Friday, April 24, 2026

 👿🩻👿🩻👿🩻👿🩻👿

*మృత్యువు ఎప్పుడూ మన వెంటే ఉంటుంది..!!*

👿👿👿👿👿👿👿👿

*సహైవ మృత్యుర్వ్రజతి సహ మృత్యుర్నిషీదతి*
*గత్వా సుదూర మధ్వానం సహ మృత్యుర్నివర్తతే*

‘‘పుట్టుట గిట్టుట కొరకే’’ అని ఒక మాట జనబాహుళ్యంలో విస్తృత ప్రచారంలో ఉంది. జన్మించిన ప్రతిజీవీ మరణించక తప్పదు. ఇది సృష్టి ధర్మం. ఈ విషయాన్నే రామాయణ మహాకావ్యంలో వాల్మీకి కూడా పలు సందర్భాల్లో చెప్పాడు. పుట్టిన ప్రతి వ్యక్తికీ మృత్యువు అతని వెంటే ఉంటుంది. అతనితోనే వస్తుంది. అతని సమీపంలోనే కూర్చుని ఉంటుంది. అతడెంత దూరం ప్రయాణం చేస్తే అంతదూరం ప్రయాణం చేస్తుంది. తిరుగు ప్రయాణంలో కూడా అతని వెంటే ఉంటుంది. అంటే మృత్యువు బారి నుండి జన్మించిన వాడెవ్వడూ తప్పించుకోలేడన్నది శాశ్వత సత్యం. ఎవరైనా అంగీకరించాల్సిన మాట.
కాబట్టే మనిషి జీవితం అశాశ్వతమన్న విషయం మనకు స్పష్టమవుతూ ఉంది. జీవించి ఉన్న కొద్దికాలంలోనే మనిషి తన జీవితానికి సార్థకత కలిగించే పనులు చేయగలగాలి. కానీ విషయలంపటుడైన మనిషి మానవత్వాన్ని మరచిపోయి అనేక దుర్మార్గాలకు, దుష్కార్యాలకు పాల్పడుతుంటాడు. తనలోని స్వార్థ గుణమే మనిషి చేత అనేక దుశ్చర్యలు చేయస్తూ ఉంటుంది. కొందరు స్వార్థపరులు నిరాటంకంగా ఇటువంటి పనులకు సిద్ధపడుతుంటారు. తమ జీవితం శాశ్వతమనే భ్రమలో బ్రతుకుతూ ఎన్నెన్నో అక్రమాలకు పూనుకుంటుంటారు. పైగా దాన్ని సమర్థించుకొనుటకై వితండ వాదాలు చేస్తూ ఉంటారు. మృత్యువెప్పుడూ మనల్ని అనుసరించి వస్తూనే ఉంటుందన్న నిజాన్ని విస్మరిస్తుంటారు.
 
మనిషి ఎప్పుడూ ఒంటరిగానే పుట్టి, ఒంటరిగానే చనిపోతాడు. కాబట్టి తన జీవిత కాలంలో తనకూ, తాను జీవించే సమాజానికి ఉపయుక్తములైన పనులు చేసినప్పుడే అతని జీవితానికి ఒక అర్థం ఉంటుంది. అంతేకాని తనకు తన వారికి మాత్రమే మేలు జరగాలన్న స్వార్థబుద్ది పనికి రాదని చెబుతూ ‘‘కఃకస్య పురుషో బంధుః’’ అంటూ వాల్మీకి ఈ లోకంలో ఎవరికెవరు బంధువు? అని వివరించాడు. అంతేకాదు, ప్రతిమనిషి కూడా ‘‘యదేకో జాయతే జంతురేక యేవ వినశ్యతి’’ అని కూడా చెప్పాడు. పుట్టుకలో ఒంటరి, చావులోనూ ఒంటరి అందుకే కేవల స్వార్థబుద్ధితో గాక లోక సంక్షేమ బుద్ధితో జీవించాలన్నదే మహర్షి అంతరంగం. ‘ఆయుస్తే హీయతే యస్య స్థితస్య చ గతస్య చ’’ వ్యక్తి ఆయువు గడచిపోతూనే ఉంటుంది, ఎక్కడ, ఎలా ఉన్నా, ఎక్కడ కూర్చున్నా ఇది తప్పదు. అందుకే ఈ సత్యం తెలిసి మనిషి తన పనులు చేసుకోవాలన్నదే రామకథ చెప్పిన సందేశం.

*నందంత్యుదిత ఆదిత్యే నందత్యస్తమితే రవౌ*
*ఆత్మనో నావబుద్ధ్యంతే మనుష్యా జీవితక్షయమ్‌*
 
‘‘కానీ లోకంలో చాలా మంది మానవులు సూర్యుడుదయించాడని, సూర్యుడు అస్తమించాడని ఆనందపడిపోతుంటారు. కానీ తమ ఆయుష్షును ఈ పగలు రాత్రులే అపహరిస్తున్నాయన్న విషయాన్ని మరచిపోయి ప్రవర్తిస్తుంటారు.’’ అందుకనే పెద్దలు జీవితం బుద్బుద ప్రాయమన్నారు. నిత్యం మన నీడ వలెనే మృత్యువు మన వెంటే నడుస్తుంటుందన్న సత్యాన్ని ఏ నాటికీ మనిషి విస్మరించరాదన్నదే మహర్షి వాల్మీకి తన రామాయణం ద్వారా బోధించాడు.

*నిరంతరం ఆధ్యాత్మిక ఆనందం*

🩻🩻🩻🩻🩻🩻🩻🩻

No comments:

Post a Comment