Tuesday, May 5, 2026

 రేపు —మాపు
ఓ స్త్రీ రేపు రా— అని కొన్ని సంవత్సరాల క్రితం జనాలు భయపడి పోయి—

ఎవరో ఈ వేళే వచ్చి ప్రాణంతీస్తారనీ —ఆ దెయ్యాన్నీ బోల్తాకొట్టించే అతితెలివి చూపిస్తూ గోడలమీద వ్రాసేవారు.

రేపు అంటే తర్వాతి రోజు అని స్థిరపడిపోయింది ఇప్పుడు.

కానీ రేపు అంటే వేకువ ..

ఈ నాటి రేపటివేళలో అంటే ఈ రోజు ఉదయం అని.

మిత్రభేదంలో ఒక డైలాగ్ ఉంది.

*అది నిన్న మాపో —నేడు రేపో అది ఇచ్చటికి వచ్చిచేరి యుండును * —

ఒక సార్థవాహుడు ఊరూరా తిరుగుతూ వస్తువులు అమ్ముతూ కొంటూ పెద్ద సరంజామాతో పోతూ వ్యాపారం చేసేవాడు. [ఈ గుంపును 'సాతు' అనేవారు.]

ఎడ్లబండ్లమీద సామాన్లు వేసుకొని కొండలు కోనలు దాటుకొంటూ పోతున్నది సాతు.

కొండనేలలో ఒక ఎద్దుకు కాలు మడతబడి ఎంతసేపటికీ కదల్లేదు. అతడు ఏదో తన ప్రయత్నం తాను చేశాడు. చివరికి దాన్ని విసిగి వదిలేసి పోయాడు. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు ఈ కుంటిఎద్దుకు మంచిరోజులు వచ్చాయి. ఆ కొండ మీద ఏ ఆకు మేసిందో — ఏ పొదలో ఆకు కాలికి రాచుకొందో కాలు చక్కగా వచ్చింది. దాన్ని మంత్రి పదవి వరించే దశ వస్తున్నది.

ఆ కాటిలో ఇద్దరు కింగ్ మేకర్స్. కరటకుడు దమనకుడు.

పింగళకుడు సింహం రాజు. వీళ్ళిద్దరూ మంత్రులు.

(తమకు) కావలసిన వాళ్లకు ఉద్యోగాలు ఇప్పించడం , తమ మాట విననపుడు పీకేయించడం వీళ్ళ వృత్తి.

చిన్నయ్యసూరి ఒక చక్కని మాట చెప్పాడు . రాజుల కొలువులో ఎవరైనా ఎందుకు చేరుతారు? నాలుగు రాళ్ళు సంపాదించుకోడానికి అనుకొంటే పప్పులో కాలేసినట్టే.

ఎందుకో తెలుసా?

మిత్రామిత్రులకు ఉపకారాపకారములు చేయవేడి బుద్ధిమంతులు రాజాశ్రయము వేడుదురు.

చమత్కారమైన విషయం. చెప్పడమూ అలంకారంతో..

మిత్రులకు ఉపకారము ఇంతవరకూ సహజంగానే ఉంది.

కూడా ఇంకోమాట . అమిత్రులకు అపకారం.

మనకు గిట్టనివాడికి ఉప్పూకారం పెట్టాలంటే మనకు వెనక సపోర్ట్ ఉండాలి. అందుకు వెనక అండ కావాలి.

ఈ విషయం వివరించనక్కర్లేదనుకొంటా.

ఇంత ఇంపుగా మాట కుదరడం చాలా కష్టం.

పెద్ద పెద్ద పండితులే అనుకరించబోయి వెల్లికిలబడ్డారు. పేర్లు చెప్తే బాగుండదు లేండి!

సరే. అటుంచండి

సంజీవకుడు ఎద్దుగారు నాలుగు రోజుల్లో కుదుటబడి హాయిగా కావలసినంత కసవుమేసి స్వేచ్ఛావాతావరణంలో స్వైరవిహారం చేస్తూ పెద్ద రంకె వేశారు. దానికంటికి అక్కడ అన్నిరోజులూ ఏ క్రూరజంతువూ తారసపడకపోవడం దాని అదృష్టం అనుకోవాలి. అందుకే పులులూ సింహాలూ జడుసుకొనేటంత రంకె వేసింది. ఇంక నన్నెవ్వరూ ఏమీ చేయలేరనే ధీమా .

నక్కలు రెండూ ఇతరజంతువులు తిని వదిలేసిన ముక్కలకోసం బొక్కలు వెదుకుతూ తిరుగుతూ ఉంటాయి గదా! ఈ అరుపు విని ఎగిరిపడ్డాయి.

అపుడు అవి అనుకొంటున్నాయి…..

ఈ అరుపు ఎపుడూ వినలేదే! ఏ జంతువు కూతబ్బా ఇది?

అదేదో వింత జంతువు నిన్న మాపో.. నేడు రేపో ఇచ్చటికి వచ్చి చేరి యుండును— అని .

ఉదయం తొమ్మిది పది సమయంలో అనుకొంటున్నాయ్.

ఆ కొత్త పశువు నిన్న అస్తమానమో— ఈ వేళ ఉదయమో వచ్చి ఉంటుంది. లేకపోతే మనకంటబడకుండా ఉంటుందా? నిన్న చీకటిబడిన తర్వాత పక్క అడవిలో నుంచి వచ్చి ఉంటుంది. లేకపోతే ఈ వేళ వేకువన వచ్చి ఉంటుంది… అని.

ఈ * రేపు మాపు* పెద్దన్న గూడా అన్నమాటే .

వరూథిని ప్రవరుణ్ణి ఇక్కడి ఉండిపోవయ్యా (మగడా) మీ ఊళ్ళో ఏముంది పెద్ద చెప్పుకోడానికి? అంటుంది.

ఈయన నాకు సంధ్యవార్చుకొనే సమయం దాటిపోతుంది .. అంటూ తాను ప్రతినిత్యమూ వేల్చే అగ్నిహోత్రుణ్ణి స్మరించుకొంటాడు.

అపుడంటాడు. (మను.2.–65)

తరుణీ! రేపును మాపు హవ్యములచేతం దృప్తుడౌ వహ్ని సత్కరుణాదృష్టినొసంగు సౌఖ్యములెరుంగన్ శక్యమే నీకు?

ఉదయవేళలో సంధ్యానంతరకాలం * రేపు* —అగ్నిని ఉపాసించి హవ్యములు వేల్చవలె.

అలాగే మాపు— సాయంకాలం గూడా సంధ్యవార్చి వేల్చవలె. ఇది విధి.

మాపు అంటే నల్లబడడం. చీకటి పడే సమయం.

అగ్నిదేవుడు చల్లగా చూస్తాడు సంతృప్తిపడి.

ఆ ఆనందం చాలు నాకు అంటాడు ప్రవరుడు.

ఇవి తెలుగు పదాలు.

No comments:

Post a Comment