*అవతార్ మెహర్ బాబా - 48*
🪷
రచన: బి. రామకృష్ణయ్య
*మస్తు కార్యక్రమం*
1937వ సం.లో బాబా పాశ్చాత్యుల కొరకు నాసిక్ లో ఆశ్రమము స్థాపించారు. బాబాతో ఉండడానికి వచ్చిన పాశ్చాత్య ప్రేమికులను ఆశ్రమంలో ఉంచారు.
1940 దశకంలో బాబా మస్తు సాంగత్యం చేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. 1949వ సంవత్సరం వరకు అవిరామంగా భారతదేశంలోని పలు పట్టణాలకు వెళ్ళి అనేక వేల మైళ్ళ దూరం బస్సుల్లో, రైళ్ళల్లో, టాంగాలలో, కాలినడకన ప్రయాణించి మస్తుల సాంగత్యం చేశారు. ఈ సమయాల్లో బాబా దీర్ఘకాలిక ఉపవాసాలు చేసేవారు. ఈ ప్రయాణాలకు ప్రత్యేకంగా తయారు చేయించిన బస్సును ఎలిజబెత్ పాటర్సన్ నడిపింది. ఈ మస్తుల సాంగత్యం గురించి బాటసారులు (ది వే ఫేరర్స్) అనే గ్రంధంలో డా. విలియం డాంకిన్స్ వివరంగా తేదీలతో పాటు ప్రచురించారు. అహమ్మద్ నగర్ లోని అలీషా, నాగపట్నంకి చెందిన చట్టిబాబా రత్నగిరి నుండి తెచ్చిన మహమ్మద్ మస్తు బాబాకు ప్రీతిపాత్రులలో ముఖ్యులు. ఇప్పటికీ బాబా అభీష్టం మేరకు మహమ్మద్ మస్తును మెహెరాబాద్ లోనే ఉంచారు. మస్తులు ఉన్నతాత్మలు, ఆధ్యాత్మిక పథంలో పురోగతి సాధించిన వారు. వారి సాంగత్యం చేసినప్పుడు బాబాను చూడగానే వారు బాబా దివ్యత్వాన్ని గుర్తించడం సహజం. పంచ సద్గురువుల తర్వాత బాబా దివ్యత్వాన్ని ప్రకటించే పాత్ర దానికి అర్హత గలవారు మస్తులే. వారు బాబా గురించి అన్న మాటలలో బాబాయొక్క దివ్యత్వం వ్యక్తమవుతుంది. ఈక్రింది సంఘటనలు దానికి నిదర్శనాలు:
1. 1946వ సంవత్సరములో అక్టోబర్ 14వ తేదీన బాబా (మధురాలో) ఆజీమ్ ఖాన్ అనే మస్తును కలుసుకొన్నారు. అతడు ఉన్నత దశలో ఉన్న ఒక మస్తు. బాబాను చూసి 'నీవు అల్లావు ఈ సృష్టి నీవల్లనే వచ్చింది - వేయి సంవత్సరాల కొకసారి నీచే సృజించబడిన ఈ జగన్నాటకాన్ని చూడటానికి వస్తుంటావు' అని చెప్పాడు.
2. అదే రోజు బాబా బ్రహ్మానందజీ అనే మస్తును కలిసారు. ఇతను ఐదవ భూమికలో నున్న ఉన్నతాత్మ. ఇతను బాబా పాదాలను తాకి 'కృష్ణ పరమాత్మని నావద్దకు గొని తెచ్చిన ప్రేమ ప్రభావము ఎంతటి ఆశ్చర్యకరమైనది? పూర్ణ పురుషుడు ఇచ్చట ప్రత్యక్షమైనాడు' అని చెప్పి తన తలదిండు క్రింద ఉన్న 'పర్ఫెక్ట్ మాస్టర్' అనే పుస్తకాన్ని తీసి తెరచి దానిలోని బాబా చిత్రపటాన్ని ఒకదాన్ని చూపించాడు.
3. 1942వ సం.లో బాబా మురాదాబాద్లోని మౌలానా షంషాద్దీన్ ఉలేమీ అనే ఆరవ భూమికలోని మస్తును రాత్రి సమయంలో కలుసుకొన్నారు. అతను నిద్రనుండి లేచి ఆ చీకటిలో బాబాను చూచి 'నిశా సమయం లోని చీకటిలో భగవంతుని ప్రకాశాన్ని చూస్తున్నాను' అన్నాడు.
మస్తులకు అంతరంగికంగా బాబా దివ్యత్వం అనుభవైక వేద్యమే. వారిలో కొందరు బాబా వద్దకు రావడానికి అంగీకరించేవారు కాదు. మార్చి 1941 లో
క్వెట్టాలోని నాదిర్ అలీ షా అనే మస్తును ఇలా బాబా వద్దకు రమ్మని పిలువగా ఆయన అన్నారు. 'నా నావ ఆ అనంత సముద్రంలో మునిగి లీనమైపోతుంది. బాబా యొక్క స్పర్శతో ఆయన తన శరీరాన్ని వదిలి అనంతానందంతో ఏకమై పోతాన'ని చెప్పారు.
కొంతమంది మస్తులు బాబాను చూడగానే ఆనందాతిశయంతో తన్మయత్వంతో నృత్యం చేసేవారు. 1939వ సంవత్సరం లో బాబా స్త్రీ మండలి వారితో మధురా లోని బృందావనంలో గల ఆలయం వద్దకు వెళ్ళారు. అక్కడ నున్న ఒక మస్తు, తన చేతిలోని పిల్లన గ్రోవిని మ్రోగిస్తూ, నృత్యం చేస్తూ 'రండి, చూడండి. కృష్ణుడు తన గోపికలతో వచ్చాడు' అని గట్టిగా అరుస్తూ చెప్పాడు. అతడు తన నిజమైన ప్రేమికుడు అని బాబా చెప్పాడు. అదే సంవత్సరంలో బాబా ఒక రోజు అజ్మీర్ వీధుల్లో మస్తుల సాంగత్యం కోసం తిరుగుతున్నాడు. 'ఓహోహో! సాక్షాత్తు శంకరుడే వచ్చాడు రండి - అందరూ రండి - వచ్చి దర్శనం చేసుకోండి' అని అరిచాడు ఆ మస్తు.
బాబా ఈ అవతారంలో చేసిన మస్తు కార్యక్రమం అనిర్వచనీయమైనది. ఆధ్యాత్మికంగా ఉన్నత దశలో నున్న మస్తుల జీవితాలు, ప్రపంచంలో జరిగే సంఘటనలతోను, సమకాలీన మానవుల స్థితి గతులతోను సంబంధం కలిగి ఉంటాయి.
📖
*విశ్వ ఆధ్యాత్మిక కేంద్రం*
మస్తుల కార్యక్రమంలో భాగంగా బాబా హైదరాబాదు, బెంగుళూరు నగరాలను దర్శించారు. బెంగుళూరులో మస్తుల ఆశ్రమం కూడా నిర్వహించారు. ఆ సమయంలో బాబా ఒక విశ్వ ఆధ్యాత్మిక కేంద్రాన్ని నెలకొల్పాలనే అభిలాషను వెలి బుచ్చారు. దాని కోసం హైదరాబాదు నగర శివారు ప్రాంతంలో కూడా ఒక స్థలాన్ని బాబా చూశారు. ఆ స్థలం రెండు తటాకాల మధ్యలో అడవిలో కనుగొన్నారు. జీసస్ క్రీస్తు శిష్య పరంపరలో ఒకడు జీసస్ యొక్క చొక్కాను భద్రపరుచుకొని ఆ స్థలం లో ఉండేవాడట. అతని గురువుగారు మరణించే ముందు ఆ చొక్కాను అతనికి ఇచ్చి ఎట్టి పరిస్థితులలోను ఆ స్థలాన్ని వదిలిపోవద్దని, ఒక వేళ వదిలిపోయే పరిస్థితి ఏర్పడితే జీసస్ ధరించిన ఆ చొక్కాను ఆ స్థలంలో పాతిపెట్టి వెళ్ళిపో వలసిందిగా ఆదేశించారు. ఆ శిష్యుడు అక్కడ నివసించే సమయంలో ఆ అడవి ప్రాంతానికి ఆధిపత్యం వహించే నవాబు సైనికులని పంపించి అక్కడి నుండి అతన్ని వెళ్ళిపోవలసిందిగా ఆజ్ఞాపించాడు. కాని అతడు నిరాకరించాడు. నవాబు పంపిన సైనికులందరూ అతని ముందుకువెళ్ళగానే వినమ్రులై అతనికి నమస్కరించి వెను దిరిగి వచ్చేవారు. అది విని నవాబు స్వయంగా వెళ్ళి అతని దివ్యత్వానికి వశుడై ఆయన ఇష్టానుసారం అక్కడే ఎంత కాలమైనా ఉండవచ్చునని కోరుకున్నాడట.
కాని పరిస్థితుల ప్రభావం వలన అతడు ఆ స్థలం విడిచిపోతూ తన వద్దనున్న ఆ జీసస్ చొక్కాను అక్కడే భూ స్థాపితం చేసి వెళ్ళిపోయాడు. బాబా ఆ స్థలంపై మక్కువ చూపడానికి అదే కారణం కావచ్చునని ఎలిజబెత్ పాటర్సన్ ఆ స్థలం చూసి వచ్చిన తర్వాత అభిప్రాయపడ్డారు.
కాని బాబా విశ్వ ఆధ్యాత్మిక కేంద్రానికి బెంగుళూరు సమీపంలో మైసూరు రోడ్డులో గల విడది నుండి 7 కి.మీ. దూరంలో గల బైరామంగళ వద్ద స్థలాన్ని నిర్ణయించారు. ఆనాడు మైసూరు రాజ్యానికి దివానుగా ఉన్న మీర్జా ఇస్మాయిల్ బాబా తలపెట్టిన విశ్వ ఆధ్యాత్మిక కేంద్రం కొరకు బైర మంగళ వద్ద 430 ఎకరాల స్థలాన్ని మంజూరు చేశారు. ఆ కేంద్రానికి బాబా 1939వ సంవత్సరం డిసెంబర్ 17వ తేదీన తన స్వహస్తాలతో శంఖుస్థాపన చేశారు. వృత్తా కారంలో ఐదుగురు సద్గురువులకు, జోరాష్టర్ తో మొదలుకొని బాబా వరకు 7 అవతారాలకి మొత్తం కలిపి 12 ఆలయాల కి 12 గదుల నిర్మాణం ప్రారంభించారు. దీనిలో 9 గదులు మాత్రం పూర్తి చేయబడినవి.
అవి రెండవ ప్రపంచ యుద్ధం జరిగే రోజులు. మొదటి ప్రపంచ యుద్ధాన్ని షిరిడీ సాయిబాబా పర్యవేక్షించి నడిపించారు. రెండవ ప్రపంచ యుద్ధాన్ని మెహెర్ బాబా నడిపించారు. ఆ కార్యక్రమంలో భాగంగానే బాబా బైరా మంగళలో చేపట్టిన విశ్వ ఆధ్యాత్మిక కేంద్ర నిర్మాణ కార్యక్రమం ఆంతరంగికంగా బాబా చేసే కార్యక్రమం మన అవగాహనకి అతీతమైనది.
అంతరంగిక కార్యక్రమానికి చేపట్టే కార్యక్రమాలు జరుపబడేవి. ఆంతరంగి కంగా ఆయన ఆశించిన పని నెరవేరగానే బాహ్య కార్యక్రమాలు ఆపివేయబడేవి. ఇది కేవలం బాహ్య కార్యక్రమాన్ని మాత్రమే చూడగలిగే అనుచరులకి వింతగా తోచేది.
రెండవ ప్రపంచ యుద్ధం జరిగే రోజులలోనే బాబా మెహెరాబాద్ లో మతి స్థిమితం లేని పిచ్చివారికొక ఆశ్రమం ఏర్పాటు చేశారు. మస్తుల ఆశ్రమంలాగే పిచ్చివారికి మానసిక రోగాలతో బాధపడే వారికోసం కూడా బాబా ఆశ్రమాలు నెలకొల్పారు. మానసిక రుగ్మతలతో బాధపడే వారిని కలిపి ఉంచి నిగ్రహించడం చాలా కష్టమైన పని. బాబా తన దివ్య ప్రేమతో పిచ్చివారిని సైతం ఆశ్రమంలో కలిపి ఉంచడమే గాక వారితో 'రాజా గోపీచంద్' అనే నాటకాన్ని వేయించారు. ఆ పిచ్చివారికి ప్లీడర్ శిక్షణ నిచ్చారు. ఆ నాటకాన్ని చూడటానికి బాబా ప్రేమికులను పిలిపించారు. ఎంత శిక్షణ ఇచ్చినా పిచ్చివారు స్టేజీ పైన ఏమి చేస్తారో అనే అనుమానం ఉండేది. కాని బాబా సమక్షంలో ఆయన దివ్యప్రేమ ప్రభావంతో వారు నాటకాన్ని విజయ వంతంగా ప్రదర్శించారు. ఈ ప్రక్రియను కూడా పరోక్షంగా బాబా రెండవ ప్రపంచ యుద్ధ పరిణామాలను నిగ్రహించడానికి ఉపయోగించారు.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment