అభిమానం,ఆప్యాయత, ఆనందం. సంతోషం
పదాలతో కథ
శీర్షిక; ఆపద్బాంధవుడు
రచన: లలిత రాయప్రోలు
" రండి రండి పెదనాన్న గారు! ఎప్పుడనగా బయల్దేరారో
ఏమో. ముందు బ్రష్ చేసుకుని రండి.
ఇప్పుడే పాలు పొంగాయి.
డికాషన్ కూడా తయారుగా ఉంది." శాంత ఆటోలో దిగుతున్న వెంకట్రావు గారి చేతిలో పెట్టె అందుకుంటూ ఆప్యాయంగా పలకరించింది.
" నీ ఆప్యాయత అంతా మా అమ్మ దగ్గిర్నుంచి వచ్చిందిరా తల్లిగా.
ఎప్పుడు సిటీకి పని మీద వచ్చినా, మీ ఇంటికి వచ్చినంత స్వతంత్రంగా మీ అక్క ఇంటికి వెళ్లలేను.
వెళ్ళింది మొదలు, " పెదనాన్నగారు! ఇడ్లీ పిండి ఉంది కానీ చట్నీకి కొబ్బరికాయ లేదు.
మీరు కాస్త వెళ్ళి, కొబ్బరికాయ, పుట్నాల పప్పు, పచ్చిమిర్చి తెస్తారా?
అన్నట్టు కొత్తిమీర కూడా ఓ నాలుగు కట్టలు తెచ్చేయండి.
అనో, లేకపోతే "ఇవాళ ఉపవాసం పెద నాన్న గారు! మీ అల్లుడు "హోటల్లో తినేస్తానులే." అన్నారు పాపం.
మీరు వచ్చారు కదా!
అన్నం వండేస్తాను. సందు చివర కర్రీ పాయింట్ నుంచి. పప్పు, కూర, ఆ పక్క షాప్ నుండి పెరుగు పాకెట్టు తెచ్చేస్తారా?
పప్పులో నంచుకోవడానికి, చిప్స్ పాకెట్ ఒకటి తెండి.
పెద్ద పాకెట్ అయితే, రేటు తక్కువ. మీకు తెలుసుగా" అనో
పన్లు పురమాయిస్తుంది." వెంకట్రావు గారు కమ్మగా ఉన్న కాఫీని బొట్టు బొట్టు ఆస్వాదిస్తూ తాగుతూ అన్నారు.
శాంత జవాబు చెప్పకుండా, వింటూ ఉంది.
" అమ్మాయ్! ప్లీడరు దగ్గిరకి వెళ్ళాలి.ఆయనతో
కాస్త టైం పట్టే పనే ఉంది.
టిఫిన్లు ఏమీ పెట్టుకోకు. ఏకంగా అన్నం తినేసే వెళ్తాను.
రాత్రి ఆఖరి బస్సుకి రిజర్వేషన్ అయింది." అని చెప్పి, పెట్లోంచి టవల్ తీసుకుని, స్నానానికి వెళ్ళారు వెంకట్రావుగారు.
శాంత తండ్రి, వెంకట్రావు గారి తండ్రి అన్నదమ్ముల మనవలు.
వెంకట్రావుగారికి పిల్లల్లేరు.
ఎవర్నీ పెంచుకునే ఉద్దేశం కూడా లేదు.
" పిల్లల్ని పెంచుకుని, వాళ్లకివ్వడానికి నాకేం ఉందయ్యా! ఆ పల్లెటూర్లో ఉన్న మండువా ఇల్లు, అరెకరం మడి
చెక్కానూ.
అవేవో మా తదనంతరం ఇల్లు అదే ఊళ్ళో ఉంటున్న మాకంటే పేద వాళ్ళకి, ఆ అరెకరం పొలం కౌలుకి చేస్తున్న రైతుకి ఇవ్వాలని మా ఇద్దరి కోరిక." శాంత తండ్రి నాగభూషణంగాటితో ఒకసారి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు వెంకట్రావుగారు.
" మంచి ఆలోచన అన్నయ్యా! ఈ కాలంలో కన్న పిల్లలే తల్లిదండ్రుల్ని కనిపెట్టుకుని, ఉండడం లేదు.
ఇంక పెంచుకున్న పిల్లలేం ఉద్ధరిస్తారు?" అన్నారు నాగభూషణం గారు.
ఆయనకి ఇద్దరు అబ్బాయిల తరవాత ఇద్దరు అమ్మాయిలు పుట్టారు.
ఉంటున్నది పల్లెటూరు కనక కొడుకులిద్దర్నీ సిటీ హాస్టల్లో ఉంచి, చదివించారు.
పెద్దవాడు డిగ్రీ చదువుతున్నప్పుడే, నక్సల్బరీ ఉద్యమానికి ఆకర్షితుడై, చేరిపోయి, ఆచూకీ తెలియకుండా అయిపోయాడు.
చిన్నవాడు హాస్టల్లో పని చేయడానిక్ వచ్చిన బీహారీ వాచ్ మాన్ కూతురి ప్రేమలో పడి, చెప్పా పెట్టకుండా ఆ పిల్లని తీసుకుని, ఎటో వెళ్ళిపోయాడు.
ఆడపిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు చేసేసి,బాధ్యతలు తీర్చుకుని, కంటికి కనిపించని కొడుకుల్ని తల్చుకుంటూ, కుమిలిపోతూ,
కాలం వెళ్లదీస్తూ ఉంటారు.
కాస్త జాతకాలు చూడ్డంలో ప్రావీణ్యత ఉంది కనక, చుట్టు పక్కల ఊళ్ల వారు వధూ వరుల జాతకాలు తెచ్చి
చూపించుకుని, ముహూర్తాలు పెట్టించుకుంటూ ఉంటారు.
ఆయన శంకుస్థాపన ముహూర్తం పెట్టారంటే, ఇల్లు కట్టడానికి డబ్బు దానంతట అదే అమురుతుందని పెద్ద పేరు.
శాంత వంట పూర్తి చేసేసరికి, వెంకట్రావు గారి అనుస్థానాలు కూడా పూర్తయ్యాయి.
శాంత భర్త సుగుణాకర్ దూరపు బంధువులెవరో చనిపోతే, పరామర్శించడానికి తల్లిని తీసుకుని వెళ్ళాడు.
కవల కూతుళ్లిద్దరూ కాలేజీ తరఫున ఖో ఖో ఆడడానికి భోపాల్ వెళ్ళారు.
సుగుణాకర్ సూపర్ మార్కెట్లో పని చేస్తాడు.
ఎదుగూ బొదుగూ లేని ఉద్యోగం అని కొన్ని ట్యూషన్లు కూడా చెప్తాడు.
శాంత పొదుపరి కనక, చిన్న అద్దె ఇల్లయినా కూరగాయలు
పండిస్తూ కూరలు కొనే ఖర్చు లేకుండా చేస్తోంది.
పిల్లలిద్దరికీ స్కాలర్ షిప్పులు వస్తాయి.
మొత్తానికి కుటుంబం అంతా ఉన్నంతలోనే, ఆనందంగా కాలం గడుపుతారని వెంకట్రావుగారికి ఎంతో ముచ్చట.
శాంత పెరట్లోంచి అరిటాకు కోసుకొచ్చి, వడ్డన చేసింది.
పొగలు కక్కుతున్న దంపుడు బియ్యపన్నం, బచ్చలి కూర పప్పు, నిమ్మకాయ రసం పిండిన అరటికాయ ముద్ద కూర, గోంగూర పచ్చడి, ఊరు మిరపకాయలు, కమ్మగా కాచిన నెయ్యి, మిరియాల చారు, చిక్కటి మజ్జిగతో వెంకట్రావు గారు తృప్తిగా భోంచేసి లేచారు.
ఆయన వచ్చినప్పుడల్లా శాంత పెరటి తోటని పరీక్షగా చూడనిదే వెళ్ళరు.
స్నానాలకి వాడే నీరు తిన్నగా అరటి చెట్లల్లోకి పోయేట్టు కాలవలు తీసారు.
శాంత చిన్న చిన్న మడుల్లో మెంతి కూర, తోటకూర, బెండ, వంగ చెట్లు వేసింది.
కాకర, సొర, పొట్ల, బీర తీగెలు కొన్ని పెద్ద చెట్లని ఆలంబనగా చేసుకుని, పాకుతున్నాయి.
బూడిద గుమ్మడి, మంచి గుమ్మడి తీగెలు ఓ వారగా నేలని ఆక్రమించాయి.
దాదాపు అన్ని మొక్కలు, చెట్లు పూత, పిందెలతో నిండి, మంచి ఆకుపచ్చరంగులో ఉన్నాయి.
సువర్ణ గన్నేరు, ఎరుపు, నారింజ రంగు ముద్ద మందారాలు విరగ బూస్తున్నాయి.
బియ్యం, పప్పులు కూరలు కడిగిన నీళ్లన్నీ బకెట్లో నింపి పెడితే, ఆ నీళ్లన్నీ సుగుణాకర్ మిగిలిన మొక్కల్లో పోసి వస్తాడని శాంత ఒకసారి చెప్పింది.
అతనికి సూపర్ మార్కెట్లో సరుకులమీద డిస్కౌంట్ వస్తుంది.
పాత స్టాక్ క్లియర్ చేసినప్పుడు ఇంకొంచెం ఎక్కువ డిస్కౌంట్ ఇస్తారట.
అప్పుడే కొంచెం ఎక్కువ తెచ్చుకుని, అప్పడాలు, వడియాలలాంటివి అత్త కోడళ్ళు కలిసి చేసుకుంటారట.
శాంత అక్క సుధ అదే ఊళ్ళో ఉంటోంది.
ఆమెకి ఇద్దరూ కొడుకులే అని చాలా గర్వం.
" శాంతకి, మరిదిగారికి తల కొరివి పెట్టడానికి కొడుకులు లేరు కదా! నా కొడుకులే పెట్టాలి. ఊరికే పెడతారేమిటి? అయినా ఏదన్నా ఇవ్వాలంటే మాత్రం వాళ్ళదగ్గరేముంది నా తలకాయ." అని వాళ్ళు వినేట్టే అంటూ ఉంటుంది.
ఒకసారి సుధ మాటలు విన్న సుగుణాకర్ మళ్ళీ వాళ్ళింట్లో అడుగు పెట్టలేదు.
సుధ కొడుకులు ఎంత పాడవచ్చో అంతా పాడయ్యారు.
తల్లిదండ్రుల మాట వినే ప్రసక్తే లేదు.
కాలేజీకి వెళ్లకుండా, అక్కడా ఇక్కడా తిరుగుతారని, మా ఇళ్లల్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నారని ఒకళ్ళిద్దరు
చెప్పినా, సుధ వాళ్ళతోనే పోట్లాడింది.
" ఎవర్ని చూసి ఎవరనుకుంటున్నారో? మా పిల్లలు ఇల్లు, కాలేజీ తప్ప ఇంకో చోటికే వెళ్ళరు. మరోసారి ఇలా ఇంటి మీదకి వస్తే, మర్యాదగా ఉండదు." అని బెదిరిస్తే, ఆవిడ చూడకుండా భర్త సర్ది పంపిస్తాడు.
ఇద్దరికీ ఇంజనీరింగ్ లో బోలెడన్ని బాక్ లాగ్స్ ఉన్నాయి.
.
పెద్దవాడు ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తున్నాడని, అబద్ధాలు చెప్పి, పెళ్లి కుదుర్చుకుని, తాంబూలాలకి అమ్మాయి వాళ్ళని పిలిచారు.
ఆడ పెళ్లి వారి దగ్గర బంధువులు శాంత ఇంటి దగ్గరే ఉంటారు.
వాళ్ళతో శాంతకి మంచి స్నేహమే ఉంది.
శాంత ఆవిడతో ఒకసారి మాటల సందర్భంలో , "మా అక్క కొడుకులు సరిగా చదవరు." అని చెప్పింది.
తాంబూలాలప్పుడు శాంతని అక్కడ చూసిన ఆవిడ, శాంతకి ఒకర్తే అక్క అని తెలుసుకుని, పెళ్లి కూతురు వాళ్ళని
ఇంకొన్ని వివరాలు తెలుసుకోమన్నారు.
" అబ్బాయి ఆఫీస్ ఎక్కడ? ఏం పని చేస్తున్నాడు?" అని పెళ్ళికూతురి మేనమామ గుచ్చి గుచ్చి అడిగేసరికి, సరైన సమాధానం లేదు.
దాంతో పెళ్లి కాన్సిల్ అయిపోయింది.
అప్పటినుండీ సుధ చెల్లెల్ని శత్రువులా చూడ్డం మొదలెట్టింది.
భర్త మంచి ఉద్యోగమే చేస్తున్నా, ఎప్పుడూ లేదు, లేదని అనడం ఇద్దరికీ బాగా అలవాటు.
మళ్ళీ శాంత లేమిని ఎత్తి చూపి, " వేపుళ్లు లేందే మా ఇంట్లో ఎవరూ ముద్ద ఎత్తరు. ఆకుకూరలు వండితే, మా చిన్నవాడు "గడ్డి వండావా?" అని తిననే తినడు." అనడం మాత్రం సుధకి నిత్య కృత్యం.
వెంకట్రావుగారు అప్పుడు వెళ్ళి, మళ్ళీ రాత్రి ఏడు గంటలవుతుంటే వచ్చారు.
"పెదనాన్నగారు! వెళ్ళిన పని అయిందా?" కుండలో చల్లని నీళ్లు అందిస్తూ అడిగింది.
" కోర్టు పనులు ఒక పట్టాన తెమలవు. అలా అని వదిలేసి కూర్చుంటే, అక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటాయి. అన్నట్టు మీ పెద్దమ్మ నీ కోసం ఒక చీర కొనమంది." అంటూ శాంత చేతికి ఒక చీర కవరు అందివ్వబోయారు.
శాంత అందుకోకుండా, అభిమానపడి, " వద్దు పెదనాన్నగారు! మీరు కిందటిసారి చీర కొని తెచ్చిచ్చినప్పుడు ఆయనకు చూపిస్తే,
"అన్నం పెట్టి, కానుకలు వసూలు చేస్తున్నావా?" అని కోప్పడ్డారు.
ఇప్పుడు వద్దండీ. నేను మీ ఇంటికి ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకుంటాను." అంది.
వెంకట్రావుగారు శాంత తల నిమిరి, చేతిలో చీర కవరు బలవంతంగా పెట్టేసి," తల్లీ. మీ అభిమానం నాకు తెలియనిదా?
ఒకసారి నీ కూతురి పుట్టినరోజు అని అయిదు వందనోట్లు
ఇవ్వబోతే, " ఒక్కటి చాలు తాతగారు." అని మిగిలినవి నాకిచ్చేసింది.
ప్లీడరు గారింటికి, వెంకటగిరి నుండి ఒకతను వాడుకగా చీరలు తెస్తాడట.
"మంచి నేత, ధర కూడా ఎక్కువ చెప్పడు." అని ప్లీడరుగారి
భార్య చెప్తే, మీ పెద్దమ్మకి, నీకూ తీసుకున్నాను......" అంటుండగా, ఫోను మోగింది.
" ................."
" అలాగా! చాలా సంతోషం....!
"..................."
"ఎప్పుడొస్తున్నారు? జాగ్రత్తగా రండి."
" ............"
" నాన్న, మామ్మ ఊరెళ్ళారు. రేపు వస్తారు. రాగానే చెప్తానమ్మా!"
చెల్లి ఎలా ఉంది? " శాంత అవతల వాళ్ళు చెప్పేది విని ఫోన్ పెట్టేసింది.
శాంత మొహం వెలిగిపోతోంది.
" పెదనాన్నగారు! పిల్లల ఖో ఖో టీమ్ గెలిచిందట.
ఇది మూడోసారి కనక, షీల్డ్ కాలేజికే ఇచ్చేస్తారట." అని వెంకట్రావుగారికి చెప్పింది.
" చాలా బాగుంది తల్లీ. సంతోషం! నీ పిల్లలు ఇలాగే మరిన్ని విజయాలు సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను."అన్నారు వెంకట్రావుగారు.
" పిల్లలు బాగా ఆడతారని వాళ్ళ ఫిజికల్ డైరెక్టర్ కావలసిన బట్టలు, షూస్ ఎవరితోనో స్పాన్సర్ చేయించాడు.
చిన్నది టీమ్ లీడర్. పెద్దది ఫస్ట్ ఇంటర్ లో కాలేజ్ టాపర్.
వాళ్ళ ప్రిన్సిపల్ కి వీళ్ళంటే చాలా ఇష్టం అట.
స్పోర్ట్స్ కోటాలో ఇంజనీరింగ్ సీట్లు ఇప్పిస్తానని అంటున్నారు.
అయినా పుస్తకాల ఖర్చులవీ ఉంటాయి కనక, అత్తయ్యగారి వడ్డాణం అమ్మేద్దామని ఆవిడ అంటున్నారు కానీ, మా ఇద్దరికీ ఇష్టం లేదు." శాంత వెంకట్రావుగారికి, వేడి మినపట్లు,అల్లం చట్నీ వేసి పళ్ళెం అందించింది.
" మీ అత్తగారికి వడ్డాణం ఉందా?" వెంకట్రావు గారు ఆశ్చర్యంగా అడిగారు.
" అవును పెదనాన్న గారు! ఉంది. ఆవిడ పుట్టింటివాళ్ళు బాగా ఉన్నవాళ్ళట.
వాళ్ళ అమ్మగారి వడ్డాణం ఆవిడ తదనంతరం ఇచ్చారట.
అప్పటికే మా కుటుంబం బాగా చితికి పోయినా కూడా, మా మామగారు దాన్ని మాత్రం ముట్టుకోలేదట.
ఎప్పుడైనా పేరంటాలకి పెట్టుకెళ్ళమని, భోషాణం లోంచి తీసి ఇస్తే, మెడలో పసుపు తాడు వేసుకుని, నడుముకి బంగారం వడ్డాణం పెట్టుకెళ్తే, చూసినవాళ్లు నవ్విపోతారని, పెట్టుకునేవారు కాదు.
మా పెళ్లిలో నాగవల్లి అప్పుడు నగలేం పెట్టలేదని అందరూ అనుకున్నా, అప్పుడు వడ్డాణం పెడితే, అతిగా ఉంటుందని, కొంగు బంగారం కింద ఇమ్మన్నారట కానీ మా ఆయన "నీ దగ్గిరే ఉండనీ అమ్మా!" అని తీసుకోలేదట." శాంత మాట్లాడుతూనే, పెద్ద గ్లాసు నిండా పల్చని మజ్జిగ తీసుకొచ్చి ఇచ్చింది.
" శాంతా! పిల్లల చదువుల గురించి, చింత పడకండి.
ప్లీడరు గారి వియ్యంకుడికి ఇంజనీరింగ్ కాలేజీ, డెంటల్ కాలేజీ ఉందని ఒకసారెప్పుడో చెప్పారు.
మనవాళ్ళకి ముఖ్యంగా ఆడపిల్లలకి మంచి మార్కులు వస్తే ఇంజనీరింగ్ చదివిస్తారట.
అప్పటికి నీ పిల్లలు చిన్న క్లాసుల్లో ఉన్నారని చెప్పలేదు.
ఈసారి వచ్చినప్పుడు పిల్లల్ని తీసికెళ్ళి, ప్లీడరుగారికి చూపిస్తాను. సరేనా! ఇంక బయల్దేరతానమ్మా! అల్లుడ్ని అడిగానని చెప్పు.
వదిన గారికి నా నమస్కారాలు చెప్పు."
శాంత ఇంకేం మాట్లాడకుండా ఆయన కాళ్ళకి దణ్ణం పెట్టింది.
వెంకట్రావుగారు ఆటో పిలుచుకుని ఎక్కి వెళ్తుంటే గుమ్మం దగ్గిరే నిలబడి, వీడ్కోలు చెప్తున్న శాంతకి వెంకట్రావుగారి
ఆటో కనుమరుగవుతుంటే, ఆయన మంచితనం తలుచుకుంటుంటే, కళ్ళు నీటి చెలమలే అయాయి.
.
No comments:
Post a Comment