శ్రీ రమణ మహర్షి బోధనలు🙏🏻
ప్ర: ఈ గమ్యాన్ని భగవంతుని స్తోత్రాలను పాడుతూ తిరుగుతున్నా సాధకులు అందుకోగలరా? లేక ఒకే ఒక చోటనే ఉండాలా?
మనిషి ఎక్కడ తిరుగుతున్నా మనస్సు ఒక దానిపైనే లగ్నమయి ఉండటం మంచిది. మనస్సు అటూ ఇటూ తిరుగుతూంటే దేహాన్ని మాత్రం ఒక చోటనే ఉంచటంలో ప్రయోజన మేమిటి?
ప్ర: అహేతుకమైన భక్తి సంభవమేనా?
సంభవమే. ఏదైనా ఒక దానిని కోరుకుంటూ భగవంతుడిని ఆరాధించటం, ఆ వస్తువుని ఆరాధించటమే అవుతుంది. వాంఛనీయమంటూ ఏమీ లేని మానసిక స్థితే శివత్వాన్ని అందుకోవటానికి ముఖ్యావసరం.
🕉️ *అంతర్యామి* 🕉️
*మనిషి జీవితంలో అతిపెద్ద విజయం బయట ప్రపంచాన్ని జయించడం కాదు—తన మనసును తాను జయించడం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, వ్యక్తులు, అవకాశాలు, సమస్యలు ఎప్పుడూ మన నియంత్రణలో ఉండవు. కానీ వాటిని మనం ఎలా స్వీకరిస్తాము? ఎలా స్పందిస్తాము? అనేది పూర్తిగా మన ఆధీనంలో ఉండవలసిన విషయం!*
*భగవద్గీతలోని ఆరవ అధ్యాయం—ఆత్మసంయమ యోగం పైకి సాధారణంగా కనిపిస్తూనే గొప్ప మానసిక శాస్త్రాన్ని ఆవిష్కరించింది! ఇది మనస్సును నియంత్రించుకోవడం, అంతరంగాన్ని శుద్ధి చేసుకోవడం, మానసిక పరిణితి, సమతుల్యత సాధించడం గురించి ఎంతో లోతైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. అందులోని 5వ శ్లోకం మన జీవితాలకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది.*
*ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్*
*ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః*
*అర్థం:*
*మన మనస్సే మనకు* *బంధువూ, శత్రువూ కూడా. కనుక మానవుడు తనను తానే ఉద్ధరించుకోవాలి. అంతేకానీ జీవితాన్ని అధోగతి పాలుచేసుకోకూడదు.*
*ఇక్కడ శ్రీకృష్ణుడు బయట శత్రువుల గురించి మాట్లాడటం లేదు. మనలోనే ఉన్న మనస్సు గురించి మాట్లాడుతున్నాడు.*
*మనస్సు—మిత్రుడా? శత్రువా?*
*మనస్సు ఒక వ్యక్తిని గొప్ప విజయాల వైపు నడిపించగలదు. అదే మనస్సు అతన్ని నిరాశ, భయం, కోపం, అసూయ, అలసత్వం, మోహం, లోభం వంటి బలహీనతలకూ బలిచేయగలదు.*
*ఉదాహరణకు రేపు ఉదయం సూర్యోదయానికి ముందే లేవాలని నిర్ణయించుకుని రాత్రి పడుకుంటాం. కానీ ఉదయం మనస్సు—“ఇంకొంచెం సేపు పడుకుందాం” అని మారాం చేస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచాలని, ఏం జరిగినా వెంటనే కాకుండా కొంచెం ఆలోచించి స్పందించాలి అనుకుంటాం. కానీ తీరా ఏదైనా సంఘటన ఎదురైనప్పుడు మనస్సు—“వెంటనే సమాధానం చెప్పాలి” అని రెచ్చగొడుతుంది. చదవాలి, సాధన చేయాలి, మంచి పని చేయాలి అనుకుంటాం. కానీ మనస్సు—“తర్వాత చూద్దాంలే, ఇంకా చాలా టైముంది” అని వాయిదా వేస్తుంది.*
*అది మనస్సు యొక్క సాధారణ స్వభావం. అది మనకు ఆదేశాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది; కానీ మన వివేకం పని చేయాలి, దానికి దిశానిర్దేశం చేయాలి.*
*అంటే మనస్సును అణచడం కాదు… శిక్షణ ఇవ్వాలి. మనస్సును నియంత్రించడం అంటే ఆలోచనలు రాకుండా చేయడం కాదు, మంచి ఆలోచనలే రావాలనుకోవడం కూడా కాదు. అది అసాధ్యం. మనస్సులో ఎన్నో ఆలోచనలు రావడం అత్యంత సహజం, సాధారణం. కానీ ఏ ఆలోచనను స్వీకరించాలి, ఏ ఆలోచనను విడిచిపెట్టాలి, ఏ ఆలోచనను వాయిదా వేయాలి అన్న వివేకాన్ని కలిగి ఉండటమే ఆత్మసంయమనం!*
*చిన్న కణం ఒక ప్రాణిగా రూపొంది భూమిపై పడటానికి ఎలాంటి నిరంతర సంరక్షణ అవసరమవుతుందో, అలాగే మనస్సు కూడా నిరంతరం అభ్యాసం, వైరాగ్యం, ఆత్మపరిశీలన ద్వారా క్రమంగా శిక్షణ పొందితే మీ ఆధీనంలోకి వస్తుంది. ఆ శిక్షణ పై మనం దృష్టి సారించాలి.*
*రోజుకు కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవడం, మన ఆలోచనలను గమనించడం, ప్రార్థన చేయడం, ధ్యానం చేయడం, అన్నింటికీ మించి సాత్వికమైన విషయాలపైనే దృష్టి పెట్టడం—ఇవి మనస్సుకు క్రమశిక్షణను నేర్పే సాధనలు. నేడు మనం వాడుతున్న సామాజిక మాధ్యమాలకు వెన్నెముకగా పనిచేసే 'ఆల్గారిథమ్' వ్యవస్థకు మూల సూత్రం మనసు పనితీరు! మనం ఒకసారి ఏది చూస్తామో, అలాంటి వీడియోలు, సమాచారం, ప్రకటనలే పదే పదే కనపడటం వెనుక పనిచేసే సూత్రం ఇదే! అందుకే సాత్విక విషయాలు, సాత్విక సంభాషణలకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెడితే, క్రమంగా మనసు వాటికి అలవాటు పడుతుంది.*
*జీవితంలో సమస్యలు తప్పవు. విమర్శలు వస్తాయి. అపజయాలు ఎదురవుతాయి. మనకు అనుకూలంగా లేని వ్యక్తులు, సంఘటనలు ఎదురుపడవచ్చు. మనం కోరుకున్నది ప్రతిసారీ జరగకపోవచ్చు.*
*అయితే ఆ పరిస్థితులకు మన స్పందనను మనస్సు నిర్ణయించకూడదు, వివేకం నిర్ణయించాలి అని ఈ శ్లోకం తెలియజేస్తుంది.*
*కోపం వచ్చినప్పుడు వెంటనే మాట్లాడకుండా ఒక క్షణం ఆగడం, నిరాశ వచ్చినప్పుడు ఆశను గుర్తుచేసుకోవడం, ప్రలోభం ఎదురైనప్పుడు ధర్మాన్ని ఎంచుకోవడం—ఇవే మనస్సును మచ్చిక చేసుకుని శిక్షణ ఇచ్చే చిన్న చిన్న విషయాలు - మన విజయానికి సోపానాలు!*
*మనస్సును జయించడం ఒక్కరోజులో జరిగే అద్భుతం కాదు. అది ప్రతిరోజూ జరిగే చిన్న చిన్న విజయాల సమాహారం. ఈరోజు కోపాన్ని కొంచెం తగ్గించగలిగితే—అది విజయం. ఈరోజు ఒక చెడు అలవాటును నిరాకరించగలిగితే—అది విజయం. ఈరోజు వాయిదా వేయకుండా చేయాల్సిన పనిని చేయగలిగితే—అది విజయం. ఈరోజు ప్రతికూల ఆలోచనకు బదులుగా సానుకూల ఆలోచనను ఎంచుకోగలిగితే—అది విజయం.*
*ఇలా ప్రతీరోజూ సాధించే చిన్న చిన్న విజయాలు క్రమంగా మనం మన మనస్సుకు యజమానులుగా మారడానికి బాటలు వేస్తాయి.*
*భగవద్గీతలోని ఈ శ్లోకం ఇచ్చే సందేశం కేవలం ఆధ్యాత్మిక బోధ కాదు. అది మానవ జీవన శైలికి, జీవిత నిర్వహణకు మానవ జాతికి ఒక శాశ్వత సూత్రం.*
*“నిన్ను నీవు ఉన్నత స్థాయికి తీసుకెళ్లే శక్తి నీలోనే ఉంది, నిన్ను నీవు అధః పాతాళానికి నెట్టుకునే బలహీనత కూడా నీలోనే ఉంది.” అదే మనస్సు. అందుకే మనసును నిందించడం కాదు—దానికి శిక్షణ ఇవ్వాలి. మనసుతో నిరంతరం పోరాడటం కాదు—దాన్ని మన మిత్రుడిగా మార్చుకోవాలి.*
*ఎందుకంటే చివరికి మన జీవితాన్ని మార్చేది పరిస్థితులు కాదు. పరిస్థితులను ఎదుర్కొనవలసిన మన మనస్సే!*
No comments:
Post a Comment