*అవతార్ మెహర్ బాబా - 50*
🪷
రచన: బి. రామకృష్ణయ్య
*నవజీవనం*
బాబా డా. నాథ్ ఇంట్లో భిక్ష పుచ్చుకునే సమయంలో ఆహారంలోని బంగాళదుంప ముక్కలు క్రిందపడ్డాయి. బాబా వంగి అవి తీసుకొని జోలెలో వేసుకున్నారు. భగవంతుడు నీ ఇంటికి భిక్షకు వస్తే అతడు క్రిందపడిన ఆహార పదార్థాలను కూడా తీసుకొని జోలెలో వేసుకుంటాడ'ని డా. నాథ్ ఎప్పుడో పురాణాల్లో చదివాడు, అంతవరకు బాబా దివ్యత్వం గురించిన అవగాహన లేకుండానే బాబాకు, ఆయన సహచరులకు బాబా విధించిన షరతుల న్నింటికి ఒప్పుకొని ఏర్పాట్లు చేశాడు. కాని ఈ సంఘటన వల్ల బాబా సాక్షాత్తు భగవంతుడని నమ్మకం కలిగింది. తన నమ్మకం బాబా ప్రేమికుడైన డా. ఖరే గారి తండ్రి ద్వారా ఆయన ఈ యుగావతారుడై న మెహెర్ బాబాయని రూఢియైనది. డా. ఖరే. నాథ్ ఇంట్లో బాబా భిక్ష తీసుకునే సమయంలో బాబా అనుమతి లేకుండా ఫోటో తీయించాడు. కాని బాబా చిత్రం ఆ ఫోటోలో పడలేదు. మరునాడు బాబా అనుమతితో తీసుకున్న ఫోటోలో బాబా చిత్రం స్పష్టంగా వచ్చింది.
కాశీ (బనారస్) నుండి బాబా తన సహచరులతో సారనాథ్ వెళ్ళి అక్కడ 12 రోజులున్నారు. సారనాథ్ బౌద్ధమతస్థులకు పవిత్ర క్షేత్రం. గౌతమ బుద్ధుడు తన శిష్యులకు మొట్టమొదట ఉపదేశం చేసిన స్థలం సారనాథ్ లోనే ఉంది. అశోకచక్రవర్తి బౌద్ధమతావలంబకుడైన తర్వాత నిర్మించిన మూడు స్థూపాలు సారనాథ్ లోనే ఉన్నవి. ఈ స్థలంలోనే బాబా కాలి నడకన కఠోరమైన నవజీవనం ప్రారంభించే ముందు తన సహచరులతో కలిసి ప్రార్థన చేశారు. సారనాథ్ లో కూడా బాబాకు, వారి సహచరులకు వసతి సౌకర్యాలు డా. నాథ్ ఏర్పాటు చేశారు. బాబాకు నివాస మేర్పరచిన బంగళాలో ఒక ముసలి తోటమాలి ఉండేవాడు. అతడు నిరంతరం రామనామాన్ని స్మరించేవాడు. ఎంతో తృప్తిగా జీవించేవాడు. బాబా సహచరులు స్త్రీ మండలిలోని డా. గోహెర్ తోటమాలిని 'నీ కేమైనా కావాలా?' అని అడిగితే నాకు ఠాకూర్ (కృష్ణుడు) అన్నీ ఇచ్చాడు, ఏమీ అవసరం లేదు అని చిరునవ్వుతో చెప్పాడు. బాబా సహచరులు మరీమరీ అడుగగా ఒక అగ్గిపెట్టె ఇవ్వమన్నాడు. బాబా సంతోషించి అతనికి ఒక శాలువా బహూకరించారు. భగవంతుడే తనకా శాలువా ఇచ్చాడని తోటమాలి చెప్పాడు.
📖
డిసెంబర్ 12వ తేదీన ఉదయం సారనాథ్ నుండి కాలినడకన బాబా తన సహచరుల తో ప్రయాణం ప్రారంభించారు. వారితో బాటు ఒంటె బండి, ఎద్దుల బండి, సవారీ బండి, రెండు ఆవులు, రెండు గాడిదలు, ఒక తెల్ల గుఱ్ఱము ఉన్నాయి. సహచరులు అందరూ తెల్ల కఫ్పీ, ఆకుపచ్చ తలపాగా, తెల్ల చెప్పుల జోళ్ళు వేసుకున్నారు. ఈ బృందాన్ని చూచి ప్రజలు యాత్రీకులుగా, ఆధ్యాత్మిక బాటసారులుగాను భావించి గౌరవించేవారు. కొందరు సర్కస్ బృందంగా భావించేవారు. కొత్త ప్రదేశానికి చేరగానే పిల్లలు, స్త్రీలు వీరి చుట్టూ చేరేవారు. స్త్రీలు మాత్రం ఎద్దుల బండిలో కూర్చునే వారు. ఉదయమే నడక ప్రారంభించి మధ్యాహ్నానికి ముందు ఊరు వస్తే అందరూ ఊరు బయట మకాము చేసి కొందరిని భిక్షకై ఊరిలోకి పంపించేవారు.
aa వచ్చిన భిక్షని బాబా కలిపి అందరికి పంచేవారు. రాత్రిళ్ళు చెట్లక్రిందనో ఆరు బయటనో విశ్రమించేవారు.
ఈ భిక్షాటనలో వింతానుభవాలు పొందారు బాబా సహచరులు. పట్టణాల్లో విద్యావంతులుగా కనిపించే పెద్ద మనుషులు వీరిని చూచి 'భిక్ష అడగటానికి సిగ్గుగా లేదా, ఏదో పని చేసుకొని జీవనో పాధి గడించుకోవచ్చు గదా' అని తిట్టి పంపేవారు. అవతారునికి ఆయన సహచరులకు భిక్ష పెట్టే భాగ్యానికి నోచుకోవాలి గదా! పల్లెటూళ్ళలో బీదవారి ఇళ్ళలో భిక్ష ప్రేమతో గౌరవ భావంతో పెట్టేవారు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఒక రోజు ఊరు సమీపించగానే బాబా స్త్రీలను 'ఆకలిగా ఉందా' అని అడిగారు. వారు 'ఔను' అనగానే బాబా ఈరుచ్ ని భిక్షకై దగ్గరిలోని ఊరికి పంపించారు. ఈరుచ్ వెళ్ళి ఒక ఇంటి ముందు ఆగి 'మాయీ! ప్రేమ్ సే భిక్షా దీజియే!' అని అడిగాడు. ఆ ఇంటిలోని స్త్రీ ఇంటిలో పిండి ఏమీలేదని చెప్పడానికి వచ్చింది. నిజంగానే ఆమె ఇంట్లో ఏమీలేదు. కాని ఈరుచ్ ని చూచిన తర్వాత ఆమె అతనిని ఊరికే పంపించడానికి మనసొప్పక పొరుగింటికి వెళ్లి గోధుమపిండి అప్పుగా తెచ్చి వేడివేడి రొట్టెలు, కూర చేసి ఈరుచ్ కి భిక్షపెట్టింది. వేరే ఇంటికి వెళ్ళ వద్దని ఆమె ఈరుచ్ ని అంతవరకు బ్రతిమిలాడి కూర్చోబెట్టింది. అవతారునికి ఆయన సహచరులకు ప్రేమతో భిక్షపెట్టిన ఆ ఇల్లాలు ఎంతటి ధన్యురాలో గదా! ఆ రొట్టెలను బాబా అందరికీ పంచారు. ఆ రోజు తిన్న ఆ రొట్టెలు, కూర రుచించినంత గా మరెన్నడూ ఎంతమంచి ఆహారమైనా రుచించలేదని సోదరి మణి చెప్పారు.
రోజు 17 నుండి 20 మైళ్ళు నడిచేవారు. నాలుగు రోజుల ప్రయాణం తర్వాత
జువాన్ పూర్ చేరుకున్నారు. అక్కడ నాలుగు రోజులున్నారు. ఊరి బయట చెట్ల క్రింద ఉన్నారు. జువాన్ పూర్ నుండి మొరాదాబాద్ కి రైలులో వెళ్ళారు. నవజీవనంలో ఉన్నందున వారు డబ్బు ముట్టుకోగూడదు. బాబా ఈరుచు ఇంకొక సహచరుడిని పంపించి ఊళ్ళో వారి మనస్సుకి మంచి దాతగా తోచిన వ్యక్తిని మొరాదాబాద్ కి టికెట్లు ఏర్పాట్లు చేయవలసిందిగా అడగమన్నారు. అలాగే వారిద్దరూ ఒక వర్తకుని దగ్గరకు వెళ్ళి తాము యాత్రీకులమని హరిద్వార్ కి వెళ్తున్నామని చెప్పి వారికి మొరాదాబాద్ వరకూ రైలు ఛార్జీలు ఏర్పాటు చేయాలని కోరారు. తమ పెద్దన్నయ్య మరియు నలుగురు స్త్రీలకు మొదటి తరగతి టికెట్లు మిగిలిన వారికి మూడవ తరగతి టికెట్లు కావాలని అడిగారు. ఆ వర్తకుడు అందుకు అంగీకరించి దానికి కావలసిన డబ్బు లెక్కించి ఇవ్వమని గుమాస్తాకు చెప్పాడు. మేమా డబ్బు ముట్టుకోకూడదు. మీరే రైలు స్టేషన్ కి వచ్చి టికెట్లు కొని ఇవ్వాలని చెప్పారు. ఆ వర్తకుడు అన్ని షరతులకు అంగీకరించి ఉదయం మూడు గంటలకే గుమాస్తాని పంపించి వారికి కావలసిన టికెట్లు కొనియిచ్చే ఏర్పాటు చేశాడు. నిరాశా నిస్పృహలతో గడిపే నవజీవనం లో కూడా సర్వజ్ఞుడైన బాబా తన నుండి నవజీవనంలో ఏ సహాయాన్ని కోరరాదని చెప్పినా వారి అవసరాలన్నీ అలా తీర్చబడుతుండేవి.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
సహచరులందరికీ ఒక గొంగళి మాత్రమే ఉంది. చలి బాగా ఉండటంతో ఆరుబైట, తోటల్లో పడుకోవలసి యున్నందున వారు చలి బాధకు గురియైనారు.
మొరాదాబాద్ నుండి బయలుదేరే ముందు ఢిల్లీ నుండి ఒక వర్తకుడు అతని కొడుకు టాంగాలో పెద్దపెద్ద సరుకుల మూటలు తెచ్చి బాబా వాటిని భిక్షగా స్వీకరించాలని కోరాడు. బాబా అనుమతి తో మూటలు విప్పి వారు తెచ్చిన దుప్పట్లు రగ్గులు, ఉన్ని బట్టలు ఆ సహచరులందరి కీ పంచారు. అందరికీ సరిపోయాయి. అవసరానికి ఆ వస్తువులను కానుకగా తీసుకొని వచ్చిన వారి ప్రేమకు బాబా సంతోషించారు.
మొరాదాబాద్ నుండి నజీబాబాద్ మీదుగా డెహ్రాడూన్ కి వెళ్ళారు. డెహ్రాడూన్ లో కాలినడకన చేసిన ప్రయాణం అంతమైంది. కాని బాబా విధించిన నవ జీవనం అలాగే సాగింది.
నవజీవనంలో బాబా సహచరులకు ఆహారం మీద ఉండే ఇష్టాయిష్టాలను లేకుండా చేసిన సంఘటనలెన్నో ఉన్నాయి. భిక్ష ద్వారా వచ్చిన ఆహారాన్ని అందరికి సమానంగా పంచేవారు. అది కొంతమందికి రుచించేది కాదు. ముఖ్యంగా డా. ఘనీకి.
ఒకసారి డా. ఘనీని హోటల్ కి వెళ్ళి అతని కిష్టమైన ఆహారాన్ని భుజించడానికి బాబా అనుమతించారు. అతనితోపాటు డా. నీలుని కూడా పంపి డా. ఘనీ ఏమి తింటే అదే ఆహారం నీలుని కూడా తినమన్నారు. డా. నీలు బ్రాహ్మణుడు. ఎప్పుడూ మాంసాహారం తినలేదు. ఆ రోజు ఘనీ మాంసాహారం తిన్నందున బాబా అజ్ఞ ప్రకారం అతడు కూడా డా. ఘనీతో పాటు మాంసాహారం తిని బాబా ఆజ్ఞను శిరసావహించి బాబా మెప్పు పొందాడు. మనం నోటి ద్వారా లోనికి తీసుకునే ఆహారం కంటే నోటి ద్వారా బయటకు వచ్చే (మాట్లాడే) మాటకు చాలా ప్రాధాన్యం ఉందన్నారు బాబా.
మరొకసారి డా. ఘనీ కోరిక మన్నించి బాబా అతనికి ఇష్టమైన ఆహారం తినడానికి అనుమతి నివ్వడమే కాకుండా తగినంత డబ్బు కూడా ఇప్పించారు. డా. ఘనీ మంచి హోటల్ కి వెళ్ళి సుష్టుగా భోజనం చేసి సర్వర్ కి బహుమానం (టిప్) కూడా ఇచ్చి దర్జాగా వచ్చాడు. మరునాడు బాబా అతనిని పిలిచి క్రితం రోజు తిన్న హోటల్ కి వెళ్ళి భిక్ష అడిగి తీసుకొని రమ్మన్నారు. అలాగే వెళ్ళి భిక్ష అడిగాడు. హోటల్లోని సర్వర్ అతనిని గుర్తించి నిన్న టిప్ ఇచ్చినతడు ఈ రోజు భిక్ష అడుగుతు న్నాడేమిటా అని ఆశ్చర్యంగా ఆయనకేసి చూస్తున్నా లెక్కచేయకుండా భిక్షమడిగి బాబా ఆజ్ఞను పాటించాడు డా. ఘనీ. మానావమానాలను సమంగా భావించి అహాన్ని పోగొట్టుకొనే శిక్షణను మండలి వారందరూ బాబా పర్యవేక్షణలో బాగా పొందారు.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment