Tuesday, May 5, 2026

 శ్రీ కొమ్ముల సూర్యనారాయణ మాష్టారు ఇచ్చిన వాక్యం 

 
 1 ఓసి నీ మొహం మండా ఆ వచ్చినావిడ ఎవరనుకున్నావ్
.
2 ఏమండీ! మీరు తప్ప నాకు పరాయి వాళ్ళు ఎవరున్నారు, చెప్పండి “* కి హాస్యాత్మికంగా రాసిన చిన్న కథ. 

 *టు లెట్ – ఇల్లు అద్దెకు ఇవ్వబడును.* 

రచన : కూచిమంచి నాగేంద్ర.


‘టు లెట్’ బోర్డు చూడగానే పరుగు పరుగున అటుగా నడిచింది అమ్మాజీ. 
‘అమ్మ బాబోయ్! ఈ ఎండలలో ఇల్లు వెతకడం కష్టమే. ఆయన చూస్తే రారు. ఈ నెలాఖరుకు ప్రస్తుతం ఉన్న ఇల్లు ఖాళీ చెయ్యాలి. ఎట్టి పరిస్థితిలో ఈ ఇల్లు వదులుకోకూడదు’ అని పరి పరి విధాల ఆలోచిస్తూ ఇంటి తలుపు తట్టింది. ఎవరూ రాలేదు. 

‘అసలు ఇంట్లో ఎవరైనా ఉన్నారా!’ అనుకుంటూ దబదబ బాదింది.

“ఉండండి వస్తున్నా!” అన్న కేక వినపడడంతో బాదుడు ఆపింది అమ్మాజీ.

కాసేపటికి తలుపు తీశాడు ఇంటి ఓనర్ పిచ్చేశ్వరరావు. ‘ది ఫేమస్ రైటర్’.

“ఎవరు కావాలి?” అడిగాడు.

“టు లెట్ బోర్డు పెట్టుకుని ఇదేం ప్రశ్న?” అంది అమ్మాజీ.

“ఓ! అద్దె ఇల్లు కోసం వచ్చారా!” అన్నాడు బద్ధకంగా.

“ఎండ మండిపోతోంది, లోపలికి రావచ్చా?” అమ్మాజీ కోపం బి.పి. లా పెరుగుతోంది.

 *“ఏమండి మీరు తప్ప నాకు పరాయి వాళ్ళు ఎవరున్నారు చెప్పండి?”*   అన్నాడు పిచ్చేశ్వర్.

కంగారుగా చూస్తున్న అమ్మాజీతో, “కంగారు పడకండి అది ఆయన ఊతపదం. ఈ మధ్య ఎవరో రచయిత గారు ఇచ్చిన ఈ వాక్యానికి కథ రాస్తూ అదే ధ్యానించడం వలన ఎవరొచ్చినా ఇదే సంత. 

ఈయన వెనకుండి నేను సర్దలేక చస్తున్నాను” అంది పిచ్చేశ్వరరావు భార్య బుచ్చేశ్వరి.

“అదేం ఊతపదం అమ్మా!” అంది అమ్మాజీ.

“ఏం చెప్పమంటారు, ఏదో గ్రూపులో ఇలాంటి పదాలు ఇచ్చి కథలు రాయమంటారట. అదిగో అప్పుడు ఆలోచనలో పడతారు. అదే పదాన్ని రామనామం లాగా వెయ్యి సార్లు అనుకుంటారు. అదే తరువాత ఊతపదం అయి నా ప్రాణం తీస్తోంది” అంది బుచ్చేశ్వరి.

“మొన్నటికి మొన్న మా అల్లుడితో ‘ *మీరు తప్ప నాకు పరాయి వాళ్ళు ఎవరున్నారు చెప్పండి* ’ అనడంతో ఆయన అలిగి పిల్లని ఇక్కడ వదిలేసి పోయాడు. 

మళ్ళీ ఆయనకి కానుకలిచ్చి ఇంటికి తీసుకువచ్చేటప్పటికి తలప్రాణం తోకకు వచ్చింది” అంది బుచ్చేశ్వరి.

“ఈ డబ్బులన్నీ గ్రూపులో ఆ వాక్యం ఇచ్చిన ఆయన దగ్గర వసూలు చేయండి అని ఓ ఉచిత సలహా పారేసి, ఇంతకీ లోపలికి రావచ్చా?” అంది అమ్మాజీ.

“భలేవారే.. మీకంటే పరాయి వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అంటూ నాలుక కరచుకుని అయ్యో రామా.. ఆ పదం నాకూ అలవాటైపోయింది, క్షమించండి. రండి ఇల్లు చూడండి” అంది బుచ్చేశ్వరి.

“రెండు గదులు, వంటిల్లు, ఈ హాలు.. చిన్న కుటుంబానికి చక్కని ఇల్లు. అద్దె పన్నెండు వేలు, రెండు నెలల అడ్వాన్స్” చిలక పలుకుల్లా చెప్పింది బుచ్చేశ్వరి.

“మరీ అంత అద్దెనా! పైగా రెండు నెలల అడ్వాన్స్. కిటికీలకు తలుపులు లేవు, కబోర్డ్స్ కట్టించలేదు, కిచెన్లో అలమారే లేదు.. సామాను ఎక్కడ పెట్టుకుంటాం?” అంది ఇల్లంతా తిరిగి అమ్మాజీ.

“అందుకనే అనేది ముందు పదిహేను వేలు చెప్పవే, తరువాత తగ్గిద్దాం అని. *నీ మొహం మండా.. ఆ వచ్చిన ఆవిడ ఎవరనుకుంటున్నావ్?* ఆ పెద్ద రచయిత అవతారం భార్య. చాలా తెలివైనది” అని భార్య చెవిలో చెప్పాడు పిచ్చేశ్వర్.

“ఆవిడ తెలివైనదైతే నేను ఇంక తెలివైన దాన్ని, చూడండి” అంటూ.. 

“అమ్మా మీకు ప్రస్తుతం ఒక రూమ్ ఇస్తాం. రెండో రూమ్‌లో మా సామాను పెట్టుకోవాలి” అంది బుచ్చేశ్వరి.

“అదెలా? పన్నెండు వేలు రెంట్ ఇచ్చి, రెండు నెలల అడ్వాన్స్ ఇస్తున్నా ఒక్క రూమ్ ఇస్తానంటే ఎలా? రెండు ఇస్తేనే తీసుకుంటాను” కంగారుగా అంది అమ్మాజీ.

భార్య తెలివికి ఆశ్చర్యపోయాడు పిచ్చేశ్వరరావు. రెండు నెలల అడ్వాన్స్ ఇచ్చి ఇల్లు అద్దెకు ఖాయం చేసుకుంది అమ్మాజీ.

“ఇక నుంచి మీరు మేము బంధువులం ?” అంది బుచ్చేశ్వరి.
“అవును.. *మీరు తప్ప నాకు పరాయివాళ్ళు ఎవరుంటారు? చెప్పండి ”* అంటూ నోరు కరుచుకుంది అమ్మాజీ.

                          శుభం

No comments:

Post a Comment