"దొంగనాబట్ట. కూలిదుడ్లని దినమ్మూ ఆ సారాయంగిట్లో సల్లేసి వస్తాడు. సాలనిదానికి ఈ నక్కాముట్టి ఆటొకటి" అంటా జారిపొయిన వెంటుకల్ని ముడేసుకునింది మాయమ్మ. మా నాయిన ఆపొద్దు రెయ్యి ఇంటికే రాలేదు.
తెల్లారి లేసి మా పనులు మేము చేసుకొని, సంగటిపొద్దుకు అమ్మ కూలికి పోతే, నేను ఆవుని విప్పుకుని పోతిని, శివరేతిరి కాలం కదా, ఎండ బలస్తా ఉండాది. మోతకమాన్లు పూసి, ఎర్రమన్నులో దొల్లాడిన ఎనుములు మాదిరిగా నిలుసుకోనుండాయి. వాడుబారిన పచ్చికసువును పరపర మేస్తా ఉండాయి పసరాలు.
మావిటాళ వరకూ ఆవుని మేపుకుని, ఇంటికి తిరుక్కుంటిని, అబ్బుడే కూలిపని నింటి వస్తా దోవలో కలుసుకునింది అమ్మ.
ఇద్దరమూ ఇంటికిపోతిమి. నేను ఆవుని గాట్లో కట్టేసి, కాళ్లూ చేతులూ కడుక్కుని ఇంట్లోకి వచ్చి "అమా దప్పికయితా ఉండాది, రవన్ని నీళ్లీమా" అని అడిగితిని. ఆ మాటతో మాయమ్మ చెంబెత్తుకుని నీళ్లరుగుకాడకి పొయింది.
"బుజ్జమ్మా కుదుట్లో బింది ఏదే" నీళ్ల అరుగు కాడనింటి అరిసింది మాయమ్మ.
నేను బెప్పరపోతా అమ్మ దగ్గిరికి పోతిని, నీళ్లరుగు మింద ఇత్తలిబింది లేదు. మమ్మల్ని వెక్కిరిస్తా కుచ్చోనుండాది ఉత్త చుట్టకుదురు.
"బుజ్జీ, అడగతా ఉంటే నోరిప్పవేందే" అనింది అమ్మ.
"ఏమోమా, నేను చూడ్లేదు. పొద్దన్నే నువ్వట్ల పోతానే, నేను ఆవును పట్టుకుని పోతి" అంటిని.
"నువ్వున్నెబుడు మీ నాయినేమన్నా వచ్చినాడా" అడిగింది.
"రాలేదు మా" అంటిని,
అంతలికే బయిటినింటి మా వెనకింటామి మాయమ్మను పిలిసింది. మేమిద్దరమూ గబగబా బయిటికి వస్తిమి.
"మల్లమ్మా, మద్దేనము మేకలు నీళ్లుతాగే పొద్దులో, నీ మొగుడు ఇత్తలిబిందిని ఎత్తుకుని కదిరిగుట్ట తట్టు పోతా ఉంటే చూస్తి, 'యాడికన్నా బిందెత్తుకుని పోతా ఉండావు' అని అడగాలనుకుని, అడిగితే ఏమి దొబ్బులో లే అని గమ్మునయిపోతి" చెప్పేసి పొయిందాయమ్మ.
మాయమ్మకు గుండెలు పగిలినట్లాయె. ఇంట్లోకి పొయి, తలకాయిమింద చేతులు పెట్టుకుని, నీళ్లరుగు కాడ కుచ్చునింది. కొంచెంసేపుటికి మెల్లింగా ఏడు పెత్తుకునింది.
"నేను కన్న అగసాట్లు పడి, కడుపుకు కూడు గూడా లేక ఒడగట్టి ఒడగట్టి తెస్తినే. దానిని గూడా ఎత్తుకుని పొయ్యి వాని ముండకాడ పెట్టుకున్నే. ఎట్ల నేను కాపరం చేసేది" అని నెత్తి కొట్టుకుని ఏడస్తా ఉండాది అమ్మ.
ఆపొద్దు మా ఇంట్లో పొయ్యి రగల్లా. పొద్దన కూడు అంతుంటే నేను తింటిని, అమ్మ మెతుకు ముట్టలేదు. మా నాయిన ఆ రెయ్యిగూడా ఇంటికి రాలేదు. తెల్లారి పొద్దుపొడిసే పొద్దుకు వచ్చినాడు.
"బింది ఏమయింది బా" అని అడిగింది అమ్మ.
"నాకు తెలీదు" అన్నాడు నాయిన.
"నీకు తెలీక ఇంకెవరికి తెలస్తాది. ఏ దొంగలు వచ్చిరి మనింటికి, నక్కముట్లో పోగొట్టేసి వస్తివే. దాన్ని ఎన్ని అగసాట్లు పడి తెస్తినో నీకేమి తెలుసు. మూడునెల్లు నేనూ నాబిడ్డా కడుపు కట్టుకుని కూడేసిన దుడ్లతో తెచ్చిన బిందిని, నక్కాముట్టాట కోసరం నీ ఎదాన పెట్టుకుంటివే. నువ్వు బాగుపడతావా" అంటా అరిసింది అమ్మ.
"ఏందే నోరు సించుకుంటా ఉండావు లంజా" అంటా వచ్చి, అమ్మని కింద తోసి కాలాచేతా తన్నినాడు నాయిన, అడ్డం పొయిన నాకుగుడకా నాలుగు దెబ్బలు తగిలినాయి, ఇద్దర్నీ తన్నేసి ఆయన దోవన ఆయన పొయ్యేసినాడు.
పండగ సంబరంలో అందురూ ఒక్కపొద్దులు ఉంటే, బింది పొయిన ఏడుపులో నేనూ మాయమ్మా ఒక్కపొద్దు ఉంటిమి ఆపొద్దు.
(సమాప్తం.)
No comments:
Post a Comment