Tuesday, May 5, 2026

 క్రమ సంఖ్య 60
తేది 29/04/2026

వీరు రచననే జీవికగా చేసికొనక ముందు అంటే, Professional Writer గా మారకముందు కాకినాడ పి. ఆర్ . కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశారు. ‘ న్యూయార్కు హెరాల్డ్ ట్రిబ్యూన్ ‘ వారు 1952లో నిర్వహించిన ప్రపంచ కథానికల పోటీలో వీరి కథకి ద్వితీయ బహుమతి వచ్చింది.  ఆ పోటీకి 23 దేశాలనుంచి 59 కథలు వచ్చాయి.  ఆవిధంగా వారు తెలుగు కథకి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టేరు. ఒకరకంగా, ఆ కథ వల్ల వచ్చిన కీర్తి, వీరి మిగిలిన కథలని కప్పేసింది. 

వీరు ఇంచుమించు అరవై దాకా కథలు, ‘బతికిన కాలేజీ’ , ‘నల్లరేగడి‘ , లాంటి పేరుపొందిన నవలలూ, ‘బంగారు పాప’ , ‘ భాగ్య రేఖ” రంగుల రాట్నం‘ వంటి అనేక సినిమాలకి రచనలూ చేశారు. ఆయన మంచి కవి కూడా. ప్రపంచ కథానికల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన వీరి కథ “గాలివాన”  గతంలో చాలాకాలం క్రితం పంచుకోవడం జరిగింది, ఇప్పుడు మళ్ళీ…. ఇంకోసారి .

*“గాలివాన”*

రచన - - శ్రీ పాలగుమ్మి పద్మరాజు గారు

రావుగారిది ఒక క్రమపద్ధతిలో సాగే జీవితం. ఆయన తన ఇంట్లో ఖచ్చితమైన క్రమశిక్షణని చాలా శ్రమపడి అమలులో పెట్టేరు. అందువల్ల ఆయన మనసూ, శరీరమూ కూడా ఎంతో సుఖ శాంతులతో ఉన్నాయి. ఆయన చదువుకునే గది అతి శుభ్రంగా ఉంటుంది. అందులో నల్ల విరుగుడు చేవతో చేసిన రాతబల్ల, దానిమీద ఒకమూలగా దీపం తళతళా మెరుస్తూ కనిపిస్తాయి. 

రావుగారికి ఇద్దరు ఆడ, ఇద్దరు మగ..మొత్తం నలుగురు పిల్లలు. వాళ్ళని చూస్తే అయనకి ఎంతో గర్వం. అలాగే తాను చాలా ఆరోగ్యవంతుడని కూడా అయనకి గర్వం. అయనకి ఒక ఇరవయ్యయిదేళ్ళ కొడుకున్నాడనీ, ఆకొడుక్కి ఇద్దరు పిల్లలున్నారనీ ఎవ్వరూ అనుకోరు. ఈ మధ్యనే రావుగారు న్యాయవాద వృత్తి వదిలేసి కొడుక్కి అప్పచెప్పేసేరు. ఆయనంత సంపాదన ఉన్న వాళ్ళెవరూ ఆ వయసులో న్యాయవాద వృత్తిని వదిలి పెట్టలేదు…..ఆయన కొన్ని పద్ధతులు పాటించాలి అనుకున్నారు. అవి అమలు చేస్తున్నారు!

రావుగారు మంచి ఉపన్యాసకుడు, గొప్ప వేదాంతి. అనేక విషయాల మీద ఆయన అద్భుతంగా మాట్లాడగలరు. చాలా ఊళ్ళల్లో, ఎన్నో సభలలో వారు ఉపన్యాసాలు చేసి మంచి వక్తగా పేరుపొందారు. ఇప్పుడు వారిని తమ వూళ్ళో ఉపన్యాసం ఇవ్వమని “ఆస్తిక మహాసమాజము” అని ఒక సంస్థ ఆహ్వానిస్తే, ఆయన బయలుదేరి రైల్వే స్టేషన్ కి వచ్చారు.

రైలు చాలా ఆలస్యంగా వచ్చింది. రావుగారు రెండవతరగతి పెట్టె ఎక్కేరు. అప్పటికే ఆ పెట్టెలోని మూడు బెర్తులూ ఎవరో ఆక్రమించుకుని, పరుపులు పరుచుకున్నారు. తను ఎక్కినందుకు అందులో ఉన్న నలుగురు ప్రయాణీకులు చిరాకుపడ్డట్టు రావుగారు గ్రహించారు. ఇంకోపెట్టె లోకి వెడితే బాగుండుననిపించింది కానీ, కూలీ ఆయన పెట్టె,బెడ్డింగూ పై బల్లమీద పెట్టివెళ్ళిపోయాడు. రైలు కదిలిపోయింది కూడా. ఒకాయన పరుపు కొంచెం మడిచి రావుగారికి చోటిచ్చాడు. కూచుని, రావుగారు చుట్టూ చూశారు. అందరూ దూర ప్రయాణీకులే అని అర్థమైంది. వాళ్ల బూట్లు బెర్తుల కిందకి తోసేశారు. కోట్లు, పాంటులు, చొక్కాలు కొక్కేలకి తగిలించి, పైజమాలు వేసుకున్నారు. కిటికీ పక్కనున్న బెర్తుల మీద ఇద్దరు పెద్దవాళ్లు, లోపల ఒక యువదంపతుల జంట కూర్చున్నారు. రైలు పరిగెడుతోంది. రావుగారు ఆలోచనల్లో ములిగిపోయారు.

ఉన్నట్టుండి పెట్టెలో చీకటిగా అయిపోయింది. బయట గాలి వేగంగా వీస్తూ, కిటికీతలుపుల మీద మొత్తుతోంది. ఇంకా సాయంత్రం అయివుండదు. ” ఎంత చీకటిగా అయిపోయింది? టైం ఎంత అయి ఉంటుంది?” రావుగారితో అన్నాడో పెద్దమనిషి–అతను చదువుతున్న అపరాధ పరిశోధక నవలలోంచి ముఖం పైకెత్తి. “మూడు గంటలై ఉండొచ్చు” అన్నారు రావుగారు తన చేతికి గడియారమున్నా గానీ చూడకుండా. యాభైఏళ్ళ పెద్దమనిషి డిటెక్టివ్ నవల చదువుతూ ఆనందించడం రావుగారికి వింతగా తోచింది. ఇంకొకాయన చుట్ట కాలుస్తూ, దాని రుచిని ఆస్వాదిస్తున్నాడు. ‘ కొందరి స్వభావాలే అంత!’ అనుకున్నారు రావుగారు.
రైలుపెట్టె కిటికీ తలుపులన్నీ మూసివున్నాయి. బయట గాలి హోరు పెడుతోంది. జల్లు మొదలైంది. గాలి బలానికి వాన చినుకులు తలుపుల సందుల్లోంచి చొచ్చుకొస్తున్నాయి. ” దారుణంగా ఉందే ఈ గాలివాన!” అంటూ యువకుడు సిగిరెట్ అంటించాడు. ఆ యువతి మొహం చిట్లించి దూరంగా జరిగింది. రావుగారికి తన కూతుళ్ళు గుర్తుకొచ్చారు.తన కుమార్తెలు తల దువ్వుకునే పద్ధతి దగ్గర్నుంచీ, వాళ్ల అలవాట్లు, స్నేహాలు, వేసుకునే దుస్తులు.. అన్నీ ఆయనే నిర్ణయించారు. అందాన్ని గురించీ, మర్యాద గురించీ అయనకి నిశ్చితమైన అభిప్రాయాలున్నాయి.

గాలి అంతకంతకూ భయంకరంగా వీస్తోంది. వర్షం పెద్దదైంది. ఆ వర్షపు హోరులో రైలు చప్పుడు తెలియడం లేదు. ఇంతలో పెట్టె తలుపు తెరుచుకుంది. ఒక్కసారి పెద్దగా గాలీవానా లోపలికి చొరబడ్డాయి. వాటితోపాటు చిరిగిపోయి, తడిసిపోయిన గుడ్డలతో ఒకామె లోపలికి ప్రవేశించింది. లోపలున్న వాళ్ల అభ్యంతరాలు లెక్కచేయకుండా, తలుపుమూసి ఒక మూల నీరుకారుతూ నిలబడింది.
ఎదురుగా ఉన్న పెద్దాయన కోపంగా, “ఇది పరుపుల పెట్టె అని తెలియదూ?” అన్నాడు. ” బాబ్బాబు! తాతగారూ! ముష్టిముండని, కాంత నిలబట్టాకి సోటివ్వరా బాబుగారూ….దయగల బాబులు! బిడ్డలుగన్న తండులు..ఈ ముష్టిదానికి ఓ కానీ పారెయ్యండి బాబు. ఆకలి కడుపులో సిచ్చెడతంది బాబులు. గొప్పగొప్ప బాబులు, డబ్బున్నా బాబులు…గొప్ప పెబువులే అంతా… పేదముండని ఇలా ఆకలితో సచ్చిపోనివ్వరు…..

రావుగారు ఆమె వేపు చూశారు. ఆమె కళ్ళల్లో తమాషాగా మెరిసే ఒక తళుకుంది. ఆమె వయసు సుమారు ముప్ఫై ఏళ్లు ఉండవచ్చు. ఎంత అసహాయత నటించినా, ఆకలితో చచ్చిపోతున్నట్టు లేదు. ఆమెలో స్థైర్యం ఉంది. బిచ్చమెత్తుకోడం మీద రావుగారికి అసలు సానుభూతి లేదు. పేద వాళ్ళన్నా, లేమితో బాధపడుతున్న వాళ్లన్నా అయనకి జాలి ఉన్నా, బిచ్చమెత్తుకోడం తప్పని ఆయన నిశ్చితాభిప్రాయం. అందుకే ఆ అమ్మి ఆయన దగ్గరగా వచ్చి అడిగితే ఆయన గట్టిగా “ఫో” అన్నారు. ఆమె అదో మోస్తరుగా మొహంపెట్టి, రెండో పక్కకి తిరిగింది. ఎదురుగా ఉన్న ముసలాయన దగ్గరకి వెళ్లి ఆయన పాదాలు ముట్టుకుంది. ఆయన వెకిలిగా నవ్వి,కాళ్ళు వెనక్కి లాక్కుని, “వెళ్లువెళ్లు” అన్నారు.

” ఇందులో డబ్బున్న దొరలున్నారని, నాబోటి ముష్టిముండని ఆకలితో సావనివ్వరని ఎంతో అశతో ఈ పెట్టెలోకొచాన్రా దేవుడా! ఎంత మోసమైపోయిందిరా దేవుడా! మూడో కలాసు పెట్టెలో పేదోళ్ళుంటారు. ఈ బాబులకంటే ఆళ్లకే ఎక్కువ జాలి. డబ్బున్నా బాబులంతా రాతి గుండెలని తెలుసుకోలేక పోయాన్రా దేవుడా! ఇక్కణ్ణించీ ఆ దయగల బాబులున్నా సోటికి ఎలాపోను? అవతల గాలివాన! రైలు నడుత్తాఉంది.” ముష్టి మనిషి నానా గోలా చేస్తూ, అందరి దృష్టినీ ఆకర్షించింది. బయట చీకటిగా అయిపోయింది. 

చీకటి పడుతున్న కొద్దీ గాలి మరీ బలంగా వీస్తోంది. రావుగారు దిగవలసిన స్టేషను దగ్గిరపడుతోంది. ఆస్తిక సమాజం సభ్యులు ఎవరన్నా స్టేషనుకి రాకపోతారా అనుకున్నారు ఆయన. బయట హోరుమని గాలి. చెట్లు పడిపోతున్న చప్పుడు లాంటివి ఎన్నో గోలగా వినపడుతున్నాయి. ముష్టిది యువదంపతుల ఎదురుగా కూచుని మళ్లీ మొదలెట్టింది. ” అమ్మో… సిట్టితల్లి గారున్నారిక్కడ! సిట్టిబాబు గారితో సెప్పి ఒక్క కానీ ఇప్పించు తల్లీ….” అంది. ” ఏదో ఇచ్చి దాన్ని పంపేయకూడదూ?” అంది యువతి భర్తతో. “నాకు తెలుసు. సిట్టితల్లిది జాలి గుండె. ఇప్పుడు తాతగారు కూడా నాకో అణాకి తక్కువ ఇవ్వరు. తాతగారు జాలిగల ప్రభువు.” అంది ముష్టిది. రావుగారు తప్ప తక్కిన అందరూ ఆమెకు ఏదో ఇచ్చారు. ఆమె మాటలు వింటూంటే అందరికీ సరదాగా ఉంది. రావుగారు గాలివానను గురించీ, తను రైలులోంచి దిగడం గురించీ ఆలోచిస్తున్నారు.

రైలు ఆగింది. గాలివాన చాలా తీవ్రమయింది. ఆయన సామాను పట్టుకుని తలుపు తెరవగానే గాలి ఆయనను ఒక్కసారిగా వెనక్కు నెట్టేసింది. ఆయన తూలిపోయారు. ముష్టిమనిషి ఆయన సామానులు దింపి పెడతానంది. రావుగారికి ఆ సందర్భంలో మంచిచెడ్డలు ఆలోచించే సావకాశం లేదు. ఏదో నియమాన్ని ఉల్లంఘిస్తున్నట్టు ఆయన మనసులో కొంచెం బాధ కలిగినా, ఆమె సహాయాన్ని అంగీకరించక తప్పలేదు. రైలు దిగి ఆయన స్టేషనులోకి. ఒక్క పరుగున వెళ్ళిపోయారు. ఆమె ఆ సామానుల బరువుతో తూలుతూ వచ్చి వెయిటింగ్ రూములో పెట్టింది.స్టేషన్లో ఒక్క దీపంకుడా లేదు. ఆయన కొంత డబ్బు తీసి అమెకిచ్చారు. అది తీసుకుని ఆమె చటుక్కున మాయమైపోయింది.

రావుగారు గదిలోకి వెళ్ళి కూచున్నారు. బట్టలన్నీ తడిసిపోయాయి. భయంకరమైన ఆ గాలిలో కాళ్ళు పట్టుతప్పిపోతున్నాయి. పెట్టెతీసి వెతికి టార్చ్ లైట్ తీశారు. పొడిబట్టలు తీసి కట్టుకున్నారు. రైలు కదిలిపోయింది. ఎవరో స్టేషన్లో ఉండకపోతారా అని ఆయన బయటికి వచ్చారు. ఇంతలో స్టేషను మాస్టరు, బంట్రోతు ప్లాట్ ఫారం దాటి వెళ్ళడం చూసి ఆయన వాళ్ళని గొంతెత్తి పిలిచారు. ” నేను ఊళ్ళోకి వెళ్ళాలి” అన్నారు ఆదుర్దాగా. “చాలా కష్టం. రోడ్డుమీద అడుగడుక్కీ చెట్లు పడున్నాయి. టెలిఫోన్ తీగలు తెగిపోయాయి. ఇప్పుడు వెళ్ళిన రైలు వచ్చే స్టేషన్లో రాత్రికి ఆగిపోతుంది. గాలీ వానా తీవ్రంగా ఉంటుందని మాకు వార్త వచ్చింది.” అన్నాడు స్టేషను మాస్టరు. “కానీ స్టేషన్లో ఇంకెవ్వరూ లేరే.” అన్నారు రావుగారు. ” నేనేం చేస్తాను? ఎలాగో స్టేషను లోనే మీరు గడపాలి”. అని అతను వెళ్ళిపోయాడు.

రావుగారు వెయిటింగ్ రూమ్ లోకి వెళ్ళిపోయారు. రెండు కిటికీ తలుపులు ముక్కలైపోయాయి. కొన్ని పెంకులెగిరిపోయాయి. ప్రకృతి మహోగ్ర రూపం దాల్చినట్టుంది. ఆ గందరగోళ స్థితిలో మనోధైర్యాన్ని చేకూర్చే వేదాంతమేదీ అయనకి తోచలేదు. క్రమశిక్షణ, నియమాలు, విలువలూ అన్నీ కూడా మానవాతీతమయిన కొన్ని శక్తులు విజృంభించినపుడు అర్థరహితం అయిపోతాయాయని ఆయనకి జీవితంలో మొదటిసారి అనుభవంలోకి వచ్చింది. ప్రకృతి చెలరేగి, నాశనానికి ఒడిగడితే మానవుడు తనని తాను ఎలా రక్షించుకోగలడు? స్టేషన్ భీతావహంగా ఉంది. రావుగారి మనసుని భయం ఆవరించింది.

ఇంతలో తెరచిన తలుపులో నుంచి లోపలికేదో ప్రవేశించినట్టుగా కనిపించి రావుగారు ఆవైపు లైటు వేసి చూశారు. ముష్టి ఆమె గజగజ వణుకుతూ నీరుకారుతూ ఒకమూల నిలబడి ఉంది. ” బాబుగారూ! తలుపుముయ్యలేదే? కొంచెం వెచ్చగా ఉంటుంది.” అందామె గొంతు పెద్దది చేసి. ఆయన లేచి తలుపు ముయ్యడానికి ప్రయత్నించి, వెయ్యలేకపోయారు. ఆమె సహాయంతో ఎలాగో మూసి గడియవేశారు. కానీ గాలి ఒక్క ఊపు ఊపింది. గడియ ఊడిపోయింది. అక్కడున్న కుర్చీలు,బీరువా, బరువైన డ్రాయరూ తలుపుకి అడ్డం పెట్టేరు. ఇపుడు కొంచెం వెచ్చగా ఉంది. “ఏం గాలివానండి బాబుగారు! నేనింతవరకూ సూడలేదు.” అంది ముష్టిది ఆమె తన గొంతులో ఏ బెదురు లేకుండా. అంత ప్రశాంతంగా ఆమె ఎలా మాట్లాడగలుగుతూందో ఆయనకి అర్ధం కాలేదు. ఆమెవైపు ఆయన లైటు వేసి చూశారు. 

వణుకుతూ ఓ మూల కూచుంది. ఆయన పెట్టె తెరచి ఒక పంచతీసి “కట్టుకో” అని అమెవేపు విసిరేరు. ఆమె బట్ట మార్చుకుని ఆ మూలే పొడిగా ఉన్నచోట కూర్చుంది. రావుగారు వాచీ చూసుకున్నారు. తొమ్మిది గంటలయింది. అయనకి రైలు దిగిన తర్వాత కొన్ని యుగాలు గడిచినట్టయింది. అసలు వచ్చే స్టేషన్ వరకూ మిగతా వారితో ప్రయాణం సాగించి ఉంటే బాగుండును. ఇక్కడనుంచి అయినా తను వెళ్ళవలసిన ఊరు రెండు మైళ్ళు ఉంటుంది. అక్కడనుంచి అయితే వెనక్కి వస్తే సరిపోయేది. గాలివాన ఇంతలా చెలరేగుతుందనీ, తను దిగే స్టేషన్ చిన్నదనీ అయనకి స్ఫురించలేదు.

రావుగారికి ఆకలి వేస్తున్నట్టు అనిపించింది. పెట్టె తీసి అందులో ఉన్న బిస్కట్ల పొట్లం తీసి, ఒకటొకటి తింటున్నారు. ఇంతలో ఆమెకి కూడా ఆకలివేస్తోందేమో అనుకుని లేచి వెళ్ళి కొన్ని బిస్కట్లిచ్చారు. మళ్లీ వచ్చి కూచుని ఆలోచిస్తున్నారు. ఆమె దేన్ని గురించీ బాధ పడదు. జీవితంలో కష్టనిష్ఠూరాలు బాగా అలవాటై ఉంటాయి అనుకుంటూ, బయట పెద్దగా వీస్తోన్న గాలివేగాన్ని అంచనా వేశారు ఆయన. సుమారు గంటకు 100 మైళ్ళు ఉండవచ్చు! పెద్దభయం ఆయనని పట్టుకుంది. ఈ గది కూలిపోవచ్చు! బయటకి పోయే దారి కుర్చీలతోటి, బల్లలతోటి మూసివుంది. కంగారుగా ముష్టిది కూచున్న చోటికి ఆయన పరుగెట్టేరు.

” ఈ ఇల్లు కూలిపోదు గదా?” అని అడిగారు. ” ఎవరు చెప్పగలరు? ఇల్లు గట్టిగానే ఉంది. గాలిబలం ఎక్కువైతే ఏది ఆగుద్ది?” అందామె చనువుగా. ఆయన పెట్టె దగ్గరకి పోయి కూర్చున్నారు. ఆయన కూర్చున్న మూలకి నెమ్మదిగా ఆమె కూడా చేరింది. ” అక్కడ కూసుంటే ఒకరిమాటికరికి ఇనపడదు” అంది. ” గాలివాన ఇంత ముదిరిపోతుందనుకో లేదు ” అన్నారు రావుగారు. ” 

బాబుగారూ..ఎందుకలా భయపడతారు? ఇద్దరమున్నాము గదా! రైలు కదులుతుంటే, దొంగముండావాడు టిక్కెట్టు కలక్టరు నన్ను దింపేశాడు. ఏంచెయ్యను? ఇక్కడుండిపోయాను. అయినా నాకేటి ఇచారం? మీరో పొడిగుడ్డ ఇచ్చారు. ఈ మాత్రం సుకమైనా ఉంటాదనుకొలేదు. ఉన్నంతలో సుకంగా ఉండాలి బాబూ! అదిలేదనీ ఇదిలేదనీ సీకాకు పడితే ఏం లాబం?” అందామె. 

ఆమె అలా మాట్లాడుతుంటే ఆయన కాస్త స్థిమిత పడ్డారు. ఆమె భౌతిక దేహం చూస్తే ఆయనకి అసహ్యం. ఆయన మనసుకీ ఆమె మనసుకీ చాలా అంతరం ఉంది. అయినా ఆ భయంకమైన రాత్రి తనకి తోడుగా ఉన్నందుకు ఆయన మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. 

“నీకెవరూ చుట్టాలు లేరా?” అని అడిగి, అలా చనువుగా ప్రశ్నించినందుకు ఆయన తనకి తనే నొచ్చుకున్నారు. 

” సుట్టాలందరికీ ఉంటారు. ఏం లాబం బాబుగారు? మా అయ్య తాగుతాడు. మా అమ్మని ఆడే సంపేసాడంటారు. నాకు మనువు అవలేదు. కానీండి బాబుగారు..ఒక దొంగముండావాడితో సేవితం కలిసింది. నాకు ఇద్దరు పిల్లలండి. ఆడికి తాగుడు,జూదం అలవాటై పోయాయి. డబ్బులన్నీ తగలేత్తాడు. ఏం జెయ్యను? ఇంట్లో తిండి తిప్పలకి నా సంపాదనే. మా వోడికి రోజుకో పావలా ఇత్తానండి. బిచ్చమెత్తుకోటాకి పిల్లలు ఇంకా చిన్నోళ్లు బాబుగారు.” అందామె. 

“నువ్వు ఏ మాత్రం సంపాదిస్తావు?” ఆయన అడిగారు. “ఒక్కోరోజు ఐదు రూపాయలు దాకా దొరుకుద్ది. ఒకోరోజు కానీ కూడా ఉండదు. అయినా బాబుగారు! నేనడిగితే ఎవరూ లేదనరండి- మీరు తప్పితే. కొంతసేపు ఆరితో సరదాగా మాట్టాడితే ఇచ్చేత్తారండి అంది.

రావుగారు అనుకోకుండానే ఆమె ముఖంమీద లైటు వేశారు. 

ఆమెకు మనసులో లోతుగా ఇష్టానిష్టాలు లేనట్టు అయనకి అనిపించింది. గడిచిన వాటిగురించి దిగులుగానీ, రాబోయే రోజుల గురించిన ఆశలు కానీ అమెకున్నట్టు లేదు. నాగరికులకు సహజమైన ద్వంద్వ ప్రమాణాలు ఆమెకు తెలిసినట్టు లేదు. ఆయన విశ్లేషిస్తున్నారు. 

“ఏమిటండి బాబుగారు! నాకేసలా చూత్తారు? మునుపున్నంత రంగుగా ఇప్పుడు లేనండి” అందామె.

వెంటనే ఆయన సద్దుకున్నారు. తన మనసులో అశ్లీలమైన భావాలు ఉంటాయన్నట్టు ఆమె సూచించినందుకు ఆమె మీద అసహ్యం వేసింది.

ఇంతలో అకస్మాత్తుగా పెద్ద చప్పుడు! గది తలుపులు ఒక్క ఊపుతో తెరచుకున్నాయి. అడ్డుగా పెట్టిన సామాను చెల్లాచెదురై పోయింది. ఒక తలుపు ఊడిపోయి కుర్చీమీదనుంచి పల్టీ కొట్టింది. చెప్పలేని భయంతో రావుగారు ఒక్క గెంతు గెంతి, పిచ్చిగా ముష్టిదాన్ని కౌగిలించుకున్నారు.

వెంటనే తెలివి తెచ్చుకుని సిగ్గుపడి పోయారు. కానీ ఆమె ఆయనను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ గుమ్మం పక్కనున్న మూలకి తీసికెళ్ళి కూచో పెట్టింది. తనుకూడా దగ్గరగా కూచుని చేతులు ఆయన చుట్టూ చుట్టింది. ఆ సమయంలో ఆ వెచ్చదనం అయనకి ప్రాణావసరం! అంచేత ఆయన కాదనలేదు. 

” సరిగ్గా కూకొని నా సుట్టూ సేతులేసుకోండి. కాంత ఎచ్చగుంటది. పాపం! బాబుగారు ఒణికిపోతన్నారు.” అందామె.

ఆ మాటలు చాలా వెగటుగా ధ్వనించాయి రావుగారికి. ఆమె ఇంకా దగ్గిరగా జరిగి ఆయన ఒళ్ళోకి వాలింది. ఆమె బరువు ఆయన మోకాళ్ళ మీద ఆన్చింది. ఆయన మరింత ముడుచుకు కూచుని, దీర్ఘంగా అవమానకరమైన ఆలోచనలలో ములిగిపోయారు. 

ఆమె ఏదో మాట్టాడుతూనే ఉంది. “ఈ మూల బయం లేదండి. బాబుగారు ఇంట్లోవోళ్ళని తలుసుకుంటున్నారు. మావాడొట్టి ఎదవ. చిత్తుగా తాగి పడుంటే, గుడిసె ఎగిరిపోతే ఆడికేం తెలుత్తాది? పిల్లలెట్టా ఉన్నారో ఏమో!” ఆ మానవ హృదయంలోని వేదన వింటూంటే ఆయన నిర్మించుకున్న గోడలన్నీ మాయమైపోయాయి. ఆవేదనగా ఆ ముష్టిదాన్ని హత్తుకున్నారు. 

క్రమంగా ఆయన మనసు ఆలోచించడం మానేసింది. గాలి చేసే అంతు లేని గోల ఎక్కడికో పోయి, ఆయన కాళ్ళమీద ఆనుకున్న శరీరపు వెచ్చదనం ఒకటే అయనకి తెలుస్తోంది. గాలివాన జోరు హెచ్చింది. కానీ ఆయన మనసులో అమితమైన శాంతి నిండింది. కొంతసేపటికి రావుగారి కాళ్ళు తిమ్మిరెక్కాయి. ఆమెకి మెలకువ రాకుండా మెల్లగా అయన కాళ్ళు కదుపుకున్నారు. ఓసారి లైటు వేసి ఆమె ముఖం వంక చూశారు. అమాయకంగా నిద్రించే ఆ ముఖంలో ఉన్న శోభ స్వచ్చమైన దివ్యత్వం స్ఫురింపచేసింది. క్రమంగా ఆయన పరిసరాలను మరచిపోయి నిద్రలో మునిగిపోయారు.

రావుగారికి మెలకువ వచ్చేసరికి వాన తగ్గింది. ఇంకా గాలి వేగంగా వీస్తోంది. ముష్టిఆమె అక్కడ లేదు. టైం చూసుకున్నారు. ఐదు గంటలయింది. లేచి నిలబడి, అనుకోకుండానే జేబులు చూసుకున్నారు. గదిలో నాలుగు మూలలా వెతికారు. కనబడలేదు. 

ఆయనకి ఆమెను దొంగ అనుకోవడం ఇష్టంలేదు. రాత్రి ఎక్కడైనా పడిపోయిందేమో అనుకున్నారు. బయటికి వచ్చారు. అంతా భీభత్సంగా ఉంది. ప్లాట్ ఫారం తప్ప చుట్టుపక్కల అంతా నీటిమయం. టిక్కెట్లు అమ్మే గది పూర్తిగా కూలిపోయింది. బల్లలూ, కుర్చీలూ చిందర వందరగా పడిఉన్నాయి.

అదే వెయిటింగ్ రూమ్ కూలిపోతే ఏమైయుండును? అనుకున్నారు. ఇంతలో అకస్మాత్తుగా ఆ సామానుకింద అస్పష్టంగా ఏదో శరీరం ఆనింది. ఆయన లైటు వేసి చూశారు. ముష్టి ఆమె! ఆయన తట్టుకోలేకపోయారు. వంగి నుదురు తాకి చూశారు. చల్లగా చచ్చిపోయివుంది. చేతులు రెండూ ఇవతలకు ఉన్నాయి. క్రింది భాగం నుజ్జయిపోయినట్టుంది. ఆమె ఒక చేతిలో ఆయన పర్సుంది. రెండో చేతిలో కొన్ని నోట్లు,కొంత చిల్లరా ఉంది. బహుశా రాత్రి టిక్కెట్లు అమ్మిన డబ్బు అయివుంటుంది. 

రావుగారు చిన్నపిల్లాడిలా ఏడవడం మొదలెట్టారు. ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని, గతరాత్రి విషయాల్ని తలచుకున్నారు. తనకు ఆత్మస్థైర్యాన్ని, శాంతినీ, గాలివానకు తట్టుకునే శక్తినీ ఇచ్చిన ఆమె ఆ గాలివానకి బలైపోయింది. తన పర్సు దొంగిలించినందుకు కానీ, అంత గాలివానలో డబ్బుకోసం టిక్కెట్ల గదిలోకి వెళ్ళినందుకు కానీ ఆయన ఆమెను మనసులో కూడా దూషించలేదు. ఆయనలో మరుగున పడిపోయిన మానవత్వాన్ని ఆ జీవి వికసింప జేసింది. ఆయన భార్య, పిల్లలలో ఎవరూ కూడా ఈమె వచ్చినంత దగ్గరగా రాలేదు.

 అంతలో దూరంనుంచి మనుషులు వస్తోన్న సవ్వడి వినిపించింది. రావు గారు క్షణం ఆలోచించి, కృత నిశ్చయంతో ఆమె వేళ్ళ సందులోంచి డబ్బు తీసి, తెరచిఉన్న డ్రాయరులో వేసి డ్రాయరు మూశారు. కానీ తన పర్సు ఆమె దగ్గరనుంచి విడదీయడానికి ఆయన మనసు వొప్పలేదు. అయితే ఇతరులు ఆమె దొంగతనం చేసిందని అనుకోడం ఆయనకి ఇష్టంలేదు. అందుకే జాగ్రత్తగా ఆ పర్సులోంచి తన పేరుగల కార్డు తీసివేసి, బరువైన హృదయంతో అక్కణ్ణించి వెళ్ళిపోయారు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment