Tuesday, May 5, 2026

 త్యాగబుద్ధి


స్వార్ధబుద్ధితో కోరుకొనే వరాలు లోకానికే కాదు . ఆఖరకు అలా కోరుకున్న వారికి కూడా మంచి చేయవని , నిస్వార్ధంతో చేసిన స్వల్పదానమైనా పదికాలాల పాటు చెప్పుకునే విధంగా వారి పేరు స్థిరపడి పోతుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకు ఉదాహరణే మహాబలసంపన్నుడైన వృత్తాసురుడు , దధీచి మహాముని జీవితాలు .


వృత్తాసురుడు మహాభయంకరాకారంగల, మహాశక్తిసంపన్నుడైన రాక్షసుడు . దేవతలపైన ద్వేషంతో తపస్సు చేసి , కనీవినీ ఎరుగని విధంగా తయారైన కొత్త ఆయుధం ..అదీ ఏవిధమైన లోహంతోనూ తయారు చేయని ఆయుధం తప్ప మరేదీ తనను చంపడం కాదు కదా , కనీసం కొద్దీ పాటి గాయం కూడా చేయని విధంగా వరం పొందాడు . ఆ వరానికి సహజసిద్ధమైన రాక్షసబలం తోడు కావడంతో వాడిని ఎదిరించగలిగేవారెవరూ లేకుండా పోయారు . వాడు మొదట ఇంద్రుడి మీద దండెత్తి , సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు . అది చాలదన్నట్టు దేవతలందరినీ హింసించడం మొదలు పెట్టాడు . దేవేంద్రుడు ఏమీ చేయలేక దేవతలను వెంటపెట్టుకుని విష్ణుమూర్తి వద్దకెళ్లి , మొరపెట్టుకున్నారు . అత్యంత బలమైన , పొడవైన ఎముకలతో అత్యంత పదునైన ఆయుధాన్ని తయారు చేయించమని సూచించాడు .


ఏనుగు , సింహం , పులి వంటి జంతువుల ఎముకలు బలిష్టంగా ఉంటాయి కాబట్టి ఆయుధ తయారీకి పనికొస్తాయనుకుంటున్న దేవతలతో విష్ణువు ఇలా అన్నాడు . " మీ ఆలోచన సరైనది కాదు .బలంతోపాటు , తపశ్శక్తి కూడా కలబోసుకున్న ఎముకలై ఉండాలి భృగుమహర్షి కుమారుడు , మహాతపస్సంపన్నుడైన దధీచి మహర్షి వెన్నెముక అందుకు బాగా ఉపయోగపడుతుందని , దేవశిల్పి , దేవగురువులను తీసుకుని వెంటనే దధీచి మునిని ఆశ్రయించమని మార్గాంతరం చెప్పాడు విష్ణుమూర్తి .


దేవేంద్రుడు, దేవగురువైన బృహస్పతిని , దేవశిల్పి విశ్వకర్మను వెంటబెట్టుకుని దధీచి మహర్షి ఆశ్రమానికి వెళ్లారు . వారిని చూసి , సంతోషంతో అతిథిమర్యాదలు చేయబోతున్న దధీచితో తాము వచ్చిన సంగతిని ఎలా అడగాలో అర్ధం కాక సతమతం అవుతుండగా , దధీచి మహర్షి వారిని గుచ్చిగుచ్చి అడగడంతో ఎట్టకేలకు చెప్పలేక చెప్పలేక విషయం చెప్పారు .


దధీచి మహర్షి ఎంతో సంతోషంతో వారికీ తన అనుమతిని తెల్పాడు . అంతేగాక యోగశక్తితో తన ప్రాణాలను ఊర్ధ్వోత్కటనం చేసుకున్నాడు . లోకోపకారం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన దధీచి , అవయవదానానికి ఆధ్యుడయ్యాడు . అలా దధీచి మహర్షి వెన్నెముక నుంచి తయారైందే వజ్రాయుధం . ఆ వజ్రాయుధంతోనే వృత్రాసురుడితో పోరాడి , అవలీలగా విజయం సాధించాడు దేవేంద్రుడు .


మంచితనానికి , త్యాగానికి మారుపేరుగా దధీచి మహర్షి పేరు శాశ్వతంగా నిలిచిపోయింది . ఆ వజ్రాయుధమే ఇంద్రుడికి ప్రధాన ఆయుధమైంది .


డి.వి. ఆర్ . భాస్కర్

No comments:

Post a Comment