పలకరింపు
'హమ్మయ్య! దర్శనం పూర్తయ్యింది. చాలా సంతోషంగా ఉంది. కదండీ!' సింహద్వారం నుండి అడుగు బయటకు పెడుతూ, శ్రీవారితో అన్నాను. 'శాంతా! దర్శనంతోనే సరి పెడతావా?
ఇంకా సాగర సంగమం, అన్నా- చెల్లెళ్ళ గట్టు కూడా చూడాలంటావా?' శ్రీవారు నాకేసి సందేహంగా చూస్తూ అన్నారు.
నేను బదులుగా, 'కోనసీమ జిల్లాలోనే అంతర్వేది ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. మాఘమాసంలో భీష్మ ఏకాదశి నాడు స్వామి కల్యాణం జరిగే చోటిక్కడే. భక్తులు, ఎక్కడెక్కడి నుండో తండోపతండాలుగా వస్తారు. అంతటి గొప్పదైన అంతర్వేది నా పుట్టిల్లు కూడాను. స్వామివారు కొలువైన ఈ చోటుకు వచ్చి, అన్నీ చూడకపోతే ఎలాగండీ?' నవ్వాను.
'తెలుసు శాంతా! అయినా అడగడం నాకలవాటు. సంక్రాంతికైనా నీ పుట్టింటికి రాకుండా ఉన్నావేమో కానీ, ఏటేటా భీష్మ ఏకాదశికి ఒక్కసారైనా రాకుండా ఉన్నావా? సరే పద' అన్నారు.
నేను నవ్వుకున్నాను. 'అలా రండి దారికి!' అంటూ సాగర సంగమానికి వెళ్లి, తిరిగి తీర్థంలోకి వచ్చాం. రోడ్డుకు ఇరువైపులా లెక్క లేనన్ని దుకాణాలు. దర్శనం జరిగే చోటే కాదు, ఇక్కడా కిక్కిరిసిపోయిన జనం. ఒకవైపు పామును బయటకు తీసి, బుస కొట్టిస్తూ, చిల్లర ఏరుకునే వాళ్ళు. మరోవైపు కోతులను ఆడిస్తూ డబ్బులు దండుకునే వాళ్ళు. మరోవైపు అవయవలోపంతో దారిన పోతున్న జనం కేసి దీనంగా చూసేవాళ్ళు..
'కాలం ఎంత పురోగమించినా, దీనుల గతి తిరోగమనమే' శ్రీవారితో అన్నాను.
'కూటి కోసం కోటి పాట్లు' అంటూ అందరికీ డబ్బులు వేస్తూ నా వెనకే వస్తున్నారు శ్రీవారు.
'అన్నదానానికి విరాళం ఇచ్చేదాతలు గుడి పక్కనే ఉన్న కౌంటర్ వద్దకు రండి!' అంటూ మైకులో గట్టిగా చెబుతున్నారు.
'స్వామివారి కల్యాణం అక్షింతలు కావలసిన వాళ్ళు, గుడి వెనుక కౌంటర్ వద్దకు రండి!' అంటూ మరోవైపు చెబుతున్నారు.
శ్రీవారు నన్ను దుకాణం వద్ద ఉండమని చెప్పి, అన్నదానానికి విరాళం ఇచ్చి, స్వామివారి కల్యాణం అక్షింతలు కూడా తెచ్చారు.
నేను నిలబడిన గాజుల దుకాణం వద్దకు వెళ్లి, 'బాబూ! రెండూ ఆరూ సైజువి ఓ పది డజన్ల ఆకుపచ్చని మట్టి గాజులు త్వరగా ఇచ్చేరు' అంటున్నారు.
'నేను ఇంకా అడగలేదే?' నవ్వుతూ అన్నాను.
'అనుభవం నేర్పిన పాఠం' నవ్వుతూ బదులిచ్చారు.
'ప్యాక్ చేసిన గాజులను జాగ్రత్తగా సంచిలో పెడుతూ, 'శాంతా!హైదరాబాద్‌లో మన అపార్ట్‌మెంట్‌లో ఎవరి బతుకులు వారివి. ఒక్కరూ ఎదురుపడితే పలకరించరు. మనం పలకరిస్తే పట్టించుకోరు' అని నేనెన్ని సార్లు చెప్పినా నువ్వు, వినవని నాకు తెలుసుగా? నువ్వు నవ్వుతూ "దేవుని గాజులు" అంటూ అపార్ట్‌మెంట్లో ఆడవాళ్లకిస్తావు. కానీ వాళ్ళు మూతి ముడుస్తూ తీసుకుంటారు. ఇదీ నాకలవాటేగా?' అంటూ నవ్వారు.
అంతలోనే ఒక బాబు ఒక్కసారిగా ఆరునొక్కరాగం అందుకున్నాడు. 'వాడి దగ్గర ఎవరూ లేరనుకుంటా?' దిక్కులకేసి చూస్తూ దీనంగా ఏడుస్తున్నాడు. దారినపోయే వారెవ్వరూ వాడికేసి కనీసం చూడట్లేదు. పట్టించుకోవట్లేదు. వాడి వయసు మూడు, నాలుగేళ్ళ మధ్యన ఉంటుందేమో? నేను ఉండబట్టలేక అమాంతం వాడి వద్దకు వెళ్ళాను. జనాల మధ్యలో ఒంటరిగా నున్న వాడిని దగ్గరకు తీసుకున్నాను.
విచిత్రం, బాబు నన్ను చూడగానే ఏడుపు ఆపేసాడు. చేతులు ముందుకు చాపుతూ నన్నే చూస్తున్నాడు. పెళ్ళై పదేళ్లయినా, ఒక్క కాయ కూడా నా కడుపున కాయలేదు. కానీ చిన్న పిల్లలంటే నాకెంతో ఇష్టం.
'దొరికినంత మాత్రానా! వీడి తల్లివి కాలేవు. మూడేళ్ళ పిల్లాడు తప్పిపోయాడని కౌంటర్ వద్ద బాబు తల్లి ఉందని, మైకులో చెబుతున్నారు' పదమంటూ శ్రీవారు నన్ను కౌంటర్ వైపు దారితీయించారు.
'బాబును కన్నతల్లికి అప్పగించేంత వరకైైెనా తల్లిగా ఉండొచ్చు కదండీ' వాడికి ముద్దు పెడుతూ అన్నాను. శ్రీవారు నా పరిస్థితిని గమనించి, జాలిగా చూశారు. కౌంటర్ వద్దకు వెళ్ళగానే, బాబు తల్లి అమాంతం బాబును నా దగ్గర నుండి ఎత్తుకోబోతూ, నన్ను చూసి ఆశ్చర్యపోయింది. ఒక్కసారిగా ఆగింది.
'బాబు, మిమ్మల్ని చూసి చేతులు చాపాడు కదా? అవాక్కైపోయారా?' అని అడిగింది.
'మీ బాబు కాదా?' అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ విస్తుపోతూ బాబు తల్లిని అడిగింది.
'ఆమె పేరు సుధ. ఈమె బాబును కన్నతల్లి' నేను చెప్పాను.
సుధ నా కేసి మళ్ళీ చూసింది.
'మీకెలా తెలుసు?' అని మహిళా కానిస్టేబుల్ నన్ను అడిగింది.
బాబును ఎత్తుకోమంటూ సుధకు ఇచ్చాను.
'హైదరాబాద్‌లో ఒకే అపార్ట్‌మెంట్‌లో కొన్నేళ్లుగా పక్క, పక్కనే ఉంటున్నాం. నాకు బాగా తెలుసు' కచ్చితంగా అన్నాను.
'కానిస్టేబుల్.. సుధ చేత కాగితం మీద సంతకం పెట్టించుకుంటోంది.
తలుపు తీయగానే సుధ కనబడితే నవ్వుతాను. బదులుగా నవ్వదు. పలకరించబోతే, నేల చూపులు చూస్తూ, తలుపు వేసేస్తుంది. స్మార్ట్‌ఫోన్ వచ్చాకా, సిటీలో ప్రత్యేకించి అపార్ట్‌మెంట్స్‌లో దాదాపుగా ఇంతే. పక్కవాళ్ళు కదాని పలకరిస్తే, పలకరు. సెల్‌ఫోన్ చూస్తూనే వేళ్ళు స్క్రీన్‌పై కదిలిస్తారు. సిటీకల్చర్‌కు సుధ ఏమీ తీసిపోలేదు. బాబు నన్ను చూసి నవ్వినా, వద్దంటుంది. నన్ను ఎత్తుకోమని చేతులు చాపినా, బలవంతంగా వాడి చేతులు వెనక్కు నెట్టేస్తుంది. మాట లేకున్నా, జంతువులన్నీ అడవిలో ఒకచోట ఉంటాయి. స్నేహంగా మెలుగుతాయి. మాట వచ్చిన మనుషులు మాత్రం పలకరింపును మరచిపోయారు. స్నేహాన్ని వదిలేశారు.
'అక్కా' అన్న పిలుపుతో, ఒక్కసారిగా సుధ వైపు చూసాను.
'నన్నేనా పిలిచింది?' అన్నట్టుగా.
'అక్కా మీరు కూడా ఇక్కడికి వచ్చారా?' పలకరించింది.
'ఆ పలకరింపే బంధానికి పునాది' మనసులో అనుకుంటూ,
'సుధా! ఇదే నేను పుట్టిన ఊరు' అన్నాను నవ్వుతూ.
'చాలా సంతోషం అక్కా. ప్రతీ ఆషాఢంలోనూ గోరింటాకు ఇస్తావు. తీసుకుంటానే కానీ, థాంక్స్ కూడా చెప్పను. శ్రావణంలో శనగలు ఇస్తావు. పుచ్చుకుంటానే గానీ, కృతజ్ఞతగా కూడా చూడను. ఇప్పుడు ఏకంగా తప్పిపోయాడనుకున్న కన్న కొడుకునే తిరిగి నాకు తెచ్చిచ్చావు. నన్ను, మన్నించవా…' గొంతు సహకరించక పోవడంతో ఆగింది.
'పిచ్చిపిల్లా.. మనలో మనకు మన్నింపులెందుకు? ఇన్నాళ్ళూ ఒకేచోట ఉన్నా, మాటలు కరువైనాయి. ఇప్పుడు ఒక్కచోట కలుసుకోగానే, మన మధ్య మాటలు ప్రవాహమే అయ్యింది.. 'మా ఇంటికి రా?' ఆప్యాయంగా పిలిచాను.
'బాబు తప్పిపోయాడన్న బెంగలో సమయం చూసుకోలేదు. గంటలో నర్సాపూర్ ట్రైన్‌కు అందుకోవాలి వదిన గారూ' సుధ భర్త వరుస కలుపుతూ ఆప్యాయంగా అన్నాడు. 'వచ్చే సంవత్సరం ఇలా అంటే ఒప్పుకోము. శాంతా వాళ్ళింటికి మనందరమూ కలిసి వద్దాం. తిరిగి కలిసే వెడదాం. సరేనా?' మా శ్రీవారు సుధ, కిరణ్‌లకేసి చూస్తూ అడిగారు.
'తప్పకుండా, మా అక్క ఇల్లు, నాకు కూడా పుట్టిల్లే' సుధ నవ్వుతూ బదులిచ్చింది. అప్పుడే, రైల్వేస్టేషన్‌కు వెళ్లే బస్సు రావడంతో, బాబుతో సహా బయలుదేరారు. 'మా బంధానికి వారధిగా నిలిచిన బాబుకు నవ్వుతూ బై, బై చెప్పాను. 'పెద్దమ్మా.. బై.. బై..' వచ్చీరాని మాటలతో వాడు మాట్లాడుతూంటే, కళ్ళు చెమ్మగిల్లాయి. శ్రీవారు నన్ను అక్కున చేర్చుకుంటూ ఓదార్చుతున్నారు.
కె.వి. లక్ష్మణరావు
9014659041
No comments:
Post a Comment