క్రమ సంఖ్య 53
తేది 18/04/2026
*“తిండి దొంగ ”*
రచన: శ్రీ కొడవటిగంటి కుటుంబరావు గారు
వెంకాయమ్మ ఓ రోజు ఎవరితోనూ చెప్పకుండా పెద్దగిన్నెలో అన్నమూ, కూరలూ, పిండివంటలూ అవీ సర్దుకుని కూతురి ఇంటి దగ్గర్నుంచి కొడుకు దగ్గిరకి వెళ్లిపోయింది! అసలు ఈవిడ కథేమిటంటే —
వెంకాయమ్మ తిండికీ బట్టకీ లోటులేని ఇంట్లో పుట్టినా, ఒక్కరోజు కూడా మనశ్శాంతి ఎరగదు. తన తండ్రీ, పెత్తండ్రి నిత్యమూ కుక్కల్లా కాట్లాడుకునే వాళ్ళు. ఇల్లు పంచుకున్నా, దొడ్డి పంచుకుని బావికి నడిమధ్యగా దడి కట్టుకున్నా కూడా…ఆ పోట్లాటలు తప్పలేదు. దొడ్డి దడి నుంచి ఏ వైపువాళ్ళు నాలుక గీసుకోడానికి ఇంత తాటాకుముక్క లాగినా రెండోవేపు వాళ్ళకి శివమెత్తుకొచ్చేది. ఆఖరికి బావిలోంచి ఎవరు ఎక్కువ నీళ్లు తోడుకున్నారనే దానిమీద కూడా యుద్ధమే. ఇక తన తల్లీ, ఆవిడ వియ్యపురాలూ అస్తమానూ సాధించుకుంటూ దెప్పుకుంటూనే ఉండేవాళ్ళు. ఇరు పక్షాలకూ అయినవాళ్ళ రాక పొకలవల్ల గొడవలు మరింత పెరిగాయి కానీ, సద్ది చెప్పిన పాపాన ఒక్కళ్ళూ పోలేదు. ఈ పెద్దవాళ్ల దెబ్బలాటల వల్ల పిల్లలకి కూడా పరస్పర ద్వేషాలు పెరిగిపోయాయి.
వెంకాయమ్మకి పెళ్లయి కాపురానికి వెళ్ళిన కొద్దిరోజులకి సులభంగానే అర్థమయ్యింది….. ఎంత కీచులాడుకున్నా, తన పుట్టింటివాళ్ళు అత్తారింటి వాళ్ళకన్నా చాలా నాగరికులని! ఆమె మామగారు చాలా ఏళ్ళ క్రితమే పోయారు. ఆ ఇంటి అవరణలో ఆమె అత్తగారిదే రాజ్యం. ఆవిడతో ఎవ్వరూ వాదించడానికి లేదు. ఎదురుమాట అనడానికి లేదు. ఆవిడకి ఎవరిమీదనన్నా ఆగ్రహం వస్తే ఆ పూట వాళ్ళు తిండి తినకూడదు. ఏ కోడలినన్నా పిలిచి, “వంద బిందెలు నీళ్ళు తోడు” అంటే తోడవలసిందే. ఎక్కడా పొయ్యడానికి లేకపోతే పారబోయాల్సిందే గానీ తోడడం మానరాదు. ఆవిడ ఏ కొడుకునన్నా పిలిచి, “నీ పెళ్లాన్ని పది దెబ్బలు కొట్టు” అంటే అతను కొట్టాల్సిందే! “ఎందుకు? ఏం చేసింది?” అనడానికి వీల్లేదు. మొదట్లో వెంకాయమ్మ తన కళ్ళనూ చెవులనూ నమ్మలేక పోయింది. అందులో తనకేమీ భాగం లేనట్టు ఓ ప్రేక్షకపాత్ర వహించింది. ఓరోజు తనని నూరు బిందెలు తోడమనీ, తోడలేక తన చేతుల్లో బొబ్బలు ఊదుకున్నందుకూ తన భర్తచేత పది దెబ్బలు కొట్టించడం జరిగాక… ఈ భావన పోయింది. తన అత్తగారి ఈ ప్రవర్తన, ఆ ‘ పైత్యాన్ని ‘ చదువుకున్న మగాళ్ళు కూడా సహించి శిరసావహించడం ఆమెకి వింతగానూ, అతి అసహజంగానూ తోచింది.
వెంకాయమ్మకో కొడుకూ,కూతురూను. ఆమె అత్తగారు కొన్నాళ్ళకి మరణించింది. ఇకనైనా పరిస్థితులు మారతాయనుకుంది. అవి మారేయి కానీ, ఆమె భర్త మానవత్వం సంపాదించలేదు. మానవత్వం తాలూకు బీజాలు అతనిలో ఏనాడో తల్లి పుణ్యాన నాశనమై పోయాయి. తల్లి ఆత్మకి శాంతి కలిగేందుకు వెంకాయమ్మను అతను రోజూ కారణం లేకుండానే చావగొట్టేవాడు. పైగా అతను కష్టజీవి కాదు. ఎవరో పొలాలు పండించి కుమ్మరిస్తే దానితో కాలక్షేపం చేసేవాడు. అట్టే శ్రమ లేకుండా డబ్బు సంపాదించడానికి అతను ఎన్నో ప్రయత్నాలు చేసినా, అవేవీ ఫలించలేదు. దానికి తోడు తాగుడు అలవాటు చేసుకున్నాడు. అదివరకూ మొగుడు తన అత్తగారి చేతిలో పనిముట్టులా కనిపించడం వల్ల ఆమెకి అతని మీద కోపం రాలేదు. కానీ ఇప్పుడు కోపమూ అసహ్యమూ కూడా కలిగాయి. ఆమె ప్రేమనంతటినీ, తన కోడుకు మీదా, కూతురు మీదా పెట్టుకుని బతుకుతోంది.
తాగుబోతు మొగుడు ఎన్నాళ్లుంటాడు? ఆస్తితో పాటుగా అతని ఆయుష్షు కూడా కరిగి, ‘పోయాడు.’ అప్పటికి కొడుకు రమణయ్య పన్నెండేళ్ళవాడు. కూతురు సుభద్ర ఎనిమిదేళ్లది. జన్మ ఎత్తిన ముప్ఫై ఏళ్లకి వెంకాయమ్మకి మొగుడు పోగానే మనశ్శాంతి లభించినట్టు కనిపించింది. పిల్లలిద్దరూ బుద్ధిమంతులు. బాగా చదువుకుంటున్నారు. ఏడెనిమిదెకరాల పొలం ఉంది. రైతు మంచివాడు. చుట్టాలతో ముఖ్యంగా భర్తవైపు వాళ్ళతో పేచీ రాకుండా జాగ్రత్తగా నెట్టుకొస్తోంది. ఇంటిపనులు చాలా భాగం రమణయ్య చేసేస్తాడు. తనకెప్పుడేనా జబ్బుచేస్తే , “నేను పోతానేమో ? ఈ పిల్లలేమౌతారు? వాళ్ల మొహం ఎవరు చూస్తారు?” అని భయపడేది. ఇంక సుభద్రకి ఓ అందగాడూ, చదువుకున్న వాడూ, బుద్ధిమంతుడూ, డబ్బున్నవాడూ అయివుండి, అత్తగారు మంచిదై ఉండి, కట్నం పెద్దగా అడగని సంబంధం చూసి ఎక్కువ ఖర్చు కాకుండా పెళ్ళి చెయ్యాలని కోరుకునేది.
ఖర్చు విషయం తప్ప మిగిలినవన్నీ కలిసొచ్చిన సంబంధం ఒకటి వచ్చింది. పెళ్ళికొడుకు డాక్టరు. వాళ్ళు లాంఛనాలూ, బట్టలూ అన్నీ కలిపి రెండువేల నూట పదహార్లు అడిగేరు. వెంకాయమ్మ ఆలోచనలో పడింది. కొడుకును సలహా అడిగింది. అప్పటికి రమణయ్య స్కూల్ ఫైనల్ చదువుతున్నాడు. “ఖర్చయితే అయ్యిందిలే, మంచి సంబంధం….చేసేద్దాం. మగవాణ్ణి బతకలేక పోతానా?” అన్నాడు. దాంతో ఆమె పొలం తాకట్టు పెట్టి, వడ్డీకి డబ్బుతెచ్చి పెళ్లి చేసింది. రమణయ్య సంపాదించ లేకపోతాడా ? అసలు, వడ్డీ తీర్చలేక పోతాడా అనుకుంది. ఏమైనా సరే పొలంలో ఒక్కసెంటు కూడా అమ్మకూడదని ఆమె ప్రతిజ్ఞ.
కానీ ఆమె ప్రతిజ్ఞ చెల్లలేదు. రమణయ్య మేజరు కాగానే నాలుగెకరాలు అమ్మి, వడ్డీతో సహా ఈ బాకీ తీర్చేశాడు. అతనికీ పెళ్లయి, భార్య కాపరానికొచ్చింది. అయితే,అతనికి నిలకడైన ఉద్యోగం మాత్రం దొరకలేదు. నెలకి పాతిక రూపాయలు సంపాదించడానికి నానా హైరానా పడాల్సి వచ్చింది. రెండేళ్ళ కొకరు చొప్పున పిల్లలు పుట్టుకు రాసాగేరు. ఖర్చులు పెరిగిపోయాయి. దానికి తగిన ఆర్జన లేక ఇంట్లో సరిగా తిండి, గుడ్డా లేవు. తన కోడలు జానకిని చూస్తూంటే వెంకాయమ్మకి గొప్ప సంతృప్తి. ఆమె తన కాలంనాటి కోడలు కాదు.
రమణయ్య కూడా తనకాలం నాటి భర్త కాదు. జానకిని బిడియం లేకుండా ఆపేక్షతో చూసేవాడు. “నువ్వు ఆడదానివి..నిన్ను మనిషల్లే చూడవలసన అవసరం లేదు” అన్నట్టు ఎప్పుడూ పెళ్ళాంతో ప్రవర్తించేవాడు కాడు. “ఇంకా కొంతకాలానికి మొగుళ్ళంతా పెళ్లాలని ఇలాగే చూస్తారు కాబోలు. ఎంత మంచి రోజులు!” అనుకునేది వెంకాయమ్మ. రానురానూ ఇంట్లో దారిద్ర్యం వెంకమ్మని బాధించేది.
ఒకనాడు రమణయ్య ” మాతో ఎందుకమ్మా నువ్వుకూడా ఈ కష్టాలు పడడం? సుభద్ర దగ్గిరకి పోయి ఉండు. శ్రీహరి బావగారి పని బాగుంది. వైద్యం మీద నెలకి సంపాదించిన దాంట్లో వెయ్యీ, పదిహేను వందల దాకా బ్యాంక్ లో వేస్తున్నాట్ట.” అని చెప్పి తల్లిని చెల్లి ఇంటికి పంపించాడు.
వెంకాయమ్మకి కూతురింట్లో, నీటిలో ములిగి ఉక్కిరిబిక్కిరవుతున్న మనిషి బయటికి వచ్చినట్టయింది. ఇక్కడ దరిద్రం లేదు. సుభద్ర అదృష్టం — ఏ పెట్టె తీసినా పది రూపాయల నోట్లే. వైద్యుడిగా అతని ప్రాక్టీసు చాలాబాగుంది. సుభద్ర వంటినిండా బంగారమే. సుభద్ర కూతురికి కూడా బోలెడు నగలూ, వెండిగిన్నెలు, ఆటవస్తువులు, బొమ్మలూనూ. ఓ వారం పాటు వెంకాయమ్మకి తన కొడుకు జీవితం గుర్తుకు రాలేదు. కానీ ఈ ఇంట్లో తన స్థానం నౌకర్లకున్నటువంటిదే అని ఆమెకు త్వరలోనే తెలిసి వచ్చింది. ఇంటికొచ్చే గొప్పవాళ్ళతో తను మాట్లాడరాదు. పనివాళ్లకి తను పనులు చెప్పకూడదు. భార్యాభర్తలు ఎక్కడికి వెళ్ళినా తనని పిలవరు. సుభద్ర తనతో పనివాళ్ళతో కంటే అసహ్యంగా మాట్లాడుతుంది. ఈ ఇంట్లో జరిగే వృధాఖర్చు చూసి, అక్కడ కొడుకు పడుతున్న పాట్లు జ్ఞాపకమొచ్చి, వెంకాయమ్మ కన్నీటి పర్యంతం అయింది. ఈ దుబారా ఖర్చులో నాలుగో వంతు ఉంటే — రమణయ్య జీవితం హాయిగా వెళ్లిపోను. ఎందుకీ వ్యత్యాసం? ఆపుకోలేక ఓరోజు కూతుర్ని అడిగింది, “నీదగ్గర ఎప్పుడన్నా కాస్త డబ్బు మిగిలితే అన్నయ్యకి పంపించరాదటే?” అని. “ఆయనకి తెలియకుండా నేనొక్క కానీ ఖర్చు పెట్టను. అన్నయ్యకి కావాలంటే ఆయన్ని అడగరాదూ?” అంది సుభద్ర. డబ్బుకి దారిద్ర్యం మీద గల నిర్లక్ష్యమే సుభద్రలో కనిపిస్తోంది..
ఆరోజు సుభద్ర పుట్టిన రోజు సందర్భంగా డాక్టరు శ్రీహరి ఇంట్లో విందు! ఎందరో పెద్ద పెద్ద వాళ్లు వచ్చారు. మణుగులకొద్దీ కూరలూ, గుండిగలతో అన్నం– పెద్ద ఎత్తున సాగుతోంది. ఆరోజే రమణయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. “…..జానకి మూడు రోజులనుంచీ మంచం పట్టింది. డాక్టరుకి చూపించమంటున్నారు. దేనికి? తిండి లేక మాడే మనిషికి మందులెందుకు? అందరమూ ఇవాళో రేపో మంచం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాం….” ఆ ఉత్తరం చదివి వెంకాయమ్మ గుండె నీరైపోయింది. కాళ్ళు చేతులు చల్లబడి పోయాయి. ఆమె ఆ ఉత్తరం పట్టుకుని సుభద్ర దగ్గరకి పోయి, “అన్నయ్య ఉత్తరం రాశాడే..” అంది.
భూభారం అంతా మోస్తూన్నంత విసుగుతో “ఇప్పుడేమిటమ్మా? తరవాత చూడచ్చు” అంటూ ఏదో పనిమీద వెళ్లిపోయింది సుభద్ర.
రాత్రి భోజనాలు అయ్యాయి. విస్తళ్ళలో ఎవరిష్టమైనంత వాళ్ళు పారెేశారు. కొడుకు ఉత్తరం చూశాకా వెంకాయమ్మ గుక్కెడు నీళ్ళు కూడా తాగలేదు. అందరి భోజనాలూ అయి, పనివాళ్ళు వెళ్ళేసరికి రాత్రి పదకొండు దాటిపోయింది. వెంకాయమ్మని భోంచేసేవా అని అడిగేవారు లేరు. ఆమె వంటింట్లోకి వెళ్ళింది. ఆకు వేసుకుని అన్నం పెట్టుకుంది.
ఒక ముద్ద తిందో లేదో వాంతి అయిపోయింది. ఇంతలో ఆమెకి ఓ గొప్ప ఆలోచన తట్టింది. ఒక పెద్ద గిన్నె తీసుకొని, దాన్నిండా అన్నమూ, కూరలూ, పిండివంటలూ, పచ్చళ్ళూ కుక్కి పెట్టింది. దానిపైన ఆకు కప్పి, వాసెన కట్టింది. అది పట్టుకుని అర్ధరాత్రివేళ బయలుదేరింది—కొడుకు ఇంటికి!!
____#####_____
No comments:
Post a Comment