Friday, August 15, 2025

 *స్నేహం కోసం.....* 

*లీలలు, మాయలు చూపడమే కాదు... నిస్వార్థమైన స్నేహాన్ని ప్రదర్శించడంలోనూ శ్రీకృష్ణుడు ఆరాధనీయుడు. శ్రీకృష్ణుడు-కుచేలుడు మైత్రి ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. యుగాలు దాటినా వారి స్నేహం గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. సుదాముడు, కృష్ణుడు ఇద్దరూ బాల్యస్నేహితులు. కలిసి చదువుకున్నారు. కాలగతిలో కృష్ణుడు ద్వారకాధీశుడు అయ్యాడు. సుదాముడు గంపెడు సంసారం మోయలేని ఓ పేదవాడిగా మిగిలిపోయాడు. జీవితం ఎంత భారంగా గడుస్తున్నా... తన స్నేహితుడిని సాయం కోరలేదు సుదాముడు. చివరికి భార్య మాట కాదనలేక ద్వారకకు వెళ్లాడు కుచేలుడు.*

*స్నేహితుడి రాకను చూసి కృష్ణుడు ఎంతగానో ఆనందించాడు. ఆప్యాయంగా పలకరించాడు. కుశల ప్రశ్నలు అడిగాడు. తన సతులతో కలిసి స్నేహితుడికి సత్కారం చేశాడు. పసందైన విందు ఇచ్చాడు. కృష్ణుడికి ఇష్టం అని చిన్ని మూటలో అటుకులు తెస్తాడు సుదాముడు. కానీ, మహారాజుకు* *అటుకులు ఇవ్వడం ఎందుకని ఊరుకుంటాడు. భవనంలో సుదాముడు విశ్రమిస్తున్న సమయంలో... కృష్ణుడు ఆ అటుకుల మూట చూస్తాడు. మిత్రుడు తన కోసం ప్రేమగా తెచ్చిన అటుకులను ఎంతో ఇష్టంగా ఆరగిస్తాడు. పరంధాముడు రెండు పిడికిళ్ల అటుకులు తినే సరికి... సుదాముడి పాపకర్మ తీరిపోతుంది. అతడి దారిద్య్రం తొలగిపోతుంది. సుదాముడి ఇంట సిరి సంపదలు తాండవిస్తాయి.*

*స్నేహితుడి కోసం తన సర్వస్వాన్నీ త్యాగం చేయాలనుకుంటాడు కృష్ణుడు. మూడోసారి తినడానికి పిడికిలిలో అటుకులు తీసుకుంటాడు. ఇది గమనించిన రుక్మిణి... కృష్ణుణ్ణి వారిస్తుంది. మిత్రుడి కష్టాలు తీరాయని విశ్వసించిన కృష్ణ పరమాత్మ మూడో పిడికిలి అటుకులు తినకుండానే వదిలేస్తాడు. తన స్నేహితుడి పాపకర్మ భస్మం చేసి... నిక్కమైన స్నేహానికి నిలువుటద్దంలా నిలిచాడు ఆయన. మిత్రుడు నోరు తెరిచి అడగకపోయినా అతడి అవసరాన్ని గుర్తించాడు. అతడి దారిద్ర్యాన్ని పరిహరించాడు. ఈ దృష్టాంతం ద్వారా స్నేహితులు ఎలా ఉండాలో చాటాడు.*

*┈┉┅━❀꧁కృష్ణ కృష్ణ꧂❀━┅┉┈*
         *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🕉️🙏🕉️ 🙏🕉️🙏 🕉️🙏🕉️

No comments:

Post a Comment