Monday, January 5, 2026

 🚩 🚩- #అత్తగారి_కథలు .!
         (#భానుమతి_హాస్య_రచన .)
#బహుముఖప్రజ్ఞాశాలిఅయినభానుమతీ రామకృష్ణ గారు
వ్రాసిన 
 హాస్య రచన *అత్తగారి కథలు*.

 దీనిలో అత్తగారి పాత్ర యొక్క స్వభావం, మాటలు, చేసే పనులు చాలా నవ్వు తెప్పిస్తాయి. ఒకటి చేయబోయి ఇంకేదో చేస్తూవుంటుంది. తను ఎంతో తెలివైనదాన్ని అనుకుంటుంది.

*#అత్తగారూ_ఆవకాయ*


సాధారణంగా మద్రాసులో ఉండే తెలుగు జనాభాకు ఆవకాయ తినే ప్రాప్తం కలగడం అదృష్టంలో ఒక భాగం అని చెప్పాల్సిందే. విజయవాడ దగ్గర్నుండి విశాఖపట్నం వరకూ వుండే వూళ్ళల్లో బంధువులో, తెలిసినవాళ్ళో వుండి ఆవకాయ జాడీలు మద్రాసుకు రవాణా చేస్తే తప్ప బంధువులూ, తెలిసినవాళ్ళూ, కనీసం ఆవకాయ సప్లయి చేసే రకం బంధువులు - ఇద్దరూ లేని తెలుగువాళ్ళు మద్రాసులో కాసే మామిడికాయలు తినాల్సిందే కాని ఆవకాయ తినే అవకాశం లేదు. ఆవకాయ పెట్టడం తెలిసిన బామ్మగార్లు వుండే కుటుంబాలకు బాధేలేదు. నూజివీడు రసాల కాయలూ, సామర్లకోట పప్పునూనె తెప్పించ లేకపోయినా మద్రాసు మామిడి కాయలతోనైనా ఘమఘుమలాడే ఆవకాయ పెట్టగలరు. ఎటొచ్చీ తింటం తెలిసి, ఆవకాయ పెట్టడం తెలియని మా బోటివాండ్లకే అవస్థ. పోయిన సంవత్సరం వరకూ తెలిసిన వాండ్లు బెజవాడ ప్రాంతాల నుండి ప్రతిఏటా ఆవకాయ పంపుతూండేవాళ్ళు, రెండు మూడు పెద్ద జాడీల్లో, ఈ సంవత్సరం వారింట్లో రెండు మూడు పెండ్లిండ్లు జరగడం వల్ల మాకు ఆవకాయ పంపే వ్యవధి వారికి లేకుండా పోయింది. ఇన్నాళ్ళూ ఆవకాయను గురించి ఆలోచించని నాకు 'ఇంట్లో ఆవకాయ లేదు, ఈ సంవత్సరం రాదు' అని తెలియగానే గుండె గతుక్కుమంది.
కొన్ని వస్తువులు ఉన్నప్పటి కంటే లేనప్పుడు ఎక్కువ అగ్రస్థానం వహిస్తాయి మనుషుల మనసుల్లో, అలాగే ఆవకాయ ప్రతి ఏటా వస్తున్నప్పుడు మా వంటచేసే అయ్యరు అన్నం వడ్డించిన వెంటనే "ఆవహా ఊరహా వేణుమా" అంటే మేము "వేండాబ్బా. ఎప్పుడూ ఆవకాయే నా దరిద్రం" అన్న రోజులు కూడా ఉన్నాయి.
ఆవకాయ ఉన్నప్పుడు మా వంట అయ్యరు పచ్చళ్ళు చేయటానికి బద్ధకించేవాడు. ఈ సంవత్సరం ఆవకాయ లేకపోయేసరికి మా వంట అయ్యరు చేసే వంటలోని లోపాలన్నీ ఒక్కొక్కటే బయటపడ్డం మొదలెట్టాయి. ఈ సంవత్సరం వంట అయ్యరు ఏం చేస్తే అది తిని, నోరు మూసుకుని, వూరుకోవాలిగాబోలునని అనుకున్నప్పుడల్లా ఆవకాయ కోసం నోరూరడం మొదలెట్టింది.
ఆవకాయ కోసం మా ఇంటికి మా వారి మిత్రులు కొందరు కుటుంబాలతో సహా భోజనానికి వచ్చేవారు. అప్పుడప్పుడు, "ఆహా! ఎన్నాళ్ళకు తినగలుగుతున్నామండీ మనదేశపు ఆవకాయ" అని వాళ్ళంతా లొట్టలు వేస్తూ తింటుంటే, మేము చాలా నిర్లక్ష్యంగా" ఆఁ, ఆవకాయకేం భాగ్యమండీ! మాకు ప్రతి ఏటా వస్తూంటుంది అవకాయ" అనేవాళ్ళం గర్వంగా. 

ఆ వచ్చినవాళ్లు అందరూ సగం జాడీ తినేసి, సగం జాడీ యింటికి పట్టుకు పోయేవాళ్ళు తలా కాస్తా.
"అయినా అంత ఆవకాయ పట్టికెళ్లిపోయారే! ఈ సంవత్సరం మన ఇంటికి చాల్తుందో లేదో" అని నేను అనుకుంటుంటే "అబ్బ! చాలకపోతే పోనిస్తూ! ఎంతని తింటాం ఆవకాయ! నాకు వద్దనే వద్దు. నీక్కావాలంటే మిగిలిన ఆవకాయ దాచిపెట్టి తింటూండు" అన్నారు మావారు ఎగతాళిగా.

 అలాంటి మావారు ఈ సంవత్సరం ఆవకాయ ఇంట్లో లేదని తెలిసిన తర్వాత తనేమన్నది కూడా మరిచి పోయి, "అయ్యరు గాడు చేసే యీ పచ్చళ్ళు తింటం చాలా కష్టం. ఆవకాయ వుంటే బావుండేది" అంటం మొదలెట్టారు. మా అత్తగారు మడిలో వుంచిన నిమ్మకాయ ఊరగాయ తప్ప ఇంట్లో వేరే ఏ ఊరగాయా లేదు. మా అత్తగారు కారం లేని నిమ్మకాయ ఊరగాయ తింటుంది. మాకు సయించదు. అదే ఆమె మడితో ఒక మూల దాచిన బూజుపట్టిన నిమ్మకాయ జాడీని ఎవరూ ముట్టుకోక పోవడానికి కారణం.
మా వారు ఒకరోజు మధ్యాన్నం భోంచేస్తూండగా "కొడుకు ఆవకాయలేదని పలవరిస్తున్నారు పాపం అని ఎంతో ప్రేమగా మడి నిమ్మకాయ ఊరగాయ తెచ్చి కొడుకు కంచంలో వడ్డించారు మా అత్తగారు, కొడుకు ఆ నిమ్మకాయ ఊరగాయను ముట్టుకోక పోగా కంచంలోంచి కిందపడేశారు. మా అత్తగారు చూడలేదు గాని చూస్తే చాలా నొచ్చుకునేదే నన్నడిగింది. "అబ్బాయి ఊరగాయ ఎట్లా వుందన్నారూ?" అని.
"చాలా బావుందన్నారు కాని, ఆవకాయ ఊరగాయంటేనే ఆయన కెక్కువ ఇష్టం. ఈ సంవత్సరం ఆవకాయ రాలేదే, ఏం చేయడం, ఎవర్ని అడగడం అన్న దిగులు పట్టుకుంది అన్నాను.
"ఆ నీదంతా చోద్యమే మరీనూ! ఎవర్నో ఎందుకడగడం? ఆవకాయ పెట్టడం ఏం బ్రహ్మవిద్య గనకనా, తెలీకడుగుతా! అయినా అంత కారం, అంత నూనె వేసిన ఆ ఉత్తరాదివాండ్ల ఆవకాయ మీరంతా లొట్టలేస్తూ తింటూంటే నా కళ్ళవెంట నీళ్ళే కార్తాయి. అయినా మన కెందుకులే అని ఊరుకున్నాను. అసలు అంతకారంగా వుండే ఆవకాయ తింటే మీ ఒళ్ళు గతి ఏం కానుంట!"
"ఏదో వారికిష్టం" అన్నాను నేను.
"నే పెట్టిస్తానుండు ఆవకాయ" అన్నారు మా అత్తగారు, దర్జాగా కూర్చుంటూ..
నా ప్రాణం లేచి వచ్చినట్లయింది. "అంతకంటేనా? మీరు గనక ఆవకాయ పెడితే యింక మనకు ఆవకాయ లేదన్న లోటు వుండదు ఈ సంవత్సరం" అన్నాను సంతోషంగా..
"ఆఁ నీదంతా చాదస్తమే మరీనూ! ఏ సంవత్సరమైనా మనింట్లోనే పెట్టుకోవచ్చు. ఆవకాయ, ఏం బ్రహ్మవిద్యంటాను? నిమ్మకాయెంతో ఆవకాయా అంతే" అన్నారు తేలిగ్గా మా అత్తగారు, "అంతే, అంతే" అన్నాను ఆవిడే మన్నదో అర్ధంగాక నేను. కాని..
నాకో సందేహం కలిగింది. మా అత్తగారి పుట్టినిల్లు చెంగల్ పట్; మెట్టినిల్లు నంద్యాల, ఆవకాయకూ మా అత్తగారికి ఎలాంటి సంబంధం వుంటుందా అని చాలాసేపు ఆలోచించాను. అడుగుదామనుకొన్నాను. మళ్ళీ "ఆక్షేపిస్తోంది" అనుకుంటుందని వూరుకున్నాను.
"అయితే ఏమేం వస్తువులు కావాల్సుంటాయి ఆవకాయ వేయడానికి" అని అడిగాను తెల్ల కాగితం, పెన్సిలు చేత పుచ్చుకొని, ఆవిడ గారి గుమస్తాలాగా. వెంటనే మా అత్తగారు కాలు మీద కాలు, మూతిమీద వేలు వేసుకొని ఒక్క క్షణం ఆలోచించారు.
"మామిడికాయలు కావాలిగా?" అన్నాను. మా అత్తగారి ఆలోచనకు అంతరాయం కలిగిస్తూ...
"అబ్బే! ఎందుకే?" అన్నారు అలక్ష్యంగా చప్పరిస్తూ. నేను తెల్లబోయి ఆమెకేసి చూశాను.
"పదిహేనెకరాల మామిడితోటలో మనం ఉంటూ, లక్షణంగా కాసే మామిడిచెట్లు పెట్టుకొని, యింకా కాయలెందుకే మనకూ" అన్నారు చిరునవ్వు లొలకబోస్తూ.
"అయితే మన తోటలోని పండ్లకాయలే వేస్తానంటారా ఆవకాయా?" అన్నాను.
"ఓ! భేషుగ్గా వెయ్యొచ్చు. ఆవకాయకు కావలసింది మామిడికాయేగా! ఏ కాయయితేనేం! మన తోటలో దక్షిణం వైపు చెట్లన్నీ భేషైన కాయలు కాస్తాయి. పడమటివైపు చెట్లు ఎంత కండగలకాయలనుకున్నావు, పోయిన సంవత్సరం తోటంతా విరగకాశాయి కాయలు. "మరి నాలుగు వందలు ఎక్కువ చెప్పి కౌలు కివ్వవే" అంటే విన్నావు కాదు. వాడికెంత లాభం వచ్చిందో తెలుసా" మన తోటవాడు చెప్పాడు. ఈ సంవత్సరమూ అంతే. వాడికింకా లాభం వస్తుంది..... కాసింది తోటంతా."
"పోనీలెండి. ఏటా కౌలుకు తీసుకునేవాడు నాలుగు డబ్బులు సంపాదించుకోనివ్వండి. పై సంవత్సరం అడగవచ్చు ఎక్కువ డబ్బు" అన్నాను.
"హా-యిస్తాడు! మళ్ళీ ఏ నష్టమో వచ్చిందంటాడు. అందుకే యిప్పుడు ఆవకాయ పెట్టబోతున్నానుగా. అయిదు వేల కాయలూ అడిగి పుచ్చుకుంటే సరి" అన్నారు మా అత్తగారు,దిట్టంగా బాసీ పెట్టు వేసి కూర్చుంటూ.
"అయితే అయిదువేల కాయలూ ఆవకాయ పెడతానంటారా?" అన్నాను ఆశ్చర్యంగా.
"కాకపోతే! మీ చెల్లళ్ళ ఇండ్లకూ, యింకా తెలిసిన వాండ్ల ఇండ్లకూ పంపాల్సి వుంటుందిగా! కొద్దిగా పెడితే ఏం చాలుతుంది మనింటికి? వాడిని మటుకు అయిదువేల కాయలూ అడగాల్సిందే! డబ్బూ తక్కువిచ్చి, కాయలూ ఇవ్వకపోతే ఎట్లా?" అన్నారు కౌలు వాడి మీద మా అత్తగారు.
"అయిదువేల కాయలు వాడివ్వడేమో. మామూలుగా వాడివ్వాల్సిన కాయలు వెయ్యి. నేను అయిదువందల కాయలు చాలన్నాను. ఎటు తిరిగీ మనకు ఎవరో ఒకరు తెలిసినవాండ్లు రసాలూ, బంగినపల్లి పండ్లూ పంపుతూనే ఉంటారుగదా - ఇంకా మనతోటలోని పండ్లన్నీ ఎవరు తింటారనే వుద్దేశ్యంతో తగ్గించి యిమ్మన్నాను. మళ్ళీ ఇప్పుడు అన్నీ కాయలూ గావాలంటే ఏం బావుంటుందీ" అన్నాను.
"ఆ! నీదంతా చోద్యమే! నీ వడక్కపోతే నేనడుగుతానుండు అన్నట్లు వాడి పేరేమిటీ... జటాయువా, జానకిరామా?...
నాకు ఫక్కున నవ్వొచ్చింది. ముసలి వాళ్ళందరికీ జటాయువంటే ఎందుకో అంత అభిమానం అని, "వాడి పేరు జటాయువూ కాదు. జానకిరామూ కాదు. దశరథుడు" అన్నాను నవ్వాపుకుంటూ.
"ఏ అతిరథుడో... ఎవడికి జ్ఞాపకం..వెంటనే వాడికి కబురుపంపి పిలిపించు..అయిదువేల కాయలూ కక్కిస్తాను. పదిహేనెకరాల మామిడితోట కౌలుకు తీసుకుని డబ్బిచ్చి దగా చేసేది కాకుండా మామూలుగా మనకిచ్చే మామిడికాయలు కూడా తక్కువిస్తే ఎలాగంట!" అన్నారు మా అత్తగారు పాయింటు దొరికిన ప్లీడర్ గారికి మల్లే.
“ఒక్క మామిడికాయతోనే ఆవకాయ కాదుగా! నూనె కావద్దూ!" అన్నాను.
"ఎందుకూ?" అన్నారు.
"ఎందుకేమిటీ, ఆవకాయలో నూనె వెయ్యరూ!" అన్నాను ఆశ్చర్యపోతూ.
"వేస్తారు సరేనే-నూనె కొంటం యెందుకంట! మనతామ్రంచేలో పండిన నువ్వులు ఎనిమిది బస్తాలూ ఏమయ్యేట్టు? మన ఇంటికి సంవత్సరానికి ఆరుబస్తాల నువ్వుల నూనె చాలు. రెండుబస్తాల నూనె వంటవాడు పోయిలోనే పోస్తున్నాడు."
"ఆ నూనె మీరు ఆవకాయలో పోస్తానంటారు. అయితే రెండు బస్తాల నువ్వులను అయిదువేల కాయలకు కావాలంటారు..." అన్నాను వ్రాసుకోబోతూ.
"అబ్బే ఎందుకే? వెయ్యికి శేరునూనె. అయిదువేలకూ అయిదు శేర్లనూనె ఎక్కువ" అన్నారు మా అత్తగారు.
"పప్పునూనె గదూ!" అన్నాను.
"ఏం పప్పూ! కందిపప్పూ! ఎందుకే, నీదంతా చాదస్తం. ఇంట్లో వుండే నూనె చాలు. మొన్న ఆడించిన ఆరు శేర్ల నూనె అలాగే వుందిగా అసలు నూనె ఎక్కువేస్తే మాకు సయించదు" అన్నారు మా అత్తగారు.
ఆవకాయ అజపజ తెలియని నేను మా అత్తగారు చెప్పినవన్నీ భక్తితో లిస్టు వ్రాసుకోవడం మొదలెట్టాను. మధ్య మధ్య తెలిసీ తెలియని సందేహాలను ఒకవైపు నెడుతూ, ఆవకాయ విషయంలో పూర్తిగా మా అత్తగారి మీద ఆధారపడదల్చుకున్నాను.
"మరి కారం?" అన్నాను.
"అదీ అంతే! మన చేలో పండిన మిరపకాయలు అయిదు బస్తాలు స్టోరు రూమ్ లో మూలుగుతున్నాయి ఒక్క బస్తా మాత్రం వాడుక్కు బయట వుంచాను."
"అయితే మిగతా నాలుగు బస్తాల మిరపకాయల కారం అయిదువేల కాయలకు వేస్తానంటారా ?" అన్నాను ఆశ్చర్యంగా.
"ఇంకా నయం - అయ్యో పిచ్చిపిల్లా" అంటూ మా అత్తగారు తన ఏనుగుదంతాల వంటి రెండుకోరల బోసి నోటితోనూ విరగబడి నవ్వారు.
"మరి ఎంత కారం కావాలంటారు? కొట్టించాలిగా కారం!" అన్నాను.
"ఎందుకే నీదంతా సింగినాదం మరీనూ! కారం కొట్టించడం మా తాతలనాడే లేదు. ఇప్పుడెందుకే? మిషనుకు వేయిస్తే సరి. ఒక్క వీశకాయలు చాలు- మాకసలు కారం సయించదన్నానుగా!''
"మరి వీశకాయల కారం అయిదువేల మామిడి కాయలకు చాలా!" అన్నాను వుండబట్టలేక.
"ఆ! చాలకేమొచ్చిందే! ఉత్తరాదివాళ్ళలాగా అంత కారం నే వేయనమ్మా - అంతగా చాలకపోతే తర్వాత కాస్త వేసుకోవచ్చులే. మొన్న నేను నిమ్మకాయకు అసలు కారమే వేయలేదు. చూశావుగా, అయినా నాలిక చుర్రుమంటూనే ఉంది" అన్నారు మా అత్తగారు.
మధ్యాహ్నం మావారు పారేసిన నిమ్మకాయ అదే గదా అనుకుని మనసులోనే నవ్వుకున్నాను.
"అయితే కారం చాలకపోతే తర్వాత వేసుకోవచ్చంటారు" అన్నాను కారం చాలదనే సందేహం వదలక.
"ఓ, భేషుగ్గా వేసుకోవచ్చు. నిమ్మకాయకు వేయడంలా ఉప్పూకారం, కావాలంటే. అంతే!
నిమ్మకాయెంతో ఆవకాయంతే" అన్నారు మళ్ళీ.
"అయితే మరి ఆవపిండో!" అన్నాను. అన్నీ నేనే అందిస్తూ వస్తున్నాను.
“ఆ... ఆ ఆవాలు మాత్రం కొద్దిగా కొనాలి. మిగతా అన్నీ మనింట్లోనే వున్నాయి. ఉప్పూ, పసుపూ, మెంతి, గింతీని. ఆవపిండి మనకెంతసయిస్తే అంతే వేసుకోవచ్చు. అయిదువేల కాయలకూ ఒక సేరు ఆవపిండి చాలని నా అభిప్రాయం. ఎక్కువయితే వేడిమి చేస్తుంది.
"నన్నడిగితే ఉప్పెంతో కారం అంత. కారం ఎంతో ఆవపిండి అంత. అవన్నీ ఎంతో - నూనె అంత-నిమ్మకాయెంతో ఆవకాయంతా" అని ముగించారు అత్తగారు. ఆవిడ చెప్పినవన్నీ
శ్రద్ధగా వ్రాసుకొన్నాను కాగితంమీద.
“అన్నట్లు ఆ కౌలువాడి పేరేమిటో మరిచిపోయాను. వాణ్ణి పిలిపించు, తక్షణం వాడితో మాట్లాడో, పోట్లాడో అయిదువేల కాయలూ తీసుకున్నదాకా నిద్రపట్టదు నాకు..." అంటూ లేచి గోల్కొండ వ్యాపార్ల గోచి సరిచేసుకుంటూ వంటింటివైపు వెళ్ళారు మా అత్తగారు.
నేను అత్తగారి ఆజ్ఞానుసారం మామిడితోట కౌలుకు తీసుకున్న దశరథుడికి కబురు పెట్టాను.
దశరథుడు చేతులు కట్టుకుని వినయంగా వచ్చి మా అత్తగారి ముందు నిలబడ్డాక, వంటచేసే అయ్యరు నేనుంటే మరి ఏడ్చిపోతాడని పులి ముందు మేకపిల్లను వదలిపెట్టినట్లు, మా అత్తగారి ముందు దశరథుడిని వదలి నేను వెళ్ళి వంటింటి ముందున్న వడ్లబస్తాల మీద కూచున్నాను.
మా అత్తగారు హైకోర్టులో వాదించే లాయర్లకు మల్లే దశరథుడితో వాదిస్తోంది. వాడి కాలికివేసి, మెడకు వేసి, చివరకు అయిదువేల కాయలూ ఇవ్వకపోతే మామిడి తోట విడిచిపెట్టి పొమ్మన్నారామె. ఇచ్చిన అడ్వాన్సు డబ్బు కావాలంటే తిరిగి ఇచ్చేస్తానని కూడా దబాయించింది. దాంతో నిజంగానే దశరథుడు భయపడిపోయాడు.
"అయితే, అమ్మగారూ, అయిదువేల పండ్లయితే నేనిస్తాను అప్పుడప్పుడు, అన్ని కాయలేంచేసుకుంటారు తల్లీ" అన్నాడు భయపడుతూన్న దశరథుడు.
"ఆవకాయ వేస్తాన్రా - ఆవకాయా! అయినా, ఏం చేస్తామో నీతో చెపితేనే ఇస్తావా కాయలు?" అని గద్దించి అడిగారు మా అత్తగారు.
"అది కాదండీ అమ్మగారూ! అయిదువేలూ పండ్లు వేస్తారా, కాయలుగా కావాలా అని అడిగానండీ! ఇప్పటికే బాగా ముదిరి పండబారి పొయ్యాయి కాయలన్నీ" అన్నాడు దశరథుడు
ఆ మాట విన్న నా గుండె గతుక్కుమంది. మా అత్తగారు పండావకాయ పెట్టబోతారేమోనని భయపడ్డాను.
“ఆ ముదిరి పండబారిన కాయలు పిల్లలు తింటారు. కాని, నువ్వు మాత్రం అయిదువేల కాయలకూ ఒక్కటి తక్కువిచ్చినా తీసుకోను. జాగ్రత్త" అని మా అత్తగారు దశరథుడిని పంపించేశారు.
మామూలు కంటే జోరుగా నడుస్తూ వచ్చారు మా అత్తగారు వంటింట్లోకి.
"ఏమన్నాడు" అన్నాను ఏమీ విననట్లు.
"ఏమంటాడు! కుక్కిన పేనల్లే దక్కిస్తూ యిస్తాడు అయిదువేల కాయలూనూ. లేకపోతే తోట విడిచి పొమ్మన్నాను. వచ్చే ఏడు డబ్బు కూడా యిలాగే దబాయించి తీసుకోవాలి గాని వాడెంతంటే అంతకు నిక్షేపంలాంటి మామిడితోట వదుల్తారటే?" అన్నారు సింహలగ్నంలో పుట్టిన మా అత్తగారు. నేను గుడ్లప్పచెప్పి ఆమెకేసి చూస్తూ వుండిపోయాను.
మర్నాడు తెల్లవారుఝామున మా అత్తగారు హడావిడిగా యింటిల్లిపాదినీ నిద్రలేపారు. వంటచేసే అయ్యరు పక్కింటి నుంచి రెండు కత్తులూ, ఎదురింటి నుంచి రెండు కత్తిపీటలు తెచ్చాడు.
'ఇంట్లో మూల పారేసిన మొద్దుకత్తులూ తుప్పుపట్టిన కత్తిపీటలూ తీసుకుని రణరంగానికి బయలుదేరినట్లు పనివాళ్ళూ, నేనూ, మా అత్తగారూ వంటింటి ముందు వసారాలో చేరాం.
అయిదువేల కాయలూ పెరటివేపు వరండాలో రాశి పోసివున్నాయి. మా అత్తగారు ఆరాశి చూస్తునే “చాలా కాయలొచ్చాయే! మనం ఐదువేలేగా అడిగింది! వెధవ భయపడి పదివేల కాయలు
కక్కినట్లున్నాడే!" అన్నారు.
"వాడు ప్రస్తుతం కక్కిందీ అయిదువేల కాయలే" అన్నాను, నవ్వు ఆపుకుంటూ మా అత్తగారి ముఖం వెలవెలబోయింది.
మొదటిరోజు రెండువందల కాయలూ, రెండవరోజు మూడువందల కాయలూ తెగేసేసరికి రెండు కత్తులూ పిళ్ళు విరిగాయి. ఒక కత్తి పూర్తిగా రెండు తునకలయింది. రెండు కత్తిపీటలు వంగిపోయాయి. మిగతా నాలుగువేలా అయిదు వందల కాయలూ పండ్లయిపోయాయి. మూడోనాటికి... మా అత్తగారి ముఖం నల్లబడిపోయింది.
"పోనీ, ముందీ అయిదువందల కాయలకూ పిండీ నూనే వెయ్యండి" అన్నాను-అప్పటికే ఆవకాయకు నీళ్ళు వదిలేసిన నేను, ఉసూరుమంటూ.
"ఆ... అంతే చేయాలి! వెధవ పండబారిన కాయలిచ్చి దగా చేశాడు" అన్నారు తప్పుకోవడానికి ప్రయత్నించే మా అత్తగారు.
"వాడేం దగా చేయలేదు. వాడు ముందే చెప్పాడు. పండబారాయి కాయలన్నీ అని” అన్నాను లోపల్నుంచి వచ్చే కోపాన్నంతా మింగుతూ.
"ఆ-అదేలే - అయితే ముందీ ముక్కలకు కారం, ఉప్పూ, పిండీ పట్టిస్తానూ! ఏం!" అన్నారు..మాట మారుస్తూ మా అత్తగారు.
"మీ ఇష్టం - అలాగే కానివ్వండన్నాను" నేను నీరసంగా.
అయిదవందల కాయల ముక్కలే ఒక పెద్ద గంగాళం నిండా వున్నాయి. ఇంటిలో వున్న చిన్న జాడీలు నాలుగూ తెచ్చి మా అత్తగారి ముందు పెట్టాను.
పిండీ, నూనె కలపకుండానే ముక్కలన్నీ నాలుగు జాడీలకు పట్టించడం మొదలెట్టారు. ఇంకా సగం ముక్కలు మిగిలిపోయాయి నాలుగు జాడీలూ నిండిపోయాయి. మా అత్తగారు గుడ్లు తేలేశారు. నేను వెంటనే మరో నాలుగు జాడీలు టౌను నుంచి తెప్పించి ఆవిడ ముందుంచాను. మిగతా ముక్కలన్నీ కొత్తగా వచ్చిన నాలుగు జాడీలకూ సరిపోయాయి. అయిదు వందల కాయలకే ఎనిమిది జాడీలయితే అయిదువేల కాయలకు యెన్ని జాడీలు కావాల్సివచ్చేదో తల్చుకుని హడలెత్తి పోయాను.
ఎనిమిది జాడీల్లోనూ గుప్పెడు గుప్పెడు కారం, ఉప్పూ, ఆవపిండీ వేసి, రెండు గరిటెలు నూనెపోసి మూతపెట్టి "కృష్ణా" అంటూ లేచారు మా అత్తగారు. "ఆవకాయ పెట్టడం అయిపోయిందా?" అన్నాను.
"ఆ! ఒక వారం రోజులు ఆ జాడీలవైపు వెళ్ళకుండా వుంటే సరి" అన్నారు మా అత్తగారు చేయి కడుక్కుంటూ.
“ఆవకాయ చేయడం యింత సులభమని తెలిస్తే నేనే వేసివుండేదాన్నే" అనుకున్నా మనసులో,
వారం రోజుల తర్వాత "మా యింటిలో మా అత్తగారు ఆవకాయ వేశారు కాబట్టి భోజనానికి రావల్సింది, అంటూ మా చెల్లిళ్ళకూ, తెలిసిన వాళ్ళకు కబురు పంపాను. ఆవకాయ కోసం ముఖం వాచిన మా చెల్లిళ్ళూ, మరుదులూ, అందరూ పిల్లాజెల్లాతో సహా వచ్చేశారు.
అంతా భోజనానికి కూర్చున్నారు. మా అత్తగారు వంటింటిలో హడావిడి పడుతున్నారు.
"ఆవకాయ కోసం నేను వెళ్ళేసరికి ఏముందీ? మూతలు తీసి చూస్తే ఆవకాయ లేదు- మామిడి పండ్ల ముక్కలున్నాయి బూజు పట్టి. మా అత్తగారి ముఖాన కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు.
            🌹😙🌹😙🌹😙🌹😙🌹😙🌹

No comments:

Post a Comment