Tuesday, May 5, 2026

 ఇప్పుడు ఆయన వయసు 70 ఏళ్లు. ఐదేళ్ల క్రితం వరకు ఆ ఇల్లు కళకళలాడుతూ ఉండేది. కానీ, సరిగ్గా రిటైర్మెంట్ అయిన ఐదేళ్లకే ఆయన భార్య మరణించడంతో, ఆ ఇంట్లోని వెలుగు ఒక్కసారిగా ఆరిపోయింది.

​ఆమె మరణం తర్వాత రామచంద్ర గారి జీవితం రెండు ఖండాల మధ్య ఊగిసలాడే ఉయ్యాల అయింది. కొడుకు అరుణ్, కూతురు అనూష ఇద్దరూ అమెరికాలోనే స్థిరపడ్డారు. తండ్రిని ఒక్కడినే వదిలిపెట్టడం ఇష్టం లేక, ఏడాదిలో ఆరు నెలలు విజిటింగ్ వీసా మీద తమ దగ్గరికి తీసుకువెళ్లేవారు. కానీ, ఈసారి మాత్రం ఎయిర్‌పోర్టులో వీడ్కోలు చెబుతూ అరుణ్ చేతిని పట్టుకొని, రామచంద్ర గారు తెగేసి చెప్పారు, ఇక నేను రానురా అరుణ్. ఆ ఏసీ గదుల్లో, ఆ పరాయి దేశంలో అతిథిలా ఉండటం నావల్ల కావట్లేదు.అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ మాటల వెనుక ఉన్న అలసట అరుణ్‌కి అర్థం కాలేదు.


ఆయన పంతం నెగ్గింది కానీ, ఒంటరితనం ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. ఒకరోజు ఉదయం టీ తాగుతూ కుప్పకూలిపోయారు. గుండెపోటు! అదృష్టవశాత్తూ పక్కింటి వాళ్లు సమయానికి స్పందించడంతో ప్రాణం నిలిచింది.ఆ వార్త విన్న వెంటనే అరుణ్ అమెరికా నుండి విమానమెక్కి పరుగున వచ్చాడు.

​ఆసుపత్రి గదిలో, ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని దీనంగా పడుకున్న తండ్రిని చూస్తుంటే అరుణ్ గుండె తరుక్కుపోయింది. డాక్టర్లు "ఈ వయసులో ఆయనను ఒక్కడినే వదిలేయడం ప్రమాదం. ఎప్పుడూ ఎవరో ఒకరు పక్కన ఉండాలి. జాగర్తగా చూసుకోమని చెప్పారు.

అరుణ్ తన ఆఫీసు పనులని, పిల్లల చదువులని వదిలి ఇక్కడే ఉండిపోలేడు. తండ్రి ఏమో అమెరికా రానని భీష్మించుకుని కూర్చున్నాడు. ఈ సంఘర్షణలోంచి పుట్టిందే ఆ 'పెయిడ్ రిటైర్మెంట్ హోమ్' ఆలోచన. హైదరాబాద్‌లోని ఒక ఆధునిక వృద్ధాశ్రమంలో నాన్నను చేర్చాలని, అక్కడైతే 24 గంటలు వైద్య సదుపాయం, తోడుగా నాన్న వయసువారే ఉంటారని అరుణ్ నిర్ణయించుకున్నాడు.

​రామచంద్ర గారు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రాగానే అరుణ్ తన మనసులోని మాట బయటపెట్టాడు. "నాన్న, మిమ్మల్ని ఈ పాత ఇంట్లో ఒంటరిగా వదిలి మేము మనశ్శాంతిగా ఉండలేం. అందుకే హైదరాబాద్‌లోని ఒక మంచి రిటైర్మెంట్ హోమ్‌లో అన్ని ఏర్పాట్లు చేశాను. అక్కడ మీకు కావాల్సినవన్నీ ఉంటాయి.” అని అరుణ్ తన నిర్ణయాన్ని నాన్నకు చెప్పాడు. కానీ రామచంద్ర గారు ఒక్కసారిగా భగ్గుమన్నారు. "​నేను ఎక్కడికీ రాను. ఈ ఇంట్లోనే మీ అమ్మ జ్ఞాపకాలు ఉన్నాయి. నా ప్రాణం పోయినా ఈ గడప దాటను," అని కచ్చితంగా తేల్చి చెప్పారు. నాన్న మొండితనం ముందు అరుణ్ మౌనంగా ఉండిపోయాడు. ​చివరికి, నాన్న ను హాస్పిటల్ లో చేర్చిన స్నేహితుడిని బ్రతిమిలాడి రంగంలోకి దింపాడు అరుణ్. ఆయన రామచంద్ర భుజంపై చేయి వేసి, "రామచంద్ర.. ఇంకా ఎందుకు ఈ పంతం? నీ పిల్లలను బాధపెడుతూ, నువ్వు నరకం చూస్తూ ఇక్కడ ఒంటరిగా ఉంటావా? కాలం మారింది, మన వయసు, ఆరోగ్యం ఇప్పుడు మన మాట వినవు. నీ కోసం పరితపిస్తున్న పిల్లల మాట విను." అని నచ్చజెప్పారు.

​స్నేహితుడి మాటల్లోని నిజాన్ని కాదనలేక రామచంద్ర గారు మౌనంగా తల ఊపారు. వెళ్లడానికి ఒప్పుకున్నారు కానీ, "సరే అరుణ్.. వస్తాను. కానీ నాది ఒకే ఒక్క షరతు," అంటూ అరుణ్‌ని దగ్గరకు పిలిచి అతని చెవిలో ఏదో చెప్పారు.

​ఆ మాట వినగానే అరుణ్ గుండె ఒక్కసారిగా నీరైపోయింది. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అరుణ్ నాన్నను గట్టిగా హత్తుకుని పసిపిల్లాడిలా ఏడుస్తూ "సరే నాన్న.. అలాగే.. మీరు అడిగినట్లే చేస్తాను," అని మాటిచ్చాడు.

రిటైర్మెంట్ హోమ్ నుండి వచ్చిన నిబంధన చాలా నిర్మొహమాటంగా ఉంది: "కేవలం రెండు సూట్‌కేసులకు మించి లగేజీ ఉండకూడదు." ఆ మాట విన్నప్పుడు రామచంద్ర గారికి తన నలభై ఏళ్ల జీవితం ఒక్కసారిగా రెండు చిన్న పెట్టెల్లోకి కుంచించుకుపోతున్నట్లు అనిపించింది.

​అరుణ్ గదిలోకి వెళ్లి నాన్నకు అవసరమైన బట్టలు, నిత్యవసర వస్తువులను ఆ పెట్టెల్లో సర్దుతున్నాడు. కానీ రామచంద్ర గారు మాత్రం గది మధ్యలో ఒక శిల్పంలా నిలబడి, తన ప్రపంచాన్ని ఆఖరిసారిగా కళ్ళతో స్పర్శిస్తున్నారు.

ఓ ఇంటిని వదిలేయడం అంటే అంత సులభమా..? ఆ అల్మారాలు, ఆ పాత ఫర్నీచర్, తన భార్య ప్రాణప్రదంగా చూసుకున్న ఆ వంట పాత్రలు.. అన్నీ తన జీవితంతో పెనవేసుకున్నవే. తన భార్య జ్ఞాపకాలు ప్రతి వస్తువులోనూ ఊపిరిపోసుకున్నాయి. ఇప్పుడు తను వెళ్లబోయే ఆ ఇరుకైన గదిలో వీటన్నింటికీ చోటు లేదు. అక్కడ ఒక మంచం, ఒక చిన్న కేబినెట్, ఒక టీవీ.. అన్నీ అవసరాలే, కానీ ఏదీ తనది కాదు.

​తన తరువాత ఈ వస్తువులన్నీ ఏమవుతాయి? రాజులు తమ కోటలనే వదిలి వెళ్లారు.. ఈ సామాన్యమైన సంపద ఎంత? ఇవన్నీ ప్రపంచానికి సంబంధించినవి, తనవి ఎలా అవుతాయి? తన తరువాత ఈ ఫోటో అల్బమ్స్ ఎవరికో పనికిరాని కాగితాలు. పుస్తకాలను తూకానికి వేసేస్తారు, బట్టలను బయట పారేస్తారు. ఏముంది తనతో వచ్చేది?రామచంద్ర గారు నెమ్మదిగా వెళ్ళి, తన భార్య నిత్యం అన్నం తినే ఒక స్టీలు ప్లేటుని, నీళ్లు తాగే గ్లాసుని తీసుకుని సూట్‌కేసులో పెట్టారు. అరుణ్ వెంటనే “నాన్న ఇవి అవసరం లేదు వాళ్ళు ప్లేట్ గ్లాస్ ఇస్తారు” అన్నాడు, “ఇవి మీ అమ్మ తినే ప్లేట్, తాగే గ్లాస్, తన జ్ఞాపకంగా తను నాతో ఉన్నట్టు ఉంటుంది" అని అరుణ్ వైపు చూసి దీనంగా నవ్వారు.

రామచంద్ర గారి చూపులు పూజ గది వైపు మళ్లాయి. అక్కడ తన భార్య పుట్టింటి నుంచి తెచ్చి, ప్రాణప్రదంగా పూజించిన సీతారాముల విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలను ఆఖరిసారిగా నిమురుతూ, పక్కనే ఉన్న అరుణ్ వైపు దీనంగా చూశారు. ఆ చూపుల్లో "వీటిని కూడా నాతో తీసుకుని వెళ్లొచ్చా?" అన్న మూగ ప్రశ్న ఉంది. కానీ అరుణ్, భారమైన హృదయంతో వద్దన్నట్టుగా చిన్నగా తల ఊపాడు. గోడకు వేలాడుతున్న పాత క్యాలెండర్ మీద తన భార్య చేతిరాతతో రాసిన పాల లెక్కలు, కూరగాయల లెక్కలు చూసి.. ఆ చేతిరాతే ఆమె ఆఖరి గుర్తుగా భావించి, ఆ పేజీని చింపి జేబులో భద్రంగా పెట్టుకున్నారు.

తను, తన భార్య కలిసి నాటిన మల్లె తీగను, జామ చెట్టును ఆఖరిసారిగా చూసి.. వెళ్తున్నాను అని ఆ చెట్టు ఆకులను ఆఖరిసారిగా నిమిరారు. హాల్లోని ఆ పాత ఈజీ చైర్ మీద తన భార్య కూర్చుని కుట్లు అల్లేది. ఇప్పుడు అది ఖాళీగా ఉంది. వెళ్లేటప్పుడు ఆ చైర్ మీద పడిన దుమ్మును తుడిచి, "ఇక నిన్ను ఎవరూ వాడరు" అని దాని వైపు దీనంగా చూశారు. వెళ్లే ముందు వంటగది మూలలో ఉన్న మట్టి కుండలోని నీళ్లను ఆఖరిసారిగా తాగారు, తన భార్య తో కలసి ఆ కుండ కొన్న రోజుని గుర్తుచేసుకున్నారు.తరచూ పలకరించే రెండు మూడు పుస్తకాలు, ఐడీ కార్డులు.. అంతే! అంతటితో ఆ నాలుగు దశాబ్దాల అనుబంధం రెండు సూట్‌కేసులలోకి కుంచించుకుపోయింది.

​బయట కారు హారన్ వినిపించింది.

​రామచంద్ర గారు బరువెక్కిన హృదయంతో గోడకి తగిలించి ఉన్న తన భార్య ఫోటో కి దండం పెట్టి గడప దాటారు. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆ ఇంటిని చూసుకున్నారు. నెమ్మదిగా వంగి, ఆ గడపకు మూడుసార్లు మొక్కుకున్నారు. అరుణ్ వైపు చూసి బలవంతంగా ఒక చిన్న చిరునవ్వు నవ్వారు రామచంద్ర గారు. ఆ నవ్వు వెనుక ఉన్న విషాదం ఆ దేవుడికి కూడా అర్థం కానిది. ఆ ప్రయాణం కేవలం హైదరాబాద్ వైపు కాదు.. ఒక నిశ్శబ్దపు ఒంటరితనం వైపు!

హైదరాబాద్‌లోని ఆ రిటైర్మెంట్ హోమ్ ఒక ఆధునిక దేవాలయంలా ఉంది. పచ్చని చెట్లు, సమయానికి పౌష్టికాహారం, నిరంతరం అందుబాటులో ఉండే వైద్యులు... అన్నీ చూశాక అరుణ్ మనసు కుదుటపడింది. "నాన్న ఇక్కడ సురక్షితంగా, సంతోషంగా ఉంటారు" అన్న భరోసా అతనికి కలిగింది.

వెళ్లే ముందు నాన్న చేయి పట్టుకుని, "నాన్న.. మీ పెన్షన్ ఇక్కడి ఖర్చులకు సరిపోతుంది. మందులు, చికిత్స బాధ్యత నేను చూసుకుంటాను. ప్రతి ఆరు నెలలకోసారి వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తాను" అని చెప్పి, భారమైన హృదయంతోనే అమెరికాకు ప్రయాణమయ్యాడు. రామచంద్ర గారు మౌనంగానే తన కొడుకుకి వీడ్కోలు పలికారు.

మేఘాల పైన విమానం నిశ్శబ్దంగా దూసుకుపోతోంది. కానీ అరుణ్ గుండెల్లో మాత్రం ఒక అలజడి. విమాన సిబ్బంది సూచనతో సెల్లఫోన్ ని 'ఫ్లైట్ మోడ్'లో పెట్టాడు అరుణ్. వణుకుతున్న వేళ్లతో ఫోన్ గ్యాలరీ తెరిచి, నాన్న ఫోటోను చూశాడు. ముడతలు పడిన ఆ ముఖం, కళ్లలో నిండిన అదే నిశ్శబ్దపు ఆత్మీయత... ఒక్కసారిగా అరుణ్ కళ్లలో నుంచి జారిన ఒక కన్నీటి చుక్క సరిగ్గా నాన్న ఫోటో మీద పడి, అక్కడి నుండి జారి అతని ఖరీదైన చొక్కాపై చిన్న మచ్చలా నిలిచిపోయింది.

అరుణ్ సీటులో వెనక్కి వాలి కళ్లు మూసుకున్నాడు. ఆ మూసిన కళ్ల తెరపై, తను మర్చిపోయిన బాల్యం ఒక్కొక్కటిగా రంగులు మార్చుకుంటూ ప్రత్యక్షమవుతోంది.

నాన్న దగ్గర ఒక పాత ఇనుప సైకిల్ ఉండేది.ఆదివారం సాయంత్రం వచ్చిందంటే చాలు, ఆ సైకిల్ ముందు భాగంలో చెల్లి అనూష ని వెనక క్యారేజ్ పై అరుణ్ ని కూర్చోబెట్టుకుని పార్క్ కి తీసుకోని వెళ్లేవారు. పార్కులో ఆడుకున్నాక తిరిగి వచ్చే దారిలో నాన్న బాదం పాలు కొనిచ్చేవారు. రెండు గ్లాసులు తీసుకుని ఒకటి అనూషకి, మరొకటి అరుణ్‌కి ఇచ్చేవారు. "మరి నీకు నాన్న?" అని అడిగితే.. "నాకు కొంచెం జలుబు చేసిందిరా, మీరు తాగండి" అని నాన్న నవ్వుతూ చెప్పేవారు.

అరుణ్‌కి ఏడేళ్లు ఉన్నప్పుడు సైకిల్ నేర్పించడానికి నాన్న పడిన తాపత్రయం గుర్తొస్తే ఇప్పటికీ గుండె బరువెక్కుతుంది. "నాన్న.. వదలొద్దు నాన్న!" అని అరుణ్ భయంతో అరుస్తుంటే, "నువ్వు తొక్కురా.. నేను వెనకే ఉన్నాను" అని నాన్న ఇచ్చిన ఆ భరోసా. కాసేపటికి వెనక్కి తిరిగి చూస్తే, నాన్న చాలా దూరంలో రొప్పుతూ, చెమటతో తడిసిపోయి ఆగిపోయి ఉండేవారు. అరుణ్ పడిపోతానన్న భయంతో ఆయన సైకిల్ వెనుక కిలోమీటర్ల కొద్దీ పరిగెత్తేవారు.

పల్నాడులో కోటప్పకొండ తిరుణాల అంటే ఒక మహాప్రస్థానం. ఆ జనసముద్రంలో అరుణ్ తప్పిపోతాడన్న భయంతో నాన్న తన చేయిని గట్టిగా పట్టుకునేవారు. ఆ రంగుల రాట్నాలు, బొమ్మల దుకాణాలు చూసి అరుణ్ నోరు తెరిచి అడిగిన ప్రతిదీ.. వెనుకాడకుండా కొనిచ్చేవారు. తిరుగు ప్రయాణంలో అరుణ్ అలసిపోయి నిద్రపోతే, ఆ కొండ దిగువ నుండి బస్సు స్టాండ్ వరకు మైళ్ల దూరం అరుణ్‌ను తన భుజాల మీద మోస్తూ నడిచిన ఆ ఆనవాలు ఇప్పటికీ నాన్న భుజాల మీద వంగిన గూనిలా కనిపిస్తూనే ఉంది.

సంక్రాంతి వస్తే లోకమంతా కొత్త బట్టల రంగులతో మెరిసిపోయేది, కానీ నాన్న ప్రపంచం మాత్రం ఆ మూడు చొక్కాలు, రెండు ప్యాంట్ల మధ్యే నిశ్శబ్దంగా మిగిలిపోయేది.

​అరుణ్‌కి, చెల్లికి ప్రతి పండగకీ కొత్త బట్టలు ఉండాల్సిందే. స్కూలు తెరిస్తే చాలు.. చిరిగిన పాత యూనిఫామ్‌ల స్థానంలో కొత్తవి మెరవాల్సిందే. వాటి కోసం నాన్న తన ఇష్టాలను ఏనాడో అటకెక్కిచ్చారు. అప్పుడప్పుడు అరుణ్ గమనించేవాడు.. నాన్న వేసుకునే షర్ట్ కాలర్లు రంగు వెలిసిపోయి, అరిగిపోయి పల్చగా కనిపిస్తుండేవి.

ఆదివారం పూట చికెన్ వండితే, నాన్న పళ్ళెంలో కేవలం పులుసు మాత్రమే ఉండేది . తన పళ్లెం లోని మంచి ముక్కలు అన్ని వెరీ అరుణ్ పళ్లెం లో వేసేవారు. నాకు పులుసు అంటేనే ఇష్టం రా, నాకు చాలా బలం ఉంది, నీకు బలం కావాలి తిను అనేవారు. తనకి ఇష్టమైన పదార్థాన్ని కొడుకు కోసం త్యాగం చేస్తూ, 'నాకు ఇష్టం లేదు' అని ఆయన చెప్పిన ఆ అబద్ధం .. ఈ ప్రపంచంలోనే అత్యంత అందమైన అబద్దం.

ఒకసారి, నాన్న జేబులో నుంచి ఆయనకు తెలియకుండానే అరుణ్ కొన్ని డబ్బులు తీశాడు. ఆ విషయం తెలిసినప్పుడు నాన్న కోపం తో అరుణ్‌ని గట్టిగా రెండు దెబ్బలు వేశారు. నాన్న కోపం అరుణ్ డబ్బులు తీశాడన్న ఆవేశం కాదు.. తన కొడుకు క్రమశిక్షణ తప్పాడు, తప్పు దారిలో వెళ్తున్నాడన్న ఆవేదన. చిత్రమేమిటంటే, ఆ దెబ్బలు తిన్న రోజే అరుణ్‌కి ఏదో ఒక మంచి జరుగుతుందని తెలుసు. ఎందుకంటే అరుణ్‌ని కొట్టిన కొద్దిసేపటికే నాన్న మనసు అపరాధ భావంతో విలవిలలాడిపోయేది. తన బిడ్డను కొట్టిన ఆ చేతులే ఆ తర్వాత అతడిని హత్తుకునేవి.

​నాన్న వెంటనే ఆ అపరాధ భావాన్ని తీర్చుకోవడానికి, అరుణ్‌ని సినిమాకి తీసుకెళ్లేవారు. థియేటర్ లో తను కోరుకున్న కూల్‌డ్రింక్ కొనిచ్చి, దారిలో వస్తూ అరుణ్‌కి ఎంతో ఇష్టమైన కోవా మాల్పూరిని స్వయంగా తినిపించేవారు.ఆ దెబ్బల్లో ఉన్న క్రమశిక్షణ, ఆ మాల్పూరీలో ఉన్న ఆత్మీయత..ఈరోజు అరుణ్ ని ఒక పరిపూర్ణ మనిషిగా నిలబడెలా చేశాయి.

విమానం నెమ్మదిగా ల్యాండ్ అవుతున్నట్లు అనౌన్స్‌మెంట్ వినిపించింది. అరుణ్ కళ్లు విప్పాడు. కనురెప్పల చివర చిన్న తడి. విమానం రన్ వే మీద సాగుతుంటే, అరుణ్ మనసు మాత్రం ఆ పాత సైకిల్ వెనుక కూర్చుని, నాన్న వీపును హత్తుకుని ఉన్న ఆ చిన్నారిలా మారిపోయింది.​"

చూస్తూ ఉండగానే నాలుగు నెలలు గడిచాయి. అమెరికాలో సాయంత్రం ఐదు గంటల సమయం. అరుణ్ తన ఆఫీసు పనుల్లో మునిగిపోయి ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో ఇండియాలో సూర్యోదయం అవుతోంది. ఫోన్ మోగింది... రిటైర్మెంట్ హోమ్ నుండి.

"హలో.. అరుణ్ గారు, మీ నాన్నగారు ఇక ఈరోజు ఉదయం చనిపోయారు. రాత్రి నిద్రలోనే ఆయనకు గుండెపోటు వచ్చింది. మేము శాయశక్తులా ప్రయత్నించాం, కానీ ఫలితం లేకపోయింది. బాడీని తీసుకువెళ్లడానికి మీరు ఎప్పుడు వస్తారు? ఒకవేళ మీకు ఇబ్బంది అయితే, ఇక్కడే అంత్యక్రియలు జరిపించడానికి మా దగ్గర 'ప్యాకేజీలు' కూడా ఉన్నాయి, చెప్పమంటారా?"

అవతలి వ్యక్తి మాట్లాడుతున్న మాటలు అరుణ్ చెవికి వినిపించడం లేదు. 'ప్యాకేజీ' అన్న మాట అతని గుండెను ముక్కలు చేసింది. ఒక్కసారిగా అరుణ్ మెదడులో నాన్న తన చెవిలో చెప్పిన ఆ ఆఖరి షరతు ప్రతిధ్వనించింది.

**"నేను నీ కోసం వస్తున్నానురా అరుణ్.. కానీ నాది ఒకటే షరతు. నా ప్రాణం ఎక్కడ పోయినా.. నా దహనసంస్కారాలు మాత్రం నా ఊరిలోనే జరగాలి. నా భార్యను ఎక్కడైతే సాగనంపామో, నన్నూ అక్కడే కలపాలి. నా శవం నా సొంత ఇంటి నుంచే స్మశానానికి బయలుదేరాలి. నా ఆఖరి ప్రయాణం నా సొంతింటి గడప నుంచే మొదలవ్వాలి."**

అవతలి వైపు నుండి "హలో.. హలో సార్.. లైన్ లో ఉన్నారా?" అన్న పిలుపు విని అరుణ్ ఉలిక్కిపడ్డాడు. కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా, గొంతును సవరించుకుని చెప్పాడు.

"ఏ ప్యాకేజీలు వద్దు. నాన్న అంత్యక్రియలు మా ఊరిలోనే, మా ఇంట్లోనే జరుగుతాయి. నేను, బయలుదేరుతున్నాను."

అమెరికా నుండి అరుణ్, అనూష పరుగు పరుగున నరసరావుపేట చేరుకున్నారు. రామచంద్ర గారి పార్థివ దేహాన్ని ఆ ఇంటి మధ్యలో ఉంచారు.ఆయన కోరుకున్న విధంగా అదే గడప దాటి ఆయన ఆఖరి ప్రయాణం మొదలైంది.

తన భార్య చితి పక్కనే రామచంద్ర గారిని కూడా సాగనంపుతుంటే.. అరుణ్‌కి ఒక విషయం అర్థమైంది. నాన్న రిటైర్మెంట్ హోమ్‌కి వచ్చింది తన సంతోషం కోసమే తప్ప, ఆయన ప్రాణం మాత్రం ఎప్పుడూ ఆ పాత ఇంటి గూడు కిందే కొట్టుకులాడుతూ ఉండేది. తన తండ్రి ఆఖరి కోరికను తీర్చానన్న తృప్తి ఉన్నా, ఆయన ప్రేమను అర్థం చేసుకోవడంలో ఆలస్యం చేశానన్న వేదన మరోవైపు అరుణ్ కళ్లలో కన్నీరుగా మారుతుండగా.. పల్నాడు గాలిలో నాన్న జ్ఞాపకాలు శాశ్వతంగా కలిసిపోయాయి.

కర్మకాండలు ముగిసిన మూడవ రోజు... అరుణ్ భారంగా నాన్న కుర్చీలో కూర్చుని ఉండగా, ఫోన్ మోగింది. రిటైర్మెంట్ హోమ్ మేనేజర్ నుంచి ఒక వాట్సాప్ మెసేజ్ "రామచంద్ర గారి జ్ఞాపకార్థం..."

​అరుణ్ ఆ వీడియో ప్లే చేశాడు. మొదట ఆయన యోగా చేస్తున్న దృశ్యాలు, తోటి వృద్ధులతో కలిసి నవ్వుతూ చెస్ ఆడుతున్న చిత్రాలు, ఆపై భోజనశాలలో అందరితో ముచ్చటిస్తున్న క్లిప్పింగ్‌లు వచ్చాయి. వీడియో మధ్యలో, ఆ సంస్థ వారు నిర్వహించిన ఒక ఇంటర్వ్యూ దగ్గర దృశ్యం ఆగింది.

​స్క్రీన్ మీద రామచంద్ర గారు కనిపిస్తున్నారు. ఎదురుగా ఉన్న వ్యక్తి, "రామచంద్ర గారు, ఒకవేళ మీకు దేవుడు కనిపిస్తే... మీరు కోరుకునే కోరిక ఏమిటి?" అని అడిగారు.

​రామచంద్ర గారు కాసేపు శూన్యంలోకి చూశారు. ఆయన కళ్లలో ఒక అంతులేని వేదన, వెనువెంటనే ఒక చిన్న మెరుపు మెరిశాయి. గొంతు సవరించుకుని ఆయన ఇలా మొదలుపెట్టారు:

​"దేవుడు కనిపిస్తేనా... నాకు స్వర్గం వద్దు, మోక్షం వద్దు. నన్ను ఒక్కసారి కాలంలో వెనక్కి తీసుకెళ్లమని కోరుకుంటాను. నా భార్య బతికున్న రోజుల్లోకి, నా పిల్లలు పసివాళ్లుగా ఉన్న ఆ క్షణాల్లోకి వెళ్లాలని ఉంది. ఆ రోజు గనుక తిరిగి వస్తే... నా పిల్లల్ని అమెరికా పంపాలన్న ఆలోచననే విరమించుకుంటాను. ఎందుకంటే, వాళ్ళ 'తోడు' ఎంత విలువైనదో ఈ ఒంటరితనం నాకు నేర్పింది."

​ఆయన కొంచెం ఆగి, కళ్లద్దాలు తుడుచుకుంటూ కొనసాగించారు:

​"నా మనవడు, మనవరాలితో నాకు అర్థం కాని ఇంగ్లీషులో కాకుండా…వాళ్లకు ముద్దుముద్దుగా 'తెలుగు' నేర్పిస్తూ మనసారా మాట్లాడాలని ఉంది. నా కొడుకు పొద్దున్నే ఆఫీసుకి వెళ్తుంటే ఆశీర్వదించాలని, నా కూతురిని చూడాలనిపించినప్పుడు విమానాల కోసం చూడకుండా, నేరుగా బస్సెక్కి వెళ్లి తనని కళ్లారా చూసి రావాలని ఉంది. ఆ చిన్న పెంకుటింట్లో మేమందరం కలిసి భోజనం చేసిన రోజులే నా జీవితంలో అత్యంత సంపన్నమైన రోజులు. ఆ రోజుల్ని నాకు తిరిగి ఇమ్మని అడుగుతాను”. వీడియో ముగిసింది.

పిల్లల భవిష్యత్తు అనే మహాసముద్రంలో వారి జీవితం సాఫీగా సాగడానికి, తన సుఖాలను వదులుకుని చిరిగిపోయే దాకా గాలిని ఎదురొడ్డి నిలబడిన నిశ్శబ్ద 'తెరచాప' నాన్న.

No comments:

Post a Comment