*విశ్వమంతయూ నీవే, అచ్యుతా!*
*విశ్వాత్ముడు, విశ్వేశుడు విశ్వమయుండఖిల నేత విష్ణుదజుండీ*
*విశ్వములో తానుండును విశ్వము తనలోన చాల వెలుగుచునుండున్ ॥*
*విశ్వమునకు ఆత్మ అయినవాడు, ప్రభువు, విశ్వమయుడు, సమస్తానికి నాయకుడు, పుట్టుక లేనివాడు అయిన విష్ణువు ఈ విశ్వములో ఉంటాడు. ఈ విశ్వము అతనియందు ఎక్కువగా ప్రకాశిస్తుంది. ఈ సమస్త విశ్వానికి ఆధారమైన ఆ పరబ్రహ్మకు సమస్కరిస్తున్నాను.*
*శ్రీకృష్ణావతార లక్ష్యం సర్వకల్మష హరణం.*
*స్వాయంభువు మన్వంతరములో స్తుతప్పుడు అనే ప్రజాపతి, అతని భార్య వృత్ని 12 వేల సంవత్సరాలు విష్ణుమూర్తి కోసం తపమాచరించారు. స్వామి ప్రత్యక్షమై వరం కోరుకోమనగా స్వామియే తనుకు బిడ్డగా జన్మించమని కోరిన ఫలితంగా అచ్యుతుడుగా అవతరించాడు. కాలక్రమేణ వారే తిరిగి కశ్యప - అదితులుగా జన్మించగా వారికి స్వామి వామనుడుగా జన్మించారు. మూడవసాని వారే దేవకీ వసుదేవులుగా జన్మించగా* *వారికి*
*సింహమాసేஉ సితేపక్షే రోహిణ్యా యష్టమీ తిథౌ*
*చరమార్థ ప్రదాతారం కృష్ణం వందే జగద్గురుం*
*తత్రోஉఖిల జగత్పద్మ బోధయాచ్యుతభానునా*
*దేవకీ పూర్వ సంధ్యయావిర్భూతం మహాత్మనా ॥*
*శ్రావణ శుద్ధ అష్టమి తిథి రోహిణీ నక్షత్ర అమృత ఘడియలలో శ్రీకృష్ణపరమాత్మ జన్మించాడని వ్యాసభారత కథనం.*
*పురాణములలో స్వామి*
*హిందువుల పురాణ కథలకు, (భారతీయ సనాతన (సాహిత్యానికి వెన్నెముక శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణ కథలు బ్రహ్మాండ, పద్మ, మార్కండేయ పురాణములలో, శ్రీదేవీభాగవతంలో, భారత, హరివంశాలలో కనబడుతున్నాయి, పద్మపురాణంలో విశేషంగా కృష్ణ (కథాప్రసక్తి ఉంది.*
*అష్టమి ప్రత్యేకత*
*జగద్గురువు శ్రీకృష్ణుడు జన్మించిన తిథులలో అష్టమి ఎనిమిదవది కాగా, శ్రీకృష్ణావతారం కూడా దశావతారాలలో ఎనిమిదవది. వసుదేవుని సంతానములో శ్రీకృష్ణుడు ఎనిమిదవవాడు. శ్రీకృష్ణునకు అష్టభార్యలు ఉన్నారు. నాలుగవ నక్షత్రం రోహిణి(ఎనిమిదిలో సగభాగం)కి ప్రీతిపాత్రుడు. షోడశకళాపూర్ణుడై సమస్త హృదయాలను ఆకర్షించినవాడు కృష్ణుడు.*
*వేదములలో పరమాత్మ*
*ఋగ్వేదములో అయిదు చోట్ల కృష్ణ శబ్దం వినిపిస్తుంది. అందులో ఒక కృష్ణుడు విశ్వకాయుని తండ్రిగా, మరొకరు ఇంద్రునకు ప్రత్యర్థి అయిన రాక్షసునిగా కనిపిస్తారు. వేదమంత్రద్రష్ట అయినా కృష్ణనామధారిగా, అంశుమతీ తీరం కృష్ణుడు అనే చక్రవర్తిగా, తపోవ్రతనిష్టుడైన కృష్ణుడు అనే నామధేయంగల ఋషిగా కనిపిస్తాడు.*
*ఉపనిషత్తులలో కృష్ణస్వామి*
*సూర్యపురోహితుడు, అంగీరస గోత్రీకుడు ఘోరస శ్రీకృష్ణునికి బ్రహ్మవిద్యను బోధించాడు. కృష్ణోపనిషత్తు కృష్ణ శబ్దానికి గల పరమార్థాన్ని ఇతిహాసంగా గోదాదేవి 'తిరుప్పావై' గ్రంథంలో గోకుల వనమే వైకుంఠవనముగా, అందులోని తాపసులే వృక్షములుగా, లోభ క్రోదాధులు చైత్యులుగా, శ్రీహరియే గోపరూపుడుగా అభివర్ణించింది.*
*లీలాశుకుడు, నారాయణతీర్థులు, అన్నమయ్య, క్షేత్రయ్య, పురంధరులు, తరిగొండ వెంగమాంబ... ఇలా ఎందరో శ్రీకృష్ణుని లీలలను వారి రచనలలో మనకు అందించారు.*
*అదృష్ట దంపతులు యశోదానందులు*
*జగత్కల్యాణానికి విష్ణుమూర్తి ధరించిన దశావతారములలో మధుర మోహన రూపం శ్రీకృష్ణావతారం. మాధవుడు మానవునిగా భారతపుడమిపై నడయాడిన వైనము, దేవకి వసుదేవులచే అంజలులు స్వీకరించిన అదృష్ట సంఘటన, తన లీలలతో బాల్యక్రీడలతో అటు పెంచిన యశోదమ్మ కడువున ప్రేమామృతంతో, గోపబాలురకు అందించిన స్నేహహస్తాలతో, గోపికలందరికీ శృంగార రసంతో ధన్యతను అందించిన మహత్తర సన్నివేశాలు జగదానందకారకము, చిన్నతనంలోనే పూతనను, ధేనుకాసురుని సంహరించి గోకులమంతా ఆశ్చర్యపడేలా చేశాడు. కాళీయమర్ధన గావించి కాళింది నదికి పవిత్రతను చేకూర్చాడు. కుబ్జ శరీరాన్ని తాకి ఆమె అంగవైకల్యం పోగొట్టి గంధర్వకన్యగా కనిపింపచేయడం ఆశ్చర్యకరమైన విచిత్రములే. దేవకీవసుదేవుల భావము భగవదవతారమే తమ పుత్రుడని, నందయశోదల భావము తమనే గాక గోకులమునంతటిని ఆనందపరచేవాడు తమ పుత్రుడని, గోకుల బాలురు తమ మిత్రుడని, గోవులు తమ ప్రభువని భావించారు గనుకనే శ్రీకృష్ణుడు పుండరీకాక్షుడయ్యాడు*
*పుణ్డరీకం హృత్కమలం అక్షోతి వ్యాప్నోతీతి*
*ఆ పుండరీకునిపై శ్రద్ధాభక్తులు గల హృదయ కమలములు గలవారియందు వ్యాపించి ఉండేవాడు అయ్యాడు. ఈ పుండరీకాక్షుడే గోవిందుడు.*
*పురాణాలు స్వామిని లీలామానుష విగ్రహునిగా పేర్కొన్నాయి. స్వామి ప్రదర్శించిన లీలలన్నీ పరమాత్ముని మహిమలకు ప్రతీకలే. స్వామికి ఎన్నో నామములున్నా కృష్ణనామం ఎంతో మహిమగల నామం. కోటి జన్మ పాపం కృషిరిత్యుచ్యతే ఋతైః తన్నాశనకరో దేవ కృష్ణ ఇత్యభిధీయతే కోటి జన్మలు ఎడతెరిపి లేకుండా చేసిన పాపానికి కృషి అని పేరు. ఆ పాపాన్ని నాశనం చేసే భగవంతుడు శ్రీకృష్ణుడు.*
*జగద్గురువు*
*శ్రీకృష్ణుడు యుక్తవయస్సు వచ్చినప్పటికీ తన బాల్య స్నేహితుడైన కుచేలుని సాదరముగా ఆహ్వానించి స్వయముగా పూజించడం మనం నేర్చుకోదగిన సంస్కారమే. శ్రీకృష్ణుడు పాండవ రాయబారిగా తన రాజనీతిజ్ఞత పరిణతి చాటుకున్నాడు. మహాభారత యుద్ధం తానొక్కడే నిర్వహించి యుద్ధరంగంలో అర్జునునకు భగవద్గీత ద్వారా కర్తవ్యాన్ని బోధించి జగద్గురువుగా నేటికీ పూజలందుకుంటున్నాడు. భీష్మపితామహునికి స్వయంగా సుదర్శన చక్రము చేబూని దివ్య దర్శనం కల్పించాడు. రాజనీతి, సేవాధర్మం, స్నేహధర్మం..... ఇలా శ్రీకృష్ణుని దివ్య ప్రబోధాలు ఎన్నెన్నో ఉన్నవి కనుకనే శ్రీకృష్ణజన్మాష్టమి పర్వపూజను జగత్తంతా శ్రద్ధతో పాటిస్తారు.*
*┈┉┅━❀꧁హరే కృష్ణ꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🕉️📿🕉️ 🙏🕉️🙏 🕉️📿🕉️
No comments:
Post a Comment