*సన్మార్గ మార్గదర్శి.....*
*శ్రావణ కృష్ణ పక్ష అష్టమి "కృష్ణాష్టమి" పర్వదినం. కృష్ణుని జన్మదినోత్సవ సందర్భ పర్వ మగుటచే దీనిని "జన్మాష్టమి" అని, కృష్ణుడు బాల్యంలో గోకులమున పెరిగినందున "గోకులాష్టమి" అని, "కృష్ణ జయంతి", "శ్రీజయంతి" అని ఈ పర్వదినానికి పేర్లున్నాయి. ఈనాడు జరిపే పూజా పునస్కారాలను కృష్ణాష్టమీ వ్రతం, కృష్ణ జయంతీ వ్రతం, కృష్ణ జన్మాష్టమీ వ్రతమని పిలుస్తారు. శ్రీకృష్ణ భగవానుడు ద్వాపర కలియుగ సంధికాలంలో శుక్ల సంవత్సరంలో శ్రావణమాసంలో బహుళ పక్షంలో రోహిణీ నక్షత్రంతో కూడిన అష్టమినాడు రెండు యామముల రాత్రి సమయాన కంసుని కారాగారంలో దేవకికి 8వ గర్భంగా మేనమామ గండాన జన్మించాడు.*
*కృష్ణాష్టమి ఒక గొప్ప వ్రత దినంగా పరిగణించ బడుతుంది. ఉపవాస పూజా జాగరణల ముఖ్య దినాలలో ఒకటి. బాలింతరాళ్ళకు తినిపించే కాయం నైవేద్యం పెట్టడం అనగానే తల్లులకు ప్రియమై, మాతృ హృదయాలలో మమతను* *పొంపొందించే పండగగా, కృష్ణుని బాల్య చేష్టలను జ్ఞప్తికి తెస్తుంది. పాపపుణ్యాల వాసనే లేని బ్రహ్మ స్వరూపపు బాలలలో ద్యోతకమయ్యే దివ్యత్వాన్ని తేట పరిచే పర్వం కృష్ణాష్టమి. ఈనాడు బాలకృష్ణుడు పూజలందుకుంటాడు. యోగీశ్వరుడు, రాజకీయ దురంధరుడు, పరమాత్ముడు, గీతా ప్రవక్తయైన కృష్ణుడు నిర్యాణం చెందిన దినమే కలియుగ ప్రారంభదినంగా పేర్కొంటున్నందున కలియుగం ప్రారంభమై "ఐదువేల ఒక వంద పదిహేడు ఏళ్ళు" దాటింది.*
*అప్పటినుండి కృష్ణుని జన్మదినోత్సవం ప్రతి ఇంట జరుపబడుతున్నది. కృష్ణ చరిత్రకు 8వ సంఖ్యకు సన్నిహిత సంబంధముంది. ఆయన పుట్టింది 8వ తిథి. దశావతారాలలో 8వ అవతారం. ఆయన వసుదేవుని 8వ సంతానం. ఆయనకు 8మంది పట్టపురాణులు. 8చే గుణింపబడే 16వేల గోపికల మనోహరుడాయన. కృష్ణాష్టమి భక్తులకు ఉపవాస దినం. బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ, పళ్ళు స్వామికి నివేదించి, ఉయ్యాల కట్టి అందులో కృష్ణమూర్తిని పరుండ బెట్టి ఊపుతూ వైవిధ్య భరిత పాటలు, కీర్తనలు పాడుతారు. శ్రీకృష్ణ జయంతి వ్రతాచరాణ ద్వారా గోదానం చేసిన, కురుక్షేత్రంలో సువర్ణ దానం చేసిన ఫలాలు దక్కగలవని, పుణ్యప్రదమని బ్రహ్మాండ పురాణం వివరిస్తున్నది.*
*మహా భారత యుద్ధాన్ని ముందుండి నడిపిన మార్గదర్శి, దుష్ట శిక్షణ... శిష్ట రక్షణ అన్న గీతోపదేశంతో మానవాళికి దిశా నిర్దేశం చేసింది కృష్ణ భగవానుడే. శ్రీమద్మహాభాగవతం జీవిత విలువలను బోధిస్తూ, ఇప్పటికీ మార్గదర్శనం చేయడం ద్వారా శ్రీకృష్ణ మహోన్నత వ్యక్తిత్వానికి దర్పణం పడుతుంది. ద్వాపర యుగంలో ఉద్భవించిన కృష్ణ పరమాత్మ నేటికీ ఆదర్శంగా నిలుస్తుండడం, ఇష్టదైవంగా కొలువు తీరడం విశేషం. గుజరాత్లో జగదాష్టమిగా పిలుస్తారు. రాజస్తాన్లో మట్టి విగ్రహాలను చేసి, పూజిస్తారు. 11వ శతాబ్దికి పూర్వం నుండే తిరుమల ఆలయంలో శ్రీనివాసుని పక్కన శ్రీకృష్ణ రజతమూర్తి పూజలందుకుంటున్నది.*
*క్రీ.శ.1545లో తాళ్ళపాక అన్నమయ్య ఉట్టి ఉత్సవాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు వాడుకలో ఉంది. ఆదిలాబాద్ తదితర పట్టణాలలో యాదవులు అధికంగా గల ప్రాంతాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించే సాంప్రదాయాచరణ కొనసాగుతున్నది. కృష్ణుడిని యాదవులు కులదైవంగా భావిస్తారు. కృష్ణ జన్మ సంబంధ పర్వమైనందున బాల్యక్రీడలైన ఉట్ల మీది వెన్న, పెరుగు, పాలు దొంగిలించడం అనుకరించే, జ్ఞప్తికి తెచ్చే ఉత్సవాలు చేయడం సాంప్రదాయం. అందుకే వీధులలో ఉట్లు పెట్టి, ప్రజలచే కొట్టించే వేడుకలు నేటికీ కొనసాగుతున్నాయి.*
*┈┉┅━❀꧁హరే కృష్ణ꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🦚🚩🦚 🙏🕉️🙏 🦚🚩🦚
No comments:
Post a Comment