Sunday, October 11, 2026

 నేటి తెలుగు వెలుగులో ఉషాకిరణాలు.                         💛*మా అమ్మ కళ్ళజోడు*💛
_[వృద్ధాప్యం అనేది మనిషి బలహీనత కాదు— అది జీవిత సహజ పయనం.]_
----------------------
*మా అమ్మకు వయసు మళ్ళింది. ఆమె చేతులు కాస్త వణికేవి, మోకాళ్ళ నొప్పులుండేవి, చూపు కూడా మందగించింది. అమ్మ తరచూ తన కళ్ళజోడు ఎక్కడో ఒకచోట మరచిపోయేది.-— ఒక్కోసారి భోజనాల బల్లపై, ఒక్కోసారి పూజ గదిలో, మరికొన్నిసార్లు తన చీర కొంగు మడతల్లోనే..!* 

*ప్రతి ఉదయం ఒకేలా మొదలయ్యేది. _"నా కళ్ళజోడు ఎక్కడుందే?"_ అని మెల్లగా, కాస్త ఆందోళన నిండిన గొంతుతో అడిగేది అమ్మ. దానికి ప్రతి ఉదయం నా భార్య పెద్దగా నిట్టూరుస్తూ, _"ఆమె ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది. ఆమె వల్ల ఇల్లంతా గందరగోళంగా తయారవుతోంది"_ అనేది. నేను పైకి నవ్వుతున్నట్లు నటించినా, లోలోపల నాకూ విసుగ్గా అనిపించేది.*

*ఒకరోజు అమ్మ టీ పెడుతున్నప్పుడు, ఆమె చేతిలోంచి స్టీలు గ్లాసు జారి కిందపడింది. అది పెద్ద శబ్దంతో నేలపై దొర్లుకుంటూ వెళ్ళింది. టీ నేలపాలునై గోధుమ రంగు మరకలా వ్యాపించింది.*

*అప్పుడు నా భార్య.., _"సరిగ్గా కనపడనప్పుడు ఇదే జరుగుతుంది! కొంచెం జాగ్రత్తగా ఉండలేరా?"_ అంటూ గట్టిగా అరిచింది. నాకు చాలా అపరాధభావంగా అనిపించింది. అందరి ముందు అమ్మపై... _"నువ్వు ఎప్పుడూ ఏదో ఒక గొడవ తెచ్చిపెడతావు. నీ కళ్ళజోడును సరిగ్గా ఉంచుకో. కనపడనప్పుడు వస్తువులను పట్టుకోకు!"_ అని గట్టిగా అరిచాను.*  

*అమ్మ వంటగది గట్టు అంచును పట్టుకుని నిశ్చలంగా నిలబడిపోయింది. ఆమె కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళిపోయింది.*

*ఆ రాత్రి అమ్మ దగ్గుతుంటే విన్నాను, కానీ నేను లోపలికి వెళ్ళలేదు. _"ఆమెకేం కాదులే, కుదురుకుంటుంది"_ అని నాకు నేను చెప్పుకున్నాను. ఆ రోజు నుంచి అమ్మ బయటకు రావడం బాగా తగ్గించేసింది. టీ చేయడం మానేసింది. పూజకు పువ్వులు సర్దడం మానేసింది. తన కళ్ళజోడు గురించి అడగడం ఆపేసింది.* 

*ఒక మూలన నిశ్శబ్దంగా కూర్చునేది—తన ఉనికి ఇతరులకు భారమని మాటల్లేకుండా తెలియజెప్పినట్లు.*

*ఒక మధ్యాహ్నం, ఎవరినీ విసిగించడం ఇష్టం లేక, లైటు వేసుకోకుండానే  వాష్‌రూమ్‌కు వెళ్ళడానికి ప్రయత్నించింది. కాలుజారి కిందపడింది. అమ్మ కళ్ళజోడు కిందపడి పగిలిపోయింది. తల తలుపు చట్రానికి బలంగా తగిలింది. మేము త్వరగతిన ఆసుపత్రికి తీసుకెళ్ళేసరికి, ఆమె మెదడుకు తీవ్రమైన దెబ్బ తగిలిందని వైద్యులు చెప్పారు. అమ్మ బ్రతికింది కానీ... ఎప్పటిలా మారలేకపోయింది. మంచానికే పరిమితమైపోయింది. కళ్ళు తెరిచే ఉండేవి, కానీ వాటిల్లోని కాంతి ఆరిపోయింది. కొన్ని నెలల్లోనే అమ్మ మమ్మల్ని విడిచివెళ్ళిపోయింది.*

*అమ్మ అంత్యక్రియల రోజున, ఒకప్పుడు నేను అమ్మపై అరిచిన అదే వంటగదిలో నిలబడ్డాను. ఆ గదిలోని నిశ్శబ్దం నా జీవితంకంటే బరువుగా అనిపించింది.*

*కొన్ని రోజుల తర్వాత, మేము ఇంటికి మరమ్మతులు (రినోవేషన్) చేయించాము. తెరలు (కర్టెన్లు), ఫర్నిచర్, నేల టైల్స్ అన్నీ మార్చాము.*

*ఒకరోజు వడ్రంగి పనివాడు, "ఈ పాత చెక్క అరను తీసేయమంటారా? ఇది వదులైపోయింది" అని అడిగాడు. అది పూజ గది పక్కనున్న అర.* 

*అమ్మ ఎప్పుడూ తన కళ్ళజోడును అక్కడే ఉంచేది. అమ్మమ్మతో చాలా చనువుగా ఉండే నా కూతురు ఒక్కసారిగా, "వద్దు. దాన్ని తీయవద్దు" అంది. లోపలికి వెళ్ళి ఒక చిన్న సంచీ పట్టుకుని బయటకు వచ్చింది. దానిలో అమ్మ పగిలిన కళ్ళజోడు ఉంది. దాని ఫ్రేమ్ వంగిపోయింది, అద్దాలు పగిలిపోయాయి. నా కూతురు దాన్ని గుండెలకు హత్తుకుని, "దాన్ని అక్కడే ఉంచండి. అమ్మమ్మ ఎప్పుడూ దాన్ని అక్కడే ఉంచేది" అంది. వడ్రంగి నవ్వి, "అమ్మాయి గారూ, మనం ఇక్కడ ఒక చిన్న గాజు పెట్టెలాంటిది తయారు చేద్దాం. ఒక ప్రదర్శన వస్తువులా, చూడటానికి బాగుంటుంది" అన్నాడు.* 

*అలా మా కొత్త ఇంట్లో ఒక చిన్న గాజు పెట్టెను అమర్చాము. దానిలో అమ్మ పగిలిన కళ్ళజోడును ఉంచాము. ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరి దృష్టి దానిపై పడేది. కొందరు, _"పగిలిన కళ్ళజోడును ఇలా ప్రదర్శనకు ఎందుకు ఉంచారు?"_ అని అడిగేవారు. దానికి నా కూతురు గర్వంగా, _"అది మా అమ్మమ్మ కళ్ళజోడు. వీటి ద్వారానే ఆమె ప్రపంచాన్ని చూసింది. వీటితోనే మమ్మల్ని పెంచి పెద్ద చేసింది"_ అని చెప్పేది. అది విన్నవాళ్ళు నిశ్శబ్దంగా ఉండిపోయేవారు. కొందరి కళ్ళలో నీళ్ళు తిరిగేవి.*
*కాలక్రమేణా నాకూ వయసు మళ్ళింది. నా చూపు మందగించడం మొదలైంది.* 
*వార్తాపత్రికలోని అక్షరాలు మసకగా కనిపించేవి. నేను కూడా సరిగ్గా అమ్మ లాగే నా కళ్ళజోడు కోసం వెతకడం మొదలుపెట్టాను.*

*ఒకరోజు కళ్ళజోడు కనిపించకపోయేసరికి విసుగ్గా గట్టిగా అరిచాను, _"నా కళ్ళజోడు ఎక్కడ?"_ నా భార్య ఫోన్ లోంచి తల పైకెత్తి ఘాటుగా అంది, _"సరిగ్గా పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. ఇల్లంతా గందరగోళం చేయకండి!"_*

*ఆమె మాటలు నన్ను చెంప చెల్లుమనిపించినట్లు తాకాయి. ఆ మాటలు కఠినంగా ఉన్నందున కాదు... ఏళ్ళ తర్వాత నా మాటలే నా దగ్గరకు తిరిగి వచ్చినందుకు.* 
*నేను నిదానంగా పూజ గది వైపు నడిచాను. ఆ గాజు పెట్టె ముందు నిలబడ్డాను. అమ్మ పగిలిన కళ్ళజోడు అక్కడ నిశ్శబ్దంగా పడి ఉంది. ఏళ్ళ తర్వాత మొదటిసారిగా అమ్మతో మనసులోనే మాట్లాడాను: _"అమ్మా... నన్ను క్షమించు."_* 

*ఆ క్షణంలో నా మనవడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. నా చెయ్యి పట్టుకుని, _"తాతయ్యా, నీ కళ్ళజోడు ఇక్కడే ఉంది! నువ్వు దాన్ని నీ తలపై పెట్టుకున్నావు!"_ అని నవ్వేశాడు. తర్వాత నా వైపు తీవ్రంగా చూస్తూ, _"కళ్ళజోడు లేకుండా నడవకు సరేనా? కిందపడిపోతావు"_ అని నా చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా నడిపించాడు. నా కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి. నేను బలహీనుడినైనందుకు కాదు... అసలైన బలం అంటే ఏమిటో నాకు చివరికి అర్థమైనందుకు.*

*ఆ సాయంత్రం, నా మనవడు తన పాఠశాల నోట్‌బుక్ తీసుకొచ్చాడు. "తాతయ్యా, నాకు డ్రాయింగ్‌లో పూర్తి మార్కులు వచ్చాయి!" అన్నాడు. నేను ఆ పేజీ తెరిచాను. అందులో పూజ గదిలోని అర బొమ్మ ఉంది. దాని లోపల ఒక చిన్న గాజు పెట్టెను గీశాడు. అందులో పగిలిన కళ్ళజోడు ఉంది. దాని కింద తన చిన్నారి చేతిరాతతో ఇలా రాసి ఉంది:*
*_"పాత కళ్ళకు కూడా గౌరవం కావాలి."_ నేను నన్ను నేను ఆపుకోలేకపోయాను.* *నా గదిలోకి వెళ్ళి ఒక చిన్నపిల్లాడిలా ఏడ్చేశాను. గట్టిగా కాదు... పశ్చాత్తాపం కరిగి నిజం ముందు నిలబడినప్పుడు వచ్చే ఏడుపది.*
*మనకూ కాలంతో పాటు వయసు మళ్ళుతుంది. మన చేతులూ వణుకుతాయి, అడుగులు నిదానిస్తాయి, చూపు మసకబారుతుంది.*
*మన పెద్దలను భారంగా భావించేలా చేయవద్దు. వారిని ఒక వరంగా భావించేలా చూసుకుందాం.*
*_మన పిల్లలకు ప్రేమను నేర్పిద్దాం..._* 
*_ఉపన్యాసాల ద్వారా కాదు... మన ప్రవర్తన ద్వారా..._* 
🙏🙏🙏🙏🙏🙏🙏 
*ఆలోచింపజేసే నిజం... (Reflection) _వృద్ధాప్యం అనేది మనిషి బలహీనత కాదు— అది జీవిత సహజ పయనం._* *ఒకప్పుడు మనల్ని పట్టుకుని, అన్నం తినిపించి, కాపాడి, మనకు ఒక ఇంటిని నిర్మించి ఇచ్చిన అదే చేతులు ఒకరోజు వణుకుతాయి;* *ఒకప్పుడు మనల్ని అనుక్షణం కనిపెట్టుకుని చూసుకున్న ఆ కళ్ళే కాలక్రమేణా కాంతిని కోల్పోతాయి. ఆ క్షణాల్లో పెద్దలకు అత్యంత కావలసింది డబ్బు, వసతులు లేదా విలాసాలు కాదు; ఓర్పు, గౌరవం మరియు ఆప్యాయత మాత్రమే..!*
*చాలాసార్లు మనం మన తల్లిదండ్రులను పెద్ద క్రూరత్వంతో కాకుండా, మన రోజువారీ చిన్నచిన్న అసహనాలతోనే గాయపరుస్తాము— ఒక కఠినమైన మాట, విసుగుతో కూడిన గొంతు, కోపంతో కూడిన నిట్టూర్పు లేదా వారిని ఒక ఇబ్బందిగా భావించడం.* *విచారకరమైన విషయమేమిటంటే, ఆ పశ్చాత్తాపం కలిగేసరికి వారు మనకు దూరమైపోతారు.*
*మనం మన పెద్దలను చూసుకునే విధానమే మన పిల్లలు నేర్చుకునే పాఠమని ఈ కథ మనకు గుర్తుచేస్తుంది. మనం గౌరవం, ఆప్యాయత చూపిస్తే, రేపు వారు కూడా మన పట్ల అలాగే ఉంటారు. ప్రేమ అనేది మాటల ద్వారా నేర్పించేది కాదు-— ప్రవర్తన ద్వారా చూపించేది.*

సేకరణ

No comments:

Post a Comment