అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-412.
4️⃣1️⃣2️⃣.
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
*భగవద్గీత*
(సరళమైన తెలుగులో)
*16. దైవాసుర సంపద్విభాగ యోగము*
(పదహారవ అధ్యాయము)
_________________________
*11. వ శ్లోకము:*
*”చిన్తామపరిమేయాం చ ప్రళయాన్తాముపాశ్రితాఃl*
*కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాఃll”*
*12. వ శ్లోకము:*
*”ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాఃl*
*ఈహన్తే కామభోగార్థ మన్యాయేనార్థసఞ్చయాన్ll”*
“మానవులకు మరణమే ప్రళయము. ‘ప్రళయాన్తా’ అంటే మరణించే దాకా అని అర్థం. "పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదు" అన్న సామెత ఇలాంటి వారి పట్ల బాగా వర్తిస్తుంది. వీరిలో పూర్వజన్మ వాసనల వలన కలిగిన ఈ స్త్రీలోలత్వము, కామవాంఛ, విషయవాంఛ, అపరిమితంగా ధనం సంపాదించడం, కోరికలు తీర్చుకోవడం, తీవ్రంగా ఉంటుంది. ఈ కోరికలు వారికి మరణించినదాకా ఉంటాయి. అటుంటి వారు జీవితాంతం తమ కోరికలు తీరలేదే అని బాధపడుతూనే ఉంటారు. వయసు మీదపడ్డా వారికి ధనం మీద ఆశ, కోరికలు తీర్చుకోవాలనే కాంక్ష పోదు.”
```
ఉదాహరణకు 50 దాటిన వారు కూడా అమాయుకులైన చిన్న పిల్లల మీద అత్యాచార ప్రయత్నాలు చేయడం మనం వింటూనే ఉన్నాము. వీరికి తమ కామము, స్త్రీ వాంఛలు తీర్చుకోవడమే ముఖ్యము. దాని వలన వచ్చే పరిణామాలను గురించి ఆలోచించరు. అటువంటి వారికి లోకంలో స్త్రీసుఖమును మించిన సుఖం, స్వర్గం మరొకటి లేదని గాఢంగా నమ్ముతుంటారు. ఏ స్త్రీని చూచినా వారికి ఆమెను అనుభవించాలనే కోరిక తప్ప మరోఆలోచన కలుగదు. ఇటువంటి వారు వందల కొద్దీ ఆశాపాశములలో అంటే ఆశలు అనే బంధనములలో చిక్కుకొని నిరంతరము ఆ ఆశలు తీరక దుఃఖిస్తుంటారు. వీరికి కామ వాంఛలతో పాటు, కోపము కూడా ఎక్కువే. తమ కామ కోరికలు తీరకపోతే కోపంతో ఊగిపోతారు. ఆ కోపంలో ఎన్నోఅనర్ధాలకు పాల్పడతారు. మంచి చెడు మరిచిపోతారు.
వీరికి ఉన్న ధనం అంతా వారి స్త్రీవాంఛలు, కామ కోరికలు తీర్చుకోడానికే ఖర్చుపెడతారు. చాలకపోతే ఇంకా ఇంకా సంపాదిస్తారు. ఆ ధనం సంపాదించడానికి ఎటువంటి అన్యాయము, అక్రమము, అధర్మమునకైనా పాల్పడతారు. ఇతరులను మోసం చేస్తారు. అక్రమంగా, అధర్మంగా ధనం సంపాదించడం, ఆస్తులు కూడబెట్టుకోవడం, కామసంబంధమైన కోరికలు తీర్చుకోవడం ఇదే వారికి దైనందిన కార్యక్రమం. చావు ఒకటే వారి కామవాంఛలకు ముగింపు. చచ్చేదాకా వారిలో ఉన్న కామ చింతన, కామవాంఛలు చావవు. "చితి" వాడిని చావు తరువాత దహిస్తే, "చింత" వాడిని బతికి ఉండగానే ప్రతి దినం దహిస్తూ ఉంటుంది.
పై లక్షణములు కలిగి ఉన్న వారిని మనము ఆసురీ సంపద కలిగిన వారిగా గుర్తించవచ్చును.✍️```
(సశేషం)
🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం,
(రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
No comments:
Post a Comment