Wednesday, February 5, 2025

 *తెనాలి రామకృష్ణ - 2* 
🧑‍🦲

*దయ్యాల భవంతిని కొనుగోలు చేయుట*

విద్యలనగరమైన విజయనగరంలో రామలింగ కవి తన భార్య ఇద్దరు పిల్లలతో రాయలు వారిచ్చిన ఓ సనాతన గృహంలో కాపురం పెట్టాడు. రాజాధిరాజు తలుచుకుంటే సౌక ర్యాలకు కొదవేముంటుంది.

ఇంటినిండా పప్పులు, బియ్యాలు, పట్టు వస్త్రాలు, అంగడికి పోయి ఏమైనా కొనుగోలు చేయాలనుకుంటే అందుకు పదింతలు ధనం సమకూర్చబడింది. తన కొత్త జీవితానికి తనే ఎంతో మురిసిపోతూ ఇంటి అరుగు మీద కూర్చున్నాడు రామలింగడు.

ఇంట్లోంచి కమ్మటి నేతి వంటకాల వాసనకు మైమరచి ముక్కుపుటాలు ఎగరేస్తున్న రామలింగడి చెవికి ఓ టముకు వినిపించింది.

"పురజనులకు ఓ ముఖ్య విన్నపం. అయ్యా! నగరంలో అతి పెద్ద నగల వ్యాపారి లింగిశెట్టి గారు తను ఎంతో ముచ్చటపడి నిర్మించుకున్న అత్యాధునిక భవనాన్ని అమ్మేస్తున్నార హో! కొనగల శ్రీమంతులు ఎవరైనాఉంటే ముందుకు రావచ్చు!" అని అరిచి చెప్తున్నాడు. 

రామలింగకవి ఆ టముకువాడిని పిలిచి ఆరా తీసాడు. విషయం తెలిసివచ్చింది. ఈలోగా అతని భార్య లోపల నుంచి వచ్చి “ఇక్కడైనా కాస్తా బుద్ధిగా ఉండండి. ఏదో రాయలవారి ధర్మమా అని ఓ గొప్ప బ్రతుకుదారి దొరికింది. వీధి గుమ్మంలో కూర్చున్నారంటే నాకు చచ్చేటంత భయం. దారినపోయినవన్నిటిలో వేలు, చెయ్యి పెట్టకండి. నేను నా పిల్లలు అన్యాయం అయిపోతాం." అని నిష్ఠూరంగా పలికి చరచరా లోపలికి వెళ్లిపోయింది.

రామలింగడు హాయిగా నవ్వుకున్నాడు. ఆ సాయింత్రమే నగల వ్యాపారి ఇంటిని చూడడానికి వెళ్లాడు. అదో రాజభవనంలా ఉంది. చాలా ధనంతో నిర్మించబడింది. లింగిశెట్టి తనెందుకు అమ్ముతున్నాడో చెప్పాడు. విని రామలింగడు అంతులేని ఆశ్చర్యానికి గురయ్యాడు. 

"అయ్యా! రామలింగకవిగారూ, ఈ ఇంటిని తమరు కొనలేరు. ఆరువేల వరహాలకు ఒక్క చిల్లిగవ్వ తగ్గించలేం. అయినను తమరు ఈ నగరానికి కొత్తగా వచ్చారు. ఇంకా సంపాదనలో లేరు. కొన్నాళ్ళు పోయాకగాని మీ వలన కాదు. రాయల వారి దయ పొందాలి " అని నసిగాడు.

“ఓ వర్తకుడా, నాకన్నివిధాల ఈ భవనం 
నచ్చింది. ఈసరికే నాకు రాయలవారు చాలా ధనం ఇచ్చి ఉన్నారు. కనుక నాకు ఈ భవనాన్ని అమ్మినచో కొనుగోలు చేసుకొందును. ఇతరత్రా నీవాలోచించ తగదు. కొంత ధనం ఇప్పుడిచ్చివేయు దును. మిగిలినది ఒక్క నెల గడువులో పూర్తిగా చెల్లించగలను” అని రామలింగడు భవనం మొత్తం కలియతిరుగుతూ మరీ తన కోరికను తెలిపాడు.

“చూస్తే నావంటివాడవు. బ్రాహ్మనయ్యవు. ఈ ఇంట్లో ఎలా ఉండగలవు? అసలే దయ్యాలు, పిశాచాలు భవనాన్ని వదలకుండా పట్టి పీడిస్తున్నాయి అని పదే పదే నీకు కనుక అడగ్గానే చెప్పాను. నా మొత్తం కుటుంబం అరవై మంది వరకు ఉన్నాం. ఐనా ఏమీ చేయలేకపోయాం. ఎంతమంది భూత వైద్యుల్ని రప్పించినా 
ఫలితం లేకపోయింది. చివరికి ఎంతో ముచ్చటపడి కట్టుకున్న భవనం ఇలా అమ్మదలిచాం. ఏ ఒక్కరం ఇకపై ఇక్కడ ఉండడానికి ధైర్యంగాలేం. భయభ్రాంతు లైపోయాం. కనుక సాహసించి కొనవద్దు. నిన్ను చూడగానే విషయం చెప్పానే మరి వినవేం ?" అని జాలిగా చెప్పాడు లింగిశెట్టి.


"నేను కాళీ ఉపాసకుడను. నాకు చీడ పీడల బాధలేదు. ఈ ఇంటిని చాలా కాలంగా అమ్మజూపినా ఎవరూ రాలేదని తెలిసివచ్చాను. నేను ఇష్టపడుతున్నాను. అమ్ముకో! " అని భుజం తట్టాడు. 

లింగిశెట్టి తీవ్రంగా ఆలోచించి సరేనన్నాడు. చివరికి వెయ్యి వరహాలు పుచ్చుకుని ఓ పత్రం రాయించుకున్నాడు. ఒక నెల గడువు మాత్రమే ఇచ్చాడు. "ఎట్టి పరిస్థితి లో నెలలోపు మిగిలిన చెల్లింపులు చేయాలి. లేకుంటే రాయలవారి బాల్య స్నేహితుడను. కనుక రాజతీర్పు పొందగలను. కొత్తగా వచ్చినవాడవు నీపై రాయలకు చులకన భావం ఏర్పడి అసలకే మోసం రాగలదు. బతుకు చెడి వీధిన పడతావు” అని సుతిమెత్తగా 
హెచ్చరించాడు.

రామలింగడు మరోసారి నవ్వుకున్నాడు. అన్ని నియమ నిబంధనలకు సై అన్నాడు. తొలి చెల్లింపు ఇచ్చి తృప్తిగా నవ్వుకున్నాడు.

రామలింగడు రాయలిచ్చిన గృహాన్ని వదిలి కొత్తగా కొనుకున్న భవనానికి వెంటనే మారా డు. ఈ విషయం వేగుల ద్వారా విన్న రాయలు ముందు ఒకింత ఆశ్చర్యపడినా, తనకు మాట మాత్రంగా అయినా చెప్పకుండా ఇంత తొందరగా స్వంత నిర్ణయాలు తీసుకోవడమా? తనకు చెప్పి ఉంటే కొనిపెట్టేవాడ్ని కదా అని పరిపరి విధాలుగా అలోచించాడు. ఆ తరువాత ఏ రోజూ చెప్పనే లేదు. మూడు నెలలు గడిచా యి.... ఒక విధంగా రాయలు బయటికి కనపడకుండా లోలోపల నొచ్చుకున్నాడు.

రాయలవారు నిండుకొలువులో ఊపిరి సలపనంత పని ఒత్తిడిలో ఉండగా లింగి శెట్టి వచ్చి ఫిర్యాదు చేసాడు. ఒక్కసారి సభంతా నిశ్శబ్దం అయిపోయింది. జనులంతా ఖిన్నులై విన్నారు.

"సాహితీ సమరాంగన సార్వభౌమా! మీ 
బాల్యమిత్రుడు ఈరోజు మీముంగిట తీర్పుకై చేతులు కట్టుకుని నిలుచున్నాడు. నేను విధి వశాత్తు ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించాను. అది వెలకట్టలేనిది. కానీ, అందు నివసించలేనిదిగా కొరకరాని కొయ్యిగా నాపాలిటి మిగిలింది. అతి తక్కువ వెలకు కొత్తగా తమ కొలువుకు విచ్చేసిన రామలింగకవిగారికి ఆ ఇల్లు అమ్మివేసితిని. ఆయన నమ్మబలికి తొలుత అతి తక్కువ ధనమిచ్చి, నెల గడువులోపు మిగిలినది తప్పక జమ చేయుదును అని చెప్పి ఇప్పుడు మూడు నెలలు అయిన పిదప ఇక తాను ఏమీ ఇవ్వవలిసినదిలేదు అని చెప్పుచున్నాడు. తమరు నాకు తగు న్యాయం ఇప్పించ గోర్తున్నాను" అని మొత్తం వివరించాడు లింగిశెట్టి.

రాయలు లోలోపల చాలా బాధపడ్డాడు. ఇదేమీ ఈ కొత్త కవి వింతపోకడలు. వినుటకే చాలా కష్టంగా ఉంది. సరే పిలిపించి విచారించిన తెలియగలదు అని వెంటనే రామలింగడిని పిలిపించాడు. 

ఆ రోజు ఆ సభలో దిగ్గజాల వంటి కవులు ఆశీనులై ఉన్నారు. సభకు విచ్చేసిన రామలింగకవి సభకు, రాయలవారికి, ప్రముఖులకు నమస్కరించి... 

"ఏలినవారు నన్ను సభకు తక్షణం పిలిపించడానికి కారణం నాకు తెలియ కుండా నేనేమైనా తప్పు చేసి ఉన్నానా, తెలుసుకోగోరుతున్నాను" అని మిక్కిలి వినమ్రతతో అడిగాడు.

రాయలకు ఎందుకో ఆ క్షణంలో తట్టుకో లేనంత కోపం వచ్చింది. అది గ్రహించిన మహామంత్రి తిమ్మరుసు రాయలకు కనుసైగ చేసి ఓపిక పట్టమనెను. రాయలు మనస్సును కుదుటపరుచుకుని.. 

"కొత్తగా మా కొలువుకు విచ్చేసిన ఓ కవి రాజశేఖరా, మీ పై ఈ నగల వర్తకుడు పెద్ద అభియోగం చేసారు. మీరీతన్ని మోసం చేసారని, అయితే పూర్వపరాలు చూడగా మీరు పెద్ద తప్పు చేసారనిపిస్తోంది. దీని పై మీరిచ్చు సమాధానం? ఏదీ దాచకుండా సభకు తెలియపరచండి. నిజాలే ఇక్కడ వింటాం. అబద్ధానికి తావులేదు. తప్పు జరిగినట్టు రుజువైనచో తీవ్రదండన తప్పదు" అన్నాడు కొంచెం ఆగ్రహంతో.
    
"రాజాధిరాజులైన మీ నీడన బతుకీడ్చు ఈ బాపడా తప్పు చేయునది. అది తమరు 
విశ్వసించుటయా! ఎంతటి ప్రారబ్దం ఈ క్షణ మనుభవించుచున్నాను. హతవిధీ! సత్య నిరూపణ కావలె. ఇక విషయం తమకు తెలియపరుచుకొందును.. అయ్యా నా ఇంటి వాకిట కూర్చుని ఉండగా ఓ టముకు విని ఆరా తీసిన నేరానికి ఈ వణిజ ప్రముఖుడు లింగిశెట్టి తన అనుయాయులను నా వద్దకు పంపి ఆ భవనం కొనుగోలు చేయమని మిక్కిలి
ప్రోత్సహించిరి. అతి తక్కువ ధరకు లభ్యం కాగలదని ప్రలోభపెట్టిరి. పెద్ద ఎత్తున ధనం ఖర్చుచేసి ఇంత స్వల్ప ధరకు ఎందుకు అమ్ముచున్నారని అడిగితిని. పొంతనలేని మాటలు వల్లెవేసారు. ఇందు ఏదో మోసం ఉన్నదని గ్రహించి ఈ లింగిశెట్టిని నేరుగా కలిసితిని. ఈ గృహమందు దయ్యాలు, పిశాచాలున్నాయి. వాటితో నువు వేగలేవని, చెప్తునే షరతుల పై నాకు అమ్మాడు.” అని రామలింగడు చెప్పాడు. 

సభా మధ్యమున నిలుచుండి కంచు గంట మ్రోగినట్లు అద్భుతమైన కంఠధ్వనితో చెప్పాడు. అంతా చెవులు రిక్కించి మరీ విన్నారు. 

“నీవు చెప్పునది సరే. ముందు షరతుల 
ప్రకారం నీవు ఈసరికి మిగిలిన మొత్తం చెల్లించాల్సి ఉంది. మరెందుకుఇవ్వకుండా మొండికెత్తితివి. రాయలవారికిచెప్పుకున్నా నీకు ఒక్క రూక రాదని పదేపదే అన్నావని ప్రధానంగా నీ పై అభియోగం. ఒక కవివై ఉండి ఇంతగా దిగజారి ప్రసంగించవచ్చా? రామలింగకవి, నీపై ఎంతో గౌరవభావంతో ఉన్న నాకు నీ చేష్టలతో మానసికంగా చాలా కృంగదీశావు. ఇట్టి తప్పిదాన్ని చేసినవారికి ఈ విజయనగరంలో శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి. నిన్ను ఏ విధంగా కఠినశిక్షకు గురిచేయాలి. నీవు నాకెందుకు ఈ విషమపరిస్థితికల్పించితివి. నీ తప్పు చాలా స్పష్టంగా కన్పించుచున్నది. నిన్ను ఏ విధంగా శిక్షించాలో నీవే చెప్పు.” అన్నాడు రాయలు అసహనంగా నొసలు నొక్కుకుంటూ.

సభలోని వారంతా హీనంగా రామలింగని వైపు చూసారు. ఎప్పుడు ఉత్సాహంగా ఉండే రాయలు ఈరోజు ఇంతటి వేదనకు గురికావడం ఏ ఒక్కరూ జీర్ణించుకోలేక పోయారు. 

" మహామంత్రీ నేనే అపరాధం చేయలేదు. నా చేత రాయించిన పత్రం ఒకసారి తమరే చదవండి నిజం తెలియగలదు. ఈ రామలింగని నిర్దోషిత్వం తమకు స్పష్టంగా తెలియగలదు” అన్నాడు రామలింగడు.

పత్రం చదివాక తిమ్మరుసు పెదవి విరవడం రాయలు మరింత నొచ్చుకున్నాడు. రామలింగ కవి ఏదో విధంగా నిర్దోషిగా నిరూపితుడవుతాడని కొండంత ఆశ పడ్డాడు. కానీ ఈతడు పెద్ద తప్పు చేసాడు. ఈ కవిలో ఇంత లక్షణాలున్నాయా ? అని అనుకున్నాడు.

"రామలింగా, ఇందులో నీవు తప్పక చెల్లించాల్సినట్టు మాత్రమే ఉంది." తిమ్మరుసు గొంతు ఖంగుమంది.

“మహామంత్రీ తమరు తప్పులో కాలు వేసారు. తమవంటివారు ఇలా చదివితే ఎలా ? లింగిశెట్టి అమ్మునది నా ఒక్కడికే కదా! ఆ పత్రంలో నా ఒక్కని పేరుందా? లేదే వేరే వారి పేర్లున్నాయి. దయ చేసి చదవండి.” 

“ఒక్కనిదే ఉంది. వేరెవ్వరి పేరు లేదే. ఎన్ని కళ్లతో చదవినా మారిపోదుకదా ! నీకు ఛాదస్తం మరీ ఎక్కువలా ఉంది.”

శ్రీకృష్ణదేవరాయలు ఉత్కంఠగా రామలింగని వైపే చూసాడు. 

"ఆ పత్రంలో అక్షరాల ఇరువురి పేర్లు 
ఉన్నాయి. రామలింగకవితో బాటు దయ్యాలు, పిశాచాలు ఉన్నాయి. వాటి వలన కవికి ఏ ప్రమాదం వాటిల్లినా అందుకు ఎలాంటి పూచీ తనకు లేదని కూడా రాసాడు ఈ పెద్దమనిషి. ఒక ఇల్లు ఒక్కరికి అమ్మినచో ఆ ఒక్కరే దాని ధర చెల్లించగలరు. మరి నాతో బాటుగా దయ్యాలు, పిశాచాలున్నాయి. అని అతనే లిఖితపూర్వకంగా ఒప్పుకున్నాడు. అవి చెల్లించవా ? ఇదేం న్యాయం మహామంత్రీ. అందుకే ఈ పెద్దమనిషితో పదేపదే అన్నాను. ఏలినవారికి చెప్పినా ఒక్క రూక రాలదని, ఇప్పుడూ చెప్తున్నాను. లింగి శెట్టికి నేను నా వాటా చెల్లించితిని. ఇక ఏ భూత మాంత్రికుడినో, పిశాచ వైద్యుడినో పట్టుకుని ఆ ఇంట్లో అక్రమంగా తిష్టవేసిన దయ్యాలు పిశాచాల వద్ద మిగిలిన వాటా వసూలు చేసుకోమనండి. మీరు విధించే కొరడాల శిక్ష ఆ భూతాలకే వేయగలరు" 
సభికులు గొల్లుమని నవ్వుతుండగా సభలో రామలింగడు ఎలాంటి జంకుగొంకు లేకుండా మరీ చెప్పాడు.

రాయలు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతూ 
తిమ్మరుసు వైపు చూసాడు. ఆయన కూడా తెరలు తెరలుగా నవ్వసాగాడు. సభ మొత్తం నవ్వులమయం అయ్యింది. లింగిశెట్టి ఆముదం తాగినట్టు జేవురించిన ముఖంతో మిగిలాడు.

నవ్వులతో ఎంతసేపటికి తేరుకోని సభనుద్దేశించి “మన్నించండి ఏలికా! నాకు చీడపీడల పై ఎలాంటి నమ్మకంలేదు. ఈ లింగిశెట్టి తక్కువ ధరకు అమ్మినందుకు ఆయన చెప్పిన కారణం నిజమని నమ్మాను. ఈతడు తమకు బాల్య స్నేహితుడు అనే ముసుగులో ఉంటూ ఈతడు మన శత్రువులకు అందుబాటులో ఉన్నాడు. ఆ ఇంటికి నేలమాళిగ సొరంగం ఉంది. అందులో పెద్ద ఎత్తున మారణా యుధాలున్నాయి. ఇవేవి ఒక వర్తకునికి అవసరమైనవి కావు. కనుక ఈతడు ఖచ్చితంగా అనుమానించదగ్గవాడే” అని లింగిశెట్టి యొక్క లోగుట్టు విప్పేశాడు.

ఒక్కసారి సభంతా నవ్వుల స్థానంలో కలకలం చెలరేగింది. రాయలు అర్ధంకాక తిమ్మరుసు వైపు చూసాడు.

లింగిశెట్టి అవమానంతో తలదించుకున్నా డు. రాయలు కన్నెర్రతో లింగిశెట్టి నిజం ఒప్పేసుకున్నాడు. తాను విజయనగర శత్రువులైన గజపతులతో ఒక దశలో చేతులు కలపక తప్పలేదు. ఆ సొరంగ మార్గంలోంచి రాకపోకలు సాగేవి. ఒకసారి సొరంగంలో గజపతుల వేగులవారికి 
దయ్యాలు ఎదురైనవని అందులోంచి రావడానికి భయపడ్డారు. తీరా నాకు ఆ ఇంట్లోకి వెళ్లాక అన్నివిధాలుగా తీవ్రంగా నష్టాలు ఎదురయ్యాయి. నేను చేస్తున్నది తప్పని తెలుసుకుని, ఇటీవల వారితో తెగతెంపులు చేసుకున్నాను. అందుకే ఆ ఇంటి గురించి ఆరాలు తీయనివాడికి అమ్మేసి బుద్ధిగా నా బతుకు బతకాలను కున్నాను. తీరా ఈ కవి చాలా తెలివైన వాడు కనుక, ఇలా నా గుట్టు తెలుసుకో గలిగాడు. వేరెవ్వరూ పసిగట్టలేనిది నా దేశద్రోహం. మన్నించండి చక్రవర్తీ !".

"ఏమయ్యా ! నీవు నాకు బాల్యమిత్రుడవు. నేను నీ యెడల చాలా ప్రేమగానే ఉంటున్నానే మరి నాపై నీకెందులకు ఈ ద్రోహచింత. దీన్ని మన్నించలేనిదిగా భావిస్తున్నాను. కనుక నీవు శిక్షార్హుడవే ” రాయలు కోపంగా లింగిశెట్టి వైపు చూస్తూ ఉరిమాడు.

"ఏలినవారికి నాదో విన్నపం. ఈతడు కులపరంగా వైశ్యుడు. కుట్రలతో సాధించే శారీరక బలుడు కానేకాడు. ఏదో ధనాశకు మన శత్రువులకు తనింటి సొరంగ మార్గం ఇచ్చి ఉండవచ్చు. వారిచ్చు ధనం కంటే ఈతనికి జరిగిన నష్టమే ఎక్కువ. గజపతుల వేగులు ఇక్కడ గూఢచర్యం సజావుగా సాగదని తెలివిగా తప్పుకునే ముందు ఆ సొరంగ మార్గంలో దయ్యాలు ఉన్నట్లు బొంకి వెళ్లిపోయారు. దయ్యాల ఉనికి నిజమని భ్రమలో పాపం ఎంతో 
వెచ్చించి నిర్మించిన భవనాన్ని చవకగా నాకే అమ్ముకున్నాడు. దయ్యాలే నిజమైతే ఈసరికి నాకు కన్పించాలి. కానీ ఇంత వరకు నేను చూడనైనా చూడలేదు. ఒక విధంగా చేసిన తప్పుకు ఇతడు తగిన శిక్ష ఆర్ధికంగా అనుభవించాడు. ఏది ఏమైనా ఈతడు చేసినది తప్పే.... అందుకు శిక్ష ఏలినవారు దేశద్రోహులకు విధించే 
మరణదండన, కనుగుడ్లు పెరికివేయించు ట వంటివి విధించవద్దని నా మనవి. దేశ బహిష్కారమే మరణదండనతో సమానం.”

రామలింగడు సభ మధ్యలో వందలాది జనాలు గుడ్లప్పగించి పరికిస్తుంటే వినమ్రుడై చెప్పాడు.

రాయలు గట్టిగా కళ్ళుమూసుకున్నాడు.

“నిజమే రామలింగడు చెప్పినట్లు దేశ బహి ష్కారంతో సరిపుచ్చాలి, లింగిశెట్టి తనకు బాల్యస్నేహితుడు. చేతులారా చిత్రహింస లు పెట్టే శిక్ష తను అమలు చేయలేడు. ఒక విధంగా రామలింగడు అడ్డుపడకుండా ఉంటే తను తప్పని పరిస్థితిలో శిక్ష విధించేవాడు అని మనస్సులో అనుకుని చివరికి లింగిశెట్టికి దేశ బహిష్కార శిక్ష విధించాడు.

ఆ తరువాత రాయలు సింహాసనం దిగి వచ్చి రామలింగ కవిని గాఢాలింగనం చేసుకున్నాడు. 

" కవి చరిత్ర మరువదు మీ చతురత, స్వామి భక్తి పరాయణత, సదా నిలుచును మీ ఎడల మా కృతజ్ఞుత. ఈరోజు నా హృదయం తేలి పోవుచున్నది. ఇట్టి కవిని నా హృదయానికి హత్తుకొనుచున్నాను. ఆ దయ్యాల భవంతిని వదిలేయండి. నేను వేరే భవంతిని ఏర్పాటు చేయగలను కాదనకండి." అన్నాడు రాయలు.

ఇతరత్రా కూడా పదేపదే మెచ్చుకుని ధనకనక వస్తువాహనాలతో సత్కరించాడు.

"ప్రభూ ఆ భవంతి ఎంతో గొప్పది. నాకు అన్ని విధాల నచ్చినది. అందులోకి వెళ్లగానే నాకు కవిగా కాకుండా నా మాతృ భూమికి నా చక్రవర్తికి నా సహచర ప్రజలకు సేవలందించాలని తెలియజేసింది. చక్కని అవకాశం లభించింది. ఆ భవంతిలో నేను నా భార్య పిల్లలతో జీవించగలను. అందులోనే మరిన్ని అద్భుతాలు చేయగలనని ఆశిస్తూ జీవించగలను. నన్ను కాదనకండి. తమ మాటకు అడ్డు వస్తున్నానని వేరే విధంగా భావించవద్దు” అన్నాడు.

తిమ్మరుసు రామలింగని వద్దకు వచ్చి..

" నాయనా నీవు గొప్ప విషయాన్ని బయటపెట్టావు. నగరంలో శత్రువుల ఉనికి ఎంతో ప్రమాదాన్ని ఇస్తుంది. అట్టిదాన్ని నీవు కుండబద్దలు కొట్టినట్టు చేసావు. తక్షణం ఆ సొరంగ మార్గంలో నిక్షిప్తమైన గుప్తాయుధాలను స్వాధీనం చేసుకుంటాం. నీవు ఈరోజు ఈ అప్పాజీతో విందుకు వచ్చి ఓ పూట గడపాల్సిందిగా నిన్న కోరుతున్నాను.” అన్నాడు ప్రేమగా..

రామలింగడు చేతులు కట్టుకుని తృప్తిగా తన సమ్మతిని తెలిపాడు.
 🧑‍🦲   
 *సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅

*తెలుగు భాషా రక్షతి రక్షితః*

No comments:

Post a Comment