Tuesday, May 5, 2026

 కలికాలం

సహజంగా చలికాలం వణికిస్తుంది. కానీ కలికాలం ఇంకా వణికిస్తోంది. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నేటి సమాజంలో జరుగుతున్న భయానక సంఘటనలు, అత్యాచారాలు, అమానుషాలు చూస్తుంటే... కలికాలంలో ఇలాంటి దారుణాలు జరుగుతాయని పెద్దలు చెప్పింది నిజమేననిపిస్తోంది. అన్నం, పాలు, నీళ్లు, గాలి, ఆఖరికి శరీరంలో అవయవా లనూ అమ్ముతారు. అమ్మాయిలను, పిల్లలను అమ్ముతారు. అమ్మనిదంటూ ఏమీ ఉండదు. పుట్టగానే లింగ వివక్షతో ఆడబిడ్డలను చంపేస్తారు. తిండి పెట్టకుండా తల్లి దండ్రులను, వృద్ధులను చంపుతారు. ఇది అన్యాయం... అని అడిగినవాళ్ల గొంతుకోస్తారు. పన్నులు కట్టించుకుంటారు. పాలన చెయ్యరు. అధికారం కోసం బీభత్సం సృష్టిస్తారు.

కాలమహిమ రకరకాలుగా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. కృత యుగంలో దేవతలు, రాక్షసులు వేర్వేరు లోకాల్లో ఉండేవారు. త్రేతాయుగంలో రాముడు, రావణా సురుడు ఒకే ప్రపంచంలో ఉన్నారు. ద్వాపరయుగంలో మంచి వాళ్లు, చెడ్డవాళ్లు కౌరవ పాండవులుగా ఒకే కుటుంబంలో ఉన్నారు. కలియుగంలో మంచి, చెడు... ఒకే శరీరంలో ఉంటున్నాయి. దాంతో ప్రతి వ్యక్తిలోనూ ప్రతిరోజూ అంతర్యుద్ధమే. ఎవరికి వారు తమలో ఉన్న చెడ్డవాణ్ని గుర్తించి బయటికి తరమాలి. మంచివాడితో సహ వాసం చేయాలి. సత్సాంగత్యం జీవనముక్తికి దారి తీస్తుందని ఆదిశంకరులు చెప్పారు. మన లోపల ఉన్న సత్యంతో మనం సాంగత్యం చెయ్యాలి. సత్యాన్ని అంటిపెట్టు కుని ఉండాలి. అసత్యాలను పెంచి పోషించ కూడదు.
కలికాలంలో బతుకుతున్నాం కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. కలి ప్రభావం అందరిమీద ఉంటుంది. కాలం మారుతుంటే మనిషి ఆలోచనల్లో మార్పులు వస్తాయన్న మాట. మంచికన్నా చెడు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఇక, యుగాంతానికి మనుషులు ఎలా మారతారో అన్నది ఊహకందని విషయం!

కలిపురుషుడి ఆలోచనలు ఎలా ఉంటా యంటే 'ధర్మమంటే ఏంటి' అంటాడు. కలిపురుషుడిది పాపభూయిష్టమైన జీవితం. ఈశ్వరుడు ఏది నిషిద్ధ కర్మగా చెప్పాడో దానిపై ఆసక్తి కలిగించడమే అతడి పని. కలి పురుషుడి ప్రభావం వల్ల మనుషుల్లో మంచితనమే నశించిపోతుంది. నిజం మాట్లాడటం మహాపాపమని భావిస్తారు. పరనింద చేస్తారు. పరద్రవ్యాలమీద పరస్త్రీల మీద ఆసక్తి పెరుగుతుంది. సర్వ పాపాలు చేస్తారు. ధనార్జనే ధ్యేయంగా బతుకు తారు. విద్యలను, జ్ఞానాన్ని అమ్ముకుంటారు. హింసోన్మాదులై చేయకూడని పనులు చేస్తారు. కలికాలం ఘోరాలకు నిలయం!

అయితే ఈ కాలంలో మంచి జరగదా? మంచికోసం చెడును ఎదిరించలేమా! ఏ కాలంలోనైనా భగవంతుడు ధర్మం రూపంలో ఉంటాడు. కలి ప్రభావం తెలుసుకుని సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండేవాళ్లకు, ధర్మబద్ధంగా జీవించేవాళ్లకు దైవం తప్పక సాయం చేస్తాడు. కలికాలం మనల్ని వణికించినా ఆ కలికాలాన్నే వణికించే సత్యసంధత, నిష్ట, ఇచ్ఛాశక్తి... అనే శక్తిమంతమైన సద్గుణాలు మన సొంతం. వాటిని పెంచుకుని విజయం సాధిద్దాం.

ఆనందసాయి స్వామి

No comments:

Post a Comment