Tuesday, May 5, 2026

 తొమ్మిదవ రోజున భీష్ముడు అర్జునుడికి బదులుగా కృష్ణుడిని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడు?


విష్ణుసహస్రనామాలలో " రథాంగపాణిః " ఒక అందమైన నామం. అంటే చేతిలో రథాంగాన్ని( భాగం )ధరించిన వ్యక్తి అని అర్థం. ఇక్కడ రథం అంటే మన శరీరం. అంగాలన్నీ విష్ణువు అధీనంలో ఉన్నాయి.

భీష్ముడు విష్ణుసహస్రనామాలని ప్రసాదించారు, అందులో ఆయన విష్ణువును రథాంగపాణిగా వర్ణించారు.

కృష్ణుడికి పరమ భక్తుడైన భీష్ముడు, కృష్ణుడిని ఎలా లక్ష్యంగా చేసుకుంటారు?.

పాండవులపై తన పూర్తి పరాక్రమాన్ని ప్రదర్శించడం లేదని దుర్యోధనుడు భీష్ముడితో కొంచెం నిష్టూరంగా మాట్లాడినప్పుడు, భీష్ముడు " రేపు నేను అర్జునుడిని చంపుతాను లేదా కృష్ణుడు ఆయుధం పట్టేలా చేస్తాను " అని మాటిస్తాడు దుర్యోధనుడికి. యుద్ధంలో తాను ఆయుధం పట్టనని కృష్ణుడు చెప్పారు.

అందుకే అతను అర్జునుడిని లక్ష్యంగా చేసుకుని, శక్తివంతమైన అస్త్రాలతో అతడిని హింసించారు. అర్జునుడు కూడా పోరాడుతున్నాడు, కానీ భీష్ముడు తన తాత కావడంతో అంత తీవ్రంగా పోరాడటం లేదు. కృష్ణుడు ఇది గమనించి, రథం నుండి దూకి, చేతిలో కొరడాతో ( మహాభారతంలో చెప్పినది కొరడాయే ) భీష్ముని వైపు పరుగెత్తారు. భీష్ముడు చాలా సంతోషించి, చేతులు జోడించి కృష్ణుడిని ప్రార్థించారు. తన భక్తుడైన భీష్ముని ప్రమాణాన్ని నిలబెట్టడం కోసం, కృష్ణుడు తన మాటకు విరుద్ధంగా " కొరడా " అనే ఆయుధాన్ని చేపట్టారు. కృష్ణుడు రథచక్రాన్ని పట్టుకున్నట్లు చూపిస్తూ ఉంటారు. కాని ఆయన పట్టుకున్నది కొరడానే.‌ ఏదయినా రథంలో భాగమే కనుక ఆయన " రథాంగపాణి " అయారు.

ఇక్కడ అసలు వాస్తవం ఏమిటంటే, మిగతా వారందరూ కొరడా పెట్టుకున్న కృష్ణుడిని చూశారు, కానీ భీష్ముడు సుదర్శనచక్రంని పట్టుకున్న విష్ణువుని దర్శించుకున్నారు. పుణ్యాత్ముడు.

కృష్ణం వందే జగద్గురుం.

శుభమస్తు

No comments:

Post a Comment