_(నామిని సుబ్రహ్మణ్యం గారి *"సినబ్బ కతలు"* నుంచి ఒక కత....మీకోసం...)_
_[ఒక్కసారి రుచి చూడండి.... భలే కమ్మగా ఉంటాదిలే....--VNR]_
*_కథ:- “మాయింటి తీగూర ఇజీకోల్టు పొరుగింటి పుల్లగూర”_*
🥙🍛🥗🍛🥗🍛🥗🍛
*నేనే ననుకుంటే మా నాయిన నాకన్నా పసిపిలగోడుగా తయారైనాడు. మా మిట్టూరు నుంచి మూడు మైళ్ళకాపక్కనుండే యెంగటాపురం అయిస్కూలుకు పొయ్ ఏడోతరగతి చదివే నేను- మాయమ్మ కేరీర్లో ఏమి పెట్టిస్తే దాన్నే ఎత్తకపొయ్- నోటి మాట ఎత్తకుండా తింటా వుండాననుకో..., నన్ను చూసి అయినా మా నాయిన బుద్ధి తెచ్చుకోని మా యమ్మ ఏమి పెడితే అది తినేసి, పీటమింద నుంచి పైకిలేచి తేపుకుంటా పోవద్దా?*
_(దొంగనాకొడుకుని కత కోసమని ఈమాదిర్తో ఇక్కడ రాస్తుండానే గానీ... తిండికాడ, నీళ్ళకాడ నేను మాయమ్మను ఎన్ని ఉరిబాధలు పెట్టుండలేదూ? అవన్నీ మళ్లెప్పుడన్నా చెప్తాలే! ముందు కతలోకి పోదాం పదండి.....)_
*మా నాయిన తిండికాడ కుచ్చుంటే చాలు, మొకం మటమటలాడించే వోడు. సంగటి ముద్దలో నుంచి ఒక్కొక్క కవణాన్నే తుంచుకోని, కూరలో అద్దుకొని, బలంతంగా మాత్తర్లు మింగినట్టు మింగేటోడు. _“ముండమొకం యెదవా, తిండిని ఎంత ఇష్టంతో తినాల. అంత కష్టంతో తింటే అది ఒంట బడితిందా?"_ అని తిట్టేది మాయమ్మ మా నాయిన్ను. మా పాపిస్టోడు పుల్లగా, కారంగా.. ఎంతో జమ్మాచారంగా ఉండే కూరనుబట్టుకోని, “చవ్వంగా వుండాది, దీంట్లో నాలుగు ఉప్పురాళ్ళు కూల్చెయ్" అనేవాడు. ఈ మాటకు మాయమ్మ నాకల్లా జూసేది. నేను తింటా వుండినోడినల్లా పైకిలేచి మా నాయిని తల యెంటికల్ని చేత్తో పట్టుకొని, _“ఆల్రైటుగా వుండే కూరను బట్టుకోని వొప్పీరం చెప్పతావా? నోరు మూస్కోని గమ్మున తినకుండా... ఏమి చెప్తావు? అమా, అందుకో కట్టె"_ అని బెదిరించేవాడ్ని. మాయమ్మ దయతలిచి కట్టి అందుకోకుండా, "ఆ జుట్టు వొదులురా సామీ, కూడు తినకుండా లేచి పూడవబోతాడు!" అని మాట్లాడేది. మా నాయిన నాతో (తగరారు) పెట్టుకుంటే సంగటికూడా దొరకదని తెలిసి సిన్నయిలూ! మీ వొదినోళ్ళింటికాడ అంతకూర యేగించుకుని రాబో, నేను తినలేను ఈ నాశినాన్ని!" అన్నాడు ఒద్దికగా. ఇంక ఆ మొగోడ్ని ఏమి జేసేది చెప్పండి? నేను మా నాయిన జుట్టొదిలేసి మా వొదినోళ్ళింటికి గిన్ని ఎత్తుకొని పొయినాను, ఆ రోజు మా వొదినోళ్ళది బెండకాయ ఊరుబిండి, పిడికిడు వూరుబిండిని వెయ్యించుకొని, ఈదిలోకి వచ్చి నాలికమింద యేసుకుందునుగదా-! "తూ నాశినం" అనే టైపులో ఉండాది ఆ వూరుబిండి. దాన్నెత్తకొచ్చీ రాంగానే మాయమ్మగూడ దాన్నంత నాలిక మింద యేసుకోని నా మాదిర్తోనే అనింది. "మనకా పూరుబిండి తూ నాశినం, మీ నాయినకు అదేగదా తిరమలకొండ లడ్డు, ఊల్లోళ్ళు చేసిన ఏ కూరన్నా అంతే.. ఆ ఈనపు మొగోడికి. వోడి గుంతలో ఎయ్ దాన్ని” అని మా అమ్మ అనంగానే నేను ఆ పూరుబిండిని మా నాయిన గిన్నిలో యేసి నాను. నేనూ మా అమ్మ ఏందో పనుండి పెళ్ళోకి పొయ్ వచ్చి చూద్దుము గదా-- మా నాయిన గిన్నెలో ముద్ద వుడీస్ అయిపోయ్యుండాది. మా నాయిన గిన్నిని, చెయ్యిని మార్చి మార్చి జాము సేపు నాకతా వుండిపోయ్నాడు.*
*మా యమ్మ మా నాయిన్ని పొడుగ్గా చూస్తా “ఆమాత్రం తిండి ఈ ఇంట్లో కూరతో తినుంటే నాకు అంతకుమించి ఏమిగావాల! జల్మరాత, ఆ తల్లి [మావొదిన] జేసుకున్న పుణ్యం" అనింది ఒళ్లు మరిచిపోయ్. దీనికి మా నాయిన నవ్వుమొకంతో, _"ఆ మాదిర్తో కూరలు చేసేది నేర్చుకో, బెండకాయ వూరుబిండి నువ్వూ నూరతావు, ఏమిటికి, కుక్కలకు యెయ్యనా!" అనేసి పెళ్ళోకి బొయ్ నాకిన చెయ్యిని నాకతానే కడుక్కున్నాడు. ఇంకొంచేపు తాలినాక మా వదిని గోడకాడికి వచ్చి, "సినబ్బా! మీదేమి కూర?" అనడిగింది. నేను ఆ మాటతోగూడా, మా అమ్మ చేసిన చేమగెడ్డల పులుసును యేసకపోయ్ మా వొదినకిస్తేవాళ్ళు తొట్ట లేసుకుంటూ తినేసినారు. మాయమ్మ చేమగెడ్డల తోలు తీసేసి, చింతపులుసు దండిగా పోసి నెంబర్వన్గా చేసింది ఆ కూరను. కోడిగుడ్ల పులుసు ఆనాటి మా చేమగెడ్డల పులుసు కాళ్ళ సందన దూరినా పనికొచ్చుండదు. ఆ కూరే మా నాయనకు సగించలేదంటే ఇంక మాయమ్మ ఏ బాయిలోకి పోయి దూకితే కర్మాలు తీరును?*
*ఒక పూట అని గాదు, దినానికి మూడు పూటలంటే.. మూడు పూటలూ మా నాయినతో ఈ మాదిరిగా మా అమ్మ గాబట్టి యేగులాడింది గానీ, ఆ సీతమ్మతల్లి అయినా కుండాజట్టీ మా నాయిన మొకాన వొక్కలే సేసి పుట్టింటికి పూడిసుండేది.*
*మేము చేమగెడ్డల కూర వేసిన మూడు నెలలకేమో మా వొదిన అదే చేమగెడ్డలకూర జేసింది. మేము నిజ్జంతోనే మా వొదిన ఆ నాడు జేసిన బెండకాయ వూరుబిండి చేసినాము. మా నాయినకు సంగటి ముద్ద యేసి, దాన్లో బెండకాయ ఊరిబిండి యేస్తే, కవణం గిన్ని ముందర కూర్చుని పక్కచూపులు చూస్తాడేగాని, పిడికిడితో పిడికిడు ఎత్తుకోని మింగడే! నేను కూరగిన్ని ఎత్తకపోయ్ మా వొదినోళ్ళింటికాడ నుంచి చేమగెడ్డల పులుసు ఎత్తకొస్తే మా నాయిన, "కూర నోటికి ఎంత రుసిగా వుండాది!" అని ఇచ్చిత్రపోయి రెండు సంగటి ముద్దలు మింగేసి మంచం మీద చేరినాడు. ఇంక ఈ కడుపుమంటకు మేము యాడబోదుము?*
*ఇది జరిగిన నాలుగు నాళ్ళకు నాకు ఒక అయిడీ వచ్చింది. ఈ ముండమొకం యెదవతో యిట్టగాదు, యింగ ఈ అయిడీని అమలులో బెట్టి తీరాల్సిందే!" అని ప్లాను యేసుకున్నాను. ఒకరోజు మా అమ్మ బలే దరిద్రపు కూర జేసింది. గబగబా అన్ని నీళ్ళల్లో బీరకాయలు కోసి ఉడకబెట్టి, అన్ని శెనిగ్గింజలు కొట్టి తియ్యంగా చేసింది. ఆ కూరతో నేనే ఒక్క కవణాన్ని కూడా తినలేకపొయ్నాను. మా అమ్మకు జరగదు గాబట్టి అరముద్ద తినేసి చెయి కడుక్కునేసింది. మా అక్క అంత ఊరగాయ ఊటతో సాంగించేసింది. యింగ కాసేపిట్లో అనగా.. మా మగమకారాజు మంచం మిందనుంచి తిండికి దిగబోతాడు.*
*ఆ రోజు మా వొదిన [మా పెదనాయిన కోడలు] వొంకాయ పుల్లగూర చేసింది. దాన్ని కూరగిన్నిడుతో కూరగిన్నిడు కూర వెయ్యించ కొచ్చి పెట్టినాను. ఆ కూర బ్రమ్మాండంగా వుండాది.*
*మా నాయిన, "సినబ్బా! మనది ఏమికూర నాయనా!" అనడిగినాడు.*
*నేను తడుముకోకుండా, "వంకాయపుల్లగూరగదా!" అనేసినాను.*
*మా నాయన యధాప్రకారం! "బలే తేమగా ఉండపోతిందిలే!" అని యెక్కిరిస్తా వచ్చి పీటముందర కూచ్చున్నాడు. మాయమ్మ గిన్నెలో ముద్ద సంగటేసింది. నేను వంకాయ పుల్లగూరను మా నాయిన గిన్నెలో యేసినాను, మా నాయిన ఒక్క సంగటి కడిని వంకాయ పుల్లగూరతో అద్దుకొని నోట్లో పెట్టుకొని, “తూ నాశినం!” అనేసి "పక్కింటోళ్ళ కూరేమి!” అనన్నాడు. నేను "బీరకాయ తియ్యగూర. యెయ్యమంటావా?" అనన్నాను.*
*"ఉంటే యెయ్!" అనన్నాడు, మా నాయన ఆత్రం ఆత్రంగా.*
*మా బీరకాయ తియ్యగూరను ఎత్తకపొయ్ గిన్నెలో యేస్తే నాకినాకి నిమిసంలో ముద్ద తినేసి రెండో ముద్ద కోసరం మాయమ్మకల్లా ఎగజూసి నాడు. మాయమ్మ రెండో ముద్ద యేసింది.*
*మా నాయిని బాగా సగించినట్లు తింటా తింటా, "ఇదీ కూరంటే! నోటికి ఎంత రుసిగా ఉండాది! నీ జల్మలో ఇటుమంటి కూర చేసుందువా?” అనన్నాడు.*
*మా అమ్మ, “నిజమేలే, యింగలెయ్, నీ ముండ మొకాన ఎండ కాసిందిగాని!" అనింది నవ్వుమొకంతో!*
*ఆ రోజు మాయస్ము, మాయక్క, మాయన్న, నేను నవ్విన నవ్వును. యింగ ఏ జల్మలో నవ్వవోతాము?*
*🤪🤪🤗-----అబ్బా! ఇట్టా కథంతా టైపుజెయ్యడానికి నేనెంత కస్టపన్నానో.. మీకేందెలుసు...?*
*అది సరేలేగానీ.. ముందు ఈ కత సదూకోండి సాములారా! ఈ ఒక్క కత్తోనే మీకు తృప్తి గలగదులే.. అందుకే పుస్తకం కొనుక్కోనిగానీ డౌన్లోడ్ చేసుకోనిగానీ కచ్చితంగా సదువుతారులే! సరేగాని సదివినాక మాత్రం "నామిని" గారికి థ్యాంక్స్ జెప్పడం మర్సిపోబాకండేం..*
=================
*_{ఒరే..ఒరే.. ఇదేందయ్యో.. నాగ్గూడా ఈ సిత్తూరోల్ల బాస-యాస ఒంటబట్టేసినట్టుండాదే..! బలే చిత్రం గదా..! 🙏 🙏 🙏 మీ... --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు, ఆత్మకూరు పట్టణం, నెల్లూరు జిల్లా🙏}_*
No comments:
Post a Comment