*కంగారు*
సమయం రాత్రి 11 గంటలు. నిద్ర పట్టడం లేదు. ఎందుకో తెలీదు. ఈమధ్య రోజూ ఇంతే. అయినా పడుకుని కళ్ళు మూసుకుంది ఆమె. ఒక్కసారిగా గత జీవితమంతా కళ్ళముందు మెదిలింది.
చిన్నతనం నించీ నాకు కంగారు ఎక్కువట. తను ఏడో నెలలోనే పుట్టేసేనట. అందుకే ఈ పిల్లకి కంగారు ఎక్కువ అని అందరూ ఏడిపించేవారు. దానికి నాదా బాధ్యత ? ఏమో కాని అప్పుడప్పుడు అనిపించేది నాకు కంగారు ఎక్కువేనని. తొమ్మిదవ నెలకే నడక, ఏడాదిలోపే మాటలు వచ్చేసాయట. బాగా మాట్లాడడంతో నాలుగో ఏటే స్కూల్ లో పడేశారు. స్పోర్ట్స్ డే నాడు రన్నింగ్ రేస్ కి వేడుతుంటే అమ్మ చెప్పింది – “నెమ్మదిగా పరిగెత్తు. నీకసలే కంగారెక్కువ”. అన్నట్లుగానే కంగారుగా పరిగెత్తాను. పడ్డాను. మోకాలు కొట్టుకు పోయింది. పెట్టిన చివాట్లతో కడుపు నిండి పోయింది. నాతో పాటే నా కంగారు కూడా పెరిగింది. పరీక్షలోస్తే కంగారు. రిజల్ట్ వచ్చే రోజైతే మరీనూ. స్కూల్ లో వక్తృత్వం పోటీలలో స్టేజ్ ఎక్కగానే కంగారు. ఎవరైనా కొత్తవాళ్ళతో మాట్లాడాలంటే కంగారు. మాటలు తడబడేవి.
ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీ చదువుతానంటే అమ్మా నాన్నా కంగారు పడి చదువు మాన్పించారు. వంట నేర్చుకోమన్నారు అక్కడ కూడా కంగారు నన్ను వదలలేదు. అన్నం వుడకదేమోనని, కూర మాడి పోతుందేమోనని, పులుసులో చింతపండు తక్కువైనదేమోనని కంగారు పడుతూ వంట తగలేసే దాన్ని. కొన్నాళ్ళకి ఎలాగో వంటొచ్చిందని అనిపించుకున్నాను.
అనుకున్నట్లుగానే అమ్మా నాన్న కంగారు పడిపోయి నాకు పెళ్లి చేసేశారు. ఆయన మంచాయనే. అసలే కంగారు మనిషినైన నన్ను ఇంకా కంగారు పెట్టేవారు. ఆయనతో ఊరెళ్ళాలంటే బట్టలు సర్దడానికి కంగారు, రైలెక్కడానికి కంగారు, సాయంత్రం పార్క్ కి వెళ్ళడానికి కంగారు, తీరా వెళ్ళేక ఇంటికొచ్చేదాకా కంగారు. ఆ కంగారు లోనే ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్ళ గురించి ఇప్పటికీ కంగారే. వాళ్ళకి జ్వరం వస్తే, వాళ్ళు హోమ్ వర్క్ చేయకపోతే, పరీక్షలో మార్కులు తక్కువొస్తే, వాళ్ళ స్కూల్ బస్ రాకపోతే, టైముకి లంచ్ బాక్స్ తయారవక పోతే అన్నిటికీ కంగారే. ఎలాగైతేనే వాళ్ళు పెద్దవాళ్ళై పెళ్ళిళ్ళు చేసుకుని ఉద్యోగాలలో సెటిల్ అయ్యారు. ఈ లోపు కంగారెక్కువై అనవసరంగా ఆయన ముందే పైకి వెళ్ళి పోయారు.
కొడుకులు, కోడళ్ళు బాగానే చూసుకుంటారు. మనవలు వాళ్ళ ఆటలు, చదువుల లోకంలో వాళ్లుంటారు. వంట మనిషి వంట చేస్తుంది. పని మనిషి మిగతా పని అంతా చేసేస్తుంది. కొడుకు కోడలు ఆఫీసులకు వెళ్లిపోతారు. ఇంట్లో నేనొక్కదాన్నే. రోజంతా ఖాళీ. ఎవరైనా నన్ను ఏదైనా అడుగుతారేమో నని ఎదురు చూస్తాను. ఎవరూ ఏదీ ఆడగారు. కావలసినవి అనీ టైమ్ ప్రకారం అమరుస్తారు. ఎప్పుడైనా మనవలు టీవీ ఖాళీగా వుంచితే చూడడం లేదా పుస్తకాలు చదువుకోవడం. ఇప్పుడు నన్ను కంగారు పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. ఆ కంగారు పడిన రోజులే నాకు బాగున్నాయనిపిస్తోంది. అసలు కంగారు లేకపోతే జీవితమే లేదు అన్న సత్యం అవగతమౌతోంది. ఆరోగ్యవంతమైన కంగారు వుండాలి. పని పూర్తి చెయ్యాలి. ఒక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ ఉండాలి. లేకపోతే జీవితంఅంతా స్తబ్దుగా వుంటుంది. డిప్రెషన్, నిరాశ, నిరంతర విచారం మనకి తెలియకుండానే మనలో ప్రవేశిస్తాయి.
ఒక్కసారిగా నాలో ఏదో ఉత్తేజం కలిగింది. నా కంగారు నాకు కావాలి. కంగారు పడాలి. కంగారు పెట్టాలి. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. నేను చేయాలనుకుని ఇంతవరకు చేయని పనులన్నీ చేసేస్తాను. ఎవరేమనుకుంటే అనుకోనీ.
హాల్లోకి వచ్చి టీవీ పెట్టాను. యూట్యూబ్ ఓపెన్ చేసి నాకిష్టమైన పాత హిందీ సినిమా పెట్టుకున్నాను. ఈ రోజు మొత్తం సినిమా చూసే పడుకోవాలి అని నిశ్చయించుకున్నాను. ఒక పది నిమిషాలలో కొడుకు, కోడలు కంగారు పడుతూ గదిలోనుంచి బయటకి వచ్చారు కంగారుగా. “ఏంటమ్మా అర్ధరాత్రి పూట సినిమా పెట్టావు ?” అని అడిగారు. “నా ఇష్టం. నేను సినిమా చూసే పడుకొంటాను. మీకిష్టమైతే మీరు కూడా చూడండి” అన్నాను సీరియస్ గా. “వంట్లో బానే వుందా ?” ప్రశ్నించారు. “నిక్షేపంగా వున్నాను. వెళ్ళి పడుకోండి” అన్నాను అంతే సీరియస్ గా. చేసేది లేక అయోమయంగా వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు.
ఇకనించీ కంగారు పడడం అంటే ఏమిటో వాళ్ళకీ నేర్పిస్తాను అనుకుంటూ చిన్నగా నవ్వుకున్నాను.
(నండూరి బాల సుబ్రహ్మణ్యం)
No comments:
Post a Comment