Friday, April 24, 2026

 *కాలంతో ప్రయాణం*

రచన లక్ష్మీ మదన్ 
_______________

కాలం ఎప్పుడూ ఒకే తీరుగా ఉండదు. కాలానికి ఒంపు సొంపులు ఎక్కువే! ప్రాంతాన్ని బట్టి ఉష్ణోగ్రతల తేడాలు వర్షాలు, ఎండలు, చలి ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. 

మనిషి అన్నిటికీ అలవాటు పడతాడు. ఎండాకాలం వస్తుందంటే దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటాడు. 
తడికల పందిళ్లు, చల్లటి నీటి కోసం కుండలు, నూలు బట్టలు ఇలా ఏర్పాటు ఉంటుంది. 

వర్షాకాలం కోసం వంట చేసుకునే కట్టెలు తడవకుండా దాచి పెట్టుకోవడం, ఇంటి ఉరుపులు పెట్టుకోవడం బయటకు వెళితే తడవకుండా ఉండటం కోసం గొడుగులు లేదా ప్లాస్టిక్ తో తయారైన రైన్ కోట్స్ ఒకప్పటి కాలంలో అయితే గోనె పట్టా తో తయారు చేసిన సంచులను తయారుగా పెట్టు కునేవాళ్ళు. 

చలికాలం అయితే చలిమంట వేసుకోవడానికి కర్ర ముక్కలు, కప్పుకునే కంబళ్లు, ఉలెన్ స్వెటర్లు ఇవన్నీ సిద్ధంగా ఉంచు కునేవాళ్లు.

శరీరాన్ని రక్షించుకోవడానికి ఇవన్నీ ఏర్పాట్లు చేసుకున్నా కూడా ఆహారపు అలవాట్లు కూడా కొంచెం మార్పు చేసుకునేవారు. 

కాలాలను బట్టి ఒంటికి ఏది చలవ చేస్తుంది. ఏది వేడి చేస్తుంది అనేది నిర్ధారించుకొని వంటలు చేసుకునేవారు. 

ఇప్పుడు ఏ కాలమైనా ఓకే తీరు. ఎండలు తెలియకుండా ఏసీలు దాహం తెలియకుండా ఫ్రిడ్జ్ నీళ్లు. చలికాలం అయితే చలి తెలియకుండా రూమ్ హీటర్స్ వేడివేడి సూప్స్ అన్నీ తయారుగానే ఉంటున్నాయి. 

ఒకప్పుడు అన్ని కాలాలని ఇష్టంగానే అనుభవించాలని అనుకునే వాళ్ళము. వాటికి సిద్ధపడి వాటిని తట్టుకొని అందులో కూడా ఆనందాన్ని వెతుక్కునే వాళ్ళము. 

ఎండల వేడి ఎక్కువగానే ఉన్నా చల్లటి కుండలో నీళ్లు తాగుతూ దాహము తీర్చుకుంటే ఎండలో నుండి వచ్చిన వేడి వెంటనే వెళ్ళిపోయి చల్లగా ఆహా! అనిపించేది. ఎప్పుడైనా కష్టం వెనుక సుఖం వస్తే అది ఆనందంగా ఉంటుంది ఎప్పుడూ సుఖమే ఉంటే సుఖం విలువ తెలియదు. 

చక్కని మల్లెపూలు ఇంట్లో ఆడవాళ్లు తల నిండా పెట్టుకుని, దేవుళ్ళ పటాలకు వేసి ఇల్లంతా  పరిమళింప చేసేవాళ్ళు. ఇంటి వెనుక నిమ్మ చెట్టు నుండి నాలుగు కాయలు కోసుకుని వచ్చి నిమ్మకాయ రసం చేసుకోవడం లేదా మామిడి కాయలను కాల్చి దానిలో బెల్లం వేసి షర్బత్ చేసుకొని తాగడం ఇలా చలవ కోసం ఎన్నో మార్గాలను వెతుక్కునే వాళ్ళము. ఆరుబయట వాకిళ్లలో చల్లగా నీళ్లు చల్లి చాపలు పరచుకొని పరుపులు వేసుకొని నిరాకాశం 
లో పడుకుంటే ఎంత హాయిగా ఉండేదని! 

చుక్కలు రాలు తున్నట్లు భావన కలిగి అది ఎక్కడ పడుతుందో అని ఆత్రంగా ఎదురు చూడటం... చుక్కలను లెక్కబెట్టడం చక్కగా నవ్వుకోవడం ఇదంతా ఆనందమే కదా! 

అలా ఓ రాత్రి బాగా నిద్ర పట్టిన సమయంలో చినుకులు రాలితే ఇంట్లోకి పరుగు పెట్టి ఏ మూలన పడితే ఆ మూలన పడుకోవడం ఆ తరం వాళ్లకు అందరికీ గుర్తుండే ఉంటుంది. 

అన్నింటికన్నా ముఖ్యమైన విషయాలు మూడు. ఒకటి మల్లెలు ఇందాకే చెప్పాను. రెండవది కొత్త ఆవకాయ. మూడవది మామిడిపండు అదెలా మర్చిపోతాం. 

ఇంట్లో ఆవకాయలు పెడుతుంటే ఆ సువాసనకి నోరూరి పోయేది. ఆవకాయతో పాటు మామిడి పండ్లు నంచుకోవడానికి ఇచ్చే ఓ నాయనమ్మనో అమ్మమ్మనో అందరి ఇళ్లల్లో ఉండనే ఉంటారు. అంతేకాక అన్నం కలిపి పెట్టి తినే దాకా వదలని ముసలమ్మలే! 

ఇంకా వచ్చి పోయే చుట్టాలు. వాళ్లతో కబుర్లు ఆటలు, స్నేహం ఎంత హాయిగా ఉండేదో. వాళ్లు వస్తున్నప్పుడు ఎంత ఆనందంగా ఉండేదో వెళ్లేటప్పుడు అంత దుఃఖంగా ఉండేది. 

ఇలా వేసవి సెలవులు తెలియకుండానే గడిచి పోయేవి పిల్లలకి. పెద్ద వాళ్లకు పనులతో గడిచి పోయేది. 

ఆ తర్వాత వర్షాకాలంలో పిల్లలు బడికి వెళుతూ బిజీగా ఉండేవాళ్ళు. అయినా వాళ్లు ఆ వర్షాన్ని ఎంతో హాయిగా అనుభవించేవాళ్లు. 

ఇంట్లో పెద్దవాళ్లు తిడుతున్నా చెప్పకుండా బయటకు వెళ్లి వర్షంలో తడవడం, ఆ తర్వాత జలుబుతో తుమ్మడం ఇంట్లో పెద్దవాళ్లు తిట్టడం ఆ తర్వాత ప్రేమగా దగ్గరికి తీసుకొని పాలు మిరియాలు తాగించడం, వేడివేడి రసంతో అన్నం తినిపించడం ఇవన్నీ అనుభవించిన వారికి గొప్ప జ్ఞాపకాలు. 

పెద్ద ఇళ్లు.. ఇంటి మధ్య గవాక్షం నుండి వర్షం ధారలు కురవడం, ఆ నీటిని చూస్తూ అప్పుడప్పుడు మెరిసే మెరుపులను ఆనందంగా చూస్తే, ఉరుమే ఉరుములకు భయపడి కళ్ళు మూసుకుని అర్జున ఫల్గుణ అని అనమనీ నాయనమ్మ చెప్తే అలా  పఠిస్తూ కళ్ళు మూసుకుని పడుకోవడం ఎంతమందికి గుర్తుంది? 

కురిసిన వర్షం అంతా వాకిలి నిండితే కాగితం పడవలు చేసుకుని వాటిని వదులుతూ నిజంగా పడవల మీద ఎక్కినంత సంబరం ఎంతమందికి కలిగింది ? 

వేడివేడి అన్నం అమ్మ తినిపిస్తుంటే ఎంత తిన్నామో తినకుండా తిన్న జ్ఞాపకాలు మరువగలమా ? ఏం తిన్నాము అనే ఆలోచన లేదు ఆనందంతో తిన్నది ఆస్వాదించడమే గుర్తుంది. 

ఇప్పుడు ఎన్ని రకాలు ఉన్నా కూడా ఇంకా ఏదో వెలితిగానే ఉంటుంది. ఇంట్లో చేసినవి చాలక బయట కొనుక్కున్న తిండ్లు కూడా ఎక్కువైపోయాయి. వాటితోపాటు అనారోగ్యాన్ని కూడా కొనుక్కుంటాము అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. 

ఆ రోజుల్లో ఎవరింట్లో నైనా గేదె ఉంటే ఆ వాడలో అందరికీ మజ్జిగ ఉచితమే! లెక్క గీసి అమ్ముకోవడాలు అసలే లేవు. 

ఒకరింట్లో ఆనెపు చెట్టు మరో ఇంట్లో బీరచెట్టు మరో ఇంట్లో కరివేపాకు చెట్టు ఇలా ఇవన్నీ కలిసి అందరి ఇళ్లల్లో కూరగా మారిపోయి కడుపు నింపేవి. నలుగురితో అనుబంధం అరుగుల మీద కూర్చుంటే కలిగేది. 

ధనుర్మాసంలో అమ్మాయిలంతా వాకిళ్లలో పెద్దపెద్ద ముగ్గులు వేస్తుంటే ముసలి వాళ్లు లోపల వెచ్చగా పడుకోకుండా, ఆ అరుపుల మీద కూర్చొని చక్కగా చాయ్ తాగుతూ పరాచకాలు ఆడుతూ కబుర్లు చెప్పేవాళ్లు. ఈరోజు జనమంతా టీవీలకు అతుక్కొని పోయి మరో మనిషితో మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. 

ఎలాగైనా కాలం మారింది. మనుషులు కూడా మారిపోయారు. మనకున్నది మనం తినాలి అనే ఆలోచన తప్ప, నలుగురు తినాలే అని ఆలోచన ఎవరికీ లేదు. అప్పట్లో మనకు ఉన్నది నలుగురు తినాలి అని ఆలోచన. కాబట్టి రోజులన్నీ ప్రశాంతంగా గడిచిపోయాయి అనిపిస్తుంది. 

పిల్లలు ఎలా పెరిగి పోయారో కూడా అర్థం కాదు. ఇంట్లో ఉన్న పిల్లలే కాక బంధువుల పిల్లలు ఊళ్లో పిల్లలు ఇంతమంది కలిసి ఆడుకున్న ఏ గొడవ ఉండేది కాదు. ఒకవేళ ఉన్నా పెద్దవాళ్ల వరకు వచ్చేది కానే కాదు. 

ఆ రోజులు బంగారు రోజులనే అనిపిస్తుంది. మరి మీకు అందరికీ అలాగే అనిపిస్తుందా!

No comments:

Post a Comment