సుగుణ రావిపూడి గారి పోస్ట్ మాన్ కోసం
అనగనగా... 🔔
ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు చాలా ఉల్లాసంగా ఉన్నవేళ కవులందరిని పిలిపించుకుని భువనవిజయం మందిరంలో సరదాగా గడపసాగాడు. తాను ఇటీవల రచించిన జాంబవతీ కళ్యాణం కావ్యం గురించి ప్రస్తావించాడు.
ఈ కావ్యంలో తను జాంబవంతునిలో పరకాయ ప్రవేశం చేసి మరీ రచించాను అని ఒకవిధంగా గొప్పలకుపోయాడు. కవులందరూ ఉల్లాసభరితంగా వింటూ తెగ ఆనందపడిపోసాగారు. వారిని చూసి మరింతగా రాయలువారు ఎక్కువ మోతాదులో చెప్పుకుపోతుంటే... రామ లింగకవి చిరునవ్వు మోముతో వినసాగాడు. ఆ కావ్యం గురించి కవుల నుంచి పొగడ్తలు శృతిమించాయి. ఒక విధంగా ఆకాసానికి ఎత్తేసారు.
“నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది ఆ కావ్యం. జాంబవంతుడు అడవిలో సంచరించే ఓ ఎలుగుబంటి. మానవభాష నేర్చుకున్న మహాజ్ఞాని, రామభక్తుడు. అతడికి మానుష్య రూపంలో గల ఓ అందాల అపరంజి బొమ్మ లాంటి కూతురు జాంబవతి. ఆమెకు ద్వారకాపురివాసి శ్రీకృష్ణుడుతో వివాహం జరిపించి ధన్యుడవుతాడు జాంబవంతుడు. ఈ కధనంలో జాంబవంతుడు మానవభాష నేర్చుకున్నట్టు నేను ఎలుగుభాషను తెలుసుకుని మరీ రాసాను.” అని రాయలు సంతృప్తిగా నవ్వుతూ చెప్పి కొత్తగా వచ్చిన రామలింగని వైపు చూశాడు . అతడు ఎలాంటి భావాలను వ్యక్తం చేయకుండా, తన ముఖంలో కనిపించనీయకుండా మౌనముద్రతో వింటుంటే చూసి ఆశ్చర్యపోయాడు.
"రామలింగా, ఏమిటా పరధ్యానం ? నా కావ్యం పట్ల మీకేమైనా విముఖత ఉందా ? మరి, అందరిలా విని ఆనందించలేదు. కనీసం తప్పేమి చూపలేదు. సరికదా ఇక్కడ ఉన్నట్టు లేరు, పరధ్యానంగా ఉన్నారు.” అన్నాడు.
"ప్రభూ ! మీ జాంబవతీ కళ్యాణం గురించి చెప్తుంటే జిత్తులమారి నక్కతో సంభాషణ గుర్తుకువచ్చింది. ఆ కధ తమరు తప్పక వినాల్సిందే"నన్నాడు.
కవులు అదోలా చూసారు. అలసాని పెద్దన, దూర్జటి, నంది తిమ్మన, రామరా జభూషణుడు ఆ మాటలకు పెదాలు విరిచారు. అయ్యల రాజు రామభద్రుడు మాత్రం “ఇదేమి వైపరీత్యం రామలింగా, మమ్మల్ని ఏ విధంగా నువు పశువుల కొట్టంలో ఒకేరాటకు కట్టివేస్తున్నావు. లేకుంటే నక్కలతో నీవు సంభాషించావా ? చాలు చాలు ఆపవయ్యా” అని పెద్ద గొంతుతో అడ్డుపడ్డాడు.
“ ప్రభూ నేను చెప్పేది వినాలని ప్రార్ధిస్తున్నా ను. తొలిసారి ఈ పవిత్రమైన భువన విజయం లోకి అడుగుపెట్టిన నాకు మాట్లాడేందుకు, నా గురించి మీకు చెప్పుకోవడానికి ఇది తొలి అవకాశం" అని ప్రాధేయపడ్డాడు.
“సరే చెప్పు రామలింగా, మాకు కుతూహలంగా ఉంది. నీవు నక్కలతో సంభాషించావా ? నమ్మశక్యంగానిదిగా ఉందే. అందుకే మన అయ్యలరాజు రామ భద్రుడు వినడానికే ససేమిరా అని బయట పడ్డాడు. మిగిలినవారు చూస్తున్నావుగా పెదాలు విరిచారు." అసహనంగా నవ్వుతూ రాయలు రామలింగానికి చెప్పేందుకు అవకాశం ఇచ్చాడు. రామలింగడు లేచి నిలుచుని వినమ్రంగా నమస్కరించాడు.
“మిత్రమా రామభద్రా! నీవు తప్పక వినాల్సిందే. మిగిలినవారు కూడా. నేను ఇరవైఏండ్ల ప్రాయమప్పుడు ఏదో పనిపడి, ఓ అడవి మార్గం లోంచి వెళ్తుండగా తోవలో నిద్రపోతున్న నక్కను చూసుకోకుండా దాని తోక మట్టేసాను. అది కుయ్యో మొర్రో అని అరిచి పక్క పొదలో దూరింది. అక్కడ ఓ పెద్ద ఎలుగుబంటి ఉంది, దాన్ని చూడగానే నా ప్రాణాలు విలవిలలాడాయి. అంతలో దొంగలగుంపు వచ్చి నన్ను ఎగాదిగా చూసి "ఓయి బాపడా, నీకు మంత్రాలు వచ్చు కదా. పదా మా నాయకుడికి పెళ్లి చేయాలి.” అని నన్ను ఈడ్చుకువెళ్లారు. భయంతో వెళ్లాను. దొంగల పెళ్లిలానే జరిపించాను. వాళ్లు దోచుకువచ్చిన వాటిల్లో నాకూ దండిగా ధనకనక వస్తువులు ఇచ్చారు. తిరిగి నన్ను ఎక్కడ్నించి తీసుకువెళ్లారో అక్కడే వదిలేసారు.
పొద వద్ద ఆ నక్క ఎలుగుబంటి ఉన్నాయి. అవి నన్ను గుర్రుగా చూస్తున్నాయి. అప్పుడు నక్క అంది "ఏయ్ బాపడా.. నువ్వు నా తోక మట్టి చాలా ధనం మూటకట్టుకు వచ్చావు. చూసావా నా తోక మహిమ." అని అపురూపంగా తోకను ముద్దులాడుకుంది.
నక్క మాటలు విన్న ఎలుగుబంటి "రేయ్ నక్క అల్లుడూ, ఒకసారి నేను నీ అదృష్టాల తోకను మడతానురా కాదనకురా, ఎప్పట్నించో ఈ అడవికి రాజును కావాలని ఆశ పడ్తున్నాను.” అని ప్రాధేయపడింది. ఇదేదో చూడాల్సిందేనని నక్క సరేనంది. ఎలుగుబంటి నక్కతోక బలంగా మట్టేసింది. అంతే దిక్కులు పిక్కటిల్లేలా అరిచిందా నక్క. అపుడే అడవి అదిరేలా మృగరాజు సింహం గర్జన వినిపించింది. నాకు పై ప్రాణాలు పైనే పోయాయి. పక్కనున్న చెట్టు ఎక్కాను, నక్క పొదల్లో దూరింది. ఎలుగుబంటి మాత్రం బిక్కచచ్చి పోయి చేష్టలుడిగిపోయినిలబడిపోయింది.
రానే వచ్చింది సింహం. "నన్ను రక్షించుము లేని ఆశలకుపోయితిని. ఈ అడవిని ఏలుదామని కోరికతో స్వామి ద్రోహినయి తిని. మన్నించు. నక్క తోక మాత్రమే మట్టితిని తప్ప ఇతరత్రా ఎలాంటి కుట్రను చేయలేదు."అని ప్రాధేయపడిందా ఎలుగుబంటి.
"ఎలుగుబంటి మాఁవా, నేను వచ్చింది నీ సాయం కోరడానికి, నీవన్నట్టు నీవు మట్టిన నక్క తోక మహిమో ఏమో నాకు తెలియదు. ఈ క్షణం నుండి నీవు ఈ కాకులు దూరని కారడవికి కొన్నాళ్లు రాజువు.
నేను నా సుపుత్రుని పెళ్లి పని మీద పొరుగు అడవికి వెళ్తున్నాను." అని కిరీటం ఎలుగుబంటి నెత్తి పై పెట్టి వెళ్లిపో యింది. ఎలుగుబంటి చిరకాల కోరిక తీరినందుకు మహా ఆనందించింది. పొదలో నక్కి దాక్కున్న నక్క బయటికి వచ్చి “ఏమిటీ విడ్డూరం.. నా తోక తొక్కిన ఆ వెర్రి బాపడికి ధనం. రేపోమాపో కాటికి పోయే ఎలుగుబంటికి కిరీటం దక్కాయి. నాకేటి లేదా ?నాతోక పచ్చి పుండు కావడమేనా ? ఇంక ఎవరికి నా తోక దొరకనీయను.” అని ఓ పెద్ద ఎలుక బొరియలోకి తోక పెట్టుకుని శోకాలు తీయసాగింది.
పాపం నక్క దురదృష్టం ఆ బొరియలో ఆకలి గొన్న పందికొక్కు అందమైన నక్క తోకను మొదల్లో పుటుక్కున కొరికేసి ఆరగించేసింది. “చచ్చాను దేవుడోయ్.. పాడు పందికొక్కు నా తోకను తినేసింది " అంటూ నేలపై గింగరాలు కొట్టి ఏడ్చింది నక్క.
అడవికి కొత్తరాజు ఎలుగుబంటి నవ్వి “చచ్చిన పీనుగులను తిని బతికే నీలాంటి వాడికి ఆ దేవుడు అదృష్టమైన తోక ఇచ్చాడు. పరోపకారం లేశమైనా లేని నీకు తగిన శాస్త్రి జరిగింది. నాకు ఈ అడవిలో మరి కనిపించ కు, నా మాట ధిక్కరించావో నీ ప్రాణాలు తీయంది వదలను. ఇది రాజాజ్ఞ" అని హెచ్చరించి పొమ్మంది ఎలుగుబంటి. నక్క బిక్కచచ్చిపోయింది. వేదాంతిలా నవ్వుకుంది.
"ఎలుగుబంటి మావా, నా తోక దయా లబ్దంతో రాజువయి తొలిసారిగా నాకే శిక్ష విధించావా, కలియుగం కదా యుగధర్మం " అని తోకలేని నడుంతో భారంగా నడుచుకుంటూ వెళ్లిపోగా, మరోవైపు ఎలుగుబంటి రాజదర్పంతో కాకు లు దూరని కారడివిలోకి వెళ్లిపోయింది.
"బ్రతుకు జీవుడా అని నేను చెట్టు దిగి ఇంటి ముఖం పట్టాను. ఇది ప్రభూ! నాకు జరిగిన అడవి జంతువులతో వింతైన అనుభవం" అని చెప్పి ముగించాడు రామలింగడు.
చెవులు రిక్కించి విన్న కవులు తెరలు తెరలుగా నవ్వారు. ఒకరిద్దరూ... పడిపడి నవ్వారు. రాయలు మాత్రం రామలింగడు ఏమనుకుంటాడోనని కనిపించకుండా నవ్వాడు. ఎలాగు తొలుత బయటపడ్డ అయ్యలరాజు రామభద్రుడు మళ్లీ తానే గొంతెత్తి "రామలింగా, అడవి జంతువుల భాష ఏ గురువు నుంచి నేర్చుకున్నావు. మాకు చెప్పరాదూ నీ వద్ద నక్కల భాష క్షుణ్ణంగా అభ్యసిస్తాం. లేదా నీ గురువు వద్ద నేర్చుకుంటాం. ఆయనెవరో చెప్పు. " అని ప్రాధేయపడ్డాడు.
ఆ మాటలకు మరోసారి అందరూ గొల్లున నవ్వారు. ఈసారి శ్రీకృష్ణదేవరాయలు కూడా బిగ్గరగా నవ్వాడు. ఆ నవ్వుల హోరయ్యాక "అయ్యల రాజ రామభధ్రా ! నక్కల భాష ని జంగా నేర్చుకుంటావా ? నీవేనా లేక ఇక్కడ కడివెడు నవ్వులు పాలుపంచుకున్న మన కవితిలకాలూ కూడానా "అని అడిగాడు రామలింగడు.
కవులందరూ రామలింగడిని మరింత ఇరుకున పెట్టాలి అని ఏక కంఠంతో "నేర్చుకుంటాం” అన్నారు. రాయలూ అనేవాడేమో కానీ రామలింగడు ఈసరికే ఒంటరి అయిపోయాడు. అని మౌనం వహించాడు.
"మిత్రులారా! నేను గురువుగా పనికిరాను. కారణం నన్ను గేలి చేస్తున్న శిష్యులు మీరు. నా వద్ద విద్య మీకు అబ్బదు. గురువు అంటే భయం, భక్తి, గౌరవం ఉండాలి. శిష్యులుగా శుంఠలు పనికిరారు. ఈ జంతు విద్య నేర్చుకోవాలన్న ఆశ మీకు బలంగా ఉంటే అదిగో మన ధర్మప్రభువులు రాయలువారి వద్ద చేతులు కట్టుకుని అభ్యసించండి. ఆయనకు ఎలుగుబంటి భాష వచ్చు, కనుకనే జాంబవంతునిలో పరకాయప్రవేశం చేసి మరోవైపు ఎలుగు భాషను తెలుసుకున్నందున రచించారు జాంబవతీకళ్యాణం. కనుక ఆయన వద్ద నేర్చుకున్నాక, అప్పటికి ఓపిక, మరిన్ని జంతుభాషలు నేర్చుకునే కోరిక బలీయంగా ఉంటే మీలో ఇప్పుడున్న శుంఠతనంపోతే నా వద్ద నక్క, సింహం భాషలు తప్పక నేర్పగలను" అని నిశ్శబ్దంగా మారిపోయిన ఆ మందిరంలో కంచుగంట లాంటి గొంతుతో వ్యంగ్యంగా ఏ మాత్రం సంకోచించకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు రామలింగకవి.
ఒక్కసారి అందరి ముఖాలు వివర్ణమయ్యా యి. ఎవరికి వారే ఏమిటింత సాహసం, రాయలవారినే తప్పుపట్టే ప్రయత్నం చేసేది, ఈ వెర్రి మొర్రి బాపడా ? కొంపదీసి ఈతడు అమావాశ్యకు పిచ్చిపట్టే రకం కాదుకదా! అని పరిపరి విధాలుగా ఆలోచించారు. భయంతో చూసారంతా.
అప్పటికే అక్కడికి విచ్చేసిన తాతాచార్యులు వారు నొచ్చుకుని “ఏయ్ రామ లింగా నీకేమైనా మతిచాందసం ఉందా ? రాయల వార్ని చిన్నబుచ్చుతావా ? ఇక్కడ కొలువు తీరిన ప్రభువుకి, మిగిలిన కవులందరికి, క్షమాపణలు కోరుకుని తక్షణం ఈ నగరం విడిచి పో ! " అని ఉగ్రుడైపోయాడు.
“మన్నించండి తాతాచార్యులుగారూ ! నేనే అపరాధం చేయలేదే.. ఎలుగులభాష తనకు వచ్చని మన ప్రభువులవారే సెలవిచ్చారు.
. అందుకు ఇక్కడ కవులు అందరూ చెక్కభజన చేసి మరింత ప్రోత్సహిస్తున్నారు. ఎంతటి వారికైనా పొగడ్త ఎనలేని సంతోషాన్నిస్తుంది. మన ఏలిక ఆ దిశలో ఆనందపడ్తున్నారు. నేను రాయలవారి శ్రేయస్సు కోరేవాడిని తప్ప ఇచ్చకాల వాడిని కాను. కనుకనే యదార్థవాదాన్ని వినిపించాను. యధారాజా! తదా ప్రజా !! కాకూడదు. అని కోరుకునేవాడిని." అని తను చెప్పాల్సింది చెప్పి లేచి నిలబడి..
"ప్రభూ నా మాటలు బాధించినట్లయితే నన్ను మన్నించండి.” అని చేతులు జోడించాడు.
రాయలు తీక్షణంగా రామలింగని వైపు చూసాడు. అంతా ఇక రామలింగడి పని అయిపోయినట్లే ! ఈ పిల్లకవి బతకడం కష్టం అని ఎవరికివారే అనుకున్నారు, కానీ దూర్జటి మాత్రం లోలోపల ఆనందించాడు. భలేగా రాయలకు గడ్డిపెట్టాడు.
చక్రవర్తి నన్న అహంతో తనకు ఎలుగు భాష వచ్చని పేలడం అందుకు తామంతా దిక్కులు పిక్కటిల్లేలా వంతపాడడం. బయటపడలేక తల అమ్ముకునే బతుకు అనుభవిస్తున్నాం. ధైర్యం అంటే ఈ రామలింగడిదేనని కవులందరూ రాయల వైపే చూసారు. ఎలాంటి శిక్ష వేస్తాడోనని ఊపిరిబిగబట్టారు. బహుశా ఇక మరణదండన అని అనుకున్నారు.
రాయలు లేచి రామలింగని వద్దకు వెళ్లి...
“నీవు ధైర్యంగా నన్ను వేలెత్తి చూపావు. నిజమే ఈరోజు నేను శృతిమించాను. ఆ కావ్యం రాసానన్న ఆనందంలో ఏమేమో అనేస్తూ నోరు జారాను. చక్రవర్తి తప్పును దిద్దే సాహసం ఎవరూ చేయసాహసించ లేరు. అది నీవు అవలీలగా చేసావు. భయపడకుండా నీ వాదన వినిపించావు. జంతు భాషను నా వద్ద నేర్చుకోవాలా? గురుభక్తి లేనివారా వీరంతా ? పైగా శుంఠలా? ములుకుల్లాంటి నీ చమత్కార పలుకులు నా మనస్సున తొలుత కోపాన్ని పెంచినా తర్వాత ఆనందాన్ని నింపాయి" అని అభినందించాడు.
అంతా నిండుగా నవ్వుకున్నారు. అలసాని పెద్దన “రామలింగా, ఎక్కడ రాజాగ్రహానికి గురవుతావోనని భయపడ్డాను.” అని గాఢంగా కౌగిలించుకున్నాడు.
“క్షమించండి రామలింగకవి, నేను తొలుత బాధ కలిగించేట్టు ఏమెమో అనేసాను " అని అయ్యలరాజు రామభద్రుడు చేతులు పట్టుకున్నాడు. రామలింగడు నవ్వుతూ అందరికీ నమస్కారం చేసి సభ నుండి ఇంటికి బయలుదేరాడు.
--------- శుభరాత్రి --------
No comments:
Post a Comment