భృగు మహర్శి,దుర్వాస మహర్శి,గాంధారి వంటి కొందరు దేవతలకే శాపాలు పెట్టి నరు గదా ? వారికి ఆ శక్తి ఎక్కడిది ? ఎవరయినా ఎవరికయినా శాపాలు పెట్టవచ్చా ?
" నాకు మంత్రాలు సరిగ్గా రావు కానీ... లేకపోతే... ఈ పాటికి నిన్ను ఎక్కడో ఒక చింతచెట్టు మీద కట్టేసేవాడిని " అంటాడు అదుర్స్ సినీమాలో భట్టు ( బ్రహ్మానందం ) చారి ( జూ. ఎన్టీఆర్ ) తో.
అంటే మంత్రాలు సరిగ్గా రావాలి, పట్టివ్వాలి. దానికి వాక్శుద్ధి కావాలి. అది సాధనతోనూ, నడవడికతోనూ వస్తుంది.
మరి సాధన ఎలా చేయాలి?.
సహిష్ణుః అని విష్ణు సహస్రనామాలలో ఓ అద్భుత నామం. సహనశీలుడు అని భాష్యం చెప్పారు. పోందవలసినది త్రిగుణాతీత స్థితి. ఉపాసించవలసినది సద్గుణాలను. దుర్గుణాలను వదిలేయడం మొదలు పెడితే సద్గుణాలు మిగులుతాయి. వాటిని పాటిస్తే త్రిగుణాతీతం లభిస్తుంది. సహనం అంటే భరించడం. దేనిని - అననుకూలతలను. అనుకూలం కాకపోతే కోపం వచ్చేయకూడదు. శపించడం మొదలు పెట్టకూడదు.
" సహోసి సహోమహిదేహి " - వేదం - సహనస్వరూపుడివి అయిన నువ్వు సహనాన్ని నాకు ప్రసాదించు అని. రామచంద్రుడు కాలాగ్ని. " సదసత్క్రోధే క్షమయా పృధ్వీ సమః " - కోపం వస్తే కాలుడు, సహనంలో భూమి.
కౌశికుడు అనే ఒకాయన తల్లిదండ్రులను, పెళ్ళాం పిల్లలను గాలికి వదిలేసి తపస్సుకు వెళ్ళిపోయాడు అడవికి. సాధన గట్టిగానే చేసాడు. ఓ రోజు జపం చేస్తూంటే చెట్టు మీద ఉన్న కాకి రెట్ట వేసింది ఈయన మీద. కోపంగా పైకి చూసాడు. కాకి మసి అయిపోయింది. ఈయనకు మతిపోయింది. సాధన ఫలించింది, శక్తులు వచ్చేసాయి, ఇక నాకు తిరుగులేదు అనుకున్నాడు.
ఈయన రోజూ అడవికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి భిక్ష తీసుకుని తినేవాడు. ఆ రోజు అలా వెళ్ళి ఓ ఇంటి ముందు " భిక్షాందేహి " అన్నాడు. ఆ ఇంటికోడలు అత్తమామలకు అన్నం పెడుతూంది. ఆవిడ తన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తూంది.
ఆయనకు బిక్ష వేయడం కొద్దిగా ఆలస్యమయింది. ఈయన ఆవిడ వేపు కోపంగా చూసాడు. ఆవిడ " నేను కాకిని కాదు, మసి అయిపోవడానికి " అనడంతో ఈయనకు మతిపోయి ఆవిడ కాళ్ళమీద పడ్డాడు.
సాధన అంటే బాధ్యతలను వదిలేసి ముక్కు మూసుకుని మూలన కూర్చోవడం కాదు.
బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ, సహనంగా ఉంటే వాక్శుద్ధి తప్పకుండా వస్తుంది ఎవరికయినా.
నిజంగా మనకు అన్యాయం జరుగుతే మన మాటే/ఆలోచనే శాపం అవుతుంది అన్యాయం చేసినవారికి.
శుభమస్తు
No comments:
Post a Comment