*సండే స్టోరీ*
*అమూల్యం*
📚
రచన : ఉదయ భాస్కర్
కన్నడ అనువాదం : వి. రాఘవేంద్ర రావు
"కష్టాలు.. నష్టాలు.. ఏది తలపెట్టినా భ్రష్టుపట్టి పోతోంది. ఆదాయం అర్థ రూపాయి, ఖర్చు రూపాయి. ఎక్కడ చూసినా చుక్కెదురు. జీవితం అంటేనే విరక్తి. నే చెప్పేది నిజమైతే ఔ'ననండి”
ఔనన్నాను. ఎదురుగుండా కుర్చీలో నిండుగా కూచున్నాడు డెబ్భై ఏళ్ళ ఆ మహానుభావుడు! పొట్లకాయ లాంటి శరీరం. గుమ్మడికాయంత తల. ఆ తలలో టొమాటోల్లాంటి కనుగుడ్లు. మునక్కాడ లాంటి ముక్కు. ముక్కు కింద వున్న నోటికి కంచె కట్టినట్టు మీసాలు. ఎర్రని పట్టు పంచె. భుజాన జరీ కండువా. రోడ్డుకి అడ్డంగా పాతిన గుంజల్లా మొహాన మూడు విభూతి పట్టీలు. ఆ మధ్యన వేలాడే డేంజర్ లైటులా నొసటి కుంకుమ. ఎ టు జెడ్ నిడివి ఉన్న పేరు. అ నుంచి అః దాకా బిరుదులు. చేతి వేళ్ళు కూడా విడిపోయేంత మందాన మూడు పెద్ద బంగారు ఉంగరాలు. ఆయన లోపలికి రాగానే నా వాలకం కనిపెట్టేశారు. నన్ను పట్టేశారు.
"బతుకు బరువనిపిస్తోంది కదూ?" పంతులుగారి వాగ్ధాటి ఊపందుకున్నది.
“నిజమే”
"మిత్రులు శత్రువులయ్యారు. బంధువులు రాబందుల్లా పొడుచుకు తినేస్తున్నారు. పిల్లకి పెళ్లి కాలేదు. పిల్లాడికి ఉద్యోగం, దొరకలేదు. ఇల్లాలు గడపదాటలేదు. నీరసం.. ఔనా?"
తల ఊపాను.
"గ్రహచారం. ఐనా రోజులు గడిచిపోతున్నాయి. ఎలాగో జరిగిన అపచారం, చేసిన పాపం ఏమిటో అంతుపట్టలేదు. ఈ పరిస్థితికి మూలకారణం ఏమిటో అంతుపట్టకుండా ఉన్నది. ఏమంటారు?"
ఆయన కుర్చీలోంచి లేచారు. ఏమీ అనలేక నేనూ లేచాను. పంతులుగారు ఇల్లు చూడటానికి బయలుదేరారు. వాస్తు బాగో లేదంటారని భయపడ్డాను. ఎందుకంటే ఓ వాస్తు పండితుడి సలహా ప్రకారం మొన్ననే ఈశాన్యం వైపున్న గది పడగొట్టేశాను. అక్కడ బోరు పెట్టించాను. యాభై వేలు వదిలింది. అదృష్టవశాత్తు పంతులుగారు ఆ ఊసు ఎత్తలేదు. 'లంబర్ రూమ్' లోనికి తొంగి చూశారు. లంబర్ రూమ్ అంటే పాతసామాన్లు పడేసుకున్న మూలగది. కలగాపులగంగా దేశ జనాభాలా ఉన్నది ఆ గది. ఆయన చూస్తానంటే నేను ఎలా కాదనగలను? లైటు వెలిగించగానే చీకటి కోణాలు ఒక్కసారి ఆవిష్కరింపబడ్డాయి. పంతులుగారి డేగచూపు నేరుగా ఓ మూల నున్న పుస్తకాల దొంతర మీద పడింది.
"ఇలా జరగటానికి కారణం ఏమిటో అర్థమైంది” అని ఆయన నవ్వుతూ లైటు ఆర్పేయమని సైగ చేశారు. నాకేమీ అర్థం కాలేదు. లైటు ఆర్పేశాను. గది తలుపులు ముందుకు వేశాను. ఆయన వెంటే నడిచాను. పంతులుగారు ఇల్లంతా తిరిగేసి మళ్లీ కుర్చీలో కూచున్నారు.
“ఈ ఇంట్లో మూల దోషం ఉన్నది"
కుజ దోషం గురించి విన్నాను. వాస్తు దోషం గురించి విన్నాను. ఈ మూల దోషం మాత్రం నాకు అంతుపట్టని మాట నిజం. అదేమిటో ఆయనే వివరించాలి. నా అజ్ఞానానికి ఆయన దరహాసం చీకట్లో చిరుదీపం.
“ఆ మూల పుస్తకాల దొంతర ఉంది. దోషమంతా అక్కడే. పుస్తకం అంటే ఏమిటి? అక్షర జ్యోతి. సాక్షాత్తు సరస్వతీదేవి విహరించే పుష్పవాటిక. ఆ విద్యాసుమాల పట్ల ఎంత అపచారం జరిగింది! అందుకే నీ పరిస్థితి ఇలా దిగజారిపోతోంది” అంటూ పంతులుగారు కనుబొమలు ముడిచారు. ఆయన కళ్లు టొమాటో జూస్ కురిపిస్తున్నాయి. నేను మిన్నకుంటే మిన్ను విరిగి మీదపడేలా ఉంది.
"అవన్నీ కొన్న పుస్తకాలు కావు. అభ్యుదయ రచయితలు తెచ్చి మర్యాద పూర్వకంగా సమర్పించుకున్న గౌరవ పత్రాలు"
"అదే.. అందుకే అంత నిర్లక్ష్యం. ఉల్ఫా గా వచ్చాయని పుచ్చేసుకున్నారు. అందులో ఓ అక్షరం ముక్కయినా చదవలేదు. కనీసం వాటి అట్టయినా తెరిచావా? అదీలేదు"
“అంతేనండి”
"ఆ మహాపాపమే శాపమై ఇలా పీడిస్తోంది. ఓ పుస్తకం చదవటం, చదవకపోవటం అన్నది మస్తకాన్ని బట్టి ఉంటుంది. చదివి తీరాలని లేదు. పోనీ దాని వెల ఎంతో, ఏమిటో కనీసం అడిగావా?”
చెయ్యని పనిచేశాననటం నా వల్ల కాదు. మరోసారి గంగిరెద్దులా తల అడ్డంగా ఊపక తప్పలేదు. కానీ ఇందులో నా తప్పేమిటో అర్థం కావటం లేదు. నేను అడగందే ఇచ్చారు. ఇచ్చారు కదా అని పుచ్చేసుకున్నాను. వాటికి మూల్యం చెల్లించాలని నాకు అనిపించకపోవటం వాస్తవమే. ఇది పాపమా? తీరని శాపమా? అడిగేసి కడిగేసుకోవాలనుకున్నాను. కానీ ఊపిరి తిప్పుకోవటానికి వీల్లేకుండా పంతులుగారు నన్ను ఎడాపెడా వాయించేశారు.
"పుచ్చుకోవటం ఓ తప్పు. ఇచ్చుకోకపోవటం రెండో తప్పు. పట్టించుకోకపోవడం మూడో తప్పు. ఆ తల్లి ఆగ్రహించటం తప్పెలా అవుతుంది? "
నా ఆక్రోశాన్నంతా కుదించి ఒక్క మాటలో మనవి చేసుకున్నాను. “నాకు అక్షర అలర్జీ ఉంది”
పంతులుగారు కాస్త ఖంగుతిన్నట్టున్నారు. ఆయన పదిన్నర శృతి నుంచి ఆరున్నర శృతికి దిగివచ్చారు.
“నువ్వు చదవకపోయినా ఫరవాలేదు. ఎవరికైనా ఇస్తే చదువుకుంటారు. ఆనందిస్తారు. కానీ అలా జరగలేదు”
📖
కథ క్లైమాక్సుకు చేరుకోకముందే కంచి వైపు రూటు మళ్లించాలి. లేకపోతే టీవీ సీరియల్లో లా పంతులుగారు నన్ను వేటాడుతూనే ఉంటారు.
“పొరపాటు జరిగిపోయింది. ప్రాయశ్చిత్తం చేసుకుంటాను" నేను ఓ బేరానికి సిద్ధం కాగానే ఆయన ముఖారవిందం మరింత ఆనందంగా వెలిగింది.
“సంచితకర్మలా సంచుల్లో ఆ పుస్తకాలని కూరేశావు. మూలదోషం పోవాలంటే మూలనున్న పుస్తకాలు ముందు బయటకు తేవాలి. ప్రతి పుస్తకానికి ఓ వెల ఉంటుంది. అది అట్ట మీద అట్టహాసంగా వెనక వైపు లేదా ముందుభాగంలో ముద్రించబడుతుంది. అడ్రసు ప్రకారం ఆయా రచయితలకి మూల్యం చెల్లించు. అలా జరిగిన పక్షం రోజుల్లో నీ సమస్యలన్నీ జటాయువు రెక్కల్లా రాలిపోతాయి”
ఆ పని చేయటం నా వల్లకాదు. అందువల్ల నా ఎలర్జీ మరోసారి గుర్తు చేశాను. పంతులుగారు ఓ నిముషం కళ్లు మూసుకున్నారు. ఆయన మస్తిష్కంలో ఏదో ఆలోచన మెరుపులా తళుక్కు మన్నట్టున్నది. కళ్లు మెల్లగా విప్పి చెరగని చిరునవ్వుతో నా వంక చూస్తున్నారు. భుజాన వేలాడే సంచిలో చెయ్యివేశారు. ముచ్చటగా మూడు పుస్తకాలు తొంగిచూశాయి. నన్ను దగ్గరికి రమ్మని సైగచేశారు. వెళ్లాను. మంత్రోపదేశం మొదలుపెట్టారు.
“ఇది ఓ నవరసభరితమైన నవలా రాజం. కధ స్మశానంలో ప్రారంభమై నువ్వు స్మశానం చేరేదాకా వదలకుండా చదివిస్తుంది. దీన్ని నువ్వు చదవక పోయినా ఫరవాలేదు. ఈ దేశంలో పుస్తకం ఓ హస్తభూషణంగా గౌరవించే గౌరవనీయులు చాలా మంది ఉన్నారు. వాళ్ల చేత చదివించు. ఇంత కన్నా సులభమైన దోష పరిహారం లేదు"
ఆ నవలా రాజం తాలూకు మూడు కాపీలు నా చేతిలో పెట్టి, తాంబులం పెట్టిన పళ్లెం అందుకుని దక్షిణతో సహా సంచీలోకి బదలాయించారు పంతులుగారు.
ఇందాక - మూల్యం గురించి ఆయన చేసిన హితోపదేశం నేను ఇంకా మరిచిపోలేదు. ఓ కాపీ అట్ట తీసి చదివాను. వెల-"అమూల్యం” అని రాసి ఉంది. అందులో ఇప్పుడు ఆ పుస్తకాలకి ఎంత మూల్యం చెల్లించాలో నా మస్తకానికి అంతుపట్ట లేదు. పంతులుగారు పట్టేశారు.
“ఈ పుస్తకరాజం మూల్యం- అమూల్యం. అంటే ఎంత ఇచ్చినా తక్కువే అని దాని అర్థం. ఇది నీ దానశీలతకి ఓ అగ్నిపరీక్ష లాంటిది” అన్నారు.
సాగదీస్తే తడిసి మోపెడయ్యేలా ఉంది పరిస్థితి. అంచేత క్షణం వృథా చెయ్యకుండా నా జుబ్బాలో చెయ్యి పెట్టాను. ఏటీయం నుంచి నిన్న ఉపసంహరించిన డబ్బు మూలుగుతోంది. మూల దోషం పోవటానికి మూడు కరకరలాడే పచ్చ నోట్లు పైకి లాగి పంతులుగారి కరకమలాలకి అందించాను. మూడు వందలు! ఆ అక్షర వ్యాపారి నన్ను మనసారా దీవించి ముందుకు మరో ఇంటివైపుకి సాగిపోయారు. పాపం ఇంత పెద్ద వయసులో ఈయనకి ఇంతటి డబ్బు వ్యామోహమేమిటో అని నిట్టూర్చి ఇంట్లోకి వెళ్ళిపోయాను.
📚📚📚
*సమాప్తం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment