Friday, August 15, 2025

 *ఆన్లైన్ పండగ.*

శ్రావణ మాసం వచ్చేస్తోంది. అరవై ఏళ్ళ నళినికి ఎక్కడ లేని కంగారూనూ! 

 కాళ్ళూ చేతులూ సరిగ్గా వుండి ఒంట్లో బలం ఉన్నప్పుడు పండగలంటే సరదాయే కానీ కలవరం ఉండేది కాదు. నెల రోజుల ముందు నుంచే బీరువాలు, అటకలు దగ్గర్నుంచి దులిపి శుభ్రం చేసి, అన్ని సామాన్లు తీసి కడిగి శుభ్రం చేసి, బట్టలు, కర్టెన్లు, కాళ్ళకింద ఉన్న డోర్ మాట్లు, బెడ్షీట్లు ఉతికి ఆరేసి మళ్ళీ అన్నీ వాటి వాటి స్థానాల్లో పెట్టేది. పండగ వచ్చేసరికి ఇల్లంతా అద్దంలా మెరిసిపోతూ ఉండేది. ఫ్రిజ్, గూళ్ళు అన్నీ తుడిచి శుభ్రం చేసేది. 

పండగ హడావుడి ఇహ చెప్పనే అక్కర్లేదు. పండగ ముందుగానే పెద్దవాడికి ఇష్టమని  చేగోడీలు, చిన్నవాడికిష్టమని జంతికలు, లడ్డూలు చేసేది. పండగ పిండివంటలు మామూలే! పూర్ణం బూరెలు, పులిహార పాయసం తప్పని సరి. ముందు రోజే తోరాణాలు కట్టి, గడపలకు పసుపు కుంకుమలు పెట్టేది.

పండుగరోజు పొద్దున్నే పిల్లల్ని స్కూలుకు, ఇంటాయన్ని ఆఫీసుకి పంపించి తర్వాత తను మడి గట్టుకుని పూజాలంకరణ, పిండివంటలు మొదలెట్టేది. అన్నీ అయ్యి, పూజ అయ్యేసరికి మధ్యాహ్నం ఒంటిగంట. 

మళ్ళీ సాయంత్రం పిల్లలు వచ్చాక వాళ్ళకి కాస్త తినడానికి పెట్టి, ఇంక తనూ తయారయ్యేది.

 ముత్తైదువలు వచ్చేసరికి తాంబూలాలు అన్నీ సిద్ధం చేసుకుని కొత్త గాజులు వేసుకుని తల్లో పూలతో తానే ఒక మహా లక్ష్మిలా తయారై, వచ్చే వరలక్ష్ములను ఆహ్వానించేది. 

పిల్లలుపెద్దవాళ్లయ్యారు. ఉద్యోగాలు పెళ్ళిళ్ళు అయ్యాయి. పెద్దవాడు ఇంటిపట్టునే ఉన్నా రెండో వాడు బెంగళూర్ లో సెటిల్ అయ్యాడు. తనకూ రాను రానూ ఓపిక తగ్గుతోంది. కానీ అలవాటు మీద ఏదో అలాగేలాగించుకొస్తోంది బండీని. 

మళ్ళీ ఈ సారి పండగొచ్చిందంటే కలవరంపట్టుకుంది. పెద్ద కోడలు లలిత తనతో కలిసిపోయింది. ఉద్యోగం చేస్తున్నా  పండగ అంటే కాస్తో కూస్తో సాయం చేస్తుంది. 

చిన్నావిడ సౌజన్య సంగతే  ఇంకా తెలీదు. పోయిన సంవత్సరమే పెళ్లయింది. మొదటి పండుగ పుట్టింట్లో జరిగి పోయింది. శ్రావణ పట్టీ తీసుకుని వీళ్ళే వెళ్ళి, పూజ చూసి, తాంబూలం తీసుకుని వచ్చారు. మళ్ళీ పండగకి అత్తింటికి రమ్మని తను చెప్పొచ్చింది నళిని. 
పండగ వారం ఉందనగా సౌజన్య, చిన్నాడు చందూ వచ్చారు. వాళ్లకు సెలవుల్లేవుట, ఇంట్లోంచే పని చేస్తారట. బోలెడు పండగ పనులకు తోడు వీళ్ళ వర్క్ ఫ్రమ్ హోం కూడానా?  ఇంకో వారంలో పనులన్నీ ఎలా అవుతాయి? అందుకే ఈ కంగారు. 

తనకా కాళ్ళ నొప్పులు, పైకి ఎక్కి సామాన్లన్నీ తీసి శుభ్రం చేసే ఓపిక లేదు. కోడళ్ళకుకొడుకులకు చెయ్యాల్సిన పనుల లిస్ట్ ముందుగా చెప్పనే చెప్పింది. అయినా ఒక్కళ్ళూ ఉలుకూ పలుకూ లేకుండా వాళ్ళ వాళ్ళ లాప్టాప్ లు వేసుక్కూర్చున్నారు.

రాత్రి అన్నాల టైం లో  అందరికీ మళ్ళీ చెప్పింది. లలిత, "ఇంకా వారం ఉంది కదత్తయ్యా! చేద్దాంలే తొందరెందుకు?" అంది. పెద్దాడు కూడా దానికి తాళం వేశాడు. 

 "అదేవిట్రా! ఒకటా రెండా ఎన్ని పనులు! పిండివంటలు చేసుకోవాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, ముత్తైదువలను పేరంటానికి పిలవాలి. అన్నీ ఎలా అవుతాయా అని నాకు కాళ్ళూ చేతులూ ఆడట్లేదు.  మీరేమో నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారు." అంది నళిని. వాళ్ళు నవ్వి ఊరుకున్నారు.

భర్త ప్రసాద్ మాత్రం, "నీ హయాం అయిపోయింది. ఇహ ఇది పిల్లల కాలం వాళ్ళు చూసుకుంటారులే! నువ్వూరుకో!" అని మెల్లిగా మందలించాడు. దాంతో నళిని చిన్న మొహం చేసుకుని కూర్చుంది.

'హ్మ్!  'అడ్డాలనాడు పిల్లలు కానీ గడ్డాల నాడా!' అని ఇంకా వీళ్ళు నామాటేం వింటారు. ఇన్నేళ్ల నుంచి నేను చేసుకొస్తున్న తీరు వీళ్ళు మార్చబోతారు కాబోలు.' అనుకుంది నళిని.

ఆ మర్నాడు మధ్యాహ్నం పదవుతుండగా ఒకడొచ్చాడు, ఏవో కొన్ని మెషిన్లు, సరంజామా తీసుకుని  వచ్చాడు.
సౌజన్య వచ్చి వాడికి ఇల్లంతా చూపించింది. ఒక్క రెండు గంటల్లో మొత్తం ఇల్లంతా క్లీన్ చేసి ఎక్కడి సామాను అక్కడ పెట్టి చక్కావెళ్ళాడు. నళిని అలా నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయింది.  అడిగితే అదేదో ఆన్లైన్ లో క్లీనింగ్ ఆప్ ఉందిట. దాంట్లో బుక్ చేస్తే వాళ్ళు వచ్చి ఇల్లు క్లీన్ చేసి పోతారుట. అలాగే బాత్రూం క్లీనింగ్ ఇంకో రోజు చేయించింది. మూడోరోజుకల్లా ఆన్లైన్ లో పిండి వంటలు వచ్చేశాయి తినడానికి. అలాగే ముత్తైదువులను వాళ్ళ వాళ్ళ వాట్సాప్ ల్లో మేసేజ్ పెట్టి, పిలిచేసారు కోడళ్ళిద్దరూ...

ఆ మర్నాడు అదే ఆన్లైన్ లో ముత్తైదువలు కోసం ఏవో రిటర్న్ గిఫ్టులుట తెప్పించింది సౌజన్య. వాటితో పాటే గాజులు, వక్కలు తోరణాలకు మామిడాకులు కూడా తెప్పించింది.
పూజకు ముందు రోజు మాత్రం పనమ్మాయి వెళ్ళాక తోరణాలు కట్టి, గడపలకు  పసుపు కుంకుమ పెట్టారు కోడళ్ళిద్దరు.  ఆరోజే తమలపాకులు, శనగలు ఆర్డర్లో వచ్చేశాయి. పూజ రోజున ప్రసాదాలు ఏదో కేటరింగ్ వాళ్లకు ఆర్డర్ ఇచ్చానని తననేమీ చెయ్యొద్దని అత్తగారికి చెప్పింది సౌజన్య. నళిని విస్తుపోయి చూసింది. నాలుగు రోజుల నుంచి జరుగుతున్న ఆన్లైన్ హడావిడి ఆవిడ్ని ఏమీ మాట్లాడకుండా చేశాయి. పూజకు ఒక క్యాసెట్ పెట్టుకుని, ముందుగా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్న అలంకరణ సామగ్రి అంతా చేర్చి, అమ్మవారి అలంకరణ కార్యక్రమం పూర్తి చేసి, పూజకు ఉపక్రమించారు తోడికోడళ్ళు.  సరిగ్గా నైవేద్యం టైముకి వేడి వేడిగా భోజనాలు, ప్రసాదాలన్నీ డెలివరీ అయ్యాయి. అవన్నీ నైవేద్యం పెట్టి, కథ విని అక్షింతలు వేసుకున్నారు. చెయ్యి కాలు కదపకుండానే పూజ పండగ పూర్తి అయ్యింది. నళిని, 'ఏమి నీ మహత్యం తల్లీ! ఇలా కూడా పూజలు సాగిస్తున్నారు జనాలు. అంతా నీ కటాక్షం.' అని వరలక్ష్మీ దేవికో దణ్ణం పెట్టుకుని, తన వంతుగా ఒక పండు నైవేద్యం పెట్టి, "ఇన్నేళ్లకి నా ఆధ్వర్యం ముగిసి తర్వాతి తరం చేతిలో పడింది. ఇక వాళ్ళు ఎలా చేస్తే అలా చేయించుకో తల్లీ! నా వల్ల ఇంతే అయ్యింది.' అని ఊరుకుంది.

సాయంత్రానికి ఇద్దరు కోడళ్ళు బంగారు తల్లులకు మల్లె తయారయ్యారు. వచ్చిన ముత్తైదువులకు పసుపు పూసి కుంకుమ పెట్టి, తల్లోకి పూలు చేతికి గాజులు ఇచ్చి, ఒక్కో స్టీలు ప్లేటులో వాయనాలు తాంబూలాలు పెట్టి చేతికి ఇచ్చి, కాళ్ళకు దణ్ణం పెట్టి, వాళ్ళ చేత అక్షింతలు వేయించుకున్నారు.

మొత్తానికి పండగ పనులన్నీ ఆన్లైన్ లో చేసినా, పూజ భక్తితోటీ, వాయనాలిచ్చి శ్రద్ధతో కాళ్ళకు నమస్కారం పెట్టీ, వాళ్ళ ఆశీర్వచనం తీసుకుని, వాళ్ళ సంస్కారాన్ని నిలబెట్టిన కోడళ్లను చూసి తృప్తిగా మురిసిపోయింది నళిని.

సమాప్తం...
సుధా లక్ష్మి చిట్టా...

No comments:

Post a Comment