Friday, August 15, 2025

 *అవతార్ మెహర్ బాబా - 47*
🪷

రచన: బి. రామకృష్ణయ్య


*ప్రపంచ పర్యటనలు (1931-1941)*

బాబా మొదటి పాశ్చాత్య దేశ పర్యటనలో లండన్ నగరంలో దర్శనమిచ్చారు. బాబా దర్శన కార్యక్రమము వార్తాపత్రికలలో ప్రకటించబడింది. బాబా తాను మెస్సయ్య అని అంటున్నారని వ్రాశారు. ఆ రోజు దర్శనానికి చాలామంది వచ్చారు. ఆలస్యంగా వచ్చిన ఒక యువకుడు కుర్చీలు ఖాళీ లేక నిలబడియున్నాడు. బాబా తానే స్వయంగా ఆ యువకుడిని దగ్గరకు రమ్మని పిలిచారు. బాబా ఒక జాలరి. ప్రేమవల విసిరి తనకు కావలసిన వారిని దరికి చేర్చుకుంటాడు. ఆ యువకుడు ముందు ముందు బాబా సన్నిహిత మండలిలో ఒకడు కాగలడని సర్వజ్ఞుడైన బాబాకు తెలుసు. కానీ ఆ యువకునికేమి తెలుసు? అసలు బాబా అనుసరించే రీతి కడు విచిత్రము గదా! ఆ యువకుడితో సంభాషణ ఇలా సాగింది..

యువకుడు : ఏమిటి మీరు భగవంతుడా!

బాబా : అవును

యువకుడు : అయితే నా భవిష్యత్తును గురించి మీరేమైన చెప్పగలరా?

బాబా : ఓ, నాకంతా తెలుసు.

యువకుడు : మీరు భగవంతుడే అయితే నేను చేయబోయేదేమిటో చెప్పండి. మీరు చెప్పినట్లే అంతా జరిగితే మీరు భగవంతుడని నమ్ముతాను.

బాబా : నీ పేరు విలియమ్ డాంకిన్. నీవు వైద్యశాస్త్రం (మెడిసిన్) చదువుతున్నావు. ఆ చదువు పూర్తి చేస్తావు.

యువకుడు : ఏమిటి నేను మెడిసన్ పూర్తి చేస్తానా! ఆ తర్వాత...

బాబా : హౌస్ సర్జన్ గా మాత్రము నీకిక్కడ సీటు దొరకదు. ఎక్కడో మారుమూల గ్రామంలో దొరుకుతుంది.

యువకుడు : ఆ తర్వాత ఏం జరుగుతుంది?

బాబా: అది పూర్తయిన తర్వాత నీకు గవర్నమెంట్ ఉద్యోగం దొరుకుతుంది.

యువకుడు : ఆ తర్వాత ఏం చేస్తాను?

బాబా : ఆ ఉద్యోగంలోనే ఇండియాకు వస్తావు. మళ్ళీ నన్ను చూస్తావు.

ఆ యువకుడు విలియమ్ డాంకిన్. బీదవాడు. ఆర్థిక పరిస్థితి బాగోలేక చదివే మెడిసిన్ మధ్యలోనే మానుకొనే పరిస్థితి లో బాబా చెప్పిన మాటలు విని ఆశ్చర్యం కలిగింది. బాబా చెప్పిన మాటలు తన డైరీలో వ్రాసుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత వార్తాపత్రికలలో వచ్చిన వ్యక్తిగత ప్రకటన ప్రకారం ఒక ఊరికి వెళ్ళి విచారించగా ఆయన సుదూర బంధువైన ఒక వృద్ధవనిత చనిపోతూ తన ఆస్థికి డాంకిన్ను వారసుడుగా వ్రాసిపోయింది. అనుకోకుండా అదృష్టం కలిసివచ్చి ఆస్థి చేజిక్కడంతో చదువు పూర్తిచేశాడు. హౌస్ సర్జన్ ఎంత ప్రయత్నించినా లండన్ లో మాత్రం అవకాశం దొరకలేదు. మారు మూల గ్రామంలో హౌస్ సర్జన్ కోర్సు పూర్తిచేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కూడా సంపాదించి ప్రభుత్వోద్యోగంలో చేరాడు. అప్పటికి బాబా మాటలను పూర్తిగా మర్చిపోయాడు కూడా.

ఇంతలో రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. ఆయనను మిలిటరీ డాక్టర్ గా తీసుకొని ఆస్ట్రేలియాకు బదిలీ చేశారు. స్టీమర్ లో బయలుదేరాడు. స్టీమర్ మధ్యధరా సముద్రం దాటి సూయజ్ కెనాల్లో వేగంగా ప్రయాణిస్తోంది. ఒక సాయంత్రం ఓడ డెక్ పైన తిరుగుతున్న డాంకిన్ మదిలో ఒక ఆలోచన తళుక్కుమంది. వెంటనే వెళ్ళి తన డైరీలో వ్రాసుకున్నది చదువుకున్నా డు. ఇప్పటిదాకా బాబా చెప్పిన మాటలన్నీ యదార్థమైనాయి. కాని బాబా ఇండియాకు వస్తావన్నాడు. తను ఆస్ట్రేలియాకు బదిలీ అయ్యాడు. బాబా దేవుడి నన్నాడు కదా! ఎలా అవుతాడు? ఆయన మాట తప్పింది కదా అనుకుని వెంటనే ఒక ఉత్తరం వ్రాసి పోస్ట్ చేయడానికి బయలుదేరాడు. ఇంతలో ఒక పోస్ట్ మాన్ ఆయన్ని వెతుక్కుంటూ వచ్చి ఒక టెలిగ్రామ్ అందించి వెళ్ళాడు. 'ఆస్ట్రేలియాకు  వేసిన ఆర్డర్ రద్దు చేశాం. ఇండియాకు వెళ్ళి బెంగుళూరులో మిలిటరీ హాస్పిటల్లో చేరవలసింది' అని ఉంది. 

డాంకిన్ నిర్ఘాంత పోయాడు. అతని ఆశ్చర్యానికి అంతులేదు. చెప్పినవన్నీ నిజమైనవి. నిస్సందేహంగా ఆ బాబా  భగవంతుడే అని నిర్ణయించుకున్నాడు. బెంగుళూరులో పనిలోచేరిన కొద్ది రోజులకే బాబా బెంగుళూరులోనే మస్తులకు, పిచ్చి వాళ్ళకు ఆశ్రమాన్ని ఏర్పరచి ఉన్నారని తెలుసుకొని వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాడు. తరచుగా బాబా వద్దకు వెళ్ళేవాడు. కొన్నాళ్ళ తర్వాత ఆయనకొక గట్టి ఆలోచన కలిగింది – దేవుడైన బాబాను వదిలిపెట్టి ఎంత సంపాదించి  ఏమి చేసుకోవాలి? ఏమిటి ప్రయోజనం అని. బాబా సేవలోనే బాబా సమక్షంలోనే జీవితం గడపాలని నిర్ణయించుకున్నాడు. 

బాబాకు తెలియజేశాడు. 'నీవు ఉండలేవు. చాలా కష్టాలు పడవలసి వస్తుంది' అని అన్నారు బాబా. కానీ డాంకిన్ తన ఆలోచన వదలలేదు. అయితే నీ ఆస్థి అంతా నీ తల్లిదండ్రుల కిచ్చేసి కేవలం కట్టుకున్న గుడ్డలతో శిష్యుడుగా నా ఆశ్రమంలో ప్రవేశించు అన్నారు. డాంకిన్ అలాగే చేశాడు. ఆస్తినంతయూ త్యజించి జీవితంలో పెద్ద డాక్టర్ గా సంక్రమించిన భోగాలను, సుఖాలన్నిటినీ వదులుకొని బాబా ఆశ్రమంలో ఒక మామూలు మనిషిగా చేరాడు. ఏ సౌకర్యము లేని జీవితం గడిపాడు. 

ఒకరోజు బాబా డాంకిన్ ను పిలిచి కలకత్తా వెళ్ళి అక్కడ ఒక ఆసుపత్రి (క్లినిక్) పెట్టమని అదేశించారు. బాబా ఆదేశాన్ని శిరసావహించి ఎవరూ పరిచయం లేని కొత్త నగరానికి చేతిలో డబ్బు లేకున్నా ఒక డాక్టర్ ని ఆశ్రయించి ఆయన భవనంలోనే ఆసుపత్రి ప్రారంభించాడు. కొద్దిరోజులలోనే ఆయన ప్రాక్టీస్ దినదినాభి వృద్ధిపొందింది. మళ్ళీ డబ్బు, పేరు సమకూరాయి. వెంటనే అక్కడ అన్నీ వదిలి రావలసిందిగా బాబా ఆదేశించారు. సంపాదించినవన్నీ తనకి ఆశ్రయమిచ్చిన డాక్టర్ గారికిచ్చేసి బాబా వద్దకు చేరాడు. మరి కొద్ది రోజుల తర్వాత బాబా డాంకిన్ను పిలిచి బొంబాయికి వెళ్ళి అక్కడ ఒక చాకలి దుకాణం (లాండ్రి) నడపమని దుస్తులు అతడే స్వయంగా ఉతకాలని చెప్పారు. బాబా ఆజ్ఞ ప్రకారం డాక్టర్ బొంబాయికి వెళ్ళి చాకలి వృత్తి చేపట్టాడు. ఆయన స్వయంగా ఉతకాల్సి వచ్చినందున తనకు చేతనైనంత పనిని మాత్రమే స్వీకరించి శ్రమించాడు. ఆ వృత్తిలో కూడా రాణించి డబ్బు, పేరు సమకూర్చుకున్నాడు. ఆ వృత్తి కూడా వదిలి రావలసిందిగా బాబా కబురు చేశారు. వెంటనే అన్నింటినీ వదిలి వెళ్లి బాబా చెంత చేరాడు. 

'నా పని అహంకార నాశనం' అన్నారు బాబా. ఆయన చేసే పనులకి అర్థం ఒక సామాన్య మానవ మేధస్సుకి గోచరించదు. మనస్సు ద్వారా తర్కించడం మానివేసి బాబా ఆజ్ఞలను విధేయతతో నెరవేర్చి బాబాకు ప్రీతిపాత్రుడైన డా. డాంకిన్ ధన్యజీవి.

అవిశ్రాంతంగా జరిపిన ప్రపంచ పర్యటనల పర్యవసానంగా బాబా ప్రాక్పశ్చిమ దేశాలకు ఆధ్యాత్మిక సంబంధాలను ఏర్పరచి దృఢపరిచారు. విశ్వకార్యంలో తనకు తోడ్పడేందుకు దరిజేర్చారు. అర్హత ప్రకారం అందరికి తన ప్రేమను పంచి వారి హృదయాలను తేలిక పర్చారు. భౌతిక వాదంతో కరడుగట్టిన వారి హృదయ క్షేత్రాలను తన ప్రేమ ప్రవాహంలో ముంచి ప్రేమ బీజాలు నాటారు. ఎంతోమంది పాశ్చాత్యులు భారతదేశం వచ్చి బాబాకు సర్వార్పణ చేసుకొని ఆయన విశ్వకార్యం లో తోడ్పడ్డారు. డా. విలియమ్ డాంకిన్ మరియు ఫ్రాన్సిస్ బ్రాబాజాన్ వారిలో ముఖ్యులు. హాలీవుడ్ సినిమా తారలు, నిర్మాతలు బాబా దర్శనం చేసుకొని ఆయన ప్రేమలో తన్మయత్వం పొందారు.
📖

*మస్తు కార్యక్రమం*

సాధారణంగా ప్రాపంచిక విషయాలపై విరక్తి కలిగినవారికి సత్యాన్వేషణకై (భగవదైక్యా నికై) తపన పెరుగుతుంది. అట్టి వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెడతాడు. సంసిద్ధత అర్హతలను బట్టి అతనికి సప్తజ్ఞాన భూమికల అనుభూతి కలుగుతుంది. ప్రాపంచిక చైతన్యము లుప్తమై సూక్ష్మ మనో ప్రపంచాలతో అనుభూతి ద్వారా సంబంధ మేర్పడి సప్త భూమికల కాధార భూతమైన శక్తి జ్ఞానానందములను ఎరుకతో అనుభవిస్తాడు. ఆ ఆనందానుభూతిలో ప్రపంచ స్మృతి కోల్పోతాడు సాధకుడు. వారే మస్తులు అనబడే సాధకులు. అందుకే మస్తులు పిచ్చివారి లాగా సాధారణ మానవులకు కనిపిస్తారు కాని ఆధ్యాత్మికంగా అభివృద్ధిచెందిన ఉన్నతాత్మలు. అందుకే వారిని అసహ్యమైన పంజరాలలో చిక్కుకున్న అందమైన ఆత్మలు అన్నారు బాబా. మస్తులు బాహ్య ప్రపంచము, భౌతిక శరీరాలకు సంబంధించిన స్మృతి కోల్పోయి నందున వారు ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించలేక ఉన్న స్థితిలోనే నిలిచి పోతారు. కావున బాబా చేసిన మస్తు కార్యక్రమంలో సిద్ధించిన ప్రయోజనాలు రెండు. ఒకటి వారిని వారు చిక్కుకున్న స్థితి నుండి పై స్థితికి చేరుకునే ప్రయాణానికి సంసిద్ధులుగా చేయుట. రెండవది బాబా అవతార కార్యమైన విశ్వమానవ జాగృతికి ఎరుకతో వారు తోడ్పడునట్లు చేయుట. కొంతమంది మస్తులు తమ స్థితినుండి బాహ్య స్మృతికి రావడానికి బాబా విశ్వకార్యంలో భాగస్వాములవడానికి నిరాకరించేవారు. కాని బాబా సహనంతో వారిని కలిసి తన స్పర్శతో సహవాసంతో వారిని సంసిద్ధులుగా చేసేవారు. ఈ మస్తులలో జమాలీ మరియు జలాలీ ముఖ్యమైన తెగలు. జమాలీ మస్తులు శాంతంగా వినమ్రులై ఉంటే జలాలీ మస్తులు దురుసుగా కోపోద్రిక్తులై ఉంటారు. సప్తజ్ఞాన భూమికలలో మండే బాటసారులు 7000 మంది. అందరూ మస్తులుగా నుండవలసిన అవసరం లేదు.

మనస్సు వేగంగా పని చేస్తే - పిచ్చివాడు.

మనస్సు మామూలుగా పని చేస్తే - సాధారణ మానవుడు.

మనస్సు నెమ్మదిగా పని చేస్తే - మస్తు.

మనస్సు పూర్తిగా నశిస్తే - దేవుడు.

అని బాబా మానసిక స్థితుల గురించి వివరించారు. ప్రేమోన్మత్తులైన ఈ మస్తుల కు శీత వాతా తపముల బాధలుండవు. వీరు సంవత్సరముల తరబడి స్నానము చేయకపోయిన, తిండి తినక పోయిన, ఎండవానల నుండి రక్షణ లేకపోయినను, వారి ఆరోగ్యము చెడదు. వీరిలో చాలా మంది పట్టణములలో నివసించేవారు. చింపిరి గుడ్డలు కట్టుకొని, చింపిరి గుడ్డల మూటలను చంకలో బెట్టుకొని దుర్గంధము నకు ఆలవాలమైన ప్రదేశాలలో ఏ బాధా లేకుండా నివసిస్తారు. బాబా వీరి కొరకు రాహూరీ, అజ్మీర్, జబల్ పూర్, రాంచి, సతారా, మహాబలేశ్వర్, నాసిక్, మెహెరా బాద్, బెంగుళూరు మొదలగు పలు ప్రదేశాలలో ఆశ్రమాలు స్థాపించారు.

మస్తులతో పాటు పిచ్చివారిని కూడా చేర్చుకొని బాబా వారికి కూడా సేవలు చేశారు. వారితో కొద్ది గంటలు సహవాసం చేసి వారికి స్నానం చేయించి కొత్తగుడ్డలు తొడిగి తన స్వహస్తాలతో అన్నం తినిపించే వారు బాబా. వారి శౌచాలయాలు కూడా బాబా శుభ్రం చేశారు. వారిని సంసిద్ధులను చేయుటకు అడిగింది ఇచ్చిపుచ్చుకొనే వారు. 

ఒకసారి రాహూరీలో ఒక మస్తు అభీష్టాను సారము బాబా ఒకటి తర్వాత ఒకటి పన్నెండు కప్పుల టీ త్రాగవలసి వచ్చింది. రెండు కప్పుల తర్వాత బాబా మళ్ళీ మళ్ళీ త్రాగుతున్నట్లు నటించవలసివచ్చింది.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment